Previous Page Next Page 
వివాహం పేజి 3

       
                                                                                  2

    శెలవు తీసుకుని తమ్ముడి వూరికి వెళ్ళి కర్మ ముగించి మర్నాడు ప్రయాణమన్నాడు. వెంకన్న పం
తులు వొచ్చినప్పణ్ణించీ, మరదలూ, కూతురూ, అతను తమను తీసుకుపోవడానికి వొచ్చినట్టే తలచుకొని అట్లానే మాట్లాడుతున్నారు. వాళ్ళని తీసుకుపోనని చెప్పే సమయం అతనికి దొరకనేలేదు. అతనితో వారా ప్రశ్న రానిస్తేనా. ఊరికి వెళ్ళేట్టే అన్ని యేర్పాట్లూ చేయించారు. అందరితోనూ, 'మా పెద్దనాన్న వొచ్చారు, వాళ్ళ వూరు వెడుతున్నామం'ది రమణ. ఆ వూరి పెద్దమనుష్యులూ, సంస్కర్తలూ, హెడ్మాష్టరు పూర్ణానందంగారూ, తాసిల్దారు రామకృష్ణయ్యా అందరూ అతన్ని చూడవచ్చి యూ సంసార భారం వహిస్తున్నందుకు వెంకన్న పంతుల్ని అభినందిస్తో మాట్లాడారు. రామ్మూర్తిని అద్భుతంగా పొగిడారు. స్కూలు పిల్లలు వచ్చారు. సామానంతా చిటికెలో సర్దేశారు. బళ్ళు పిలుచుకొచ్చి యెక్కించారు.

    "బాబాయ్! ఈ సామానంతా ప్యాసింజర్ లో తీసికెడితే చాలా ఖరీదవుతుంది. గూడ్సులో వేయిస్తా"నని ఆగక వెళ్ళిపోయింది రవణ.

    తను రవణ వెనక పరిగెత్తుకెళ్ళి "వీల్లేదు నేను మిమ్మల్ని తీసుకుపోవటంలే"దని యెట్లా అంటాడు వెంకన్న పంతులు? యెదుట నిలబడి వున్న శిరద్దారుని చీవాట్లు వేయడం, గుమాస్తా శెలవ అడిగితే వీల్లేదనటం నేర్చుకున్నాడు గాని, తండ్రిపోయి యేడ్చే ఆడపిల్ల వెనక పరుగెత్తి యేడిపించే ధైర్యమెక్కడ నేర్చుకున్నాడతను?

    తమ 'టీచరుగారి' సంగతి వచ్చినప్పుడల్లా, ఆయన ఫోటో ఆయన దస్తూరీతో కాయితం కనపడ్డప్పుడల్లా ఆ కుర్రాళ్ళ యేడుపులు విచిత్రం! రవణ వాళ్ళని వోదార్చడం! ఇదో కొత్తలోకం లాగుంది వెంకన్న పంతులుకి. సంస్కరణం యిష్టంలేని లోకమంతా కలిసి యే విధానో రామ్మూర్తిని చంపినట్లు మాట్లాడుకుంటున్నారు వారందరూ. అందులో రామ్మూర్తి బంధువులు, అందులో చాలా దగ్గరవాళ్ళు, బాధ్యత కలవారు. అందులో ముఖ్యంగా ఒకరు, అతని చావుకు కారణమైనట్లు వాళ్ళంటున్నట్లు తోచింది వెంకన్న పంతులుకి. పోనీ అట్లా వూరికే యాడవకపోతే వాళ్ళలో యెవరో ఇద్దరు కుర్రాళ్ళు, తల్లినీ కూతుర్నీ కట్టుకుని వితంతు రజస్వలానంతరం వివాహ సంస్కరణాన్ని సఫలపరచి, గురూపదేశ రుణం తీర్చకూడదా, తనకీ అవస్త తప్పిపోనే - అనిపించింది పంతులికి.

    ఏమైతేనేం, తన ప్రయత్నం రవ్వంత లేకుండానే బుధవారం సాయంత్రం తల్లీ కూతుళ్ళతో సహా గంటకి ముప్పైమేళ్ళ వేగంతో తన వూరివేపు ఎగిరిపోతున్నాడు. కరణాల డొక్కలు చీల్చడానికి ప్రసిద్ధి కెక్కిన డిస్టీ కలెక్టరు. చెట్లలోంచి కనపడే గుడి గాలిగోపురం వెనక సూర్యుడస్తమిస్తున్నాడు. రైలు గేటు దగ్గిర ఆవు పెయ్యలు తోకలెత్తుకొని బెదరి పరిగెత్తాయి.
పైర్లమీద శాంత వస్త్రాన్ని కప్పింది పంజ. వెంకన్నగారి మనసులో కలవరపు టాలోచనలు విజృంభించాయి. ఈ తల్లినీ కూతుర్నీ వెంట పెట్టుకెళ్ళి తన యింటి గుమ్మంలో దిగగానే, భార్య యేమంటుందో, యేం చేస్తుందో అని ఆలోచించాడు. తన కచేరీకి వొచ్చే కరణాలూ, ప్లీడర్లూ, గుమాస్తాలూ, వీళ్ళందరి స్వభావం-ముఖం చూడగానే కనిపెట్టి మరు నిమిషం ఏం మాట్లాడుతారో యెట్లా ప్రవర్తిస్తారో తెలుసుకోడంలో నేర్పరితనం వహించగలిగాడు గానీ, యిన్నేళ్ళు కలసి కాపరం చేస్తున్నా, భార్య రామమ్మ యే నిమషాన యామంటుందో, యేం చేస్తుందో, యెందుకు చేస్తుందో రవ్వంత కూడా నిర్ణయించలేడు. తను చంగావి పంచెలు మానేసి కలకత్తా అంచుపంచెలు కట్టినందుకు గాని, యే మధ్యాహ్నం కాఫీమాని 'టీ' తాగినందుకు గానీ, యే కారణాల వల్లనైనా ఆమె తటాలున బావిలో పడ్డా, అతనికేమీ ఆశ్చర్యం కలగదు. కాని పూర్వానుభవాన్ని పట్టి ఆమె మూడు విధాలైన ఆచరణలు అమలులో పెట్టవొచ్చు, యీ విషయంలోనని అనుకున్నాడు. మొదటిది - వీళ్ళని చూడగానే పెద్దగా అరిచి వాళ్ళు యింట్లోంచి వెళ్ళిందాకా తను ఒక్క నిమిషం విశ్రాంతి పుచ్చుకోవడం గాని, యితరుల్ని పుచ్చుకోనివ్వడం గాని లేకుండా వీలయిన శబ్దాలు చెయ్యడం, తన కష్టం తొలగిందాకా చుట్టుపక్కల వాళ్ళందరికీ, ముఖ్యం భూలోకదైవం తన భర్త వెంకన్న పంతులుకీ, తరువాత ప్రియమైన పిల్లలకీ, అమితమైన కష్టం కలిగించే సామర్ధ్యం ఆమె కతీతంగా వుంది.

 Previous Page Next Page