గర్భవతుల దగ్గర ఈ తప్పులు చేయద్దు!
గర్భవతుల దగ్గర ఈ తప్పులు చేయద్దు!
మహిళలకు మరొక జన్మ అమ్మ కావడం అంటారు. పెళ్ళైన వాళ్ళు గర్భం ధరించాక తొమ్మిది నెలలు బిడ్డను మోస్తారు. ఆ తొమ్మిది నెలలలో వారిలో శారీరక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పుల వల్ల స్వతహాగా వారి ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. తినే విషయం నుండి వారి రోజువారీ పనులు, అలవాట్లు వంటివి చాలా మార్చుకోవాల్సి ఉంటుంది.
గర్భవతులు ఉన్న ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు తోడుగా ఉండటం పరిపాటి. ఉద్యోగాల పేరుతో దూరంగా ఉన్నా నిరంతరం ఫోన్స్ రూపంలో అందుబాటులోనే ఉంటారు వాళ్ళు. ఇంట్లోకి ఒక కొత్త ప్రాణం రాబోతోందనే వారి తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే గర్భవతులు విషయంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి.
ఆంక్షలు పెట్టకూడదు!!
అది చేయకు, ఇది చేయకు. అలా ఉండకు, ఇలా ఉండకు లాంటివి పదే పదే చెప్పకూడదు. ఒక్కసారిగా లైఫ్ స్టైల్ చేంజ్ అయితే వారిలో గందరగోళం నెలకొంటుంది. పదే పదే చెప్పడం వల్ల చెప్పే విషయాలు మంచికి చెబుతున్నాం అనే భావన కంటే ఆంక్షలు పెడుతున్నాం అనే ఫీలింగ్ ఏ ఎక్కువ కలిగిస్తుంది. కేవలం గర్భవతుల విషయంలోనే కాదు పిల్లల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అయితే గర్భవతులను ముందే ప్రత్యేకంగా చూస్తుంటారు దానికి తగ్గట్టు ఇలా చేయడం వల్ల వారిలో అసహనం స్థాయిలు పెరిగిపోతాయి.
తిండి దగ్గర మరీ బంధనాలు వేయొద్దు!!
ఆహారమే అమృతం. గర్భవతుల విషయంలో ఈ ఆహారం పాత్ర మరింత ముఖ్యమైనది. ఏమి తినాలి ఏమి తినకూడదు అనేవి చాలా గట్టిగా చెబుతుంటారు. అయితే సహజమైన, తాజా ఆహార పదార్థాలు ఏవైనా మితంగా తీసుకుంటే ఏ నష్టమూ జరగదు. అలాగని అన్నీ తినెయ్యమని చెప్పడం లేదు. కానీ వైద్యుల సలహాతో చక్కగా తినొచ్చు. నిజానికి శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల కొన్ని పదార్థాలు తినాలని అనిపించవు, కొన్ని తినాలని అనిపిస్తాయి. పోషకాలున్నాయని తిను తిను అని పదే పదే బలవంతం చేయకూడదు. ప్రేమ కొద్దీ చెప్పినా అది ఒకోసారి అతి అనిపిస్తుంది.
బిడ్డ గురించి మాట్లాడకూడదు!!
కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడుతుంటే అమ్మాయిలు మురిసిపోతారని అనుకుంటారు చాలామంది. అత్తలు, మామలు, పెద్దవాళ్ళు కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతూ పుట్టిన తరువాత బిడ్డ కోసం అలా చేస్తాం, ఇలా చేస్తాం, మా మనవడు అలా ఉండాలి ఇలా ఉండాలి, అలా చదివిస్తాం, మీకంటే గొప్పగా చేస్తాం. వంటి విషయాలు పొరపాటున కూడా గర్భవతుల ముందు మాట్లాడకూడదు. బిడ్డ ఎప్పుడూ తన బిడ్డగానే ఉండాలని అనుకుంటుంది ప్రతి అమ్మాయి. ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుందనే మాటలు ఆమె మనసును కుదురుగా ఉండనియ్యవు.
కేరింగ్ ఎవరిమీద??
భర్త, అత్తమామ, తల్లిదండ్రులు, ఇతరులు ఇలా అందరూ కడుపులో బిడ్డ గురించి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఒక విషయం తెలుసుకోవాలి. బిడ్డ మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అనే ధోరణి మాటల్లో కనిపించకూడదు. అలా కనిపిస్తే వీళ్లకు నా కడుపులో బిడ్డ కావాలి తప్ప నేను కాదు. బిడ్డ పుట్టగానే ఈ ప్రేమలు, జాగ్రత్తలు, ఆప్యాయతలు అన్నీ మాయమైపోతాయేమో అనే ఫీలింగ్ అమ్మాయిలలో వచ్చేస్తుంది. అందుకే కేరింగ్ ఏదైనా అమ్మాయిల విషయంలో చూపించాలి. వారి కోణం నుండే మాట్లాడాలి.
కాబట్టి గర్భవతుల దగ్గర మాట్లాడటంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏమైనా వారి మనసు నొచ్చుకుంటే గందరగోళంలో పడి తన కడుపులో బిడ్డ మీద నిర్లక్ష్యం ఏర్పడే ప్రమాధముంటుంది.
◆ నిశ్శబ్ద.