Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 3


    "యిట్లా కాగితంమీద చూస్తే నాకు చస్తే అర్ధంగాదు యింతకూ స్థలం ఎక్కడ కొన్నారూ?"

    'యింకా కొనలేదు, ఎంతలోకి కొనాలె!'

    'పోనీ డబ్బు అయినా సిద్దంగా ఉందా' అంది మూతి విరుస్తూ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరచి.

    'ఈ వెధవ ప్రశ్నలు వేస్తావని నాకు తెలుసు. అందుకనే నీకు యిన్నాళ్ళ బట్టీ చెప్పలేదు."

    "అయితే యిది వెధవప్రశ్న?? డబ్బు లేకుండా యిల్లు ఎల్లాగ కడతారండీ" అన్నది మాత్రం నాకు తెలియదన్నట్లు చూస్తూ.

    'డబ్బు కావాలే అనుకో' అన్నాను నేను దర్జాగా...

    'అనుకోవటం ఏమిటీ? కావాలె_ఉందా?' అంది ఆవిడ వర్తకుడిలాగ కఠినంగా?  

    'ఉందా అంటేమరీ...రొక్కంగా లేదనుకో..కానీ...కానీ...' అంటూ కళ్ళు తేలేస్తూ అట్టాగే కుర్చీలో కూర్చున్నాను కలంపుల్ల పళ్ళసందున బిగించికొరుకుతూ.

    'రొక్కంగా గాక నోట్లరూపంగానా అన్నది కాంతం వెటకారంగా నవ్వుతూ.'

    'అవునూ నోట్లో అంటే ప్రానిసరీనోట్లు మూలకంగా' అన్నాను. హఠాత్తుగా ఏదోవిధమైన సమాధానం చెప్పగలిగినానన్న సంతోషంతో నిజానికి మొదట నేను ఇటువంటి అసందర్భపు ప్రశ్నలు ఈవిడ వేస్తుందనుకోలేదు ఏదోనాలాగే అందరి మోస్తరుగా సంతోషిస్తుంది అనుకున్నానుగాని.

    ప్రామసరీ నోటు అనేమాట వినేసరికి, ముఖం ఇంత జేసుకొని అప్పుజేసి ఇల్లుకడతారూ? అన్నది. ఈమాటలు ఎల్లాగన్నదో కానినన్ను సాగదీసి లెంపకాయ కొట్టినా, అంతబాధ పెట్టేదికాదు. ఆ మాటలు అంతకంటె బాధపెట్టినయి.

    'అప్పు అంటే అప్పుగాదు. నీ కెందుకూ నీవు ఊరుకో' అన్నాను విసుగ్గా ఏమీ తోచక.

    'అప్పుగాక పోవటం ఏమిటి? అన్నది కనుబొమ్మలు ముడిచి.

    'అప్పుగాక పోవటం ఏమిటంటే బ్యాంకులో తెస్తాను' అన్నాను జయసూచకంగా నవ్వుతూ.

    'బ్యాంకులో తెస్తే అప్పుగాదా? అని అడుగుతుందని నాకు తెలుసూ. అడగనూ అడిగింది.'

    అప్పే అనుకో, అయితే మట్టుకు అదివేరు. ఆ కట్టిన ఇల్లు అద్దెకు ఇస్తే నాలుగేండ్లంలో దాని అప్పు అదేతీర్చుకుంటుంది' అన్నాను నేను. నిజానికి కూడా నా ఊహ అదే.

    ఈ ఊహ ఆవిడకు నచ్చలేదు, 'మనం అద్దెకొంపలో నానాఅవస్థా పడుతూ, కొత్తగా కట్టిన ఇల్లు అద్దెకివ్వటమా? మహ బాగుంది మీ ప్లాను' అని నీరసంగా మాట్లాడింది.

    ఆడదానితో కాస్త రాజీకి వస్తే మంచిది. అందుకని 'పోనీ నీమాట ఎందుకు కొట్టెయ్యాలె. మనమే ఆ ఇంట్లో ఉండి, అద్దె ఇస్తున్నట్లుగానే నెలకు పదిరూపాయలు ఇస్తూ అప్పు తీరుద్దాం' అన్నాను కొంచెం దారికి వస్తున్నది అన్న సంతోషం కూడా కలిగింది.

    'అయ్యో!! అయ్యో!! మీరే అప్పు తీర్చేది! ఇల్లు మీరుకట్టనూ, నేను కాపరం ఉండనూనా!' అన్నది రాగాలుతీస్తూ.

