మోహన్ గారు సాహితీ జీవిత స్వర్ణోత్సవాలు జరుపుకోవలసిన సంవత్సరంలో వెలువడుతున్న ఈ హాస్య కథా సంపుటి తెలుగువారికి అనర్ఘమైన కానుక. ఎన్నో కథలు వుత్తమ పురుషలో రాసిన, పాఠకులను హాస్యరస జగత్తులో ఓలలాడించిన ఉత్తమ పురుషుడాయన. తెలుగువారు గర్వించదగ్గ మేధావుల్లో కె. ఆర్. కె. మోహన్ గారు ఒకరు.
జ్యోతిషం వచ్చిన వాళ్ళు సైన్సును తూలనాడడం, సైన్సు వచ్చిన వారు జ్యోతిషాన్ని చీల్చి చెండాడడం చేస్తున్న ఈ రోజుల్లో ఈ రెండు శాస్త్రాలను తన అంబులపొదిలో చేర్చుకొని సమన్వయం చేసి ప్రజలకు విజ్ఞాన వితరణ చేస్తున్న మేధో హంస మోహన్ కారు.
ఈ హాస్య కథా సంపుటిలో ఒక్కోకథ హాస్య సుధ.
మనిషి బలహీనతలను బలంగా చిత్రించి పాఠకులను మురిపించి, మెరిపించి, మైమరపించడం మోహన్ గారి ప్రత్యేకత. సెలవు కోసం పై అధికారిని లంచమిచ్చి మెప్పించవలసిన ఉద్యోగ జీవితంలోని ధౌర్భాగ్యస్థితిని హాస్యరస భరితంగా ఆయన ఒక కథలో చిత్రించారు. ఈ హాస్యం ఇంద్రియాలను రెచ్చగొట్టే హాస్యంకాదు. చక్కటి, చిక్కటి సందేశంతో పంచి పెట్టిన పరిహాసం.
'తా మునిగిందే గంగ - తా రాసిందే కథ' అనే రచయితల మనస్తత్వాన్ని 'ఎండ్' గడుతూ ఆయన ఓ తాటిచెట్టు కథ రాశారు. రచయితలు తమ రచనలోని పాత్రలనే ప్రమాణంగా తీసుకొని "ఆవు వ్యాసం" వినిపించడాన్ని మోహన్ గారు చక్కదా చిత్రించారు. కన్యాశుల్కంలోని గిరీశాన్ని తలపింపజేసే గిరీశం మాస్టారు పాత్రను చిత్రించి టీచర్లకు కొత్త టెక్నిక్ లు నేర్పారు.
'ఎవ్వనిచే జనించు - హాస్య రస మెవ్వరిలో స్రవించు?' అంటే.... ఇతర దేశాల సంగతి ఏమోకానీ, ఇండియాలో మాత్రం "సర్దార్జీలు" అంటారు. 'అడగ' కుండానే 'అడుగు' అడుగునా నడిచి వచ్చే హాస్య 'గజాలైన' సర్దార్జీలు గురించి కథ రాసి మోహన్ గారు 'సరదార్ జీ' అనిపించుకున్నారు.
మోహన్ గారు తన సామాజిక స్పృహతో హాస్య కథను 'కొత్త వింతలు' తొక్కించారు. సున్నితమైన మత పరమైన అంశాలను కూడా సుతారంగా, సితారంగా మీటి "పెళ్ళి చూపులు" కథ రాశారు. ఇందులో అబ్బాయి నచ్చలేదని అమ్మాయి చెబుతుంది. ఇందులో మోహన్ గారు 'ఫెమినిష్ఠా గరిష్ఠుడై' సాక్షాత్కరిస్తారు. ఒక్కో కథకు ఒక్కో ప్రత్యేకత. పదకాలాల పాటు పదిలంగా వుండే మనోరంజకమైన హాస్యకథా పేటిక ఇది.
మోహన్ గారు ఆకాశవాణిలో కథలు వినిపిస్తుంటే ఆ విను వీధిలో ఆ 'శ్రోతస్విని' లో అందరూ ఓలలాడుతారు ఆయనకు బహుమతులు కొత్తకాదు. సమాజంలోని వ్యక్తుల బహు 'మతులు' కూడా కొత్తకాదు. అన్ని అవార్డులకు మించి తెలుగువారి హృదయాల పల్లకీలో ఆయన దర్జాగా ఊరేగుతున్నారు. ప్రతి ఊరూ ఏగుతున్నారు. 'ఖుషీతో నాస్తి దుర్భిక్షం' అని నిరూపించుకున్నారు.
'విష్ హిమ్ హ్యాపీ రెస్పాన్స్' అని ఆకాంక్షిస్తున్నారు.
- హాస్య 'సుధ జన' విధేయుడు
వాస్తు బ్రహ్మ
శంకర నారాయణ
హాస్య టానిక్కు కావాలనుకునేవాళ్ల కోసం......
'చక్కనమ్మ చిక్కినా అందమే!' అన్నట్లు చిన్నకథ - చిన్ని కథయినా, బుల్లి కథయినా కూడా దాని మెరుపునది మెరిపించగలదు. అందుకే నవలా ప్రభంజనంలో వాటి మధ్య ఇరుక్కుపోయినా, నలిగి సన్నగిల్లినా దానిని పాఠకులు ఆదరిస్తూనే వున్నారు. అందుకే రచయితలు రాస్తున్నారు, పత్రికలు ప్రచురిస్తున్నాయి.
