హాస్య కథలు
- కె. ఆర్. కె మోహన్
నవ్వుతూ నాలుగు మాటలు......
ఈ స్పీడు యుగంలో, యాంత్రిక జీవితాల్లో అనేక సమస్యలు - ప్రతి ఒక్కరికీ టెన్షన్... టెన్షన్ .... రిలాక్స్ కావాలని! మెంటల్ స్ట్రెస్ బి. పి., హైపర్ టెన్షన్, డయాబెటిస్... వంటి రోగాలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకు ఒకటే మందు.... అది హాస్యం! సమస్యలు ఎన్ని వున్నా - కాసేపు వాటిని మరిచిపోయి తిరిగి మనిషికి నూతనోత్సాహం కలిగించే అధ్బుతమైన టానిక్.... హాస్యం!
హ్యూమర్ ను ఎంజాయ్ చేసే వాళ్లలో గ్లామర్ పెరుగుతుంది. హాయిగా జోకులేస్తూ - సరదాగా మాట్లాడే వాళ్ళను మనం బాగా అభిమానిస్తాం. వాళ్ళ సాంగత్యం ప్రతి నిత్యం కోరుకుంటాం. అలాటి మిత్రులు అందుబాటులో లేనప్పుడు మంచికామెడీ కథల పుస్తకమే మనల్ని నవ్వించే మిత్రుడు.... , నవ్వుల దివ్వెల్ని మన గుండెల్లో వెలిగించే నేస్తం! అలాటి నవ్వుల నేస్తమే మీ చేతుల్లో వున్న ఈ హాస్య కథల సంపుటి.
ఈ పుస్తకంలోని కథలు చదివేటప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేయడమే కాదు... ఎంచక్కా రిలాక్స్ అవుతారు. అంతేకాదు, మీరు అభిమానించే ఆత్మీయుల్ని ఎవరైనా ఆనందింప జేయాలంటే ఈ పుస్తకం చిరుకానుకగా ఇవ్వొచ్చు. ఈ కథల్ని మీరు చదవడమే కాదు.... , మీ మిత్రులచేత కూడా చదివించండి. ఇలాటి మంచి నవ్వుల నేస్తాన్ని మనవంటి హాస్య ప్రియుల కోసమే శ్రీ కె. ఆర్. కె. మోహన్ అందించారని నా అభిప్రాయం.
శ్రీ కె. ఆర్.కె. మోహన్ గార్ని చూసినప్పుడు నాకు బోలెడు ఆశ్చర్యం - ఒకింత బాధ కలుగుతాయి. ఆశ్చర్యం ఎందుకంటే ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియ లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నమేటి రచయిత. కథలు, నవలలు, వ్యాసాలు, సైన్స్ పిక్షన్ కథలు, పిల్లల కథలు, పుస్తక సమీక్షలు.. .ఒకటేమిటి? ఈ అన్ని ప్రక్రియల్లోనూ ఆయన అందెవేసిన చెయ్యి. పైగా... .ఆయన ఇంగ్లీషులో చాలా రచనలు చేసి అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు, ప్రశంసలు పొందారు. ఇంగ్లీషులో మంచి కథలు, వ్యాసాలు రాయగలిగిన అతికొద్దిమంది రచయితల్లో అగ్రగణ్యులు శ్రీ కె. ఆర్. కె. మోహన్ గారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయనకు తగిన ప్రాచుర్యం లభించలేదేమో... అన్న బాధ నాకు కలుగుతుంది.
'మీరు ఏ పాశ్చాత్య దేశంలోనో - లేదా ఏ ఇతర రాష్ట్రంలోనో పుట్టివుంటే మీ పేరు ఆర్. కె. నారాయణ్ లా మారుమోగిపోయేది' అని ఆయనతో అంటుంటాను. దానికాయన చిన్నగా నవ్వేసి 'పబ్లిసిటీ కోసం తాపత్రయపడడం అన్నది నైజం కాదు. నా రచనలు పాఠకులకు తృప్తి కలిగిస్తే చాలు. అదే నాకు ఆనందం, తృప్తి!' అంటారు. భేషజం లేని రచయిత శ్రీ కె. ఆర్. కె. మోహన్. అందుకే ఆయనంటే నాకు గౌరవం. ..., అంతకుమించిన అభిమానం.
అయితే... నాకు ఆయన మీద కించిత్ కోపం కూడా వుంది. సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో లబ్ద ప్రతిష్టులైన శ్రీ మోహన్ గారు హాస్యకథలు ఎక్కువగా రాయలేదు. సరస సంభాషణా చతురుడైన ఆయన ఎందుకు హాస్యకథలు రాయలేదో నాకర్దమయ్యేది కాదు. ఇంతలో... హఠాత్తుగా ఆయన కొన్ని కథలు నా చేతికిచ్చి 'ఇవన్నీ హాస్య కథలే! ఈ హాస్యకథల సంపుటిలో ఒకటి రెండు కథలన్నా చదివీ నీ అభిప్రాయం చెప్పు' అన్నారు.
