Next Page 
కాంతం కాపరం పేజి 1

                                 


                                                     కాంతం కాపరం


                                           -మునిమాణిక్యం నరసింహారావు

                                                          మా గృహనిర్మాణం

 

                                        
   
    ఈఅద్దె కొంప లలో ఉండి అవస్థలు పడలేక స్వంత ఇల్లోకటి కట్టించుకోవలెనని అభిలాషపడ్డాను. ఇల్లు కట్టి చూడండి. పెండ్లి జేసి చూడండి అన్నారు. ఇది లోకోక్తి. ఇల్లు కట్టి చూడండి అన్నారుగానీ ఇల్లు కడతానని కొంపలో అని చూడండీ తెలుస్తుంది! నేనన్నానేమో అనుభవించానేమో చెపుతాను ఆ సంగతి ముందు మా శిరోమణి సంగతి చెప్పనీయండి.

    ఎందుకంటే ఇల్లు కట్టడం అంటూ వస్తే శిరోమణి ప్రశంస లేకుండా ఉండటానికి వీల్లేదు. పాండవారణ్య వాస కథ చెప్పటానికి నలోపాఖ్యానం ఎట్లా అవసరమయిందో, అట్లాగే నా గృహనిర్మాణ ప్రయత్నానికి ముందు మా శిరోమణి సంగతి చెప్పటం అవసరం అయింది. 

    మా శిరోమణికీ ఒకసారి...ఇల్లు గట్టాలని బుద్దిపుట్టింది. అతని వద్ద చేతిలో నలుగువందల రూపాయలూ ఉన్నాయి. గుంటూరులో వెయ్యిగజాల నివేశన స్థలమూ ఉంది ఆ స్థలంలో ఒక చక్కని గృహనిర్మాణం చేయాలని అతనికి ఒక పెద్ద ఊహ కలిగింది. నాలుగువందలు పెడితే ఏదో ఒక రకం కొంప ఒకటి కట్టటం అంత అసాధ్యమైన పనికాదు. కాని అతని ఉద్దేశం ఆ తక్కువ మొత్తంతోనే అన్ని సౌకర్యాలు కమాండు చేసే ఇల్లు కట్టాలని.

    గృహనిర్మాణాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదివితే తాను చౌకగా ఇల్లు కట్టడమే కాకుండా అఖీలాంద్రావనికీ కూడా ఒక నిరాడంబరమైన ఆదర్శాన్ని కల్పించవచ్చునని తోచింది.

    "వెధవలు, మన ఆంధ్రులకు బుద్ధిలేదు. వేలకు వేలు పోసి లంకంత లోగిళ్ళు కడతారు. దరిద్రపు కొంపలు గొడ్లసావిళ్ళలాగ తయారు అవుతాయి. గాలి వచ్చే మార్గమా ఉండదు. పడకగదీ అంటూ అసలు ఉండదు. చచ్చేటంత మందముగా గోడలూ, దయ్యాలలాంటి సావిళ్ళూనూ. ఎందుకూ పనికి రాకుండా కడతారు. ఇంకో పద్ధతిలో కట్టడమా తెలియదు." అని అంటూ ఉపన్యాసం సాగించాడు శిరోమణి ఆరోజు నుంచీ.

    ఇక గృహనిర్మాణాన్ని గురించి చదవాలె. తదర్థం హిగ్గి ,బాదమ్స్ నుండి కాటాలాగు ఒకటి ముందు తెప్పించాడు. ఇల్లు కట్టడానికైనా నిలువ ఉంచుకొన్న నాలుగు వందలలో నుంచీ పుస్తకాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం తెలివి తక్కువపని అని అతనికి తెలియకపోలేదు. అందుకని ఇరవై రూపాయలు మాత్రం వ్యయం చేసి నికరమైన జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు కొన్ని మాత్రం తెప్పించాడు.

    అవి క్షుణ్ణంగా చదివాడు. జపానువారి గృహనిర్మాణ పద్ధతీ, ఇంగ్లండులో కంట్రీహౌస్ నిర్మాణమూ, జర్మనీలో పద్ధతీ నీగ్రోలు, ఎస్కిమోలు మొదలగువారు ఇండ్లుకట్టే పద్ధతీ వారి నేర్పరితనమూ, మొదలైన విచిత్ర విషయాలు ఎన్నో మాకు ఆయన చెపుతూవుంటే మేము ఆశ్చర్యంతో చెవులు నిక్కలు పొడుచుకొని వింటూ ఉండేవాళ్ళం. 
 
    తదుపరి దొంగలకు అలవికాని ఇళ్ళు కట్టే పద్ధతిని గురించి చెపుతూ ఉండేవాడు. ఒకదానిపక్కన ఒకటి ఒకటిన్నర అడుగుల ఎడంలో, రెండు గోడలు ఒక ఇటుక వరస మందానలేపి ఆ రెండు గోడలమధ్యా ఇసుక పోస్తే, ఒక దొంగ అక్కడ కన్నం వేయటానికి వీలులేదు. అతి చౌకలో దొంగలకు అలవిగాని ఇండ్లు కట్టే పద్ధతి ఇది. ఇల్లాగ నాలుగు గోడలూ కట్టిన గదిలో బంగారం పారేసుకున్నా దొంగలకు అందదు అని అంటూండేవాడు. ఆయన చెప్పే పద్ధతులు విన్నప్పుడు మట్టుకు అటువంటి ఇల్లొకటి కట్టి, బంగారం పారేస్తే బాగుండునూ అనిపిస్తుండేది. గృహనిర్మాణ విషయమై ఆయన చూపిస్తున్న జ్ఞానసంపత్తును గూర్చి మేము ఊహూ గర్వపడుతూ ఉండేవాళ్ళం.