శ్రీ పాద వారు 'చిన్నకథ' అంటే కనీసం ముప్పై పేజీలు. ఇప్పుడు ముప్పై లైన్లు కూడా దాటని కథలు, కాలమ్ సైజ్ కే కుదించిన కథలు వస్తున్నాయి. చిన్ని కథల్లో మనసు చమత్కారం, కొసమెరుపే ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి చమత్కార కొసమెరుపు కథల్ని కొన్నింటిని కె. ఆర్. కె. మోహన్ గారు హాస్య కథా సంపుటిగా తెస్తున్నారు. ఈ చిన్ని కథలు కొసమెరుపుతో మనల్ని చక్కిలిగింతలు పెడతాయి. కొన్ని వ్యంగ్య చెబుతాయి. రచయిత అనుభవాల్ని మన ముందుంచుతాయి. నిత్య జీవితంలో మనం చూసే షాక్ సంఘటనల్ని మెరిపిస్తాయి. కొన్ని ఝళిపిస్తాయి కూడా! ఈ హాస్యకథా సంపుటిలో మోహన్ గారు చిన్ని, బుల్లి కథలతోపాటు ఓ మోస్తరు పెద్దకథల్ని కలిపారు. జీవితంలో హాస్యం తగ్గిపోతోంది. అందుకనేనేమో..... మన సాహిత్యంలోనూ హాస్యం పాలు సన్నగిల్లింది. హాస్యం రాసే రచయితలూ అరుదైపోయారు. ఇటువంటి సమయంలో కె. ఆర్. కె. మోహన్ గారు తాము రాసిన పిల్లల కథలు, వైజ్ఞానిక కథలతోపాటు హాస్యకథల్ని ఒక సంపుటంగా తేవడానికి ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. ఈ సంపుటి మరికొన్ని హాస్య సంపుటాల ప్రచురణకు స్పూర్తి నిస్తుందని ఆశిస్తున్నాను.
మనిషికి మనసే ముఖ్యం. అది ఆరోగ్యంగా వుంటే ఆలోచనలు, తద్వారా ఆచరణలో కూడా ఆరోగ్యం కనిపిస్తుంది. అందుకు మానవతా విలువల్ని పెంచే సాహిత్యంతోపాటు మనసుకి ఉత్సాహాన్ని కలిగించే కథలూ రావాలి. ఆరోగ్యకరమైన హాస్యం రాయడం మిగతా రసాలకన్నా కష్టతరం. కష్టతరమైన పనుల్ని ఇష్టతరంగా చేస్తున్న కె. ఆర్. కె. మోహన్ గారిని మరోసారి ప్రశంసిస్తూ, ఆయన మరిన్ని మంచి హాస్యకథలు రాయాలని కోరుకుంటున్నాను.
హాస్య ప్రియులకు టానిక్కు, అపహాస్య ప్రియులకు కిక్కునిచ్చే కథలివి.
డా: వేదగిరి రాంబాబు
-సీనియర్ జర్నలిస్ట్, రచయిత
హాస్యం ఒక యోగం! ఆస్వాదం ఒక భోగం!!
గత కొంతకాలంగా తెలుగువారిలో హాస్య ప్రియత్వం కొరవడిపోతోందన్న విమర్శ తరచూ వనిపిస్తోంది. ఆ మాటలు విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే..... తెలుగువారు హాస్య ప్రియులన్న నమ్మకం నాకు చాలాకాలంగా వుండడం!
నిజానికి 'తెనాలి రామలింగని హాస్యకథలు' విని ఆనందించని తెలుగువారు ఎవరైనా వున్నారా? హాస్యం ఎక్కడనుంచి వచ్చినా ఆస్వాదించగల లక్షణం వారికుంది కనుకనే 'అక్బర్ - బీర్ బల్ కథ' లను కూడా రామలింగని కథలతో సమానంగా చదివీ, వినీ ఆనందిస్తున్నారు.
1940,50 దశకాల్లో భమిడిపాటి కామేశ్వరరావుగారి ఏకాంకికలకు విపరీతమైన క్రేజ్ వుండేది. ఆరోజుల్లో వాటిని కాలేజీ, హైస్కూల్ వారోత్సవాలలో ప్రదర్శించని కళాశాల కాని, హైస్కూల్ కాని ఇంచుమించు లేవనే చెప్పవచ్చు. నా కాలేజీ రోజుల్లో నేను కూడా ఆయన నాటికలు కొన్నిటిలోనూ, విశ్వనాథ కవిరాజుగారి 'దొంగనాటకం' వంటి మరికొన్నింటిలోనూ వేషాలు వేసినవాడినే. (వెధవ్వేషాలు కాదు.) ఆ నాటకాలను చూసి ఆనందించని ప్రేక్షకులు లేరు. కామేశ్వరరావుగారి నాటకాలతోపాటు ఇతర రచనలు కూడా చదివీ, విరగబడి నవ్వీ ఆనందించిన వాళ్ళలో నేనూ ఒకడిని. ఆయనంటే నాకు ఆరాధనా భావం వుండేది. అయితే దురదృష్టవశాత్తూ ఆయనను కలుసుకోవడంకాని, ఆయనతో మాట్లాడడం కాని సంభవించలేదు. రాజమండ్రిలో ఒకసారి ఆయన వేదిక మీద వుండగా చూశాను. అంతే! ఆ తర్వాత కొద్దికాలానికే ఆయన కీర్తిని వదిలి తిరిగిరాని దూరాలకు వెళ్ళిపోయారు.