నాకు చాలా ఆనందం కలిగింది. అన్ని కథలూ చదివాను. ఇవి కేవలం హాస్య కథలు కావు..., హాస్య గుళికలు! హాస్యాన్ని కోరుకునే పాఠక ప్రియులపై ఆయన కురిపించిన నవ్వుల చిరుజల్లులు. ఇవి కె. ఆర్. కె. మోహన్ గారి కలం నుంచి జాలువారిన పటిక బెల్లం (కలకండ) పలుకులు. మానసిక వత్తిళ్ళ నుంచి మనల్ని విముక్తం చేసి మానసికోల్లాసం కలిగించే మహత్తర హ్యూమర్ మాత్రలు!
తమ జోకులతో - నటనతో - హావ భావ ప్రకటనలతో హాస్యం కురిపించడం అంత కష్టమైన పని కాదు. కాని, తమ రచనల ద్వారా హాస్యం పండించి పాఠకుల్ని నవ్వించడం చాలా కష్టం. అందుకే చాలామంది ప్రముఖ రచయితలు గుండెల్ని పిండేసే కథలు రాయగలిగినంత తేలికగా హాస్య కథలు రాయలేరు. అందుకే మన తెలుగులో హాస్య రచయితలు తక్కువమంది వున్నారు. ఆ కొద్దిమంది ప్రముఖ హాస్య రచయితల సరసన ఈ హాస్య కథల సంపుటితో శ్రీ కె. ఆర్. కె.మోహన్ గారు కూడా శాశ్వత స్థానం సంపాదించారు.
మనసారా - ఆనందంగా - నవ్వడం ఒక భాగం.... అలా నవ్వించగలగడం ఒక యోగం! ఆ యోగ సాధనలో శ్రీ మోహన్ గారు కృతకృత్యులయ్యారు.
మంచి కథలు జీవితంలో నుంచి పుడతాయని అంటారు కదా! అలాగే మంచి హాస్యం కూడా నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే సమఘటనల్లో నుంచి, అనుభవాల్లో నుంచి పుడుతుంది. ఈ కిటుకు తెలిసిన శ్రీ కె. ఆర్. కె. మోహన్ గారు మన నిత్య జీవితంలో ప్రతినిత్యం జరిగే చిన్న చిన్న సంఘటనలతో, చిర పరిచితమైన పాత్రలతో మనకు చక్కలిగింతలు పెట్టే కామెడీ కథలను అందించారు. ఈ కథల్లో పాత్రలన్నీ మనకు తెలిసినవాళ్ళే అనిపిస్తుంది. చాలా సంఘటనలు మనం చూసినవో, విన్నవో, మన జీవితంలో జరిగినవో అన్పిస్తాయి. సామాన్యుల జీవిత కోణాల్లోనుంచి హాస్యాన్ని అలవోకగా అందించ గలిగిన రచయిత శైలి, మోహన బాణీ మనల్ని హాస్య సమ్మోహితుల్ని చేస్తాయి.
ఈ కథల్లో కుళ్ళుజోకులు లేవు. అరువు తెచ్చుకున్న వెకిలి హాస్యం లేదు. ఆహ్లాద భరితమైన హాస్యంతోనూ, సెటైర్ తోనూ సహజమైన హ్యూమర్ చిందించే ఆనందపరచాలని ఒక హ్యూమరిస్టుగా కోరుకుంటున్నాను.
ఆహ్వానిస్తున్నారు శ్రీ కె. ఆర్. కె. మోహన్ నవ్వుల విందుకు.... ఇక ఆలస్యం ఎందుకు? - తిప్పండి పేజీలు ముందుకు...!
హాస్య భూషణ
-రాజశేఖర పాండే
హాస్య కథా మోహనుడు
తెలుగువాడికి 'సెన్సాఫ్ హ్యూమర్' తక్కువ. 'సెన్సాఫ్ హ్యూమర్' ఇంకా తక్కువ. తెలుగువాడిని నవ్వించడం అంత తేలికైన పనికాదు. అయినా విశ్వకథా మోహనుడైన, కె. ఆర్. కె. మోహన్ హాస్య కథా మోహనుడయి నవ్వులు పండించారు. 'ఊరగాయ నవ్వింది' వంటి కథా 'నిక్' లతో తెలుగువాడిని నవ్వించడాన్ని 'అవ' లీలగా సాధించారు.
ఎప్పుడో తెలుగువాడి కథకు అంతర్జాతీయ బహుమతి 'గాలివాన' కు కొట్టుకొచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ బహుమతిని పట్టుకొచ్చింది మన మోహన్ గారే. గాలివాన కథా రచయితను శ్రీశ్రీ ప్రైజు ఫైటర్ పాపరాజు (పాలగుమ్మి పద్మరాజు) అంటే, మోహన్ గారిని 'సర్ ప్రైజ్ ఫైటర్' అని నేను అంటున్నాను. తేనె మనసు (లు) వున్న వెండి తెర కథా రచయిత మోహన్ - హాస్య క్షేత్రంలోనూ బంగారు పంట పండించారు.