Previous Page Next Page 
తృప్తి పేజి 22


    కాత్యాయినికి జాలేసింది. "పోనీ కాస్తన్నం తింటావుటే?" అనడిగింది.
    "అమ్మో! చీకటయిపోతుంది. పిల్లలు ఆకల్తోనుంటారు. తండ్రి ఏయాల్టికెల్తాడో ఆనికే తెలియదు. జల్దీ తీసుకోండ్రమ్మా" అంది తరాజు చేతిలోకి తీసుకుంటూ.
    వంకాయలు ఏరుతూ "ఎంతమంది పిల్లలే?" అనడిగింది.
    "ఐదుగురు మగోళ్ళు ఒక ఆడపిల్ల!" అని చెప్పింది.
    "మళ్ళీ..." అని అనుమానంగా చూసింది కాత్యాయిని దాని కడుపుకేసి.
    "ఔ అమ్మ మల్ల ఇదొకటొచ్చి పాడాయె. ఆ ముదనష్టపోనికేం తెలుస్తది నా బాధ" అంది కసిగా.
    "నీకేం రోగం? ఇంతమందిని కనే బదులు ఆపరేషన్ చేయించుకోరాదు? ఎట్లా పెంచుతారే మీరు? ఇద్దరికే చస్తున్నారు మా ఇళ్ళల్లో" అంది గట్టిగా కాత్యాయిని.
    "ఎట్లయితది నువ్వే చెప్పు! గా ఆపరేసనో, ఏమోగాని చేపించినాకా మంచం మీది కెల్లకుండా పండాలంట నేనట్ల పండితే నా బిడ్డలేం దినాల?" అనడిగింది తక్కెట కిందపెడ్తూ.
    "నీ మొగుడు చూసుకోవాలే ఆ సంగతి. లేకపోతే ఇలా పుడ్తూనే వుంటారు" అంది విసుగ్గా.
    "మా మొగోళ్ళు మీ వాళ్ళలెక్క కాదమ్మా. ఆడది కష్టంచేసి ఇల్లు నడపాలె. లేకుంటే సావాలె. అంతే! వానికేం పట్టదు. పగలు కష్టం చేస్తడు. సీకటి కాగానే తాగి ఇంటికొచ్చి ఆగమాగము చేస్తడు. పిల్లలు బతికున్నారా, సచ్చిన్రా అన్నది వానికి బట్టదు. తట్టలో కూడు రావాలె, పెండ్లాం కావాలె, మందు కావాలె. ఏమైనా అంటినా ఇక మీదకెగబడ్తదు, ఒల్లంతా సితక తంతడు. తెల్లారి పనిచెయ్యనీకి చాతగాదు. పిల్లగాల్లని పస్తుపెట్టాలె. గందుకని ఏమనక నాపని నేన్చూసుకుంట. జల్దీ పైసలియ్యమ్మా!" అంది.
    కాత్యాయిని ఉసూరని నిట్టూర్చి పైసలు తేవడానికి లోపలికెళ్ళింది. గంగ లేచి బావి దగ్గరకెళ్ళి ఓ చాదెడు నీళ్ళు తోడుకుని గటగటా తాగి మిగిలినవాటితో మొహం, కాళ్ళు, చేతులు కడుక్కుంది.
    "ఇదిగో రూపాయి ముప్పావలా" అంది కాత్యాయిని.
    కొంగుతో మొహం శుభ్రంగా తుడుచుకుని పైసలందుకుంది. బుట్ట తేలిగ్గా వుండటంతో కాత్యాయిని సహాయం లేకుండానే అందుకుని నెత్తిమీద పెట్టుకుని వెళ్ళిపోయింది. అదెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది కాత్యాయిని. రెక్కలు ముక్కలు చేసుకుని ఆడది పిల్లల కోసం కష్టపడుతుంది. రేపా పిల్లలు పెద్దయ్యాక చూస్తారా! ముఖ్యంగా మగపిల్లలు. పెళ్ళయ్యాక ఎవరి సంసారాలు వాళ్ళకొస్తాయి. దాంతో స్వార్థం పెరిగో లేక వ్యవధి లేకో సొంత తల్లిదండ్రుల్ని కూడా పట్టించుకోరు. కొంతమంది తమ పిల్లలూ, భార్యా గురించి అతిగా పట్టించుకుని బతికే వాళ్ళకోసమన్నట్లుగా వుంటారు. ఇంకొంతమంది భార్యా, పిల్లలకింత ప్రాముఖ్యతనివ్వకుండా ఎప్పుడూ వాళ్ళ సరదాలూ, స్నేహితులతో మునిగివుంటారు. మగవాడు బాధ్యత వహించేవాడుగా ఉంటే ఆడది అదృష్టవంతురాలంటారు. అదేం పట్టించుకోకుండా తిరిగేవాడో, వ్యసనపరుడో అయితే "మగాళ్ళంతే!" అని