1950,60 దశకాల్లో తండ్రిని మించిన తనయుడిగా ఆయన కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ రంగప్రవేశం చేశారు.
కామేశ్వరరావుగారి నాటకాలలో హాస్యం ప్రధానంగా వుండేది. రాధాకృష్ణగారి నాటకాలలో హాస్యంతోపాటు సామాజిక ప్రయోజనం బలంగా వుండేది. నాటకాన్ని చూసినంతసేపూ హాస్యాన్ని హాయిగా ఆనందించేవారు. చూడడం అయిపోయాక దానిలోని ఇతివృత్తం లేదా సమస్య లేదా సమదేశం మనసుని వెంటాడుతూనే వుండేది. ఇందుకు ఉదాహరణగా ఆయన రచించిన 'కీర్తిశేషులు' ను తీసుకోవచ్చు. 1960 దశకం మధ్యలో ఆయన్నిచిత్రరంగం మద్రాసుకి లాక్కుపోయింది. అక్కడ ఆయన సక్సెస్ "ఫుల్" రైటర్ గా నిరూపించుకుని యమబిజీ అయిపోవడంతో నాటక రచనకి ఆయన 'పెద్దకామా' పెట్టేశారు.
ఆయన నాకు మంచి మిత్రుడు. చాలామందికి ఆయన నాటక రచయితగా, సినీ సంభాషణా చతురుడుగా మాత్రమే తెలుసు. కాని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. జ్యోతిషం, సంఖ్యా శాస్త్రం, పంచాంగ నిర్మాణం వంటి అనేక విషయాలలో ఆయన అపూర్వమైన, అధ్బుతమైన కృషి చేశారు. మద్రాసులో వాటిని ఆయన నాకు చూపిస్తూ వివరించినప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ రంగాలలో ఆయనకి రావలసిన గుర్తింపు రాకపోవడం విచారకరం.
1960 దశకం నుంచి తెలుగు సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదలవుతుండడం, ప్రేక్షకులలో నాటకాలపట్ల ఆసక్తి తగ్గిపోతుండడం కారణంగా నాటక రంగం వెనకబడింది. ఉత్తమ నటులతో, అత్యుత్తమ నాటకాలను ఊరికే చూపిస్తామన్నా వచ్చే ప్రేక్షకులు కరువయ్యారు. ఎదురు డబ్బిచ్చినా వచ్చి చూస్తారా... అనేది అనుమానమే. రంగస్థల హాస్య నాటకాలకి సంబంధించి 1960 దశకం చివరనుంచి భరతవాక్యం పాడడం ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే... ఆదివిష్ణు వంటి కొద్దిమంది హాస్య రచయితల నాటకాలు కొంతకాలం జనాన్ని అలరించాయి కాని, ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే చాలా నిరాశే మిగులుతుంది. ఈనాడు వ్యంగ్య నాటకాలు వస్తున్నాయి కాని, హాస్య నాటకాలు ఇంచుమించు రావడం లేదనే చెప్పవచ్చు.
