విజయవంతమైన మహిళ కావాలంటే.. సమన్వయంతోనే సాధ్యం!

 

విజయవంతమైన మహిళ కావాలంటే.. సమన్వయంతోనే సాధ్యం!

సమన్వయంతోనే మహిళల జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఇవి మాత్రమే కాకుండా ఒక స్త్రీగా మహిళలు మాత్రమే ఎదుర్కొనే విషయాలు ప్రతి దశలోనూ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వీటన్నిటి మధ్య మల్టి టాస్కింగ్ కాస్త కష్టమే. కానీ వీటన్నింటిని ఎంతో సులువుగా అధిగమిస్తున్న మహిళలు ఎంతోమంది ఉంటున్నారు. ఒక విజయవంతమైన మహిళ కావాలంటే తప్పనిసరిగా మల్టిటాస్కింగ్ చెయ్యాల్సి ఉంటుంది. వీటన్నింటి మధ్య సమన్వయం ఎలా.. ఆలోచనల వరకు బోలెడు చేస్తాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి సగం కూడా అమలు చేయలేం. మరి అన్నింటిని చక్కగా డీల్ చెయ్యాలంటే ఎక్కడో ఏదో మిస్సవుతున్నారని అర్థం. అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అందరి కోసం.

స్పష్టత..

మహిళలకు తాము చేసే పనుల మీద స్పష్టత చాలా ముఖ్యం. ఏ పనిని  ఎందుకోసం చేయాలని అనుకుంటున్నాం. తమ జీవితంలో దాని ప్రాధాన్యత ఏమిటి??  తమకు ఆ పని వల్ల మెరుగుదల ఉంటుందా అనేది ఒకటైతే.. తమకు స్పష్టత ఉన్నట్టైతే.. తాము చేస్తున్న పనిలో  ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా 90శాతం ముందే ఊహించవచ్చు. స్పష్టత వల్ల పనిలో ఆశించిన ఫలితాన్ని పొందడమే కాకుండా పనిని త్వరగా ముగించవచ్చు, తద్వారా సమయం ఆదా అవుతుంది. అందుకే స్పష్టత అనేది చాలా ముఖ్యం.

చెబితేనే…

చాలామంది ఆడవారు ఇంట్లో భర్త, పిల్లలు, అత్త మామలు తమను అర్థం చేసుకోవట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ముందు వారికి విషయాన్ని ఎలా చెప్పాము అనేది కూడా ముఖ్యం. కొందరు ఆడవారు ఇంట్లో వారు మన గోడు వినరులే అనే ఆలోచనతో అసలు విషయాన్ని వారితో చెప్పకుండా అన్ని భారాలు మోస్తూ ఉంటారు. వృత్తిపరంగా ఒత్తిడి ఉన్నప్పుడు ఇంటికి సమయం కేటాయించలేకపోతే ఆ విషయాన్ని, పరిస్థితులను పిల్లలకు, భర్తకు, అత్తమామలకు వివరించాలి. కొన్నిసార్లు వారు అర్థం చేసుకోకపోయినా మరికొన్నిసార్లు కనీసం ఆలోచన అయినా చేస్తారు. తద్వారా వారు ఏదో ఒకసారి ఖచ్చితంగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసే సందర్భం వస్తుంది. అందుకని సమస్య కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఒత్తిడి కావచ్చు వేరే ఏ విషయమైనా కావచ్చు. దాన్ని చెప్పినప్పుడే దానికంటూ ఓ పరిష్కారం లభించే అవకాశం దొరుకుతుంది.

కంగారు వద్దు!!

కొన్నిసార్లు మనం ఎంత చెప్పినా అవతలి వారు అర్థం చేసుకోకపోవచ్చు. ఇల్లు, ఉద్యోగం రెండింటిలో ఏది అనే ప్రశ్నను ఎవరైనా మీ ముందు ఉంచితే ఇల్లే ముఖ్యం అని ఖచ్చితంగా చెబుతారు. కానీ అదే ఇంటివారు ఈ ప్రశ్న వేస్తే అప్పుడే ఆడవారిలో రోషం నిద్రలేస్తుంది. చాలామంది నాకు రెండూ కావాలి అని చెబుతారు. కొందరు అయితే నాకు ఉద్యోగమే కావాలి అని తెగించి చెబుతారు కూడా. ఇలాంటి సందర్భాలలోనే బంధాల మధ్య బీటలు వారే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు వేరే ఏదైనా కావచ్చు దాన్ని ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. మీలో ఉన్న ప్రతిభ ఇంటి వారికి అర్థమయ్యేలా చేస్తే వారు మొదట వ్యతిరేకంగా మాట్లాడినా తరువాత మెల్లగా అలవాటు పడిపోతారు. ఇంట్లో ఇలా అన్నారు, బయట ఇలా అయ్యింది అంటూ కంగారు పడిపోకూడదు. అలాంటి సందర్భాలలో మౌనంగా అయిపోవడం వల్ల కొన్ని తప్పులు జరగకుండా ఉంటాయి, కాస్త ఆలోచించుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. 

ముందడుగే….

ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు ఇంట్లో వారితో , స్నేహితులతో, ఆత్మీయులతో చెప్పినప్పుడు కొందరు నీరుగారుస్తూ మాట్లాడతారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఇలాంటి వారి మాటలు ఏంటి అని నీరసపడిపోతారు కొందరు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏదైనా చేసేటప్పుడు దానికి న్యాయం చేయగలరా?? దానికింతగిన ప్రతిభ మీలో ఉందా అని విషయం సెల్ఫ్ చెక్ చేసుకుని అన్నీ సరిగా ఉన్నాయని అనిపిస్తే ఇక ఎలాంటి సందేహం లేకుండా ముందడుగు వేయడమే. 

కాబట్టి పైన చెప్పుకున్న విషయాలు అన్నీ ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుని మీలోనూ ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని మీకు మీరే సరిచేసుకోవచ్చు. అప్పుడు విజయవంతమైన మహిళగా మీరు కూడా మారతారు.

                                     ◆నిశ్శబ్ద.