ప్రతిక్షణం ప్రపంచంలో కొన్ని వందలచోట్ల, కొన్ని లక్షల కోట్ల కరెన్సీ అతని ఎమౌంట్స్ లో జమ అవుతూనే వుంటుంది. జె.జె. అన్న రెండక్షరాలు చాలు అంతర్జాతీయ బ్యాంకులైనా అప్పులివ్వటానికి.
ఆ జె.జె. అంతటి స్థాయి వున్న జె.జె.కి కూడా లీస్ట్ బాదర్డ్ సెంటర్ హైదరాబాద్ కి రాక తప్పలేదు.
అతను అపజయాన్ని అంగీకరించడు. ఓటమి అంటే అతనికి అసహ్యం. గెలుపు, గెలుపు, గెలుపే అతనికి ఇష్టం. ఇప్పటివరకు అతని జీవితంలో రైజ్ అండ్ ఫాల్ లేదు. రైజ్ అండ్ రైజ్ విజయాల్ని సొంతం చేసిపెట్టే యుద్ద వీరుల్లాంటి సిబ్బంది ఉన్నా, ప్రభుత్వపరంగా ఎలాంటి పనైనా చేసిపెట్టే అధికారులున్నా అతనికీసారి ఓటమి తప్పలేదు.
జీవితంలో తొలిసారి ఓడిపోయాడు. ఓటమి చిన్నదే. ఆ ఓటమి మూలంగా సంభవించే నష్టమూ చిన్నదే. అయినా దాన్ని సయితం అతను భరించలేకపోయాడు.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే అలవాటున్న జె.జె దిగబోతున్నాడు. 15 సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత మరలా జె.జె రాబోతున్నాడు.
అందరి హృదయాలలోను ఉద్వేగం నెలకొని ఉంది.
అందరి ఆలోచనలు ఉద్విగ్నతతో గడ్డకట్టుకుపోయాయి.
ఎవరి ఉద్యోగాలకు ఉద్వాసన వస్తుందో, ఎవరు నిర్దాక్షిణ్యంగా పేక్ చేయబడతారో తెలీదు.
క్షణాలు... నిమిషాలు కరిగి కాలం ఆసన్నమయింది.
ఎయిర్ పోర్ట్ మైకులు జె.జె. రాకను తెలియజేశాయి.
అందరూ ఎలర్ట్ అయిపోయారు.
చూస్తుండగానే చార్టర్ద్ సున్నితంగా లాండ్ అయింది.
"ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ది వరల్డ్- ఫార్ట్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ లోకి ఎక్కినా ది గ్రేట్ మనీ మేకర్ మిస్టర్ జె.జె. ఈజ్ కమింగ్" అంటూ ఎయిర్ పోర్ట్ ఎనౌన్సర్ ఎగ్జయిట్ అవుతూ చెప్పుకు పోతున్నాడు.
కొద్దిక్షణాలు గడిచాయి.
జె.జె. వచ్చారా లేదా అన్న అనుమానం అక్కడున్న ఆహుతులకు వచ్చింది. కారణం.... పదిమంది వ్యక్తులు చార్టడ్ ఫ్లయిట్ నుంచి దిగినా అందులో అరవై యేండ్ల వయసున్న వ్యక్తి లేడు.
మరికొద్ది క్షణాలకే జె.జె. రాలేదని.... జె.జె. మనుమరాలు మౌనికను పంపించారని తెలిసి ఓ క్షణం గుండెలనిండా ఊపిరి తీసుకున్నారు.
ఆమెను అదే తొలిసారి చూట్టం- అందుకే మరోవిధంగా ఏంగ్జయిటీ ఫీలవుతున్నారు జె.జె. స్టాఫ్ అంతా.
కాని అంతలోనే ఓ విచిత్రం జరిగింది.
ఆమె వీళ్ళను చూడకుండానే మరో గేట్ గుండా అప్పటికే సిద్దంగా వుంచిన మెర్సిడెస్ లో నగరంలోకి వెళ్ళిపోయింది.
సరిగ్గా అదే సమయానికి మరోవిధంగా నగరం ప్రవేశం చేశాడు ది గ్రేట్ జె.జె.
* * * * *
తెల్లవారుఝామున నాలుగ్గంటలకు ఆమెకెందుకో మెలుకువ వచ్చింది. ఓసారి లేచి కళ్ళు నులుముకుంటూ మధ్య హాల్లోకి వచ్చింది.
