Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 2


    గుంటూరులో వున్న వెయ్యిగజాల నివేశన స్థలం ఇక అతనికి అనవసరం అనిపించింది.

    అదీగాక_గుంటూరు అతనికి ఇరుకై పోయింది. అంటే అతనికి విశాలదృష్టిలో గుంటూరు చాలా చిన్న ఊరు అయింది. ఆ స్థలం అమ్మివేస్తే, ఉన్న అప్పులూ తీర్చుకోవచ్చు. రెండు మూడు వందలు చేతపట్టుకొని మద్రాసు వెళ్ళవచ్చునని తోచింది.
    కొద్దిరోజులకే మద్రాసు చేరాడు.

    మద్రాసు వెళ్ళిన తరువాత_'మూడు వందలలో ముచ్చట అయిన ఇల్లు' అనే వ్యాసం వ్రాశాడు. మూడు గదులూ, ఒక వంట ఇంటితో సహా, మూడు వందలతో ఒక ఇల్లు కట్టడం ఎల్లాగ సాధ్యమో చూపిస్తూ దానికి కావలసిన వస్తువులూ, వాని ధరలూ, ఆ లెక్కలూ, ఆ ప్లానులూ, సమస్తమూ తయారుజేసి వ్రాసి చూపాడు. దానితో అతనికి అద్భుతమైన పేరు వచ్చింది. గవర్నమెంటు వారు శిరోమణిని వెంటనే ఆర్కిటెక్టుగా నియమించక పోవటం కేవలం అన్యాయం అనిపించింది. అతనిని అందరూ వేనోళ్ళ పొగిడారు.   

    అక్కడ నుంచి అతనికి ఒక టేపిచ్చి, పుస్తకాలు కొనటం చదవటం, ఇప్పటి కాల పరిస్థితులనూ దారిద్రాన్ని పట్టి ఇళ్ళు చౌకలో ఎల్లాగు కట్టవచ్చునో, గవర్నమెంటు వారు తాము కట్టె భవనాలలో కొద్ది మార్పులుచేస్తే ఎన్ని లక్షలు ఆదా చెయ్యవచ్చునో మొదలైన విషయాలు ఎన్నో అతడు బయట పెడుతూంటే అంధ్రావని అట్టుడికినట్లు ఉడికి పోయింది. ఇట్టి విషయమైన జ్ఞానంలో శిరోమణి నిధి అయిపోయినాడు. కీర్తి వచ్చింది గానీ__

    ఆర్ధికంగా మట్టుకు అతనికేమి లాభించలేదు! లాభించలేదని అతడు నిరుత్సాహమూ చెందలేదు. గృహ నిర్మాణంలో నుంచి, అతడు గృహ సౌదర్య విషయమై_'ది ఈ స్తటిక్స్ ఆఫ్ ది హోమ్_' తెలుసుకొనటం మొదలు పెట్టాడు. అదో ఏడాది తీవ్రంగా చదివాడు. తరువాత పశ్చిమ దేశాలలో గృహనిర్మాణమూ, ప్రాగ్దేశాలలో గృహనిర్మాణం ఈ రెంటికి గల సామరస్యం భేదమూ అంటూ మరొక వ్యాసం వ్రాశాడు.

    గృహనిర్మాణాన్ని గురించి చదువుతూ ఉన్న రోజులలోనే ఆయనకు వాస్తుశాస్త్రంలో పరిచయం కలగటం సంభవించింది_అది క్షుణ్నంగా చదివిన మీదట ఆయన మనస్సు జ్యోతిష్యం మీదికి పోయింది. యిక అప్పటినుండీ ఆయన జ్యోతిష్యం మీద పట్టించాడు.

    ఇంతకూ, ఆయన అప్పటికీ యిప్పటికీ యిల్లు కట్టలేదు. కాని యిల్లు కట్టడాన్ని గురించి, ఆ శాస్త్రానికి సన్నిహితమైన వాస్తు జ్యోతి శాస్త్రాలను గురించీ శిరోమణికి తెలిసినంతగా యింక ఎవ్వరికీ తెలియదు.

    యింతకూ ఎందుకు చెప్పానంటే ఇదంతా_అదిగో ఆ చివరవాక్యం ఉందే, అప్పటికీ యిప్పటికీ_అని అదే ఆ వాక్యమే మా ఇద్దరి జీవితాలనూ కలిపి కుట్టింది_అదే మా జీవిత పంథాలను కలుపుతూ వున్న అడ్డరోడ్డు. అదే మా జీవిత స్రవంతులను కలుపు వారావధి మా జీవిత సంగీతానికి మేళకర్త_అదే ఆహతనాదం. మాజీవిత విపంచులు ఆ వాక్యం స్పురించే అర్ధంలో మాత్రం ఏకశ్రుతిని పొందినవి. ఒకే శ్రుతిలో వున్న వీణాతంత్రులలో ఒక దానిని కదిలిస్తే, రెండో తీగలో కూడా అదేవిధంగా కదలిక కలిగినట్లు, అతని జీవితవివంచిపై జన్మించిన నాదమే నా జీవిత విపంచిపై కూడా, సంవాది న్యాయాను గుణ్యముగా, మ్రోగింది. ఆ వాక్యార్ధం యొక్క అనుభూతియే మా యిరువురి జీవితాలను రాసోద్దీపకమైన ఘట్టము. ఆ వాక్య స్పురణలో వుత్పత్తి ఐన నాదాలే మా యిరువురి జీవాలలో ఆరోహణా క్రమణ ఊర్ధ్వ ముఖంగా బయలుదేరి మూలాధార స్వాధిష్ఠాన, మణిపూరక అనాహతాది చక్రపరంపరను దాటి తారాస్థాయిలో మేళవించినై. అందుచేతనే ఆ కథ అంతా చెప్పవలసిన వచ్చింది. 
                 

