Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 3

   

        ఘర్షణ పెరుగుతోందని గ్రహించిన వృద్దుడు "నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడు బాబూ!" అన్నాడు వణుకుతున్న కంఠంతో.
   
    "నాకు తెలుసు నాన్నా... జీవితమంటే చట్టాలే, బ్రతుకంటే సంపాదనే, కళలంటే కటిక స్మశానమే అనుకునే పచ్చి మెటీరియలిస్ట్ తో మాట్లాడుతున్నాను.....నాకూ ఓరోజు రాకపోదు.... నాకు గుర్తింపు రాకపోదు...."       
   
    "షటప్ అండ్ గెటవుట్..." అంటూ ఆమె మీద మీదకు రావటంతో మాథుర్ మెల్లగా ద్వారబంధంకేసి నడిచి, అది దాటుతూ అన్నాడు...."పోలీసులు నిజంగానే శాడిస్టులు... దానికి ఆడ, మగా భేదం లేదు. ఓ మైగాడ్... సేవ్ మై పూర్ బ్రదర్..." అంటూ దాటేశాడు.
   
    ఆమె చటుక్కున తలుపులు మూసేసింది. బయట చలిలో మాథుర్....
   
    బాధతో లోపల ముసలి దంపతులు.
   
                             *    *    *    *    *
   
    దిలీప్ కుమార్ ఇగో ఎలా దెబ్బతిన్నది?
   
    సీరియల్ లో ఓచోట బిలియనీర్ అయిన జె.జె. ఓ సాధారణ వ్యక్తిలా తన రీజనల్ ఆఫీసుకే రావడం జరుగుతుంది. అలా సాధ్యమా అనే అనుమానం రావచ్చు.
   
    అందుకే రెండు, మూడు వాస్తవంగా జరిగిన సంఘటనలన్నీ మీ ముందుంచుతున్నాను.
   
    ఓసారి, చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్లైట్ లో ప్రముఖ హిందీనటుడు దిలీప్ కుమార్ బొంబాయి నుంచి ఢిల్లీ వెళుతున్నాడట. అప్పటికే దిలీప్ కుమార్ కి ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అప్పట్లో దిలీప్ అంటే తెలీని ప్రేక్షకులే లేరంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
   
    పేరు ప్రతిష్టలతోపాటు దిలీప్ కుమార్ కి ఇగో కూడా అంటుకుంది. తనను చూసి అందరూ గౌరవించాలని, తనచుట్టూ జనాలు ఎగబడాలని లోలోపల అతను చాలా తాపత్రయ పడేవాడు.
   
    సరిగ్గా అలాంటి టైమ్ లోనే దిలీప్ ఫ్లైట్ ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ లు, ఫ్లైట్ క్రూ ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అంత దగ్గరగా ఆయన్ని చూడగల్గుతున్నందుకు తమకు ఎంతో ఆనందంగావుందని చెప్పారట.
   
    దాంతో దిలీప్ కుమార్ పరమానందభరితుడయి చిరుదరహాసాన్ని వాళ్ళకు కానుకగా ఇచ్చి స్వాగత్ మేగజైన్ లో తలదూర్చాడట. ఈలోపు ఫ్లయిట్ లో వున్న కో-ప్యాసింజర్స్ ఒక్కొక్కరే దిలీప్ దగ్గరకు వచ్చి అభినందించి వెళ్ళసాగారు. ఫ్లయిట్ ఢిల్లీవేపు ప్రయాణిస్తున్నా ఆ హడావిడి తగ్గలేదట. మొత్తానికి ఓ అరగంటకి ఆ సందడి తగ్గింది.
   
    అంతలో దిలీప్ కుమార్ కి చిన్న అనుమానం వచ్చింది..... ఫ్లయిట్ లో వున్న ప్రతి ఒక్కరూ తన ప్రతిభను, గొప్పతనాన్ని మెచ్చుకుంటుండగా తన ప్రక్కనే, తనను అనుకోని కూర్చున్న వ్యక్తి కనీసం ఓసారన్నా తలెత్తి తనను విష్ చేయలేదని.
   
    అంతలోనే ఆ అనుమానం కాస్త స్వాతిశయంగా మారింది. అతనిలోని అహం దెబ్బతింది. మెల్లగా దిలీప్ కుమార్ తలతిప్పి ఆ మధ్య వయస్కుడి వేపు చూసి "మీరెక్కడకు వెళుతున్నారు?" అని హిందీలో ప్రశ్నించాడట.
   