అయితే - హాస్య రచనలు అంతగా రాకుండినా, హాస్య నాటికలు, నాటకాలు పర్దాలోకి పోతుండినా, గత రెండు మూడేళ్లుగా ఒక శుభపరిణామం చోటుచేసుకుంది. 'నువ్వేకావాలి' చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో తిరిగి హాస్య చిత్రాల శకం మొదలైంది. సంభాషణా రచయితలు, దర్శకులు కూడా హాస్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ చిత్రాలలోని టపాకాయలవంటి హాస్య సంభాషణలు టి. వి. మాధ్యమం ద్వారా ప్రేలినప్పుడు ఆ చిత్రాలకు మంచి ప్రాచుర్యం వచ్చి విజయవంతమవుతున్నాయి. పాతిక ముప్పయి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని 'కుటుంబ' చిత్రాలకు, 'సెంటిమెంటల్' చిత్రాలకు వెళ్లి, పాత్రలతోపాటు రెండున్నర గంటలపాటు ఏడుస్తూ కూర్చోడానికి ప్రేక్షకులు సిద్దంగా లేరు. హాయిగా ఓ హాస్యచిత్రాన్ని చూసి రెండుగంటలపాటు కడుపారా నవ్వుకుని తేలికపడ్డ మనసుతో బయటకి రావడానికి ఇష్టపడుతున్నారు .ఇది నిజంగా శుభపరిణామం. అయితే.... వెలుగునంటే చీకటి వున్నట్లు - వీటిలో అవాంఛనీయ విషయాలూ వుంటున్నాయి. ముఖ్యంగా - కాలేజీ లెక్చరర్లను విద్యార్దులు ఆటపట్టించే తీరు. ఆ మోటు హాస్యం జుగుప్స కలిగించేదిగా వుంటోంది. ఉదాహరణకి... 'మనసుంటే చాలు' లో బ్రహ్మానందం పాత్ర, 'మూడు ముక్కలాట' లో, ఏ. వి. యస్. పాత్ర, 'ఆనందం' లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర. ఇటువంటి సన్నివేశాలు చూస్తే గురువులను ఏడిపించడం ఈనాటి విద్యార్దుల హక్కేకాక, విధి అన్న భావం కలుగుతుంది. ఆ 'విధి' ని ఈనాటి విద్యార్దులందరూ నిర్వర్తిస్తే ఇంక చెప్పేదేముంది! 'ఆచార్య దేవోభవ' అని గురువును దైవంతో సమానంగా భావించిన దేశంలో ఇలా గురువులను కించపరచడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. అలాగే 'ఆనందం' చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం విద్యార్దినులపట్ల అతిప్రేమ ప్రదర్శించడం ఉపాధ్యాయవృత్తికే కళంకం.
నిజానికి హాస్యాన్ని ఎక్కడనుంచి కొనితెచ్చుకోవడమో, అరువు తీసుకురావడమో చేయవలసిన అవసరం లేదు. నలుగురు మిత్రులు కలిసినప్పుడు వారి మధ్య సాగే సంభాషణలో హాస్యం పాలే ఎక్కువుంటుంది. కొన్ని సందర్భాలలో అప్రయత్నంగానే అధ్బుతమైన జోకులు పేల్తుంటాయి. వాటని గుర్తిస్తే సృజనాత్మక రచిత తన కథల్లో పాత్రలను సృష్టించి, వాటిచేత ఆ జోకులు పలికించవచ్చు. వాటికి అనుగుణమైన సన్నివేశాలను సృష్టించవచ్చు. ఆ విధంగా హాస్యకథలకు కావలసిన మసాలాను సమకూర్చుకోవచ్చు.
హాస్యం ఆవిర్భవించడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఒక పదం చాలు, కొన్ని వాక్యాలు చాలు. మన పత్రికలలో కనిపించే తెలుగువారి ఎన్నోపేర్లు, మరెన్నో ఇంటి పేర్లు అడగకుండానే హాస్యాన్ని అందిస్తుంటాయి. ఒకసారి ఓ దినపత్రికలో ఒక సంస్మరణ ప్రకటన వచ్చింది. దానితోపాటు ఒక శుభాకాంక్షల ప్రకటన కూడా వచ్చింది. సంస్మరణ ప్రకటనలో తన భార్య 'సమాధానం' చనిపోయిన విషయం తెలుపుతూ ఆమె భర్త 'దైవాదీనం' ఇచ్చినది. రెండవది..... 'ఆశీర్వాదం' గారు అమెరికా యాత్ర ముగించుకు వచ్చినందుకు అభిమానులు వ్యక్తం చేసిన శుభాకాంక్షలు గురించి. 'సమాధానం, దైవాదీనం, ఆశీర్వాదం' అన్నమూడుపేర్లు చూడగానే మా అమ్మాయి అప్పటికప్పుడు ఒక కథ అల్లేసి అందర్నీ కడుపుబ్బ నవ్వించింది.