సరిపెట్టుకుంటారు. కాని ఆడవాళ్ళ విషయంలో అలా కాదు. అది తాళి కట్టించుకున్న మరుక్షణం నుండీ సంసారానికే అంకితమయిపోవాలి. తన ఇల్లూ, తన భర్తా, పిల్లలూ తప్ప బయటి ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఆమెకి తెలియకూడదు. భర్త కోరిక తీర్చినందుకు గర్భమొచ్చేది ఆడదానికే. నవమాసాలు నానా కష్టాలకోర్చి బిడ్డనికంటుంది. ఆ బిడ్డని కంటికి రెప్పలా పెద్దయ్యేదాకా సాకేది ఆడదే. మధ్యమధ్యలో వాడు ముద్దొచ్చినప్పుడు ఎత్తుకుని కాసేపాడించి ఓ ముద్దు పెట్టుకుంటారు కొందరు భర్తలు. ఇంతలో వాడే ఒకటో, రెండో చేస్తే "ఒసే వీడ్ని తీసుకో ఛీ ఛీ" అంటూ భార్యకందించి దులిపేసుకుని వెళ్ళిపోతాడు. అలా ఆడది చెయ్యగలదా? పిల్లాడికో, పిల్లకో విరేచనాలయి ఇల్లంతా పాడుచేస్తుంటే "వీడ్ని కాస్త చూడండి!" అంటూ ఎక్కడికన్నా వెళ్ళిపోగలదా? అంతెందుకు చాలా విసుగ్గా వున్నా "నేను కాస్త అలా అలా తిరిగొస్తాను. మీరు పిల్లల్ని చూసుకోండి" అని చెప్పి ఎక్కడికన్నా వెళ్తుంటే "ఎక్కడికి? ఎందుకు?" అనడగకుండా ఏ భర్తన్నా పిల్లల్ని చూసుకుంటూ ఇంటిపట్టునుంటాడా? ముఖ్యంగా ఒంట్లో బాలేనప్పుడు రాత్రుళ్ళు నిద్రమేల్కొని, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది తల్లేకానీ తండ్రి కాదు. అందరు తండ్రులూ అలా వుండకపోవచ్చు, కానీ కాత్యాయినికి తెలిసిన తండ్రులు అంతే.
    పదిహేడోఏట పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించారు కాత్యాయినిని. అత్తవారింట్లో నలుగురు మరుదులూ, ఇద్దరు ఆడపడుచులూ, అత్తగారూ, మావగారూ, మావగారి అక్కగారూ.... ఇంతమందుండేవారు. "నీకు వంటొచ్చా? ఇంతమందికి చెయ్యగలవా?" అని ఎవరూ అడగలేదు. "మడి గట్టుకుని ఎసరు పడెయ్" అనత్తగారు ఆజ్ఞాపించింది. ఆపూట నించీ కాత్యాయినికి రెండుపూట్లా వంటా మిగతా పన్లూ అప్పజెప్పబడ్డాయి. చీటికీ మాటికీ పెళ్ళయిన ఆడపడుచులు పుట్టింటికొస్తుండేవారు. ఏ పూటా పది, పన్నెండు మందికి తక్కువ కాకుండా వుండేవాళ్ళు. వాళ్ళుకాక అప్పుడప్పుడూ వేరేవూళ్ళ నుండొచ్చిన చుట్టాలూ గట్రా కూడా ఉండేవారు. ఓసారి కొత్తల్లో అన్నం చిమిడిపోయింది.
    "ఎవరీ అన్నం వండింది?" అనడిగారు మామగారు.
    "ఇంకెవరూ, మీ కోడలే" అంది అత్తగారు.
    "అమ్మాయ్" అని పిలిచారు.
    ఆ పిలుపుకే గజగజా వణికిపోయింది కాత్యాయిని. ఆమె బయటికి రాగానే "తీసుకెళ్ళి గోడకు పిడకలా చరుచమ్మా ఎండాక వేయించుకోవచ్చు" అని చెప్పి చరచరా వెళ్ళిపోయాడు. అదో హాస్యంలాగా అత్తగారూ, ఆడబిడ్డలూ పడీపడీ నవ్వేరు.
    ఆ రాత్రి కాత్యాయిని ఏడుస్తూ "నాకు పుట్టింట్లో వంటచేసే అలవాటు లేదు. ఇక్కడికొచ్చాక అలవాటు చేసుకున్నాను. కానీ ఇంతమందికి నా ఒక్కదానివల్ల కావడం లేదు. అత్తగారసలేం చెప్పనేచెప్పరు. నేనే వూహతో చేస్తున్నాను" అంది భర్తతో.
    "మరి పుట్టింటి నుండి దాసదాసీజనాన్ని తెచ్చుకోకపోయావా?" అన్నాడాయన.

 Previous Page Next Page