    ఆ వ్యక్తి ఓసారి తలెత్తి దిలీప్ వేపు చూసి "ఇది ఢిల్లీ వరకే వెళుతుంది....మధ్యలో ఆగదు" అని తిరిగి మేగజైన్ లో తలదూర్చాడట.
   
    ఆ వ్యక్తి సమాధానం దిలీప్ సహనాన్ని పరీక్షించటంతో "మీరేం చేస్తుంటారు?" అని మరలా అడిగాడట.
   
    "బిజినెస్" అన్నాడట అతను. అతను ఇంకా తనను గుర్తుపట్టక పోవటం దిలీప్ కి అవమానంగా అనిపించింది.
   
    ఇగోకి విచక్షణాజ్ఞానం మొదటి శత్రువు.
   
    "ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?" దిలీప్ మరలా ప్రశ్నించాడు.
   
    "నాకు ఖాళీ సమయాలుండవు" అన్నాడట అతను పొడిగా.
   
    "ఒకవేళ వుంటే?" దిలీప్ రెట్టించాడు.
   
    "సరదాగా విమానాల్ని నడుపుతుంటాను."
   
    అతని సమాధానం విని దిలీప్ ముందు బిత్తరపోయాడట... తరువాత తేరుకొని "సినిమాలేమన్నా చూస్తుంటారా?" అతన్ని తనవేపుకు లాక్కొనేందుకు, తనెవరో తెలియజెప్పేందుకు దిలీప్ విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
   
    "ఎప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా చూశాను. ఇప్పుడు సినిమాలు చూసేంత ఖాళీ లేదు" అన్నాడాయన అదే ధోరణిలో.
   
    మరోసారి షాక్ తిన్నాడు దిలీప్. సినిమాలు చూడని వ్యక్తి ఇండియాలో వున్నాడంటే దిలీప్ కి నమ్మశక్యం కాలేదు.
   
    ఇంతలో ఆయన "ఇంతకీ ఇన్ని ప్రశ్నలెందుకు వేశారు? మీరెవరు?" అన్నాడట.
   
    దాంతో దిలీప్ ముఖం అవమానంతో ఎర్రబడిందట.
   
    "మై నేమ్ ఈజ్ దిలీప్ కుమార్.... నేను సినిమాల్లో యాక్ట్ చేస్తుంటాను" అన్నాడట కసిగా దిలీప్.
   
    అతను అలాగా అన్నట్లు చూసి తిరిగి పత్రికలో తలదూర్చాడట.
   
    దిలీప్ ఇగోమీద ఓ కమ్చీ దెబ్బ చురుక్కుమంది.
   
    అప్పటికే ఫ్లయిట్ ఢిల్లీలో లాండ్ అయింది.
   
    ఆఖరిగా దిలీప్ ఒక ప్రశ్న వేశాడట.... "మీరెవరో తెలుసుకోవచ్చా?" అని.
   
    అతను చాలా కేజువల్ గా..... "ఐ యామ్ జె.ఆర్.డి.....జె.ఆర్.డి. టాటా" అన్చెప్పి సీట్లోంచి లేచాడట. దాంతో దిలీప్ కుమార్ నిజంగా షాక్ తిన్నాడట.
   
    ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్..... బిజినెస్ ఎంపరర్... ఇండియాలో తొలిసారిగా విమానం నడిపిన వ్యక్తి, కొన్న వ్యక్తి.... ఇండియాలో ఎయిర్ లైన్స్ సర్వీసెస్ ని ప్రవేశపెట్టిన ది గ్రేట్ జె.ఆర్.డి. టాటా ఇతనేనా?! దిలీప్ కి కొద్దిక్షణాలు నోట మాట రాలేదట.
   
    దిలీప్ అలా చూస్తుండగానే ఆయన ముందుకెళ్ళిపోయాడట.
   
    కొన్నివేల కోట్లకు అధిపతి అయిన వ్యక్తి మామూలుగా, సాదా సీదాగా మందీ మార్బలం లేకుండా, సాధారణ ప్రయాణీకుడిలా ప్రయాణించటం తలుచుకుని దిలీప్ కుమార్ లోని ఇగో చల్లబడిపోయిందట. ఆ తరువాత దిలీప్ కుమార్ జె.ఆర్.డి.ని కలుసుకోవాలని ప్రయత్నిస్తే, ఆరునెలల తర్వాత ఒకే ఒక్క నిమిషం కలుసుకునే అవకాశం యిచ్చాడట టాటా సెక్రటరి.
   
