జీవితంలో స్త్రీలు ఎందుకు ముఖ్యం?

 

జీవితంలో స్త్రీలు ఎందుకు ముఖ్యం?

ప్రతి వ్యక్తి జీవితంలో స్త్రీ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషి సామాజికంగా ఎదగడానికి, ఆర్థిక అవసరాలకు మగవాడి అండ ఉండాలేమో కానీ వ్యక్తిత్వానికి బీజం వేయడానికి ఇంకా చెప్పాలంటే మనిషి జననం, బాల్యం, ఆ బాల్యంలో బుడిబుడి అడుగుల బీజం. వీటికి ఖచ్చితంగా ఆడవాళ్లే ఎక్కువ బాధ్యత వహిస్తారు.

గర్భవతి అయిన స్త్రీ సుఖంగా, సంతోషంగా ఉండాలి. మంచి మాటలు వినాలి. మంచి ఆలోచనలు చేయాలి. భర్త, ఇతరబంధువులు ఆమెకు కష్టం కలగకుండా చూడాలి. ఆమె కోరికలు తీర్చాలి. ఆమె ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదు. ఎటువంటి ఆందోళనలు చెందకూడదు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఏర్పరచారు.

శిశువు జననం తరువాత ప్రథమగురువు 'తల్లి' అని నిర్దేశించారు. తల్లి పాడే లాలిపాటలు, జోలపాటలు, బుజ్జగింపులు, ప్రేమచర్యలు సర్వం పిల్లవాడి వ్యక్తిత్వ వికాసంలో ప్రథమపాఠాలు. ఆపై తండ్రి ప్రేమ, బంధువుల అనురాగం, పెద్దల మార్గనిర్దేశనం పిల్లవాడిని వేలు పట్టుకుని ఉత్తమవ్యక్తిత్వం వైపు నడిపించే అంశాలు.

బాల్యంలో ఇంట్లో, నేర్చుకున్న అంశాల నిగ్గు తేల్చుకుని, స్వీయవ్యక్తిత్వాభివృద్ధికి రాచబాట నిర్మించుకోవటం పాఠశాలకు వెళ్ళటంతో ప్రారంభమౌతుంది. అంత వరకూ తానే కేంద్రబిందువుగా ప్రపంచం నడుస్తుందనుకున్న పిల్లవాడు సమాజంలో అడుగుపెడతాడు. పాఠశాలలో తనలాంటి అనేకకేంద్రబిందువులను చూస్తాడు. వారికీ, తనకూ భేదాన్ని గుర్తిస్తాడు.

ప్రతి వ్యక్తీ ఎవరికి వారు ప్రత్యేకమైనా, ఎలాగైతే ఏ నీటి బిందువుకు ఆ నీటి బిందువు ప్రత్యేకం అయినా, జలప్రవాహంలో మిళితమై ప్రవహిస్తుందో, అలా తానూ సామాజిక స్రవంతిలో ఒక భాగం అని గ్రహిస్తాడు. అతడికి ఈ గ్రహింపునిచ్చేది. అధ్యాపకులు, తోటి విద్యార్థులు, సామాజిక వాతావరణం, పాఠ్యాంశాల వంటివి. అంతవరకూ తాను నేర్చుకున్నవాటికీ, ఇప్పుడు నేర్చుకుంటున్న వాటికీ నడుమ తేడాలు గుర్తిస్తాడు. తాను నమ్ముతున్నవాటిని, ఎదురుగా కనబడుతున్నవాటితో పోలుస్తాడు. అతడి అంతరంగంలో సంఘర్షణ చెలరేగుతుంది. ఈ సంఘర్షణ ఫలితంగా అతడి వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. ఇక్కడ మనసు ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తుంది. ఆ మనసుపై శిశువు జననం నుంచీ పడిన ప్రభావాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. అందుకే మన పూర్వికులు శిశువు మనసుపై మంచి ముద్రలు వేసేందుకు అనేక విధాలైన నియమాలను, సూత్రాలను ఏర్పాటు చేశారు.

ఇవన్నీ ప్రతిఒక్కరికి ఎంతో ముఖ్యమైన అంశాలు. ఎన్ని తరాలు మారినా అందరికీ వర్తించే విషయాలు.

ఆడవారి పాత్ర సమాజంలోనూ, ఇంట్లోనూ ఎంతో ఉన్నా ఆడవారిని గౌరవించకపోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. తగిన గుర్తింపు అనేది ఉండదు ఆడవారికి. తన కుటుంబం కోసం చేసిన పనికి గుర్తింపు ఏంటి అని చాలామంది అనుకుంటారు కానీ గుర్తింపు అంటే ఆ వ్యక్తిని గౌరవించినట్టు అనే విషయాన్ని మరవకూడదు. అందుకే ఆడవారికి గుర్తింపు ఇవ్వడమంటే వారి కష్టాన్ని గౌరవించినట్టు అని అర్థం. 

గుర్తింపు, గౌరవం అనేవి తన కర్తవ్యాన్ని మరింత ఇష్టంగా, మరింత బాధ్యతతో చేయడానికి దోహదపడే గొప్ప బహుమానం. ఆడవారిని గౌరవించే ఇల్లు ఎలాంటి కలహాలకు తావు లేకుండా ఉంటుందనేది ఒప్పుకోవలసిన విషయం కావాలంటే అలాంటి ఇళ్లను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. 

యత్ర నార్యస్తు పూజ్యంతే-రమంతే తత్ర దేవతాః|| 

అన్నారు.

అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసముంటారు అని అర్థం. అంటే దేవతలున్నచోట ఐశ్వర్యం, సంతోషం, ఆనందం ఉంటాయని అర్థం.

                                       ◆నిశ్శబ్ద.