Previous Page Next Page 
వేగు చుక్క పేజి 2


    "ఫాంటాబ్యులస్!" అన్నాడు ఇంగ్లీషు సెయిలర్స్ లో ఒకతను తమకంగా నిట్టూర్చి, అక్కడ ఉన్న రిక్షా వాలాలతో బేరమాడడం మొదలేట్టాడు.

    "హౌరా బ్రిడ్జ్! హౌ మచ్?"

    విశాఖపట్నంలో ఉన్న హౌరా బ్రిడ్జ్ ఏరియా గురించి సెయిలర్స్ కి చాలా మందికి తెలుసు నెలల తరబడి షిప్పుల్లో ప్రయాణం చేస్తే నానికులకి సముద్రపు గాలి సోకినన్నాళ్ళూ ఆడగాలి సోకదు. అందుకనే పోర్టులో దిగీ దిగగానే సుఖాలని వెదుక్కుంటూ వెళ్ళిపోతారు. చాలా మంది. ప్రతి పోర్టులోనూ "హౌరా బ్రిడ్జి' లాంటి ఏరియా ఒకటి తప్ప కుండా ఉంటుంది. సెయిలర్స్ కి కావలసినని 'అన్నీ' పుష్కలంగా దొరుకుతాయి అక్కడ.

    "హౌరా బ్రిడ్జి! ఓకే సార్! గిప్ హండ్రెడ్ రుపీస్ సార్!" అన్నాడు రిక్షావాలా.

    హర్భరు దగ్గర ఉండే రిక్షావాళ్ళకు మంచి సంపాదన వుంటుంది షిప్పు జర్నీలో డబ్బు ఖర్చుపెట్టె అవకాశం కూడా వుండదు సెయిలర్ల కి అందుకని వాళ్ళకి టోపీ వెయ్యడం తేలిక.

    "హండ్రెడ్ రుపీస్" అని వినబడగానే ఆడపిల్ల లందరూ ఆశ్చర్యంగా అటు చూశారు. వాళ్ళు జగదాంబా సెంటరునుంచీ ఆటోల్లో వచ్చినా ఒక్కొక్క ఆటోకి అయిదురూపాయిలే అయింది.

    ఇంగ్లీషు సెయిలర్సు తమకి అన్నీ తెలిసినట్లుగా మొహం పెట్టి గీచిగీచి బేరమాడ్డం మొదలెట్టారు.

    "హండ్రెడ్ రూపీస్? నో నో ! ఫిఫ్టీరూఫీస్!"

    "నో సార్! గివ్ నైన్టీ రుపీస్!" అన్నాడు రిక్షావాలా.

    "సెవన్టీ ఫైవ్ రుపీస్! నో మోర్!" అన్నారు  సెయిలర్సు ఖచ్చితంగా.

    రిక్షావాలా మనసులో ఉప్పొంగిపోయినా, పైకి మాత్రం విషాదంగా మొహం పెట్టి, "ఓకే సార్! కమాన్!" అన్నాడు.

    ఆ తమాషా చూస్తున్న ఎలిజబెత్ అనే అమ్మాయి ఫక్కుమని నవ్వింది. తక్కిన అమ్మాయిలందరూ నవ్వు మొహాలు పెట్టారు.

    టిక్కెట్లు కొన్న అనూహ్య దూరంనుంచే పిలిచింది.

    "ఎలిజబెత్! శ్రీప్రియా! కమాన్!"

    "ఎలిజబెత్" అనే పేరు వినగానే పుంజుకున్నారు సెయిలర్సు.

    "బ్రదర్! క్వీన్ ఎలిజబెత్ కి ఎప్పుడూ బాటమ్స్ తడిగా ఉంటాయి! ఎందుకో తెలుసా?" అన్నాడు మొదటివాడు.

    "తెలియదు! ఎందుకూ?" అన్నాడు రెండోవాడు అమాయకంగా మొహం పెట్టి. కానీ మోటుగా వుండే ఆ సెయిలర్స్ జోకు రిక్షా అతను అప్పటికి వందసార్లు విని వుంటాడు.

