చీకటిలో మసకగా కనిపిస్తున్న ఆ డాబా ఇల్లు ఆమెకు మౌనంగా తన కథను చెబుతున్నట్లనిపించింది.
అదే అచుతరామయ్యగారి ఇల్లు. చాలా పెద్ద ఇల్లు. కలిగిన కుటుంబం. అచ్యుతరామయ్యగారు దయాదాక్షిణ్యాలు కలవాడని అందరూ పొగిడేవారు. ఆయన భార్య రామసుబ్బమ్మకూడా పాపభీతిగల మనిషి. వారికి ఒకే కూతురు. అల్లారుముద్దుగా పెంచారు. కాని ఆ పిల్లకు వయస్సు వచ్చినప్పటినుంచి రకరకాల కథలు చెప్పుకొనేవారు. ఎదురింటి అరుగుమీద మిషను కుట్టుకునే బుడేసాయిబుతో ఓనాటి రాత్రి వంటినిండా నగలు పెట్టుకొని బంగారు పిచ్చుకలా ఎగిరిపోయింది. అప్పటికి ఆ పిల్లకు పధ్నాలుగో సంవత్సరం మాత్రమే. మేనమామలు వెతికి పట్టుకొచ్చారు. ఊళ్ళో అందరికి పిల్ల మేనమామ ఇంటికి వెళ్ళిందని చెప్పటం మొదలుపెట్టారు. అందరూ లోలోపల నవ్వుకున్నా, పైకిమాత్రం ఆ మాటలు నమ్మినట్లే నటించారు. చివరకు ఓ బుద్ధిమంతుడైన బీదకుర్రాడికిచ్చి వివాహంచేసి అల్లుణ్ణీ, కూతుర్నీ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ తరువాత ఆ పిల్ల ఆ వూరికి ఓ వ్యవహార్తే అయింది. ఏ కాస్త అవినీతిని సహించలేదు.
ఆమెకు ఇప్పటికీ గుర్తు తనను భర్త బయటకు నెట్టిన రోజు ఆవిడ తనవంక ఎలా చూసిందో! కుష్ఠురోగిని చూసినట్లు- చాలా జుగుప్సాకరమైన వస్తువును చూసినట్లు చూసింది. అవును నిజమే! ఆవిడ ఏంచేసినా ఇంట్లో స్థానం ఎప్పటిలాగేవుంది. ఇంటి నాలుగు గోడల మధ్యనే వుండిపోయింది. సంఘానికి కావల్సింది అదే కాని తనో? బజార్లో పడిపోయింది. రోడ్డుమీద కాలు పెట్టిన స్త్రీ బ్రతుకు దెబ్బతిని కిందపడ్డ కాకి బ్రతుకులాంటిదే. అన్ని కాకులూ చుట్టూచేరి ఆ దెబ్బతిని కిందపడిన కాకిని పొడిచి చంపటానికి ప్రయత్నిస్తాయి. తను ఏ పాపం చెయ్యలేదు. కాని తనకోసం, తరతరాలుగా నిర్దేశించబడిన స్థానం- ఆ నాలుగు గోడలమధ్య స్థానం- దాన్ని తను వదిలేసింది. తనకూ ఓ వ్యక్తిత్వం వుందని గుర్తించింది. అదే తను చేసిన మొదటి తప్పు. సంఘం దృష్టిలో అది సహించరానిదే.
ఆ మిషిన్ సాయిబును ఆ పిల్ల మేనమామలు చంపించారని వదంతి పుట్టింది. అందులో నిజం ఎంత వుందో కాని మళ్ళీ బుడేసాయిబు ఆ వూరు రాలేదు. తను కనిపించాడని చెప్పినవాళ్ళు లేరు. ధర్మచింతగల అచ్యుతరామయ్య దంపతులు బుడేసాయిబు భార్యాబిడ్డలకు తిండికీ గుడ్డకూ లోపం లేకుండా చూశారు.
