ఓంకారం గురించి వేదాలు ఏం చెప్పాయి? దీని విశిష్ఠత ఏంటి?

 

 

 ఓంకారం గురించి వేదాలు ఏం చెప్పాయి? దీని విశిష్ఠత ఏంటి?


ఓం శబ్దం 'అ' కారం తో ప్రారంభమై 'మ' కారంతో అంతమవుతుంది. ఈ విశ్వంలోని శబ్దాలన్నీ వీటి మధ్యనే ఉంటాయి. అన్ని ధ్వనులూ ఓంకారంలో పుట్టి, దానిలోనే అంతమవుతాయి. అందుకే ఓంకారాన్ని శబ్ద బ్రహ్మామనీ, నాద బ్రహ్మమనీ, అనాహత శబ్దమనీ చెబుతున్నాయి వేదాలు. ఓంకారమే ప్రణవ మంత్రం, ఆదిమంత్రం. అన్ని బీజమంత్రాలకూ మూలం ఓంకారమే. అందుకే ఓంకారాన్ని 'మహా బీజమంత్రం' అంటారు. ఓంకారం దేవతల జన్మస్థలం అనీ, అలాగే, ఓంకారం సగుణ, నిర్గుణ బ్రహ్మాలను నిర్దేశిస్తుంది అనీ ఋగ్వేదం చెబుతోంది.

ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే..

"భగవత్ సాక్షాత్కారానికి దరిజేర్చే వాహనం లాంటిది ఓంకారం." - అని అమృతబిందూపనిషత్. 

"ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. నాలుగు వేదాలూ ఓంకారానికి నాలుగు పాదాలు.”- అని అధర్వశీరోపనిషత్

“ముముక్షువులు పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ధ్యానించాలి." - అని ధ్యానబిందూపనిషత్..

"ఓంకారం మోక్ష మంత్రం. దీని వల్ల జీవుడు సంసార సాగరాన్ని దాటగలడు. ఈ మంత్రాన్ని మనస్సులో కానీ, బిగ్గరగా కానీ ఉచ్చరించడం వల్ల ఆలోచనలు, కర్మలు ఓం కారమనే దివ్యసూత్రంలో గుచ్చబడి అది భగవదర్పితం అవుతుంది. జీవాత్మ - పరమాత్మలను అనుసంధానం చేసి, తద్వారా "అసి" అనే పదం ద్వారా ఆ రెండింటినీ ఏకం చేసేది ఓంకారం.” - అని హయగ్రీవోపనిషత్..

"ఓంకారాన్ని జపించడం వల్ల మన అజ్ఞానం దహించబడుతుంది. తద్వారా మనిషి జనన మరణాల నుండి విముక్తుడై, సత్యసాక్షాత్కారాన్ని పొందుతాడు.” - అని కైవల్యోపనిషత్ ఓంకారం విశిష్టతను చెప్పాయి.

ఓంకార పర్వతం

ఎన్నో అద్భుతాలకు నిలయమైన హిమాలయాలలో ఓంకార పర్వతం ఒకటి. కైలాసనాథుడు ఎల్లప్పుడూ ఓంకార ధ్యానంలో నిమగ్నమై, బ్రహ్మానుభూతి పొందుతూ ఉంటాడు. పరమేశ్వరుడు తాను పొందే నిత్యానందం మానవులందరికీ లభించాలని తలచాడు. ఒకనాడు శివతాండవం ఆడేవేళ తన త్రిశూలంతో ఒక పర్వతం మీద ఓంకారాన్ని చెక్కాడు. శంకరుడు ఓంకారం చెక్కిన పర్వతమే 'ఓంకార పర్వతం',

భారత సరిహద్దుల్లో నవీధాంగ్ అనే ప్రాంతం ఉంది. కాలా పానీ- లిపూ లేక్ కనుమల మధ్యన భారత - టిబెట్ సరిహద్దులో ఓ చిన్న లోయలోని ప్రాంతమే నవీధాంగ్. ఇది సముద్రమట్టానికి దాదాపు 14వేల అడుగుల (సుమారు 4,200 మీటర్ల) ఎత్తున ఉంది. నవీధాంగ్ మజిలీకి తూర్పు దిక్కున చూస్తే, ఓ అద్భుతం కనిపిస్తుంది. తూర్పు దిక్కున ఉన్న హిమ శిఖరాలపై మంచుతోనే ఈ (ఓం) అనే చిహ్నం చెక్కినట్లుగా కనిపిస్తుంది. ఎవరి ప్రమేయమూ లేకుండా, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చిహ్నమది. నిరంతరం పేరుకొనే మంచు సరిగ్గా ఆ ఓం అన్న చిహ్నం రూపంలోనే కుదురుకొనే విధంగా అక్కడి పర్వత ఆకారం ఉంటుంది. నవీధాంగ్ మజిలీకి కుడివైపున ఉన్న లోయ గుండా ప్రయాణిస్తే, ఈ 'ఓం పర్వతాని'కి చేరుకోవచ్చు. ఇలా ఓంకారం విశ్వమంతటినీ తనలో నింపుకుంది.


                                  *నిశ్శబ్ద.