రెండోది- వీళ్ళు వొచ్చారని తెలియగానే ముసుగు పెట్టి, ఒక్క ఆహారానికి తప్ప, యింక అన్నిటికీ నిర్జీవమై, పడుకుని వుండడం. మూడోది- తన కోపాన్నంతా దిగమింగి, ఈ కొత్తవారికి మర్యాదా ప్రేమా కనపరచడం. ఈ మూడోది సక్రుతూ, తాత్కాలికమూనూ. ఈ మూడోపద్ధతి పన్నిందా వెంకన్నపంతులికి సంతోషం యేమీలేదు. అసలు వడ్డీతో కూడా తుఫాను త్వరలోనే బద్ధలౌతుంది. తన గుమ్మంలో బండి చప్పుడు కాకుండా దిగడం, వణుకుతున్న వేళ్ళతో ముందుగానే బండి వాడికి డబ్బులు ఒక అణా ఎక్కువగా యివ్వడం. ముందు తను వసారాలోకి నడవడం, దీపం చీకట్లో తన వీపు వెనకాల వీళ్ళు నుంచోడం, బండివాడు సామాను తీసుకొచ్చి లోపల .... ..... చప్పున వెంకన్నగారి గుండెలు కొట్టుకోడం ఆగాయి. తన ట్రంకు, తోలు ట్రంకు కొత్తది అది యామయింది? రైల్లోవచ్చిందా? దాన్ని చూసి మూణ్ణెల్లయినట్టుంది. దాన్ని, తన మంచి ట్రంకుని యెట్లా మరచిపోయినాడూ? యీ పాడు గోలల్లో మతే తోచడం లేదు. బట్టలు మార్చుకున్నాడు, డబ్బు తీశాడు, టికెట్టు కొన్నాడు, కాని ట్రంకు చూసిన జ్ఞాపకం లేదు. జేబులో తాళం చెవిలేదు. రైలుపెట్టి చుట్టూ చూశాడు. ఎక్కడా కనపళ్లేదు.
"ఏమిటి బాబాయ్, వెతుక్కుంటున్నావు?"
ఈ రవణ, తన సొంత కూతురై, ఒక్క నిమిషం తనని విడిచి వుండనంత చనువైనట్టు మాట్లాడుతుంది. స్వభావమా, యెత్తా? ఆ పిల్లని చూసినకొద్దీ అతని కాశ్చర్యంగా వుంది. తండ్రిపోయిన దిగులేమీ కనిపించదు. పదమూడేళ్ళకీ చాలా భారీవొళ్ళు, యిదో దుర్లక్షణం. పెద్దది కాలేదంటే చూశే వాళ్ళు నమ్ముతారా? యీ అమ్మాయి స్వభావం కూడా నీచమైనదిగా కనపడుతోంది. ఆ బడిపిల్లలతో చనువూ, బండివాడితో, స్టేషన్ నౌకర్లతో చొరవా, సిగ్గు అసలు లేకపోవడం, యివన్నీ పంతులుకి వెగటుగా తోచాయి. టిక్కెట్ కలెక్టర్ని భుజంమీద చెయ్యేసి వూయించి, "వెంకటేశ్వర్లుగారూ, మేము వెళ్ళిపోతున్నాం. మా బాబాయి మమ్మల్ని తీసుకెడుతున్నా" రంది.
ఇప్పుడామూల సాలెవాడితో, బట్టలు నెయ్యడం, స్వదేశీ పరదేశీ; లాభం, నష్టం యేమిటో మాట్లాడుతుంది గంటనించి. వాడితో వెళ్ళిపోరాదూ, తననిట్లాయేడిపించకపోతే....!
"ఏం లేదు? ఏం లేదు.... నా పెట్టె...."
చిరునవ్వుతో "వుంది బాబాయ్!.... మన సామానులోనే వచ్చింది, నీకేమన్నా కావాలా దాంటో?" అంది.
ఉందా! ఎక్కడ? తాళం లేదుగా! మూత యెట్లా వస్తుంది? తన కేం కావాలి? తనకేం కావాలనాలి? ఆలోచించాడు.
"పుస్తకం కావాలి."
"మూడు పుస్తకాలున్నాయి, ఏది కావాలి?"
"జ్ఞాపకం లేవు, చూడనీ."
(2)
"రైనాల్డ్సు, మేరీ ప్రెస్, రివిన్యూ ఎడ్మినిస్ట్రేషన్, సత్యం-శివం-సుందరం. యేది కావాలి."