"జయా! నేను తరుగుతాను. నువ్వు వేరే పని చూసుకో" అంటూ ధైర్యంచేసి వంటింట్లోకెళ్ళింది.
"కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టూ, నువ్వూరుకో. అదలా తిరిగి పనిచేసుకుంటుంటే సుఖంగా, తేలికగా ప్రసవమవుతుంది" అంది దుర్గమ్మ.
"ఈవిడ సామెతల పిచ్చికాదు గానీ, ఏమంటోందో ఆవిడకే తెలియదు" నుదురుకొట్టుకుంది జయ.
"ఉష్! అంటే అందిలే, గాడిదలం కాకపోతే ఇలాంటి ఇంట్లో ఆడపిల్లనిస్తామా" అంది చిన్నగా నవ్వుతూ కావేరి.
"ఇదివరకు ఆడపిల్లనిచ్చిన ఇంట్లో కాదుగదా! ఆ వూళ్ళోనే పచ్చి మంచినీళ్ళు తాగేవారు కాదుట. ఆ రోజులు పోయాయి. "మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ అనే పరిస్థితులొచ్చాయి" దుర్గమ్మ కావాలనే అంటోందా లేక తెలివితక్కువగా మాట్లాడ్తోందా? అనే అనుమానమొచ్చింది కావేరికి. గబుక్కున భర్తవైపు తిరిగింది. పేపరు చూస్తున్నవాడల్లా లేచి "చక్రపాణింటికెళ్దాం పద" అన్నాడు. అతని మొహం ఎర్రగా కందిపోయింది.
"అదేమిటన్నయ్యా! వంటయిపోయింది" అంది జయ.
"ఇవాళెలాగూ గురువారం మా ఇద్దరికీ ఉపవాసం. మీ వదిన చెప్పలేదా? పూజకి పెట్టు తింటానంటే" అన్నాడు చెల్లెలి మనసు నొప్పించకూడదనీ.
"అయ్యయ్యో! ఈ విషయం చెప్తే ఉప్మా చేసేదాన్నిగా" అంది నొచ్చుకుంటూ.
"నిన్నిబ్బంది పెట్టడం ఇష్టంలేక హోటల్లో టిఫిన్ చేసేవచ్చాం" చెప్పింది కావేరి.
జయకి పరిస్థితి అర్థమయింది. ఇక మాట్లాడలేదు. చీకటిపడ్తుండగా జయ భర్త శశిధర్ వచ్చాడు. "బావగారా? నమస్కారం. ఎప్పుడు రావడం" అంటూ బాగానే పలకరించాడు.
జయ వదినగారూ, పిల్లలూ బయటికొచ్చి ఎవరివైపూ చూడకుండా వంటింట్లోకెళ్ళారు. జయ వడ్డిస్తోంది. కావేరి వూర్కోలేకపోయింది.
"జయ చాలా బలహీనంగా కనిపిస్తోంది. డాక్టర్ కి చూపించారా? మందులతోబాటు విశ్రాంతి కూడా ఈ పరిస్థితిలో అవసరం" అంది నెమ్మదిగా.
"అవన్నీ ఆడవాళ్ళ విషయాలు, నేను పెద్దగా పట్టించుకోను" చెప్పాడు కావేరివైపు చూడకుండానే.
కావేరి మనసు రగిలిపోయింది. కాపురం చేసి, గర్భవతిని చేసి మిగతా సంగతులేం పట్టించుకోకుండా రంగేళిలా వూరేగుతున్నాడు.
సుష్టుగా తిని, ఆ భోజనం పెట్టిన మనిషిని "నువ్వు తిన్నావా?" అనడగని వాడు ఓ మనిషేనా అనిపించింది. సుధాకర్ లేచి నిలబడి చెప్పాడు. "మా ఫ్రెండ్ ఇంటికెళ్తున్నాం. రేపు గుడికదీ వెళ్ళి సాయంత్రానికొస్తాం. రాత్రికి బండి ఉంది. మీరింట్లోనే ఉండండి" అని కావేరివైపు తిరిగి చెప్పాడు. "జయకి చెప్పు ప్రయాణానికి సిద్ధంచేసుకోమని. అలాగే మనకి వంట చెయ్యొద్దు అనికూడా చెప్పు"
సరేనని వంటింట్లోకెళ్ళింది కావేరి. భర్త చెప్పమన్న మాటలు చెప్పి "వెళ్ళొస్తాం అక్కయ్యగారు, వెళ్ళొస్తాం పిన్నిగారు" అని చెప్పి బయటికి నడిచింది.
