వేగు చుక్క
- మైనంపాటి భాస్కర్
'నేను సాయుధ విప్లవాన్ని ఆదరించలేను. కానీ అల్లూరి సీతారామరాజు వంటి ఆకుంఠిత విప్లవ వీరులనూ, వారి అసమాన త్యాగాలనూ అభినందించకుండా వుండలేను.'
-మహాత్మాగాంధీ
* * *
ముందుగా వెనక్కి:
క్రీ||శ|| 1857: బ్రిటిష్ ఇండియా:
దారుణం ఏదో జరగబోతోందని తనకు తెలిసినట్లు అలజడిగా ఉంది సముద్రం. చిమ్మచీకటి, ఆకాశం వంగి సముద్రపుటంచుని తాకుతున్నట్లు అనిపించేటంత దూరంలో మినుకుమిణుకు మంటోంది ఒక వెలుగుచుక్క. కొద్దిసేపటి తర్వాత ఆ వెలుగు చుక్క సప్తర్షి మండలంలా ఏడు చుక్కలుగా కనబడటం మొదలెట్టింది.
మరి కొంత గడిచాక, ఆకాశంలో నక్షత్రాల మధ్య మబ్బుతరకల్లా ఆ దీపాలమధ్య ఉన్న తెరచాపలు మసక మసగ్గా కనబడ్డాయి. అలలమీద నెమ్మదిగా తేలుతూ దగ్గరవుతోంది ఆ ఓడ.
ఆ ప్రాంతంలోనే మరొక చిన్న నౌక ఉంది. అందులో వున్నారు రంగరాజు.
"సిద్దం!" అని తన అనుచరులని హెచ్చరించి, తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు. బాగా పొడుగ్గా, బలంగా ఉన్నాడు.
అతని అనుచరులతో ఆ షిప్పుని అడ్డగించడం దాదాపు అసంభవమేనని తెలుసు రంగరాజుకి. చిరుచేప తిమింగలాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యడం లాంటిదే ఇది!
అయినా చెయ్యక తప్పదు.
ఉద్వేగంతో బరువుగా ఉంది వాతావరణం. ఆ నౌక బాగా దగ్గరయింది.
"జయ సింహాద్రి అప్పన్నా!" అంటూ సింహనాదం చేసి, తాటినిచ్చెనను ఆ షిప్పు మీదికి విసిరాడు రంగరాజు.
"జయ శ్రీశైల మల్లన్నా! జయ తిరుపతి వెంకన్నా !" అని కేకలు వేస్తూ, ఉడుముల్లా గబగబ ఆ నౌక మీదికి ఎగబాకసాగేరు అందరూ.
క్షణాలలో భీకరమైన పోరాటం మొదలయింది. రంగరాజూ, అతని మనుషులూ కొదమ సింహాల్లా వీరవిహారం చేశారు. రంగరాజు అనుచరుల్లో ముగ్గురు చనిపోయారు. చనిపోయే ముందు ఒక్కొక్కడూ మూడు మూళ్ళ తొమ్మిది మందిని చంపిగానీ నేలకి ఒరగలేదు. అరగంట తర్వాత షిప్పులోని వాళ్ళందరూ ఊచకోత కోయబడగా, ఒక స్త్రీ మాత్రం ప్రాణ భయంతో మిగిలింది.
ఆమె ఒక ఆంగ్ల వనిత.
అది ఒక బ్రిటిషు నౌక.
దాని నిండా ఒకే సరుకు ఉంది!
బంగారం!
బ్రిటిషువారి దాస్యంలోనుంచి బయటపడాలన్న ఆరాటం దేశంలో అప్పుడప్పుడే ఆచరణలోకి వస్తోంది. మొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు జరిగింది.
రంగరాజులాంటి సాహసికులైన దేశభక్తులు కొందరు, సాయుధ విప్లవకారులుగా మారి, ఎవరికివారుగా తెల్లదొరలమీద తిరగబడ్డారు.
