కాళ్ళు తగలగానే చేతులతో కళ్లకద్దుకుంటాం దానివెనుక అసలు కారణమిదే...

 


కాళ్ళు తగలగానే చేతులతో కళ్లకద్దుకుంటాం దానివెనుక అసలు కారణమిదే...

మన కుటుంబాల్లో ఓ అలవాటు ఉంది. కాగితాలను కానీ, పుస్తకాలను కానీ, అవతల వాళ్ళను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళతో తాకం! ఒకవేళ పొరపాటున కాలు తగిలితే, వెంటనే చేతులతో కళ్ళకు అద్దుకుంటాం. పుస్తకాలు, సంగీత వాద్యాలు, విద్యా సామగ్రిని ఎంతో పవిత్రమైనవిగా భావించాలంటూ చిన్నప్పటి నుంచి  పిల్లలకు బోధించడం భారతీయ సంప్రదాయం. అందుకే, ఏ మాత్రం పొరపాటున కాలు తగిలి, అపచారం జరిగినా క్షమాపణగా చేతులతో కళ్ళకు అద్దుకొని, మన గౌరవం ప్రదర్శిస్తాం. తప్పు జరిగినట్టు చెంపలు వేసుకుంటాం. 


దీనికి కారణం లేకపోలేదు. భారతీయుల దృష్టిలో జ్ఞానం ఎంతో పవిత్రమైనది. దైవంతో సమానమైనది. కాబట్టి, సర్వకాల సర్వావస్థల్లో దాన్ని గౌరవించాలి. ప్రాచీన భారతీయ సంప్రదాయంలో మామూలు విద్య నుంచి, ఆధ్యాత్మిక విద్య దాకా ప్రతిదీ దైవ సమానమే. అన్నింటినీ గురువు గారి సమక్షంలో గురుకులంలో నేర్చుకోవాల్సిందే! విద్యా సామగ్రికి దేనికీ పొరపాటున కూడా కాళ్ళు తగలకూడదు. దాన్ని బట్టి భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారని గ్రహించవచ్చు. ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలకు బోధించడం వల్ల పుస్తకాల పట్ల, చదువు పట్ల వారి అంతరాంతరాళాల్లో అపారమైన గౌరవం చోటు చేసుకుంటుంది. విద్యను గౌరవంగా భావించి భక్తిగా చూస్తాం కాబట్టే విద్య పట్ల విద్యా సామాగ్రి పట్ల ఎంతో భయభక్తులతో ఉంటాం. 


అందుకే, అప్పటికీ, ఇప్పటికీ ఏటా శరన్నవరాత్రుల్లో చేసుకొనే దసరా పండుగలో భాగంగా పూజ నిర్వహిస్తుంటాం. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. సరస్వతీ పూజను సహజంగా చేసుకుంటాం అందరూ. అలాగే నవరాత్రులలో ఆయుధపూజ రోజు కూడా . పుస్తకాలనూ, వాహనాలనూ, యంత్ర సామగ్రినీ అన్నిటినీ పూజలో ఉంచుతాం. 


అంతెందుకు! ఇప్పటికీ, ప్రతిరోజూ చదువు మొదలుపెట్టే ముందు సరస్వతీ ప్రార్థన చేస్తాం. 


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 


'తల్లీ! సరస్వతీదేవీ! సమస్త కోరికలనూ తీర్చే మాతా! నేను నీకు నమస్కరిస్తున్నాను. చదువు మొదలు పెడుతున్నాను. నా ప్రయత్నం సదా సఫలమయ్యేలా అనుగ్రహించు' అని కోరుకుంటాం.


ఇక వ్యక్తుల విషయంలో అయితే, పెద్దలకు పిల్లల కాళ్ళు తగిలినా, పిన్నలకు పెద్దల కాళ్ళు తగిలినా క్షమాపణగా కళ్ళకు అద్దుకోవడంలో మరో అంతరార్థం కూడా ఉంది. సర్వం భగవత్ స్వరూపమే కాబట్టి, అవతలి వ్యక్తి, లేదంటే వస్తువు ఎవరైనప్పటికీ, ఏదైనప్పటికీ, అక్కడా ఉన్నది దేవదేవుడే! మనిషిని సాక్షాత్తూ ఆ భగవంతుడు నివసిస్తున్న అందమైన, సజీవ ఆలయంగా భావిస్తాం. కాబట్టి, అనుకోకుండా మన కాలు తగలడం ద్వారా ఆ వ్యక్తిలోని దైవత్వానికి తెలియక అగౌరవం చేసినట్లవుతుంది. అనుద్దేశపూర్వకంగా చేసిన ఆ అపరాధానికి తక్షణమే మన్నింపు కోరడమే ముఖ్యం. ఈ రకంగా మన భారతీయ సంస్కృతిలో, అలవాట్లలో ఎన్నో చిన్న చిన్న అంశాల్లో ఎంతో నిగూఢమైన తాత్త్విక అర్థాలు దాగున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలు శతాబ్దాలుగా పరిఢవిల్లుతుండడానికి అదే మూల కారణం.


                                   ◆నిశ్శబ్ద.