* * *
అదుగో ఆ మండువా లోగిలిని తను బాగా గుర్తించగలదు. తమ ఇంటి ఎదురు ఇల్లు. ప్రహరీవాకిలి తెలిస్తే చాలు ఆ ఇల్లు ఎదురుగా కనిపిస్తుంది. ఆ ఇంటి కథ చాలా చిత్రమయింది. ఒకసారి తనకు అత్తగారు చెప్పారు. సాంబయ్యగారు చనిపోయి చాలా కాలం అయినా సాంబయ్యగారి ఇల్లనీ, సాంబయ్యగారి పొలం అనీ, సాంబయ్యగారి వెంకట్రామయ్యనీ అంటూంటారు. తను సాంబయ్యగారిని చూడలేదు.
సాంబయ్యగారు ఆజానుబాహువట. పచ్చినిచాయతో మెళ్ళో రుద్రాక్షమాలా, ముఖాన విభూతిరేఖలూ, సాక్షాత్తు సాంబశివుడిలాగే వుండేవాడట. ఆరోజుల్లో ఆయనే ఆ ఊరికి పెద్ద. ఆ ఊళ్ళో ఏ ఇద్దరికి పేచీ వచ్చినా, ఏ ఇంట్లో గొడవలు రేగినా, ఆయన వెళ్ళి తీర్చాల్సిందేనట. ఎప్పుడైనా ఏ తగాదా అయినా ఆయన రాకుండానే సమసిపోవటం అంటూ జరిగితే, అది తనకు అవమానంగా భావించేవాడట ఆయన. మళ్ళీ ఏదో విధంగా ఆ తగాదాను రెచ్చగొట్టి తను కల్పించుకొని, రాజీచేసి కాని నిద్రపోయేవాడు కాదట!
పాతిక ఎకరాల మాగాణీ, ఏభయ్ ఎకరాల గరువూ ఉండేది ఆయనకు. ఓకే కొడుకు. కట్నంకూడా బాగానే వచ్చింది.
ఒకరోజు సాంబయ్య మహాలక్ష్మమ్మ చెట్టుకింద అరుగుమీద కూచుని వున్నాడు. ఆయన చుట్టూ ఆ ఊరి పెద్దలు చాలామంది కూచుని వున్నారు. లంకపొగాకు చుట్ట కాలుస్తూ అందరి మంచి చెడులూ కనుక్కుంటున్నారు. క్రమంగా వాళ్ళ సంభాషణ ఊళ్ళో పెరిగిపోతున్న అవినీతి వైపుకు మళ్ళింది. ఆ ఊరికి కొత్తగా కాపరానికి వచ్చిన చాకలి రత్తిని గురించి ఎవరో ఎత్తారు. దాని వ్యవహారం బొత్తిగా బాగుండలేదనీ, మోతుబరి కుటుంబాల్లోని కుర్రాళ్ళను ఆకర్షిస్తూందనీ మాట్లాడుకున్నారు. దాన్ని ఆ వూరినుంచి వెళ్ళగొట్టాలనే నిర్ణయాన్ని వినిపించాడు సాంబయ్య. అందరూ సరేనని తలలు ఎగరేశారు. తన ఏకైక పుత్రుడు రత్తికోసం పడిచచ్చిపోతున్నాడని సాంబయ్యకు తెలుసు.
అంతలో హరిజన వాడనుంచి ఓ యువకుడు హడావిడిగా వచ్చి వాళ్ళముందు నిల్చున్నాడు.
"ఏరా ఏసోబూ! ఏవిఁటి విశేషం?" సాంబయ్య అడిగాడు చుట్టపొగను గుప్పుగుప్పున వదులుతూ.
"ఇసేసాలకేంలే బాబూ! మీరు దొరలు, గొప్పోళ్ళు. మీకు కోపం వచ్చినా మేమే సావాలి. మాకు కోపంవచ్చినా మేమే సావాలి."
"ఏమిటోయ్ చాలా పెద్దమాటలు మాట్లాడుతున్నావ్?" అని కాండ్రించి వూశాడు సాంబయ్య.
"చెప్పరా సందేహిస్తావే?" చెప్పటానికి సందేహిస్తూ నిల్చున్న ఏసోబును అడిగాడు కామయ్య సౌమ్యంగా.