పొట్టకూటికోసం వ్యాపారస్తులుగా వచ్చి కాళ్ళ దగ్గర చేరి చివరికి రాజకీయదికారం చేజిక్కించుకుని నెత్తికెక్కిన తెల్లదొరలు, రత్న గర్భ అయిన భారతదేశాన్ని తరతరాలపాటు కొల్లగొట్టి తరలించుకుపోయారు తమ దేశానికి.
తూర్పు తీరన్నంతా ఊడ్చెయ్యగా వచ్చిన అపారమైన సంపదను విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం రేవులో ఎక్కించారన్న సమాచారం అందింది రంగరాజుకి. (అప్పట్లో విశాఖపట్నం హర్భరు ఉండేదికాదు. భీమ్లీనే పెద్దరేవు)
ఆ నౌకనే అడ్డగించాడు రంగరాజు దాన్ని స్వాదీనం చేసుకున్న తర్వాత అండమాన్, నికోబార్ ద్వీపాల సముదాయంలోని కమోర్తా దీని వైపు దారితీపేడు.
సముద్రం అక్కడ రెండు పాయలగా చీలి, తీరం లోతుగా, పెద్ద పెద్ద నౌకలు ఆగడానికి వీలుగా వుంది.
లంగరు వేశారు నౌకకి. బంగారాన్ని చిన్న చిన్న పడవలలో నిర్జనమైన మరో దీవికి తరలించడం మొదలయింది. బాగా బలశాలురైన పధ్నాలుగు మంది మగవాళ్ళు రాత్రింబగళ్ళు శ్రమించినా. ఆ పని పూర్తిచెయ్యాడానికి మూడురోజులు తీసుకుంది.
"పనయితే పూర్తయింది! మరి ఈ దొరసాన్ని ఏటి సెయ్యాల?" అన్నాడు ఒక అనుచరుడు. కణ కణ మండుతున్న ఒక నెగడు చుట్టూ కూర్చుని ఉన్నారు వాళ్ళు. అప్పుడే వేటాడి తెచ్చిన ఒక లేడి నిప్పుల్లో కాలుతోంది. అందరి మొహాల్లో విజయోత్సవం కనబడుతోంది.
ఆ దొరసాని ప్రాణభీతితో రంగరాజువైపు చూసింది.
తీక్షణంగా ఆమెని ఒకసారి పరికించి చూశాడు రంగరాజు.
"ఏం చెయ్యాలి! సమర్యాదగా వాళ్ళ బంధువుల దగ్గర దింపేసి రావాలి" అన్నాడు ముక్తసరిగా. శత్రువుల తలలు తునుమాడి వాటితో బంతులాడగల శౌర్యం వుంది అతనిలో. కానీ శత్రువైనా సరే, ఆడదానికి అపకారం చెయ్యకూడదన్న నియమం కూడా ఉంది.
బంగారాన్ని అంతా ఒకచోట గుప్తంగా భూమిలో పూడ్చి పెట్టడం పూర్తయ్యాక, ఆ ఇంగ్లీషు వనితతో సహా భీమునిపట్నానికి తిరుగుప్రయాణం కట్టారు వాళ్ళు.
మెయిన్ లాండ్ చేరీ చేరగానే రంగరాజునీ, అతని అనుచరులనీ బంధించారు ఆంగ్ల సైనికులు.
ఆ నిధిని దాచిన చోటు చెప్పమని ఒకరోజు చేతి వేళ్ళు కోసి, ఒక రోజు కాలివేళ్ళు తెగనిరికీ, రోజుకో రకమైన చిత్రహింస పెట్టారు.
పెదవి విప్పలేదు రంగరాజు బృందం.
ఉక్రోషం పట్టలేక సోల్జర్లు వాళ్ళని,
సజీవంగా-
సమాధి చేశారు.
