"జాణవులే! వరవీణవులే" వెనుకనుంచి వినిపించింది. దిగ్గున వెనక్కి తిరిగి చూసింది. నవ్వుతూ శేఖర్.
"రేపు కలుస్తావా లేదా? ఇప్పుడు చెప్పు! ఆలోచించడానికే ఇంత టైమిచ్చాను" చెప్పాడు మీసాల చాటున నవ్వును దాస్తూ.
"రేపు నీపని చెప్తాను" కళ్ళనుంచి చెంపల మీదుగా జారే ముత్యాలను రుమాలుతో అద్దుకుంటూ అంది.
"థాంక్యూ! ఎదురుచూస్తుంటాను" నవ్వుతూ చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
ఓ నిమిషమాగి చూసి సన్నని చిరునవ్వు పెదవులమీదకి రాగా తనూ ఇంటివైపు అడుగులెయ్యసాగింది తేలికబడ్డ మనసుతో యమున.
* * * *
కావేరికి క్షణం తీరిక లేకుండా ఉంది. జయకి ఏడోనెలొచ్చి వారమయింది. వెళ్ళి పసుపు కుంకుమలిచ్చి తీసుకురావాలి. వాళ్ళుండేది బెజవాడలోనే కాబట్టి కనకదుర్గ మొక్కు కూడా తీర్చేసుకోవచ్చని పూజని కూడా తీసుకెళ్తోంది. ప్రభని రమ్మని మర్యాదకడిగింది. "అమ్మో! వాళ్ళత్తగారో లంఖిణి. ఏదో ఒకటంటుంది. నీకైతే ఓరిమి బాబూ! నేనైతే ఏదో ఒకటి అని దులిపిపారేస్తాను. వద్దు నువ్వెళ్ళు అన్నయ్యతో" అంది.
సుధాకర్ సూట్ కేస్ సర్దుతూ మాటిమాటికీ "కావేరీ కావేరీ" అని పిలుస్తూనే వున్నాడు.
వంటింట్లో అత్తగారితో చక్కిలాలు, చలిమిడీ, లడ్డూ చేస్తున్న కావేరి మాటిమాటికీ పరిగెత్తాల్సి వస్తోంది.
"అబ్బా! వదిలెయ్యండి. నేనొచ్చి చూస్తానుగా!" అంది.
"ఏమిటి నీ మొహం నువ్వు చూసేది! చంటిపిల్లతో వెళ్తున్నాము. దానికి స్వెట్టర్ పెట్టాలా? కొత్తచోటు అక్కడేమైనా విరేచనాలు అవుతాయనుకో. వాళ్ళనిబ్బంది పెట్టకుండా మనమే మందులవీ తీసుకెళ్ళాలి. పూజకి కాఫ్ సిరప్, కోల్డు సిరప్, దెబ్బ తగిలితే నియోమైసిన్ ఆయిన్ట్ మెంట్, చెవి పోటొస్తే ఓజోసిన్ ఇంకా..." అంటుంటే తల కొట్టుకుంది కావేరి.
"ప్రయాణాలు బొత్తిగా చెయ్యకపోవడంతో మీరు కంగారుపడ్తున్నారంతే! అదేం అంటార్కిటికా కాదు. అడవీ అర్ధాన్నం అసలేకాదు. విజయవాడ మహా పట్టణం. వెళ్తున్నది మీ చెల్లెలింటికి. రెండుపూటల్లో తిరిగి వచ్చేస్తాం. ఇంత సరంజామా అనవసరం. అవునూ! ఇంతకీ ఉత్తరం అందుంటుందా? లేకపోతే ఆవిడ చెప్పా పెట్టకుండా వచ్చి మా కోడల్ని పట్టుకుపోతున్నారెందుకంటుంది."
"ఎప్పుడో అంది' మనమొస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో ఆవిడ రిహార్సల్స్ కూడా చేసేసుకునుంటుంది" అన్నాడు పెట్టెమోస్తూ.
"అమ్మాయ్, ఈ పాకం చూడు" అంటూ వంటింట్లోంచి అత్తగారి కేక వినిపించి ఈసారి పిలిస్తే రాను అని బెదిరించి వంటింట్లోకెళ్ళింది కావేరి.
సాయంత్రం బజారుకెళ్ళి జయకో మామిడిపండు రంగు ఎర్ర బోర్డర్ వెంకటగిరి జరీచీర, వాళ్ళత్తగారికో తెలుపుకి నీలమంచు నేతచీర తీసుకుంది. జయకిష్టమని కలాకండ్, జీడిపప్పుపాకం మంచి షాప్ లో కొంది. పూలు, ఆకులూ, అరటిపళ్ళు దగ్గర్నుంచి అన్నీ కొనేసి ఇంటికొచ్చారు భార్యాభర్తలు.