"హడావిడి పెళ్లికొడుకు అత్తగారి మెడలో పుస్తె కట్టాడనీ, ఇప్పుడే వెళ్ళిపోతున్నారా?" అంటుంది ఇంతింత ముద్దలు చేసుకుని మింగుతూ దుర్గమ్మ.
బయటకు రాగానే జయ భుజంమీద చెయ్యేసి చెప్పింది కావేరి. "మీ గదిలో మంచంమీద స్వీట్ ప్యాకెట్టు పెట్టాను. నువ్వు తిని తర్వాత వాళ్ళకియ్యి. లేకపోతే నీదాకా రానివ్వరు వాళ్ళు.
జయ శుష్క దరహాసం చేసి "అన్నం పెట్టకుండా పంపించేస్తున్నాను" అంది.
"ఇంటికెళ్ళాక నీ పాకశాస్త్ర ప్రావీణ్యమంతా చూపించెయ్! తృప్తిగా తింటాను. ఇంకెంత ఇరవైనాలుగ్గంటలు!" చెల్లెలి తలను దగ్గరగా తీసుకుని ప్రేమగా చెప్పాడు సుధాకర్.
భర్తతో చెప్పింది కావేరి. "ఇన్నాళ్ళూ అందరూ కావేరికి ఓర్పెక్కువా, మంచిది" అంటుంటే నిజమనుకున్నాను. కాదని జయని చూస్తే తెలిసింది. అన్నీ సరిగ్గా వుండి, భర్త ఆదరణా, అత్తగారి మంచితనం వున్నచోట కలివిడిగా వుండడం గొప్పకాదు. ఏమీ లేకపోయినా నోరెత్తకుండా ఇంత చాకిరీ చేస్తూ, ఒక్కమాటైనా మనకు తెలియబర్చని జయది మంచితనం" అంది.
"కాదు చాతకానితనం!" వెంటనే అన్నాడు.
"ఆడదానికి భర్తని తనవైపుకి తిప్పుకునే ఓర్పూ, నేర్పూ కొంతవరకూ అవసరం. శశిధర్ మూర్ఖుడే కానీ దుర్మార్గుడు కాదు. అది ప్రయత్నిస్తే అతన్ని మార్చుకోవచ్చు. అతనోసారి ప్రపంచాన్ని చూస్తే, తల్లి సణుగుడు లెక్కచెయ్యడు. చాలా మొండివాడు"
"మనింటికి రానీయండి. దానికి నాల్గు లెక్చర్లిచ్చి మార్చేస్తాను. అంతేకాదు అతన్నో రెండు, మూడుసార్లు పిలిపించి మిగతా భార్యాభర్తలు ఎలా వున్నారో తెలిసేటట్లు చెయ్యాలి" అంది కావేరి.
పూజ నిద్రపోయింది. చక్రపాణివాళ్ళు రిక్షాబెల్లు కొత్తగానే బయటికి వచ్చి చూశారు. రిక్షాలోంచి దిగుతున్న సుధాకర్ "సుధా" అంటూ కావలించేసుకున్నాడు. వెనకాలే వచ్చిన వాళ్ళావిడ "రండి, రండి" అంటూ పూజని చేతిలోంచి చనువుగా అందుకుని ఎత్తుకుని "ఒరే బుజ్జీ, సూట్ కేస్ లోపలికి తీసుకురా" అంటూ కొడుక్కు చెప్పింది. రిక్షావాడికి డబ్బులు కూడా ఇవ్వనివ్వలేదు చక్రపాణి. తనే ఇచ్చి భుజంచుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాడు. వాళ్ళ భోజనాలవీ అయి పడుకున్నట్లున్నారు.
"లక్ష్మీ! ముందు కుక్కరు పడేసిరా. తర్వాత మాట్లాడుకోవచ్చు" అని చెప్పాడు.
"అరెరే! ఏం వద్దు. ఓ దుప్పటి ఇవ్వండి చాలు" అంది గబుక్కున కావేరి.
"మీ హైదరాబాద్ లో చుట్టాలొస్తే అలాగే చేస్తారా ఆంటీ!" సిసింద్రీలా అడిగింది వాళ్ళమ్మాయి.