"లతకి కొత్తాపాతా లేదు, అంతా తల్లిపోలిక" చెప్పాడు చక్రపాణి.
"అవునవును! కొత్తవాళ్ళని చూడగానే బిగుసుకుపోయి కూర్చోడం, అలవాటుపడేలోగా వచ్చినవాళ్ళు వెళ్ళిపోవడం నాకు చిరాకు" చెప్పేసింది బంగాళాదుంపలు తొక్కతీస్తూ లక్ష్మి.
"మీరనవసరంగా శ్రమపడ్తున్నారు" అంటున్న కావేరి మాటలకడ్దొస్తూ చెప్పాడు సుధాకర్. "నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వనవసరంగా అడ్డుపుల్లలేసి మా చెల్లెలి పనికడ్డురాకు."
తెల్లబోవడం కావేరి వంతయింది. బంగాళాదుంపల వేపుడూ, చారూ, అప్పడాలూ, వడియాలు, గోంగూర పచ్చడీ, కందిపొడీ, పెరుగుతో కొసరి కొసరి వడ్డించి పీకలదాకా తినిపించారా దంపతులు.
నా కడుపులో ఇంత ఆకలి దాక్కుందా? అని ఆశ్చర్యపోయింది కావేరి. "ఒక చెల్లెలింటికొచ్చి, ఇంకో చెల్లెలి చేతివంట తినాలని రాసిపెట్టుంది కాబోలు" అంటూ చెప్పాడు సుధాకర్, జరిగినదంతా పూసగుచ్చినట్లు.
"ఈ కాలంలో కూడా ఇంత గుండమ్మలుంటారా?" అడిగింది లక్ష్మి అమాయకంగా.
కావేరీ, లక్ష్మీ బాగా కలిసిపోయారు. అటువైపు వాళ్ళ గురించి, ఇటువైపు వాళ్ళ గురించీ కూడా మూడుతరాల వెనక్కిళ్ళిపోయారు.
"చిన్నప్పటినుండి స్నేహితులం, అయినా మాకిన్ని కబుర్లు లేవేమిటి" ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి.
"వదిన చాలా కలుపుగోలు మనిషండీ! చదువుకుని, ఉద్యోగం చేస్తున్నా, అస్సలు గర్వం లేదు" అని చెప్తుంటే స్వచ్చమైన పాలలాంటి ఆమె మనసు లోంచొచ్చినవే కాని అవి మాట వరుసకన్నవి కావని తెలిసిపోతుంది.
ఆలస్యంగా పడుకోవటం వల్ల తెల్లారిలేచేటప్పటికి బారెడు పొద్దెక్కింది.
"అయ్యో!" అనుకుంటూ గబుక్కున లేచింది కావేరి. రాత్రి సరిగ్గా చూడలేదు కానీ, మూడు గదుల పోర్షన్. ముందుగదిలో పిల్లలూ, చక్రపాణి, సుధాకర్ పడుకున్నారు. మధ్యగదిలో లక్ష్మి, కావేరీ పూజని పెట్టుకుని పడుకున్నారు. మిగిలింది వంటిల్లు. విశాలంగా బావుంది. కూర్చుని భోజనాలు కూడా చెయ్యొచ్చు.
"అమ్మా...." అంటూ వచ్చింది పూజ లోపల్నుండి.
"షేమ్...షేమ్ లేట్ గా లేచావు, నేను చూడు బ్రష్ చేసుకుని, పాలుతాగి స్నానం కూడా చేసేశాను" చెప్పింది.
కావేరి అప్పుడు గమనించింది బల్లమీద పూజ బ్రష్, టంగ్ క్లీనర్ వున్నాయి. "నేను ఆంటీకి తీసిచ్చాను. ఈ బాడీఫ్రాక్ కూడా తీసి వేసుకున్నాను బుట్టలోంచి" చెప్పింది.
"లేచావా వదినా! ఇంకాసేపు పడుకోపోయావా? అక్కడెలాగూ తప్పదు నీకీ తెల్లారగట్ల లేవడం" అంటూ వచ్చింది లక్ష్మి తలగడలతో.
"ఛా! ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది" అంటూ బాత్ రూంలోకి నడిచింది కావేరి.