"ఏం సెప్పమంటారు బాబూ! మీ ఇళ్ళల్లోనుంచి ఆడాళ్ళు రాత్రిళ్ళు మా కాడకు వత్తుంటారు బాబూ! జోసఫ్ గాడి పెళ్ళాం పసికట్టింది. ఆడాళ్ళు కూడగట్టుకొని రాత్రి కాపలాకాసినారంట నాకు తెలవనే తెలవదు బాబయ్యా! ఆళ్ళు వచ్చారంట. మా ఆడాళ్ళు బాగా తన్నారంట. ఆళ్ళు తప్పించుకొని పారిపోతుంటే ఒకామె కాలిగొళ్ళెపు గొలుసు వూడిపడిపోయిందట. ఇదిగో సూడండి" అంటూ ఏసోబు వెండి గొళ్ళెం గొలుసును సాంబయ్య ముందు పెట్టాడు.
అంతవరకు అందరూ బిగుసుకుపోయి విన్నారు. గొలుసును సాంబయ్య అందుకొని పరిశీలిస్తుంటే అందరూ ఎవరికివారే బెదిరిపోతూ దానికేసి చూస్తుండిపోయారు. ప్రతిష్ఠ ఎవరి కొంప మీదకు వస్తుందోనని వణికిపోయారు. పైకిమాత్రం అందరూ బింకంగా వున్నట్లే కూచున్నారు.
"ఎంత అప్రతిష్ఠా! ఎంత అప్రతిష్ఠా! మన ఊరి పరువు తీసిన వాళ్ళెవరో ఇప్పుడే తేల్చేస్తాను. కుటుంబాన్ని ఊరినుంచి పీకేయిస్తాను" అంటూ రామయ్య ముఖంలోకి చూశాడు సాంబయ్య అర్ధయుక్తంగా. రామయ్య వళ్ళు అప్పటికే చిరుచెమటలు పట్టింది. రామయ్య భార్య కాస్త మెతక మనిషి అని ఊళ్ళోవాళ్ళు అనుకుంటూంటారు- ఆ మాటే సాంబయ్య భార్య ఓసారి సాంబయ్య చెవులో వేసింది. అది గుర్తొచ్చింది సాంబయ్యకు. రామయ్యంటే సాంబయ్యకు లోలోపలే కోపం. రామయ్య సాంబయ్యను పెద్దగా గౌరవించడు.
"చూడు చంద్రం! ఓ సారి భద్రాచారి ఇంటికెళ్లి నేను రమ్మన్నట్లు చెప్పి వెంటనే పిల్చుకురా!" అని పురమాయించాడు సాంబయ్య అక్కడే బచ్చాలు ఆడుతున్న ఒక కుర్రాణ్ణి. వాడు పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
అందరూ బిగుసుకుపోయి కూచుని వున్నారు. ఎవరికీ మాట్లాడాలని లేదు. అందరికీ అక్కడనుంచి వెళ్ళిపోవాలని వుంది. కాని లేస్తే బాగుండదని కూచున్నారు.
భద్రాచారి పరుగుపరుగున వచ్చి సాంబయ్యకు నమస్కరించాడు.
"ఏం బాబూ పిల్చారంట?" భద్రాచారి వినయంగా అడిగాడు.
"చూడు భద్రాచారీ! ఈ గొలుసు నువ్వు చేసిందేనా?" అంటూ అందించాడా గొలుసును సాంబయ్య భద్రాచారికి.
"అవును బాబూ! నేను చేసిందే" అన్నాడు భద్రాచారి-ముక్కు మీదకు జారిన కళ్ళజోడు ఫ్రేమ్ పైగా చూస్తూ.
"బాగా చూడవోయ్!" అన్నాడు సాంబయ్య.
"ఎంతమాట బాబుగారూ? నా పనితనాన్ని నేను అంత దూరం నుంచి పోల్చగలను" అన్నాడు భద్రాచారి సగర్వంగా.
"అది ఎవరిదో చెప్పగలవా?"
కళ్ళజోడు సరిచేసుకొని ఆ గొలుసును పరిశీలిస్తుంటే కొంతమంది ఊపిరి బిగబట్టుకొని కూచున్నారు.