                                                                               2

                            ఇక నా సంగతి.

    నేనూ ఇల్లు కడదామని తీవ్రంగా ఆలోచించాను. ప్లానులు కూడా తయారు చేశాను. ఇంటికి ముందు వసారా, దక్షిణాన తడక గదీ, పడమట వంటఇల్లూ, మధ్యహాలూ ఉండేటట్టు ఏర్పాటు చేశాను. మా అమ్మాయి నాకోగది ప్రత్యేకంగా కావాలెనాన్నా అన్నది ఇదంతా గ్రహించి.

    "నీకు గది ఎందుకే. రేపో ఎల్లుండో అత్తవారింటికి పోయేదానివి...దాని కెందుకు నాన్నా నాకుమట్టుకు చదువు కొనేందుకు ప్రత్యేకంగా గది కావాలె నాన్నా" అన్నాడు మా అబ్బాయి.

    "నీవు మట్టుకు ఇక్కడ ఉండ వచ్చావా ఏమిటి? పెద్ద అయిం తరవాత ఏ వూళ్ళో ఉద్యోగం అవుతుందో? ఎక్కడ ఉంటావో? నీకు మట్టుకు గది ఎందుకురా" అన్నది ఆడపిల్ల.

    "నాకు కావాలె...అదంతా నీకెందుకూ" అని మొగపిల్లవాడు ఉరిమి చూశాడు.

    "నీకు...అనవసరం...అంతవరకు నిజం. నాకంటే...బట్టలూ, సొమ్ములూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకం గది కావాలె అన్నది, అది సహేతుకంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లు.

    "నీకున్న_పెట్టెకూ, సొమ్ములకూనూ ఓ పెద్ద గది కూడానూ! ! వెధవవి రెండు పెట్టెలున్నాయో  లేవో!! అన్నాడు వీడు రొమ్ము విరుస్తూ.

    "నీకు ఎడ్సినై, మాటలు సరిగ్గాగానీ అన్నాడు. వీడు ముక్కుపుటాలు ఎగరేస్తూ.

    "వెధవగది నీవేతీసుకో_నా కొద్దులే_అని కళ్ళ నీళ్ళు గుక్కుతుంది ఆడపిల్ల.

    "ఆ వెధవగది అంటావా?" అని లేచాడు కోపంతో. నాకు వళ్ళు మండిపోయింది, వీళ్ళపోట్లాట చూస్తే.

    "నోరు మూయండర్రా భడవల్లారా. ఆలూ లేదూ సూలూ లేదూ కొడుకు పేరు సోమలింగ మన్నట్లుంది. ఇళ్ళు కట్టనూ లేదు పెట్టనూ లేదూ మీరు గదుల కోసం పోట్లాటా!!" అని వాళ్ళ ఇద్దరినీ సద్ది పడుకోండి అని పంపించి ప్లానులు ముందు వేసుకొని, దక్షిణపు వేపు గోడకు రెండుకిటికీలు పెడితే బాగుంటుందా లేక దక్షిణాన ఒకటే పెడదామా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. సింహద్వారం మట్టుకు తూర్పుకే పెట్టడానికే నిశ్చయించాను. అయితే దక్షిణ వేపు గదే పడకగది కావాలె. ఆగదిలో ఎనిమిది మంచాలూ పట్టాలె. ఎట్లాగా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.

    ఇంతలోనే తొమ్మిది గంటలూ, ఠాంగ్, ఠాంగ్ న కొట్టటం ఏమిటీ మా ఆవిడ ఘళ్ళుఘళ్ళున గుండుచెంబుతో మంచినీళ్ళు పట్టుకొని రావటం ఏమిటి, రెండూ ఒకసారే.

    చిరునవ్వుతో మా కాంతాన్ని ఆహ్వానించాను.

    ఏం మహా సరదాగా ఉన్నారు ఇవ్వాళ అన్నది కనుబొమ్మ లెగ రేస్తూ.

    రా, రా, ఇట్లాకూర్చో, చెప్పానుగాదూ నీకు ఇళ్లు కట్టించాలని ప్రయత్నం చేస్తూన్నానని అదే సంగతి. ప్లానులు అన్నీ తయారు అయినై. దక్షిణపువైపుగా మన పడకగదికి రెండు కిటికీలుంటాయి కావలసినంతగాలి. చూడు ఇక్కడా... ...ఇల్లు ఇల్లాగ తూర్పు ముఖంగా ఉంటుంది_పడక గదికి అవతల చిన్నతోట. అందులో గులాబీ, చామంతి, మల్లె, జాజి, గన్నేరు, రేరాణి మొదలైన పూల మొక్కలుంటాయి. ఆపూలపై నుంచి వచ్చే మంచిగాలి సరిగ్గా మన గదిలోకి వస్తుంది. రెండే గదులు...అందులో ఇది నేను చదువుకొనేగది, నా కుర్చీలు, బల్లా, బీరువా యిక్కడే పెట్టుకుంటాను. ఏం అట్లామాస్తావెం. అర్ధం అవుతున్నాదా?

 Previous Page Next Page