    "ఎందుకంటే, క్వీన్ ఎలిజబెత్-2 అనేది ఒక షిప్పు పేరు కాబట్టి!" అని పగలబడి నవ్వి, "మూవ్ మేన్ మూవ్!" అన్నాడు రిక్షా అతనితో.

    రిక్షా కదిలింది.

    ఉక్రోషంగా చూసింది ఎలిజబెత్.

    "ప్రపంచంలో ఏమూంకెళ్ళినా మగాళ్ళు ఇంతేలేవే!" అని సర్ది చెప్పింది మరో అమ్మాయి.

    అందరూ హార్బరులోకి నడిచారు.

    హార్బరులో పెద్ద క్రేసు ఒకటి, బ్రహ్మాండమైన కొయ్యపెట్టె ఒక దానిని  చులాగ్గా ఎత్తేసి, షిప్పులోకి చేరవేసింది.

    కొంచెం దూరంలో సన్నటి బ్రిడ్జిలాంటిది కనబడుతోంది పొడుగ్గా.

    "అదేమిటో?" అంది శ్రీప్రియ.

    అనూహ్య ఇదివరకు ఒకసారి విశాఖపట్నం వచ్చింది తనకు ఆ ఊరు కొంత పరిచయమే.

    "అది జెయింట్ సైజు కన్వేయర్ బెల్టు! మాంగనీసు  ముడిఖనిజాన్ని నేరుగా షిప్పుదాకా చేరివేస్తుంది" అంది.

    "విశాఖపట్నం పెరిగిపోతోంది స్టీలు ఫ్యాక్టరీ పూర్తయితే గుర్తు పట్టలేనంతగా మారిపోతుందనుకుంటారు" అంది శ్రీప్రియ.

    "పూర్తయినప్పుడు!" అంది అనూహ్య నిరసనగా 'విశాఖఉక్కు, ఆంధ్రుల హక్కు' అని ఎంతో మంది ఆందోళన చేసి, చదువూ, ఉద్యోగాలూ, డబ్బూ, ప్రాణాలూ పోగొట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు మనకీ ఫ్యాక్టరీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క అంగుళం కొత్త రైల్వే లైను వెయ్యలేదు, మొన్న మొన్నటి వరకూ, తప్పనిసరి పరిస్థితుల్లో స్టీలు ఫ్యాక్టరీ ఇచ్చినా, టమిలియన్స్ ఊర్కోరుగా. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో గుండెకాయ లాంటి ఇంజన్ల డివిజన్ తమిళనాడు తరలించుకుపోయినట్లుగానే, విశాఖ ఉక్కుని ముక్కలు చేసి పెద్ద ముక్కని తమ పేలంకి ఎత్తుకెళ్ళి పోయేదాకా వాళ్ళకి నిద్రపట్టలేదు. సేలం ఫ్యాక్టరీ అప్పుడే ప్రొడక్షన్ స్టార్ట్ అయి స్టీలు గిన్నెలు మార్కెట్ లోకి వచ్చాయి. విశాఖ ఉక్కుకి మాత్రం విధులు లేవు."

    ఆమె స్టూడెంట్ యూనియన్ లీడరు. స్టేజి ఎక్కి అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగువాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం మొదలెడితే కోపంతో ఊగిపోతుంది. దేశ భక్తుల కుటుంబం ఆమెది. స్వాతంత్ర్య పోరాట సమయంలో వాళ్ళ తాతగారిని బ్రిటిష్ వాళ్ళు అండమాన్స్ జేయిల్లో వుంచారు. అక్కడే చనిపోయారు ఆయన.

    "ఆఁ! మన ఆంద్రా వాళ్ళు పోట్లాడు కోవడం తప్ప దేశం కోసం ఏం చేశారు తెలుగు వాళ్ళు? అందుకనే మనకి దేన్లోనూ వాటా ఇవ్వడం లేదేమో!"