"ఇంకా సందేహం ఎందుకు బాబూ? మన అమ్మగారిదే. ఈ ఏసోబుగాడు కొట్టేశాడు ఏంటిబాబూ! వీళ్ళతో బతికే వీల్లేకుండా పోయింది" అంటూ సాంబయ్య ముఖం కేసి చూసిన భద్రాచారి తెల్లముఖం వేశాడు. సాంబయ్య రాతి ప్రతిమలా బిగుసుకుపోయి వున్నాడు. మనిషిలో జీవం వున్నట్లు ఎక్కడా కనిపించటంలేదు.
"సరిగ్గా చూడవోయ్!" అన్నాడు రామయ్య ఆ గండం తన తలమీదనించి జారిపోయినందుకు సంతోషంగా.
"వారింట్లో వారిదేనండీ! ఆ మధ్యనే చేశాను. శీల దగ్గిరగా "స" అనే అక్షరాన్ని కూడా చెక్కాను అన్నాడు భద్రాచారి భయపడుతూనే అసలు సంగతేమిటో అర్ధంకాక.
యంత్రంలా నడిచివెళ్ళిపోతున్న సాంబయ్యను అందరూ జాలిగా చూశాడు. ఆనాడు అలా వెళ్ళిపోయిన మానవుడు మళ్ళీ వీధిముఖం చూచి ఎరగడు. వెళుతూనే మంచానికి అడ్డంగా సాంబయ్య మళ్ళీ మంచం మీదనుంచి లేవలేదు. మంచంలో తీసుకొని తీసుకొని ఆరునెలలు తిరక్కుండానే ఇహాన్ని విడిచిపెట్టాడు.
తను కాపరానికి వెళ్ళేప్పటికి సాంబయ్య భార్యకు ఏభయ్ ఏళ్ళుంటాయి. కొడుకులూ, కోడళ్ళూ గౌరవంగానే చూసేవారు. ఊళ్ళోకూడా ఆమెకు గౌరవం తగ్గలేదు. అందరూ ఆమె ఎదురుపడితే మహా గౌరవం చూపెట్టేవారు. కారణం డబ్బు వుంది. ఇంట్లో ఆమెకు గౌరవం వుంది. సంఘం చచ్చినట్లు గౌరవించి తీరాలి, లేక నటించాలి.
* * *
ఆమె రెండడుగులు ముందుకు వేసింది. గడియారం కేసి చూసుకుంది. ఇంకా పన్నెండు కావడానికి పదినిమిషాలుంది.
అదుగో! అదే నాలుగో ఇల్లు. ఎడంచేతివైపుగా కొంచెం వెనగ్గా వుంది. ఆ ఇంటి ఇల్లాలు కాంతమ్మగారిని చూస్తేనే గుండెలు దడదడ లాడతాయి. పెద్ద శరీరం. చిటపటలాడే ముఖం. గరగరలాడే కంఠం. ఆమె భర్తకూడా చెట్టంతమనిషే. ఇద్దర్నీ చూస్తూంటే బ్రహ్మదేవుడు ఏమీ తోచనప్పుడు సరదాగా ఈ రెండు బొమ్మల్నీ చేశాడా అనిపిస్తుంది. పిల్ల లందరికీ తల్లి పోలికలూ, తండ్రి శరీరాలు వచ్చాయి. ఏమయితేనేం కట్టుకుపోయినంతవుంది. వాళ్ళింట్లో బంగారు ఇటుకలు వున్నాయని వదంతి. పిల్లలందరికీ మంచి సంబంధాలే వచ్చాయి. వాళ్ళ ఆస్తిని గురించి కూడా ఒక కథ చెప్పుకుంటారు.
శేషయ్య తాత ఏమీ లేనివాడే- తండ్రి హయాంలోనే ఆస్తిని బాగా సంపాదించాడు. శేషయ్య తండ్రికి ఒకే కొడుకు. అతనికి పది సంవత్సరాలు వుండగా ఒక్కసారిగా అదృష్టం కలిసివచ్చిందట!