నిర్భయంగా, ముక్తకంఠంతో "జయ భారతమాతా! జయ జయ భారతమాతా!" అన్న నినాదాలుచేస్తూ మృతువుని కౌగలించుకున్నారు వాళ్ళు.
వాళ్ళతోబాటే భూస్థాపితం అయిపోయింది ఆ నిది రహస్యం-
నూట పాతిక సంవత్సరాలపాటు.
* * *
1985 : నవంబరు: మొదటి తారీఖు:
విశాఖపట్నం హర్భరు మెయిన్ గేటు ముందు నిలబడి వున్నారు తొమ్మిది మంది అమ్మాయిలు. ఫ్యాషన్లు, సినిమాలు, సీరియల్ నవలలూ, పిక్ నిక్ లూ, వీటన్నిటితోబాటు చదువూ తప్ప జీవితంలో మరేదీ ముఖ్యం కాదనుకునే వయసు వాళ్ళది. హర్భరూ, షిప్పులూ చూడడానికీ వచ్చారు హైదరాబాద్ నుంచి.
ఒకళ్ళు వేసుకున్న రంగుడ్రెస్ మరొకళ్ళు వేసుకోకూడదని ముందే సరదాగా కూడబలుకున్నారు వాళ్ళు. అందుకనే ఒకమ్మాయి చీర కట్టుకుంటే, ఇంకో అమ్మాయి చుడీదార్, కుర్తా, మరొక అమ్మాయి పట్టుపరికిణి నైలాన్ ఓణి- అలా డ్రెస్ చేసుకుని ఉన్నారు.
అవుటర్ హర్భరులోకి అంతకు ముందే వచ్చి ఆగిన షిప్పులో "సైన్ ఆఫ్" చేసి, ఊళ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ సంపాదించిన ఇద్దరు ఇంగ్లీషు సెయిలర్సు గేటులో నుంచీ బయటికి వస్తూ, వాళ్ళని చూసి హుషారుగా విజిలేశారు.
"ది గ్రేట్ ఓరియంటల్ ఫాషన్ పెరేడ్!" అన్నాడొకతను సరదాగా.
"సి దట్ గాల్! సి దట్ గాట్!" అని మోచేత్తో మొదటి వాణ్ణిపొడిచాడు రెండో అతను.
ఇద్దరూ కళ్ళప్పగించేసి చూశారు.
టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర నిలబడి ఉన్న అనూహ్య ఆ అమ్మాయి లందరిలోకి ప్రత్యేకంగా కనబడుతోంది. ఆడపిల్లలకి కనుముక్కు తీరు అందాన్ని ఇస్తే, పొడుగూ, పర్సనాలిటీ సెక్సప్పీలుని కలగజేస్తాయి. ఫేషనబుల్ గా ఉండే బట్టలు గ్లామర్ ని తెస్తాయి.
ఆ మూడూ త్రివేణీ సంగమంలా కలిశాయి అనూహ్యలో.
మోకాళ్ళు దిగి మూడంగుళాలు మాత్రమే కిందికి వచ్చిన గ్రే కలర్ స్కర్టు వేసుకుని ఉందామె. టైలరు జాగ్రత్తగా కట్ చేసి కుట్టిన ఆ స్కర్టు ఒక్క మడత కూడా లేకుండా ఘనమైన ఆమె జఘనాన్ని తమకంగా హత్తుకుని ఉంది. ఆ పైన సన్నటి నడుముని చుట్టేసుకుని ఉంది, బెల్టులాంటి వెండి గొలుసు. లైట్ గ్రే కలర్ టాప్సు స్కర్టులోకి టకప్ చేసింది. ఎత్తయిన వక్షానికి అడ్డంగా తెలుపు చారల డిజైను ఉంది దానిమీద.
తను ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న ఆ గ్రేకలర్ డ్రెస్ సెన్సేషనల్ ఎఫెక్టని కలిగిస్తోందని తెలుసు అనూహ్యకి.