అంతే... ఆమె కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. వెంట వెంటనే ఇంట్లో వున్న లైట్స్ వెలిగించింది. హాలు మధ్యలో సోఫాలో చలికి ముడుచుకు పడుకున్న తన మరిది మాథుర్ దగ్గరకు వచ్చి పిలిచింది. అతనిలో ఏమాత్రం చలనం లేదు. మరోసారి.... మరోసారి పిలిచి చూసింది. లాభం లేకపోవడంతో కసిగా బాత్ రూమ్ కేసి నడిచింది.
అప్పటికే ఆ హడావుడికి లేచిన ముసలి దంపతులు, పడుతూ లేస్తూ కొడుకు దగ్గిరకు వచ్చి తట్టి చూశారు. ఫలితం లేకపోయింది.
అంతలో ఆమె చేతిలో బకెట్ తో రానే వచ్చింది.
ఆమె కళ్ళల్లో రౌద్రాన్ని, చేతిలో కనిపించిన నీళ్ళ బకెట్ ను చూసి ఆ ముసలి ప్రాణాలు రెపరెపలాడాయి.
ఆ ముసలి దంపతులు కోడలికి ఎదురుతిరిగే దైర్యాన్ని ఎప్పుడో కోల్పోయారు.
డిసెంబర్ మాసం చలి....
శరీరాన్ని గడ్డకట్టించే చలి.
తాగి వున్నాడు గనుక అప్పటికా చలి తెలీకపోయినా, ఆ నీళ్ళు ఒంటిమీద పడితే...? బిడ్డ ప్రాణాలు రెపరెపలాడిపోతాయి.
ఆమె అత్తమామల వేపోసారి నిర్లక్ష్యంగా చూసి బకెట్ ను మాథూర్ పై గుమ్మరించింది.
చల్లటి నీళ్ళు శరీరాన్ని కోసేయడంతో దిగ్గున లేచి కూచున్నాడు మాథుర్.
"ఆస్తులన్నీ తాకట్టులో పెట్టించి పెద్ద పెద్ద చదువులు చదివావు....ఏం లాభం? జ్ఞానం అబ్బిందేమోగాని ఇంగితజ్ఞానం అబ్బలేదు. పైసా సంపాదన లేకపోయినా తాగుడుకేం తక్కువలేదు...."
మాథుర్ ఆమెకేసి వేదాంతిలా చూశాడు.
ముసలి దంపతులు లోలోపలే కొడుక్కి పట్టిన దుర్గతికి కుమిలి పోతున్నారు.
జె.జె. కంపెనీలో ఉద్యోగమంటే మాటలా? ఉద్యోగమంటే అంత లెక్కలేకుండా పోయిందా? ఎలా బ్రతుకుదామని? ఉన్నదంతా నువ్వేదో ఉద్దరిస్తావని నీ చదువుకి తగలేశారు ఈ ముసలివాళ్ళు! ఇప్పుడీ కుటుంబాన్ని నా మొగుడు, నేను పోషించాలి. సిగ్గులేదు, మా కష్టం మీద బ్రతకడానికి?..." ఆమె ఆ సమయాన తనో బాధ్యతాయుతమైన పోలీసాఫీసరని కూడా మర్చిపోయింది.
మాథుర్ లేచి స్టడీగా నిలబడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
"బెటర్ టూ డై ఆన్ యువర్ ఫీట్ దేవ్ లివ్ అన్ యువర్ నీస్ అండర్ స్టాండ్?"
మాథూర్ సోఫాను ఆసరా చేసుకుంటూ చిన్నగా నవ్వాడు-
"నువ్వెలా ఐ.పి.ఎస్. ఆఫీసర్ వయ్యావో అర్ధం కావడంలేదు.... ఆడదాని నోటివెంట అందమైన వాక్యాలు జాలువారాలి. ప్రతిమాట ఓ సంగీత స్వరంలా వుండాలంటారు కవులు... పిచ్చికవులు.... ప్రేలాపనలు కాకపోతే ఏమిటి?.....స్త్రీ పెదవుల వెంట ఉపశమనపు అమృతపు చినుకులు వస్తాయన్నారు. ఏవీ...? లేవే...? ఆఫ్ట్రాల్ ఫుడ్..... ఆఫ్ట్రాల్ షెల్టర్..... ఆఫ్ట్రాల్ క్లోత్స్.... వీటికోసం స్త్రీ పరమైన సున్నితత్వాన్ని కోల్పోతున్నావే..... అదే నా బాధ?
స్త్రీ..... స్త్రీ..... మైగాడ్.... హృదయాల్ని కదిల్చి సేద తీర్చవలసిన స్త్రీ..... ప్రకృతి పరవశంలో పుట్టి, ఆ ప్రకృతి అందాల్నే ధిక్కరించే స్త్రీ.... ఎంత దిగజారిపోయి ఆలోచిస్తోంది నేడు....?" నవ్వుతూనే అన్నాడు.