    వూళ్ళో ఎక్కడన్నా పునాదులు తీస్తున్నట్టు కనపడిందా అక్కడికి మేము తయారు. వెళ్ళి ఆ యజమానిని ఎంత కష్టపడి అయినా సరే కలుసుకొని, "అయ్యా మీరు ఏదో ఇల్లు కట్టే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, శిరోమణి గారిని కలుసుకొని ప్రసంగించారా" అనటం అతడు మేము భయపడ్డట్టుగానే లేదండీ అనేవాడు. అయ్యయ్యో, మీరు ఆయనతో సంప్రదించకుండా ఏ ప్రయత్నమూ చెయ్యకండీ, గృహ నిర్మాణ విషయంలో ఆయన నిధి...అట్లాగా అని చెప్పే వాళ్ళం. ఆయన మర్నాడు శిరోమణి వద్దకు వచ్చాడా సరే సరి. (మేము అంతగా చెప్పినా తెలివి తక్కువ వెధవలు వచ్చే వాళ్ళు కారు) లేకపోతే శిరోమణినే అక్కడికి పట్టుకెళ్ళి, ఆయన ఎదుట నుంచో పెట్టి, ఉపన్యాసం ఇప్పించే వాళ్ళం, అయితే వాళ్ళు తెల్లపోయి వినేవాళ్ళు.

    ఇట్లా, మనిషైనవాడు, ఎందుకు కడుతూ ఉన్నాడూ. తనకూ, తన కుంటుంబానికి, నీడకోసమున్నూ, తన ఆ ఆస్తిని దొంగలు ఎత్తుకొని పోకుండా రక్షించుకోవటానికీని...అందులో ఆస్తిరక్షణే ముఖ్యమైనది కాబట్టి దొంగలూ, వాళ్ళు ఇండ్లలో ప్రవేశించటానికి అవలంభించే మార్గాలూ, వాళ్ళ పద్ధతులూ, రకరకాల దొంగతనాలు ఇవన్నీ చదివితే కాని, ఆ పద్ధతులు అన్నింటికీ అలవికాని గృహనిర్మాణం ఇదమిత్ధం అని నిర్ణయించటానికి వీలులేదు. అందుచేత మనవాడు ఒక సంవత్సరం పాటు తత్ సంబంధమైన వాజ్మయము అంతా గాలించి క్షుణ్నంగా చదివాడు. అగ్నిభయమూ, చోరభయమూ మొదలైనవి ఏమీ లేకుండా చౌకలో ఇల్లు కట్టే పద్ధతి ఇప్పుడతనికి తెలిసింది.

    ఇల్లుకట్టే పద్ధతి తెలిసేటప్పటికి డబ్బు చాలా భాగం అయిపోయింది. రెండు వందలు కామాలు అప్పటికి ఉన్నాయి. ఆ రెండువందలలో ఇల్లు కట్టటానికి చాలేటట్టు లేదు.

    అయితే ఆ ఉన్న మొత్తానికి ఇంకో రెండువందలు అప్పుజేసి కలిపి, ఇల్లు కడితే ఆ అప్పు ఆ ఇల్లే తీర్చుకోదా అని తాను ఇన్నాళ్ళూ చదివి చదివి సంపాదించిన జ్ఞానం వల్ల, మూడు వందలలోనే యిలు కట్టలేనా అనే అతనికి తోచింది. కాని...

    ఇప్పుడు ఆ కాస్తా ఇలుకట్టడానికి వినియోగిస్తే, ఇక తనకు జన్మలో ఆ శాస్త్రంలో పరిపూర్ణమైన జ్ఞానము సంపాదించటానికి అవకాశం ఉండదన్న మాట నిశ్చయం. అందుచేత__

    ఇంకా పుస్తకాలు కొని ఆ జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకోవలెననీ, ఇల్లు సంగతి దర్మిలా ఆలోచించుకోవచ్చుననీ అతనికి తోచింది. అందుకని పుస్తకాలు కొని యింకా జ్ఞానాభివృద్ధిని చేసుకొన్నాడు.

    ఆ నెలలోనే 'గృహనిర్మాణము దాని చారిత్రము' అని చక్కని వ్యాసం వ్రాశాడు. అందులో సృష్ట్యాదిలో మానవుడు గుహలలో నివసించిన దగ్గర నుంచీ, మొదలు పెట్టి, ఏదో ఒక ఆచ్చాదనకోసం మానవ హృదయం ఎట్లా పరితాపం పొందిందీ చూసి గృహనిర్మాణాభిముఖంగా మానవ ప్రయత్నాలు, ఏయే దేశాలలో దేశపరిస్థితులననుసరించి, ఏయే విధంగా పరిణామం పొందినవో చూపి, వర్తమాన కాలంలో గృహనిర్మాణం ఎట్టి మహత్తరమైన సృష్టివైచిత్ర్యంగా తయారైందో అగుపర్చాడు.

    ఆ వ్యాసాన్ని మెచ్చుకోనివారు లేరు. చారిత్రక పరిశోధన మండలివారు కూడా శిరోమణిని అభినందించారు,
    ద్రవ్య లాభం మట్టుకు ఏమీ కలుగలేదు...

    అక్కడ నుంచి అతడు వివిధ పత్రికలకు ఈ విషయమై వ్యాసాలు పంపడం సాగించాడు. గ్రంథావలోకనం ఎక్కువైంది. గృహనిర్మాణ విషయమై దొరికిన పుస్తకమల్లా చదివాడు.

Next Page