పదవుతుండగా అందరూ కొండకి బయల్దేరారు. చక్రపాణి ఆఫీస్ టెంపో తెప్పించాడు. అతనికి తను పనిచేసే కంపెనీలో షేర్లవీ వున్నాయి. బాగానే సంపాదిస్తున్నాడు. ఇల్లు కూడా కడ్తున్నాడు. రెండునెలల్లో గృహప్రవేశముంటుంది మళ్ళీ రావాలి అని లక్ష్మి ఇప్పటికి పదిసార్లు చెప్పుంటుంది. విజయవాడలో ఇల్లు కట్టడమంటే మాటలు కాదు, అందరూ వ్యాన్ ఎక్కి కూర్చున్నారు. పూజకి చాలా సంతోషంగా ఉంది. లతా, వాళ్ళ బుజ్జీ దాన్నెత్తుకుని దింపట్లేదసలు.
"లక్ష్మి! ఏమిటాలస్యం?" అంటూ హారన్ మోగించాడు చక్రపాణి.
"వస్తున్నానండీ!" అంటూ పెద్ద బుట్టతోటి బయటికొచ్చింది లక్ష్మి.
"అందులో ఏమిటమ్మా" అడిగాడు సుధాకర్.
"ఏం లేదన్నయ్యా! దర్శనమయ్యేటప్పటికి ఆలస్యమౌతుంది. అందుకని పులిహోరా, చక్కెరపొంగలీ చేశాను. పిల్లలకోసం పండ్లు, బిస్కెట్లు పెట్టాను. ఇంక మంచినీళ్ళు, కూర్చోడానికో జంబుఖానా సరేసరి"
"సర్లే! నీకింకాస్త టైమిస్తే మనింట్లో ఒక్కవస్తువూ మిగలకుండా టెంపోలో పెట్టించేస్తావు" అంటూ హాస్యమాడాడు భర్త.
"ఇప్పుడిలాగే అంటారొదినా! తర్వాత పిల్లలకంటే ముందీయనే ఆకలని నా ప్రాణం తినేస్తారు" చెప్పింది వ్యాన్ లో కూర్చుంటూ.
లక్ష్మి ఓర్పూ, పనితనం చూస్తుంటే ముచ్చటేసింది కావేరికి. ఇంకా ఇలా అతిధులకి మర్యాదలూ, ఆప్యాయతలూ పంచే మంచి మనుషులుండబట్టే దేశం ఈ మాత్రంగానైనా వుందికాబోలుననుకుంది.
అమ్మవారికర్చన చేయించి చీరా, రవికల గుడ్డా పెట్టి "ప్రతిజన్మలోనూ ఇటువంటి భర్తా, అత్తగారే దొరకాలని మొక్కుకుంది" కావేరి.
అందరూ జంబుఖానా పరచుకుని కూర్చుని తెచ్చినవన్నీ తిన్నారు. లక్ష్మి చేతిమహిమేమో కానీ దానం కూడా చేసేంత మిగిలింది.
ఇంటికొచ్చేటప్పటికి మూడయింది. లక్ష్మి ఓపిగ్గా గుత్తివంకాయకూర, సాంబారూ, కొబ్బరి చట్నీ అన్నీ చేసింది. "ఏకంగా తిని బయల్దేరదాం సాయంత్రం" అనుకున్నారు సుధాకర్, కావేరి.
కావేరి బలవంతంమీద సాయంత్రం లక్ష్మి, చక్రపాణి కూడా బయల్దేరారు జయ ఇంటికి.
"తెచ్చినసారె నేనెప్పుడు పంచేదమ్మా. ఇంతాలస్యంగా వస్తే" అంటూ రుసరుసలాడింది దుర్గమ్మ.
"నీకింకో అక్క. ఈవిడ పేరు లక్ష్మి" అని పరిచయం చేసింది జయకి కావేరి.
"చారెడు పసుపూ, భరిణెడు కుంకుమా, ఈ కొంచెం చలిమిడీ ఎవరి ముక్కుల్లోకమ్మా?" అంటూ ముక్కున వేలేసుకుంది ఆడపడుచు.
కుంకుమ, పసుపూ, మూడుకిలోల చలిమిడీ, వందలడ్డూలు, చక్కిలాలు, తెచ్చిన చీరలూ ఆవిడకంటికానలేదు. జయ అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంది. పేరంటాళ్ళొచ్చినా కూడా.
"అంతలా ఆవేశపడకు. నువ్వు కుర్చీలో కూర్చో" అంది కావేరి.
"వగలమారొంకాయ సెగలకే మగ్గిందనీ అంతమాత్రానికే అలసిపోతుందా?" అంది దుర్గమ్మ.