ఆశీర్వాదంగారు దైవాధీనం దగ్గరకు వచ్చి - "దైవాదీనం, దైవాధీనం... నీ భార్య సమాధానం అకస్మాత్తుగా చనిపోయిందట. ఇందుకు ఏమిటి సమాధానం?" అని అడిగాడు. అందుకు దైవాధీనం "ఆశీర్వాదంగారూ, ఆశీర్వాదంగారూ.. నా భార్య సమాధానం హఠాత్తుగా మరణించిన మాట నిజమే. ఆమెకు ప్రభువు ఆశీర్వాదం కరువయింది. అంతా దైవాధీనం. ఇదే నా సమాధానం....!" అన్నాడు దైవాదీవం. మూడు ముక్కుల్లో రామయణాన్ని చెప్పినట్లు - మూడు పేర్లతో చక్కని హాస్యకథ వచ్చింది. రోజూ పత్రికలు చూస్తుంటే ఇటువంటివెన్నో తగులుతుంటాయి.
మా నాన్నగారు కంచి జగన్నాధరావుగారు వేదాంతి. మాతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. బయటవాళ్లతో కేవలం అధ్యాత్మిక విషయాలే మాట్లాడేవారు. మా అన్నలూ, అక్కలూ కొంచెం రిజర్వ్ డ్ గానే వుండేవారు. మా అమ్మ మాణిక్యమ్మగారు అలాకాదు..., మాటమాటకీ హాస్యాన్ని పలికించేది. 'ఆవిడ మాటలకు నవ్వము' - అని భీష్మించుకు కూర్చున్నవాళ్లు కూడా నవ్వవలసిందే! మాకు - ఏదో అందరిలాగా మామూలుగా ఇంట్లో ఉన్నట్లుగా కాకుండా సరదాగా నవ్వుతూ, సంతోషంగా రోజులు గడిచిపోతుండేవి.
కాలేజీ రోజుల్లో మరికొన్ని మధురానుభవాలు. నేను సంస్కృత విద్యార్దిని. ఇంటర్ రెండు సంవత్సరాలలోనూ జగజ్జట్టీల వంటి ఇద్దరు పండితులు మాకు లెక్చరర్ లుగా వచ్చేవారు. వాళ్ళు సంస్కృత సారస్వతంలోని హాస్య ఘట్టాల్ని, హాస్య ప్రక్రియలను పాఠంతోపాటు ఎంతో ఆసక్తికరంగా చెప్తుండేవారు. వీటివల్ల మామూలుగా బోర్ కొట్టే పాఠం కూడా సమయం తెలీకుండా సాగిపోయేది. మా కాలేజీలో ఆదినారాయణగారని ఒక తెలుగు లెక్చరర్ వుండేవారు. ఆయన కాలజీ డేస్ లో విద్యార్దుల చేత నాటకాలు వేయించేవారు. వాళ్ళకి ఆయనే స్వయంగా మేకప్ చేసేవారు.
ఆంధ్రా వీక్ సెలబ్రేషన్స్ సందర్భంలో మేము విశ్వనాథ కవిరాజుగారి 'దొంగనాటకం' నాటిక వెయ్యాలనుకున్నాం. అందులో హీరోయిన్ పాత్ర నాది. హీరో, దొంగ, మరో రెండు పాత్రలు. ఆదినారాయణగారు మాకు మేకప్ మొదలుపెట్టారు. మిగిలిన ఇద్దరూ బాగా నల్లగా వుండేవారు. దొంగ పాత్రధారిని చూసి "నీకు వేరే మేకప్ అవసరం లేదు. ఓ బనీనూ, ఓ గళ్ళ లుంగీతో రా... చాలు!" అన్నారు. ఆయన తర్వాత నాకు ముఖానికి రంగు అద్దారు. నా తర్వాత హీరో ముఖానికి రంగు అద్దడం మొదలుపెట్టారు. అలా అద్దుతూ - "చూశార్రా... మోహన్ ముఖానికి రంగు అద్దితే సావిడి గోడకు వేసినట్లుంది. వీరిగాడి ముఖానికి అద్దితే వంటింట్లో పొగచూరిన గోడలకు సున్నం వేసినట్లుంది" అన్నారు. అందరం నవ్వుకున్నాం. వీరయ్య బాధపడలేదు. అలా వచ్చేదే స్పాంటేనియస్ హాస్యం.