    నూటపాతిక ఏళ్ళక్రితం దేశాన కోసం దారుణమైన  చావుని కౌగలించుకున్న రంగరాజు లాంటి వాళ్ళు ఈ తెలుగు గడ్డమీద కోకొల్లలుగా ఉన్నారని ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయికే కాదు, చాలమందికి తెలియదు ఈ తరంలో బ్రిటిషు వాళ్ళని గడగడ లాడించిన అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళ పేరే తెలుగునేల దాటి బయట ఎవరికీ తెలియకుండా ఉండిపోతున్నప్పుడు, రంగరాజు లాంటి వాళ్ళు ఎవరికి తేలుస్తారు? తెలుగువాళ్ళు కావడంవల్ల వాళ్ళ త్యాగాలు వెలుగులోకి రాకుండా పోయాయి. వాళ్ళే ఏ బెంగాలీ బాబులో, తమిళ తంబీలో అయిఉంటే, వాళ్ళ ముఖారవిందాలూ, వీరకృత్యాలూ పోస్టేజి స్టాంపుల్లో, పాఠ్యపుస్తకాల్లో, పిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీలలో రోజుకి వందసార్లు మనకి కనబడుతూ ఉండేవి- వినబడుతూ ఉండేవి.

    ఆ మాటే అంది అనూహ్య.

    "మనవాళ్ళు దద్దమ్మలు కారు! త్యాగాలు చెయ్యడమే తప్ప ఆగాలు చేసి భోగాలు అనుభవించే రోగం లేని జాతి మన తెలుగుజాతి! అందుకే ముందుకుపోయే యోగం లేక ఇలా పడి వుంది! అందరిలాగా ప్రతి దానికీ అల్లరి చెయ్యడం నేర్చుకుంటే మనమూ చాలా బాగుపడి ఉండేవాళ్ళం!" ఆవేదన కనిపించింది ఆమె వదనంలో.

    ఆమె మూడ్ పాడయిపోతోందని గ్రహించారు ఫ్రెండ్సు. ఇంక ఆ టాపిక్ వదిలేసి, మౌనంగా షిప్పు దగ్గరికి నడిచారు.

    తాటిచెట్టంత ఎత్తున దుర్భేధ్యమైన ఇనుప గోడలా కనబడుతోంది అది. కింది నుంచీ పైదాకా పెయింటు వేసి ఉంది. ఆ పైన అంతా నీలం పెయింటు.

    నీళ్ళ దాకా సిమెంటు ప్లాట్ ఫారంలా కట్టి ఉంది. దానికి ఒకా మీటరు దూరంలో ఆగి ఉంది షిప్పు. మీద నుంచీ ప్లాట్ ఫారం మీదకు ఇసుప మెట్లు అమర్చి ఉన్నాయి. 'గాంగ్ వే' అంటారు దాన్ని. ఆ మెట్ల పైన, షిప్పు రెయిలింగులకు అనుకుని, సెలయిరు డాబా మీద నుంచీ చూస్తున్నట్లు చూస్తున్నాడు.

    "ఒకసారి షిప్పు చూడొచ్చా మేము?" అంది అనూహ్య చిరునవ్వుతో అతన్ని చూస్తూ.

    ఆమె మాటలు ఆ నావికుడికి వినబడలేదు. విసురుగా వీస్తున్న గాలి, ఆమె మాటలని సముద్రపు దొంగలా హైజాక్ చేసుకెళ్ళిపోయింది.

    మాటలు వినబడక పోయినా ఆమె చిరునవ్వు కనబడింది ఆ నావికుడికి. ఆ చిరునవ్వుకి ఎనెస్తీషియాలా ఎదుటి వాళ్ళని మత్తులో ముంచేసే గమ్మత్తు లక్షణం ఉంది.

    అతను ఇబ్బందిగా ఫీలవుతూ అన్నాడు. "షిప్పు బయలుదేరి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంది. అంతా హడావిడి! సారీ!"

    నిరాశ ఉవ్వెత్తున కెరటంలా లేచి ఆ అమ్మాయి లందరినీ ముంచేసింది.

