Read more!
 Previous Page Next Page 
వివాహం పేజి 2

       
    సంస్కరణానికి పూనుకున్న యోధుడు అదేదో కొన ముట్టిందాక చూసిపోక, ఈ ప్రకారం సంస్కారాన్నీ, సంస్కరణానికి అచ్చుపోసిన కూతుర్నీ నిర్లక్ష్యంగా వొదిలిపెట్టి సుఖంగా బతుకుతున్న తనకీ, తన కుటుంబానికి తన మామగారి ఆచారానికీ యింత ఆపత్తు కలిగించటానికి రామ్మూర్తి కేమి హక్కువుందని వెంకన్న పంతులికి కోపమొచ్చింది. ఒకసారి కనపడిచే యివన్నీ తమ్ముడుతో "ఆర్గ్యూ" చేసి వుండును.

    రామ్మూర్తి భార్యనీ, కూతుర్నీ, వాళ్ళ గతికి వాళ్ళని వొదిలేసి చక్కా వెళ్ళిపోయాడు. 'దేవుడే ఉన్నాడు గతిలేని వాళ్ళకి' - అంటే తక్కువ అపవాదా, 'ఆచారం లేని వాళ్ళని తన యింట్లో పెట్టుకుని పోషిస్తే' తక్కువ అపవాదా అని ఆలోచించాడు పంతులు. తమ్ముడికే కానీ అతని కూతురికీ, భార్యకీ సంస్కరణాభిలాష వుండదు కదా? వాళ్ళని పూర్వాచారంలో కలిపేసుకోవచ్చు. కాని, ఆ పిల్ల రజస్వలయిందను కుంటున్నారు? వెంకన్న పంతులికి పెళ్ళి కావలసిన కూతురంటే యిన్ని జిజ్ఞాసలే రాకపోను. ఆ ఆపదే లేదు కనకనే యీ వూగులాట. కాని యెట్లాగేనా కొన్ని దురూహలు తప్పవు. తనని గురించి అంత మంచి అభిప్రాయంగల తన మామగారేమంటారు?

    ఇరవై యేళ్ళకిందట పెండ్లినాడు వెండి చెంబుతో పంచపాత్ర యిస్తానని యింకా ఇవ్వలేదని, మొన్ననే ఆ మామగారిని బూతులు తిట్టాడుయ కాని, ఈ విషయంలో ఆయన తన కిచ్చే గౌరవాన్ని పోగొట్టుకో తలుచుకోలేదు. ఎంత అనుభవం మీద ఆయన సనాతన మార్గాన్ని తొక్కి ధన్యుడైనాడో కదా! తనా అనాచారంలో ప్రవేశించి, పాపం ముసలివాడు తన భార్య తండ్రి, ఆయన అవసానదశలో కష్టం కలిగించేది? అదీగాక, ఈ కాలంలో తమ్ముడి దిక్కులేని సంసారాన్ని భరించలేదని ఆగ్రహించే దెవడు, రజస్వులైనట్టు అనుమాన మున్న పిల్లని యింటో పెట్టుకున్నాడని వెలివేసేవాడే కాని! వాళ్లు అడుక్కుతింటే యెవరికేం. భ్రష్టులైపోతే యెవరికేం? పైగా నీకు మాత్రమెందుకంటారు. జాలిపడి సహాయం చేసే వాణ్ణి. తమ్ముడి కర్మ యెవరు చేస్తారు? తనే చెయ్యాలి. ఈ విషయంలో ప్రపంచం తనను క్షమించదు. ఇంటిపక్కనున్న పురుషోత్తమ శాస్తుర్లూ, సంస్కర్తలందరికీ ఆదర్శ పురుషుడు వెంకటశివుడూ అందరూ వొచ్చి, తక్కిన విషయాలెట్లావున్నా తమ్ముడి కర్మ మాత్రం తను చేసి తీరాలన్నారు. సంస్కర్త అయితే మాత్రం రామ్మూర్తికి పుణ్యలోకాలక్కర్లేదా? శాస్త్రం ప్రకారం అన్న, కర్మ చేసి తీరాలి మరి. రామ్మూర్తి పేరుని, అన్న వెంకన్న, పిత్రులోకాలవరకూ నెడితే, తరువాత ఆ లోకంలో పిత్రుదేవతలు దాన్నేమన్నా చేసుకోవీ, వాళ్ళగోల వాళ్ళదీ!

 Previous Page Next Page