సమాజంలో చిన్నచూపు చూడటం ఎప్పటినుండి ఉందో తెలుసా?
సమాజంలో చిన్నచూపు చూడటం ఎప్పటినుండి ఉందో తెలుసా?
భర్త గతించగానే అతడి మరణానికి ఈవిడే కారణమన్నట్లు భార్య కేశాలు తీయించడం అనే ఆచారం ఈ దేశంలో నిన్నా మొన్నటివరకూ సాగిపోతూ వచ్చింది. ఒక వర్గం వారికి ఇది ఎంత పవిత్రమైన కార్యంగా కనిపించేదో, ఇతరులకు ఈ ఆచారం అంత క్రూరంగా కనిపించేది. భర్త చనిపోగా మిగిలిపోయిన ఆ స్త్రీకి కామవాంఛ కలగకుండా వుండడానికి, ఒకవేళ ఆవిడ అలాంటి బలహీనతకు లోనైనా ఏ పురుషుడి దృష్టి ఆవిడపై మళ్లకుండా వుండడానికి, ఆవిణ్ణి అట్లా వికారంగా చేసి పెట్టేవాళ్లు. సమాజంలో నీతిని కాపాడడానికి ఆనాటివారు కనిపెట్టిన విధానమిది. స్త్రీకి నీతి వుండి తీరాలనే ఈ పట్టుదల పురుషుల విషయంలో ఉండేది కాదు. స్త్రీ తన వాంఛల్ని కొన్ని సందర్భాలలో విసర్జించాలని భావించిన సమాజం, పురుషుల విషయంలో మాత్రం స్వేచ్ఛనిచ్చిందంటే, సంఘంలోని పురుషాధిక్యతే ఇందుకు కారణమని స్త్రీలు భావిస్తే తప్పేముంది??
మనం ఈ దేశంలో స్త్రీలను తక్కువ తరగతి మనుష్యులుగా ఎలా పరిగణిస్తుంటామో, శ్వేతజాతీయుల్లో చాలామంది నల్లజాతి వారిని, ఆసియా దేశ వాసుల్ని అలాగే చూస్తారు.
భారతదేశంలో స్త్రీలను కూడా పురుషులు ఇలాగే పరిగణించారు. ఒకరిద్దరి స్త్రీలను గౌరవించామని కబుర్లు చెప్పి లాభంలేదు. స్త్రీ జాతికి అక్షరజ్ఞానం లేకుండా, రాణించే అవకాశం ఇవ్వకుండా, స్వసుఖానికి సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకొని, "నీతిగా బ్రతకడం నీ కర్తవ్యం సుమా” అని బోధించి కూచోబెట్టారు. అందుకనే ఈనాడు కట్నం తీసుకురాలేదనే నేరం మోపి సతాయించి చంపగలుగుతున్నారు. వ్యభిచార నేరం క్రింద అరెస్టుచేసి శిరోముండనం చేయడానికి సాహసిస్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదని అనుకుంటున్న నేటి కాలంలోనే నేరం రుజువైనా, కాకపోయినా కేశఖండన జరిపి అవమానించవచ్చనే అభిప్రాయం ప్రబలినప్పుడు, ఇక నిరంకుశ పాలనలో ఇలాంటి శిక్ష ఎంత త్వరగా విధించేవారో చెప్పనక్కరలేదు.
నైజాం పాలనకాలంలో హైదరాబాదులో ఇరామ్ మంజిల్ నిర్మించిన ఫక్రా ఉల్ముల్క్ నివాస గృహంలో మొగలాయి వంటకాలు చేయడానికి ఆరు మంది “బూవా” స్త్రీలు ఉండేవారు. ఒక్కొక్క వంటకం చేయడంలో ఒక్కొక్కరు ప్రవీణులు. వారిలో ప్రతి ఒక్కరి క్రింద నలుగురు యువతులు ఉండేవారు. పొయ్యి క్రింద మంట ఆరిపోకుండా ఊదుతూ వుండడం, ఉడికేపాత్రలోని వస్తువును కలియబెడుతూ వుండడం, ఆ ప్రత్యేకమైన వంటను నేర్చుకోడం ఈ యువతుల కర్తవ్యం. వంటగదిలోకి విధులు నిర్వహించడానికి వచ్చే ఈ యువతులు స్నానమాచరించి, పరిశుభ్రమైన దుస్తులు ధరించి ప్రవేశించాలి. తలజుట్టు అటూ ఇటూ జారిపడకుండా తెల్లటి వస్త్రంతో వెంట్రుకలను బిగించి కట్టాలి. ఎవరి వెంట్రుకైనా ఆ వంటపాత్రలో పడిందంటే వారి పని అయినట్లే.
ఏ వంటకంలోనైతే ఈ వెంట్రుక కనిపించిందో, ఆ వంటకాన్ని ఫలాని బూవాస్త్రీ ఆధ్వర్యంలో వండారనేది ఎలాగూ తెలిసే వుండేది. ఆ వండడంలో తోడ్పడిన నలుగురు యువతుల విషయం ఆరా తీసేవారు. వంటపాత్రలోని ఆ కేశాన్ని తీసి ఆ నలుగురు యువతుల జుట్టుతో సరిపోల్చేవారు. ఎవరి తలనుండి ఊడిపడిందో నిర్ధారించి, మంగలితో ఆ యువతి జుట్టును పూర్తిగా తీయించేసేవారు.
తోటిమనిషిని మనిషిగా పరిగణింపకపోతే, ఎంత చిన్ననేరానికైనా చాలా పెద్ద శిక్ష వేయడం జరుగుతుంది. కొన్ని మతపరమైన దేశాల్లోనూ, నిరంకుశ రాజ్యాల్లోనూ ఇలాంటి పెద్ద శిక్షలు చట్టసమ్మతం కూడా. ప్రజాస్వామ్య దేశాలనుకున్న చోట కూడా ప్రభుత్వం వేయికళ్ళతో కనిపెట్టకపోతే నిరంకుశ మనస్తత్వమున్న అధికారులు, ఎంత కిరాతానికైనా ఒడిగట్టగలరు. సమాజంలో ఈ చిన్నచూపు చూడటం అనే విషయం తరాల నుండి ఇలా కొనసాగుతూ వస్తోంది.
◆నిశ్శబ్ద.