    "జస్ట్ ఫైవ్ మినిట్స్!....." అంది అనూహ్య గొంతూ, మొహమూ సాధ్యమైనంత జాలిగా పెట్టి.

    వాళ్ళు తటపటాయించటం గమనించి, చొరవగా గాంగ్ వే మెట్లు ఎక్కేసింది.

    "ప్లీజ్! హైదరబాద్ నుంచి పని గట్టుకు వచ్చాం మేము, కేవలం షిప్పులని చూడడానికే!

    ఇవాళ ఈ ఇన్నర్ హర్సరులో ఇది తప్ప ఇంకే  షిప్పూ లేదుట!

    ప్లీజ్! మాకు ఈ చిన్న ఫేవర్ చెయ్యరా? ప్లీజ్!"

    కఠిన శిలలను కూడా కరిగించేటంత ప్రార్థనా పూర్వకంగా ఉంది ఆమె చూపు.

    మైనంలా మెత్తబడి పోయడతను. వాచ్ చూసుకుని, "ఒకే! జస్ట్ ఫైవ్ మినిట్స్! గబగబ ఒకా చక్కరు కొట్టేసి రండి! ఇంజన్ రూంలోకి వెళ్ళొద్దు!" అన్నాడు.

    సంతోషంతో అనూహ్య మొహం వెలిగిపోయింది. "థాంక్యూ! థాంక్యూ సో మచ్!" అంది సిన్సియర్ గా.

    కానీ ఆ సంతోషం అనవసరమనీ, తను ప్రమాదాన్ని వెదుక్కుంటూ వచ్చి ఆ షిప్పు ఎక్కిందనీ, జీవితంలో మర్చిపోలేని అనుభవాలు తనకి కలగబోతున్నాయనీ ఊహించలేకపోయింది!


                                      2

    క్రింద ఉన్న ఫ్రెండ్సు వైపు చూస్తూ, షిప్పులోకి రమ్మన్నట్లు చెయ్యి ఊపింది అనూహ్య.

    అందరూ గబగబ గాంగ్ వే మీదకు ఎక్కారు. కానీ నాలుగు మెట్లు ఎక్కేసరికి వాళ్ళ స్పీడు తగ్గింది. ప్లాట్ ఫారంలా ఉన్న క్వే'కీ షిప్పుకీ మధ్య ఉన్న ఎడంలోనుంచి సముద్రం కనబడుతోంది. మెట్టు మెట్టుకీ మధ్య ఖాళీ ఉంది. తప్పటడుగు వేసి కాలు జారితే, ఒరిగి నీళ్ళలో పడటం ఖాయం.

    అందుకే అలాంటి ప్రమాదమేమీ లేకుండా, మెట్ల కిందగా తాళ్ళతో చేసిన వలలాంటిది కట్టారు. అయినా భయం భయంగానే మెట్లు ఎక్కారు వాళ్ళంతా.

    పైకి వచ్చాక వాళ్ళ భయం తగ్గింది. ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూస్తూ, కారిడార్ లో తలో వైపూ వెళ్ళిపోవడం మొదలేట్టారు.

    అది చూసి గాబరాపడ్డాడు ఆ సెయిలర్ -"ప్లీజ్ ! ప్లీజ్! అలా ఒక్కొక్కళ్ళూ  ఒక్కొక్క  వైపు వెళ్ళిపోకండి ! నాతో రండి! నేను త్వరత్వరగా చూపించేస్తాను" అన్నాడు.

    అందరూ అతన్ని ఫాలో అయ్యారు. "నా పేరు బావా!" అని తనని తాను ఫ్రెండ్లీగా పరిచయం చేసుకున్నాడతను.

    "బావా? ఎవరికీ?" అంది ఒకమ్మాయి, జనాంతికంగా.

    రాబోయిన నవ్వుని ఆపుకున్నారు అందరూ.

    గ్రామరు కొంచెం తక్కువగా ఉన్న ఇంగ్లీషులో చెప్పడం మొదలెట్టాడు అతను.

 Previous Page Next Page