"అమ్మవారికి చీర పెడ్తానన్నావు?" అడిగింది వర్ధనమ్మగారు ఇంటికి రాగానే. కావేరి మాట్లాడలేదు. "బాగానే వుంది సంబడం. ఇదిగో మొన్న ప్రభచేత తెప్పించి వుంచాను. నాకు నీ సంగతి తెలుసుగా!" అంటూ ఎర్రగళ్ళ పేటేరు చీర ప్యాకెట్ లోంచి తీసి చూపించింది వర్ధనమ్మ. కావేరికి తెలుసు ఆదావిడ మనసుపడి ఎదురింటికి చీరలవాడొస్తే కొనుక్కుందని. కానీ తెలియనట్లే తీసుకుని "చూశారా! అమ్మవారే ఏర్పాటు చేసుకున్నారు తన చీర" అంటూ వంగి అత్తగారి కాళ్ళకు దండం పెట్టింది. 'పిచ్చిమొద్దు' అంటూ లేవనెత్తి 'తన స్వార్థం తను చూసుకుంటే ఈ సంసారం ఇలా సాఫీగా నడిచేదా? ఏమైనా కోడలి విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని' అనుకుంది వర్ధనమ్మ.
స్టేషన్ లో దిగగానే "టిఫిన్ చేసేద్దాం. ఎందుకైనా మంచిది" అన్నాడు సుధాకర్. సరేనని పూజకి పెట్టించి తనూ ఆకలి లేకపోయినా ఇడ్లీ తింది. రిక్షా చేయించుకుని ఎడ్రస్ ప్రకారం ఇంటికెళ్ళారు. వాకిట్లోనే కూర్చునుంది దుర్గమ్మ. "కాగల కార్యం గంధర్వులు తీర్చారని, నేనే మీ పిల్లని పురిటికి తీసుకెళ్తారా లేదా అని ఉత్తరం రాద్దామనుకున్నాను. ఇంతలో మీరు రాసిన ఉత్తరం అందింది. ఏమిటి ఇంత ఆలస్యం? 'మందుకెళ్ళి మాసికానికొచ్చి'నట్టు" అంది.
ఆవిడ వాగ్ధాటి తెలిసిందే కావడంతో "ఇద్దరం ఉద్యోగస్తులమా సెలవులవి చూసుకోవాలి కదండీ!" అంది కావేరి.
"తుమ్మితే వూడిపోయే ముక్కుల్లా అవేం ఉద్యోగాలమ్మా! రెండు రోజులు సెలవు కూడా దొరకదా! బాగానే వుంది" అంది.
"అమ్మా! అత్తేది?" అంటూ మధ్యలో రెండుసార్లడిగింది పూజ.
"పెళ్ళికొడుకేడంటే, అరివేణం కుండలకాడ తొంగున్నాడన్నట్టూ లోపలెక్కడో చేసినపనే చేస్తుంటుంది, ఒసేయ్ జయా!" అంటూ కేకేసింది.
ఆ పిలుపు చాలా మోటుగా అన్పించింది. జయ లోపల్నుండి భారంగా అడుగులేస్తూ వచ్చి "అన్నయ్యా, వదినా" అంటూ గబగబా దగ్గరకొచ్చి వదినగార్ని రెండు చేతులతో పట్టుకుని "బాగున్నారా అంతా?" అనడిగింది.
"నువ్వేమిటిలా అయిపోయావు? వేవిళ్ళు తగ్గాయా?" అడిగింది కావేరి గుంటలుపడ్డ కళ్ళు, పాలిపోయిన చెక్కిళ్ళు తడిమి.
"కడుపుతోటున్నప్పుడలా గాక ఇంకెలా వుంటారు? నువ్వు మాత్రం కనలే ఇద్దర్నీ" అంది దుర్గమ్మ నిష్టూరంగా.
సుధాకర్ మొహం ఎర్రబడింది.
"లోపలికి రండి. పూజా, అత్త గుర్తుందా!" అంటూ పూజని ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది జయ.
పక్కగదిలోంచి టి.వి. హోరుగా వినిపిస్తోంది. "ఎవరూ?" అన్నట్లు సైగచేశాడు సుధాకర్.
"మా వదినగారూ, పిల్లలూ. అన్నయ్యగారు దుబాయ్ వెళ్ళినప్పట్నించీ ఇక్కడే వుంటున్నారు" చెప్పింది కావేరి.
ఆవిడ కానీ, పిల్లలు కానీ ఇంటికెవరో వచ్చారని బయటికొచ్చి పలకరించడం అదీలేదు. వి.సి.ఆర్.లో క్యాసెట్లనుకుంటా చూస్తున్నారు. గొడవ, గొడవగా.
కావేరి స్నానం చేసొచ్చింది. పూజని కూడా తయారుచేసింది. దుర్గమ్మ తన ధోరణిలో ఏదో పెళ్ళినాడు మర్యాదలవీ సరిగ్గా జరగలేదనీ, వాళ్ళ మేనత్తకెవరికో అప్పగింతల చీర పెట్టలేదని చెప్పుకొస్తోంది. జయ వంచిన నడుం ఎత్తకుండా వంటింట్లో అటూ ఇటూ తిరుగుతూ వంట చేస్తోంది. కత్తిపీట ముందు కూర్చుని కూర తరుగుతున్నదల్లా, పొయ్యి మీద ఎసరు చూడడానికి లేచింది. లేచేటప్పుడు చాలా కష్టపడ్తోందని ఆమె ముఖం చూస్తే ఎవరైనా చెప్పగలరు. కావేరి మనసు కొట్టుకుపోతోంది జయ పరిస్థితి చూస్తుంటే. అక్కడ వదినగారూ, పిల్లలూ మళ్ళీ క్యాసెట్టు మార్చుకుని కేరింతలు కొడ్తూ సినిమా చూస్తున్నారు. ఇక్కడ దుర్గమ్మ ధోరణి దుర్గమ్మదే.