    "నేను కట్టలేనా? అన్నాను మూతి బిగించి.

    "కట్టాలె!" అన్నది ఆవిడ చెయ్యిచాచి నేల వైపు పతాకహస్తాన్ని చూపుతూ.

    "ఏం. అట్లా అంటావు? నేనేం కట్టలేనా?" అని అన్నాడు మీనం మెలేస్తూ.


    ఇక అందుకుంది ఒక ఉపన్యాసానికి "కట్టలేకేం! పెద్ద పిల్ల పెండ్లికి అయిన అప్పు ఇంతవరకూ దమ్మిపీ తీరలేదు ఏదో కరతారట కంటం" అంటూ మళ్ళీ అరిచేతులు అదో ముఖంగా చూపటం విదిలించటం సాగించింది.

    నాకూ వళ్ళు మండింది. 

                                                                               3

    ఏం, అంత నిరసనగా మాట్లాడుతున్నవూ? నాకంటె ఎక్కువ సంపాదిస్తున్నారా మీ వాళ్ళు? మీ నాన్న ఎక్కువ వాడా? మీ తమ్ముడు నాకంటే పొడిచేశాడా? అందరి ప్రయోజకత్వం తెలుసు!" అన్నాను  నేను తల పంకిస్తూ, చేతులు ఊపుతూ.

    "మా నాన్న కేం, ఆయన రెండు ఇండ్లు కట్టించాడు. ఆయనను ఎక్కిరించవచ్చారు" అన్నది ఆవిడ. వాళ్ళనాన్న గొప్ప గొప్ప సాహసకృత్యాలన్నీ చేసినట్లూ, అవి నేను కృతజ్ఞతతో జ్ఞాపకం ఉంచుకోక మహాపరాధం చేసినట్లూ, చూపులతో చెపుతూ. 

    "అవును. ఏం లాభం, ఆ రెండు ఇళ్ళూ అమ్మాడు మళ్ళీనీ వీలైతే పొరుగిల్లుకూడా అమ్మేడు, చెప్పొచ్చేవు ఆయన ప్రయోజకత్వం," అన్నాను నేను ముక్కుతూ.

    మీరు అమ్మరాడు చల్లపల్లి వారి కేకినీమహల్"

    "ఇక చాలించు"

    "మరి మా వాళ్ళమాట ఎత్తకండి,"

    "మరి నేను ఇల్లు కట్టలే ననబోకు"

    కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కట్టలేరు అన్నాను. తప్పా !

    "కట్టగలిగిన స్థితిలో మీ తమ్ముడు ఉన్నాడా?"

    "మళ్ళీ వాడిమాట ఎందుకూ"   

    "నామాట ఎందుకూ?"

    "మీమాట నాకు కావాలె"

    "వాడిమాట నాకూ కావాలె"

    "మొండివాదన, తలాలేదు, తోకా లేదూ!"

    "మొండి వాదన నాదా నీదా?"

    "మొండివాదన కాక ఏమటండీ ఇదీ? చేతిలో దమ్మిడీ లేదాయె, ఊళ్ళో మూడు నాలుగు వందల అప్పులాయె, మ్,మరి మీ మాటలు చూస్తుంటే కోటలు దాటుతూ ఉండె. అదేమంటే కోపాలూ తాపాలూ, వెనకటికి ఒకడూ ఎందుకు లెండి, మీకు సరసం తెలియదు. మాట్లాడితే మూతివిరుపులూ ముక్కువిరుపులూనూ. 

    "అదేమిటి? అలా అయితే ఎందుకు మొదలు పెట్టావూ వరసమో విరసమో అనే సెయ్యి. అనదలచుకున్నది."

    "కోపమేమో?"

    "చెప్పకపోతే మట్టుకు కోపంగాదా?"

    "మరేమి లేదు లెండి వెనకటికి మీ మోస్త రాయనే ఒకాయన

    "ఆహా__ఏమిటా విరగబడి నవ్వటం చెప్పి మరీ నవ్వు"

    "ఒకాయన అన్నాట్టా తమలపాకులూ ఇన్ని ఏ వెధవైనా ఇస్తే బాగుండూ, వక్కలకు ఏం భాగ్యం ఎవర్ని అడిగినా, రెండు ఇస్తారు. సున్నం గోడకు గిల్లి రాచుకోవచ్చూ, అనీ"

    "అంటే నేనంత లేనిస్థితిలో ఉన్నానా!"
 

 Previous Page Next Page