ఆ రోజుల్లో ఊరు బయట లంబాడీతండా విడిసివుంది. లంబాడీ వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుందనీ వాళ్ళు ఆ డబ్బును భూమిలో దాస్తారనీ అంటారు. శేషయ్య తండ్రి రాజయ్య దగ్గర వెంకటసుబ్బడనే జీతగాడు ఒకడు వుండేవాడు. వాడు కాలాంతకుడు. పన్నెండేళ్ళ వయస్సు నుంచీ రాజయ్యగారి ఇంట్లోనే పెరిగాడు. వాడి తల్లిదండ్రులెవరో ఎవరికి తెలియదు. వాడికే తెలియదంటాడు. ఒకసారి రాజయ్య కుటుంబంతో కోటప్పకొండకు వెళ్ళాడు. తిరునాళ్ళలో పోలీసులు ఒక పన్నెండు సంవత్సరాల కుర్రాణ్ణి పట్టుకుని కొట్టటం రాజయ్య చూశాడు. చూసి వాకబుచేశాడు. ఎవరి జేబో కొట్టే ప్రయత్నంలో వుండగా పోలీసులు పట్టుకున్నారన్న విషయం తెలిసింది.
కుర్రాడు చాకులా వున్నాడు. ఇంట్లో చాకిరిచేస్తూ పడివుంటాడనే ఉద్దేశ్యంతో వాణ్ణి పోలీసుల బారినుంచి వదిలించి తీసుకొచ్చాడు. వెంకట సుబ్బడు యజమానికి తగ్గవాడనిపించుకొన్నాడు. వాడికి పెళ్ళి ఈడురాగానే రాజయ్యే పెళ్ళికూడా చేశాడు. ఓ చిన్న ఇల్లు కట్టించి ఇచ్చి ఒక ఇంటివాణ్ణి చేశాడు! ఆ రోజు వూళ్ళో వాళ్ళంతా రాజయ్యను నమ్ముకున్న వాళ్ళెవరూ చెడిపోలేదు అనుకున్నారు.
అదే రోజుల్లో ఒక లంబాడీతండా ఊరుబయట పొలిమేరల్లో దిగింది. రోజూ సాయంకాలం వెంకటసుబ్బడు వాళ్ళ గుడిసెల దగ్గరకు వెళ్ళి వస్తూండేవాడు. కొందరితో స్నేహం చేసుకున్నాడు. ఒకరోజు లంబాడీ వాళ్ళంతా పక్క అరణ్యంలోకి ఆవుల్ని తోలుకొని వెళ్ళారు. వాళ్ళు సాధారణంగా ఆడవాళ్ళూ, మగవాళ్ళూకూడా ఉదయం బయటకు వెళ్ళి సాయంకాలంగానీ రారు. మరీ పసిపిల్లలూ, ముసలివాళ్ళు మాత్రమే గుడిసెల్లో వుంటారు. వెంకటసుబ్బడు వాళ్ళతో కలసిమెలసి తిరుగుతూ కొన్ని రహస్యాలను తెలుసుకొన్నాడు.
ఒకనాడు మధ్యాహ్నం వెంకటసుబ్బడు యజమానిని వెంటబెట్టుకుని లంబాడీ గుడిసెలదగ్గరకు వెళ్ళాడు. పిల్లలూ, ముసలాళ్ళూ ఎవరి గుడిసెల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. వెంకటసుబ్బడి చేతిలో దుడ్డుకర్ర వుంది. ఒక గుడిసెలో ప్రవేశించాడు. రాజయ్య మాత్రం గుడిసె ముందు నిల్చొని ఎవరైనా వస్తారేమోనని కాపలా కాస్తున్నాడు. గుడిసెలో ప్రవేశిస్తూనే కూచుని కునికిపాట్లు పడుతున్న ముసలిదాని తలమీద కర్రతో సత్తువకొద్దీ కొట్టాడు. అది కిక్కురు మనకుండా వొరిగిపోయింది. దాన్ని అవతలకు లాగి, ఆ ప్రదేశంలో తవ్వగా డబ్బు సంచులూ, బంగారు కణికలూ వున్నాయట!"