    ఉదయం తొమ్మిది గంటలు... నగరం నడిబొడ్డున ఆకాశంలోకి తొంగిచూసే అంబర చుంబి సౌధం.... అదే జె.జె ప్రాంతీయ రాజ ప్రాసాదం....వ్యాపారం ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు వాణిజ్య ప్రపంచానికి తలమానికంలా, దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలవిరాట్ లా కనిపిస్తుంది. పదహారు అంతస్థుల జె.జె. బిజినెస్ ఎంపైర్ లో ఇప్పుడు నిశ్శబ్దం, గంభీరత చోటు చేసుకుంది. ప్రతిరోజూ పదిగంటలకు ఆఫీసుకి చేరుకునే సిబ్బంది ఆరోజు తొమ్మిది గంటలకే ఠంచనుగా తమ తమ సీట్లలోకి చేరుకున్నారు.
   
    ఎవరి పనిలోకి వారు తలలు దూర్చినా, రాబోయే పారిశ్రామిక సామ్రాజ్యపు యువరాణి, ది గ్రేట్ జె.జె. మనుమరాలు, జె.జె.కి ప్రాణప్రదమైన సామ్రాజ్ఞి మౌనిక కోసం, ఆమె ఆగమనంలో సంభవించబోయే పరిణామాల కోసం ఉద్విగ్నతతో ఎదురుచూస్తుండగా డైమలర్- మెర్సిడస్ బెంజ్ సర్రున దూసుకువచ్చి సరిగ్గా మేయిట్ గేట్ ముందాగింది.
   
    అందులోంచి ఆమె రాజహంసలా దిగింది.
   
    గేట్ మాన్ వినయంగా ఎయిర్ ఇండియా మహారాజ్ లా తలవంచి డోర్ ని తెరవగా ముందుగా ఆమె ఎడమకాలు క్రిందకు వచ్చింది.
   
    అప్పుడక్కడ ఆమెను ఆహ్వానించేందుకు సిద్దంగా నున్న సిబ్బందిలో ఆమెపట్ల భయమూ, గౌరవంతోపాటు ఆసక్తి కూడా చోటుచేసుకుంది.
   
    ఆ ఆసక్తిలో ఆమె ఎంత అందంగా వుంటుంది? ఎంత సౌకుమార్యంగా వుంటుంది? ఎంత సెక్సీగా వుంటుంది? ఆమె వస్త్రధారణ ఎంత అద్భుతంగా వుంటుందనే ప్రశ్నలు మిళితమయి వుండడంతో, ముందుగా వారి చూపులు ఆమె ఎడం పధం పైకి మరలాయి- ఆ తరువాత క్రమంగా కారునుంచి దిగుతున్న ఆమె పైకి మరలాయి.
   
    పూర్తిగా ఆమెవేపు చూసినవాళ్ళు ఓ విచిత్రమైన ఉద్వేగానికి గురయ్యారు.
   
    ఓ హెలెన్ ఆఫ్ ట్రాయ్ ని, ఓ క్లియోపాత్రాని, ఓ మార్లిన్ మాన్రోని, ఓ ఎలిజబెత్ టేలర్ ని చూసిన సంభ్రమాశ్చర్యాలు వారిలో ముప్పిరిగొనగా ఒకింత ఎమోషనల్ ఎటాచ్ మెంట్ కి దూరమయ్యే అచేతన స్థితికి వెళ్ళారు. రొమేంటిక్ వల్కనో... శృంగారాన్ని, అద్వితీయ అందాన్ని పుణికిపుచ్చుకున్న అగ్నిపర్వతం...అని కొందరు తలపోస్తే... వైటల్ స్టాటిస్టిక్స్ 38-24-38 అని మరికొందరు కూడబలుక్కున్నారు.
   
    నడుస్తున్న పాలరాతి విగ్రహంలా ఆమె ప్రధాన ద్వారంకేసి సాగగా... అప్పటికి వాళ్ళు తేరుకొని ఆమె ననుసరించారు.

 Previous Page Next Page