"పూటకు గతిలేకపోయినా కవిత్వమొకటి....? నీకంటే తప్పయినా జేబుదొంగలు నయం... కనీసం కష్టపడైనా దొంగతనాలు చేస్తారు. రిస్క్ కి సిద్దపడతారు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి.... నీ సుపీరియన్స్ ని ఫూల్స్ క్రింద జమకట్టి పొగరు తలకెక్కి ఉద్యోగం వదిలేశావ్. ఎన్నాళ్ళు పోషించాలి మేం....?"
"ప్రిమిటివ్ కల్చర్ తో పుట్టే కవిత్వమే నీ కర్ధం కాదు... ఇంక నా కవిత్వమెలా అర్ధమవుతుంది గ్రేట్ వదినగారూ?
అర్ధంలేని చట్టాల్ని, ఐ.పి.సీని అడ్డం పెట్టుకొని చిన్నవాళ్ళ ఎఫ్.ఐ.ఆర్.లు కఠినంగా రాస్తూ, పెద్దవాళ్ళ ఎఫ్.ఐ.ఆర్.లు లాకీగా రాస్తూ శాంతిభద్రతల్ని కాపాడుతూ, ప్రజల సొమ్ము జీతాలుగా తింటూ, వారి జీవితాల్ని శాసిస్తూ బ్రతికే మీ కష్టం నిజంగా కష్టమేనా? అంత గొప్పగా పరిపాలిస్తే ఇన్ని హత్యలు, దోపిడీలు, మానభంగాలు, లూటీలు, దహనకాండలెలా జరుగుతున్నాయా...?"
ఆమె ఓ క్షణం ఉలిక్కిపడినా వెంటనే సర్దుకుంది.
"నా శాఖ అర్ధంలేనిదే. మరి నీ పిచ్చి సంగీతం.... వీధులెంట డ్యాన్స్ లు, స్టేజీలెక్కి రకరకాల ఫీట్లు...? పిచ్చి కవిత్వం.... మాటేమిటి?"
మాథుర్ ఇంకా పెద్దగా నవ్వాడు. "సంగీతం.... మ్యూజిక్..... మానవ హృదయం జనించి వారిని పులకరింపజేసి, వారి జీవితాల్లో మరపురాని మధురోహల క్షణాలని, యుగాల్ని సృష్టించిన సంగీతం.... మధుర రాగాలూ, త్యాగరాయ కృతులూ, మగళంపల్లి మధురిమలు, సుబ్బలక్ష్మి తాదాత్మ్యత, సింఫోనీలూ, ఒషెరాలూ, రాక్, ఆఫ్రికన్స్ డ్రమ్స్, రిథిమ్ బిట్, వీణలు, సితారలు, సింత రైజర్ లు, సంతూర్ వాయులీనాలు.
మృదంగాలూ... తబలాలూ, వేలాది కంఠాల కోరర్స్.... భజనల.... ఖవాలీలు... గ్రూప్ డాన్స్ లు.... థింసా, క్లాసికల్, పాప్, ఫోక్, కంట్రీ...వాటిని ఆదరించి ఆనందించే కోట్లాది సంగీత ప్రియులు.... అన్నీ అందరూ నీలాంటి వాళ్ళ దృష్టిలో ఫూల్సే.... ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని అర్పించి అందించిన జ్ఞాన సంపద.... సారస్వత సాగరం....అందులో పుట్టిన ఎన్నో అమూల్యమైన ముత్యాల్లాంటి కావ్యాలు... కవితలు..... ఉమర్ ఖయ్యాం రుబాయిలు, గాలిబ్ గీతాలు, హెమ్మింగ్ లే గద్యం, రిల్కె పద్యం.... వాల్మీకి కవిహృదయం, వ్యాసుడి గ్రాండ్ కాన్వాస్... హోమర్ ఇతిహాసం, అరిస్టోఫీనస్ కామెడి, యూరిఫైడిస్ ట్రాజెడీ, ధృతరాష్ట్రుడి బాధ..... సీత కథ..... హెలెన్ వ్యథ.... ఓ మైగాడ్.... ఎంత చరిత్ర....?! ఇది నీ చట్టాలకి, ఐ.పి.సి.లకు అర్ధం కాదులే..... నీకు సంపాదనే తెలుసు.... నేను.... నేను ఐడిల్ గా వుండడమే తెలుసు."