తెల్లవారి పోలీసులు వెంకటసుబ్బణ్ణి పట్టుకెళ్ళారు. పోలీసులవెంట వెళుతూ వాడు యజమాని కళ్ళల్లోకి జాలిగా చూశాడు. రాజయ్య- "భయపడకు. నేను వున్నాను" అన్నట్లు కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. వాడికి పన్నెండు సంవత్సరాల శిక్షపడింది. చివరిదాకా వాడు యజమానికి విశ్వాసపాత్రుడుగానే వున్నాడు. ఎంత కొట్టినా ఒక్కమాట అతని నోటి వెంట రాబట్టుకోలేకపోయారు పోలీసువాళ్ళు. ఆరు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి అక్కడే కన్నుమూశాడు వెంకటసుబ్బడు.
లంబాడీతండా విడిసిన చోట ఒక చిన్న గుడి కట్టించి రాజయ్య ఒక లంబాడీ బొమ్మను పెట్టించాడు. ప్రతి సంవత్సరం అక్కడ పూజలూ పునస్కారాలూ చేయిస్తూ వుండేవాడట. ఇప్పటికీ శేషయ్య చేయిస్తూవుంటాడు. ఎవరో సిద్ధాంతి అలా చెయ్యాలనీ, లేకపోతే లంబాడీ దెయ్యం ఆ వంశాన్ని వృద్ధికానివ్వదనీ, విరుచుకు తినేస్తుందనీ రాజయ్యను భయపెట్టాడట.
* * *
అదే తన ఇల్లు. ఆ నాలుగు ఇళ్ళ అంతస్తునూ అందుకోలేని చిన్న పెంకుటిల్లు. ఒకనాడు చిన్నదయినా, ఆ ఇంటికి ఆ నాలుగిళ్ళకంటే ఎక్కువ గౌరవమే వుండేది. కాని ఈనాడు ఆ ఇల్లు సగం భూమిలోకి కుంగిపోయినట్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ప్రతి గోడా, ఇంటుకా చెప్పేది తన చరిత్రే. మచ్చలేని ఆ వంశానికి తనవల్లనే తీరని కళంకం వచ్చిందిట!
ఆమె గబగబా తన ఇంటి దగ్గిరకు నడిచింది. ప్రహరీగోడ తలుపులు బార్లా తెరిచి వుండటం కనిపించింది. తలుపులు తెరిచే వున్నాయి. తన కోసమే అవి బార్లాగా తెరిచివున్నాయి. లేకపోతే అంతరాత్రివేళ అవి తెరిచి వుండవు. ఉద్వేగంతో రెండడుగుల్లో వాకిట్లోకి వచ్చింది. కాలుకి చెత్తా చెదారం తగిలింది. ఎంతోకాలంగా ఆ వాకిలి ఊడ్చినట్టు అనిపించలేదు. ఇంటి వసారాకు పొగ చూరిన హరికెన్ లాంతరు వేలాడగట్టివుంది. ఆ గుడ్డివెలుగులో వీధితలుపుల్లో ఒకటి పూర్తిగా విరిగిపోయి కనిపించింది. ఆ వాకిలి ఎంతోకాలం తెరచే వున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటిదీ? ఇది మనుషులు వుండే ఇల్లేనా? పాడుపెట్టినట్టుందే? సందేహిస్తూనే లోపలకు కాలు పెట్టింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అది తనకు తెలిసిన ముంగిలికాదు. ఇంటిముందర మల్లెపందిరి వున్న చిహ్నాలే లేవు. జామచెట్టుమోడుమాత్రం యధాస్థానలోనే ప్రహరీగోడను ఆనుకొని వుంది. గోడలమధ్య రావిమొక్కలూ, గోడలపక్కగా జిల్లేడు మొక్కలూ వున్నాయి. వేపచెట్టు నిలువునా ఎండిపోయివుంది. ఎంతోకాలంగా ఆ ఇంట్లో మనుష్యులు నివసించటం లేదనేది చూడగానే అర్ధం అయిపోతుంది. అజ్ఞాత శంకలతో ఆమె నిలువెల్లా కంపించిపోయింది.