మహిళలు లావుగా ఉంటే ఫిట్నెస్ గా లేనట్టా?
మహిళలు లావుగా ఉంటే ఫిట్నెస్ గా లేనట్టా?
అమ్మాయిలు అందంగా, నాజూగ్గా ఉండాలనేది చాలామంది అభిప్రాయం. అయితే కొందరు మహిళలు ఎక్కువగా తినకపోయినా అధికంగా బరువు పెరుగుతారు. అందరిలోనూ ఇలాంటి సమస్య ఉండదు. అందుకే లావుగా కనబడితే చాలు అదేదో జబ్బులున్నట్టు, ఒళ్ళంతా కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్టు అందరూ ఫీలైపోతారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తిండి కట్టుకోమని, వ్యాయామం చేయమని, బరువు తగ్గడానికి ఇదిగో చిట్కాలు అని బోలెడు సలహలు కూడా ఇస్తారు.
అయితే లావుగా ఉండటం అంటే అనారోగ్యంతో ఉండటమా??
లావు, సన్నం అనేవి కేవలం ఆహారం మీద చాలా తక్కువ మంది విషయంలో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఆహారం తీసుకున్నా మగవారి కంటే శారీరక శ్రమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తినే ఆహారంలో కేలరీలు కరగడం పెద్ద కష్టం కాదు.
మరి మహిళలు బరువు పెరుగుతున్న కారణాలు ఏంటి??
మహిళలు బరువు పెరుగుతున్న కారణాలే వారి ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తాయి. బరువు అనేది ఒక్కొక్కరిలో ఒకో కారణం వల్ల పెరుగుతుంది.
జన్యు కారణాలు!!
తల్లిదండ్రుల నుండి సంక్రమించే జన్యువుల వల్ల లావుగా ఉండేవారు చాలామంది ఉంటారు. వీరు సహజంగానే చిన్నతనం నుండి లావుగా, బొద్దుగా ఉంటారు. తమ శరీర పరిస్థితిని చూసుకుని తిండి కట్టేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జన్యు సమస్యల వల్ల లావుగా ఉండేవారు ఆందోళన పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఎలాంటి భయాలు పెట్టుకొనవసరం లేదు. రోజువారీ వ్యాయామం, శరీరానికి తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటే చాలు.
హార్మోన్ సమస్యలు!!
మహిళల్లో హార్మోన్ సమస్యల వల్ల బరువు పెరిగిన వారే అధికం. వీరికి చిన్నతనం నుండి బరువు అనేది సమస్యగా ఉండదు. మహిళలకు ఋతుక్రమం మొదలయ్యే దశ నుండి ఈ సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ప్రసవం తరువాత శారీరకంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. నెలసరి సమస్యలు, మెనోపాజ్ దశలు దానికి తగ్గట్టు ప్రస్తుతం ఇంటా, బయటా కూడా పనులు చేసుకుంటూ, వాటిని సక్రమంగా నిర్వర్తించాలనే ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారు.
ఆహారం!!
ఆహారం వల్ల బరువు పెరిగేవారిలో చాలావరకు దిగువ, మధ్యతరగతి గృహిణులు ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చక్కబెట్టే ఆడవారు ఆహారం వృధా అయితే భరించలేరు. నేటి తరం పిల్లలు చాలావరకు సాయంత్రం అవ్వగానే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. ఫ్రెండ్స్ తో బయట తిన్నానని కొడుకు, ఆఫీసు వాళ్ళు, వృత్తి రీత్యా బయట తినాల్సి వచ్చిందని భర్త చెప్పే కారణాలకు సగటు గృహిణి ఏమి అనలేదు. అలాగని వండిన ఆహారాన్ని చూస్తూ చూస్తూ చెత్తబుట్టలో వేయలేదు. అందుకే చాలావరకు ఆహారాన్ని అలాగే ఉంచి మరుసటిరోజు తింటూ ఉంటారు. ఇంకా వృధా అయిపోతోందనే కారణం వల్ల ఆకలి లేకపోయినా తింటుంటారు. ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. అది మాత్రమే కాకుండా సగటు మధ్యతరగతి మహిళలు హార్మోన్లు ఇంకా ఇతర అనారోగ్య సమస్యల గురించి పెద్దగా పట్టించుకోరు. వాటి పరీక్షలు, ఖర్చులకయ్యే డబ్బు పిల్లల కోసం, ఇంటి అవసరాల కోసం ఉంటాయనే ఆలోచనతో ఉంటారు.
పై కారణాలు అన్నీ గమనిస్తే మహిళలు లావుగా ఉండటం అనేది ఫిట్నెస్ లేకపోవడం కాదు. మహిళలు లావు కావడానికి గల కారణాల మీద మహిళల ఆరోగ్యం, వారి ఫిట్నెస్ ఆధారపడి ఉంటుంది.
◆ నిశ్శబ్ద.