ఈకాలంలో భగవంతుడికి వ్యతిరేకంగా ఎందుకున్నారు?
ఈకాలంలో భగవంతుడికి వ్యతిరేకంగా ఎందుకున్నారు?
భగవంతుడి గురించి అనుమానాలను కలిగి ఉండడం వ్యర్థం. ఆయన ప్రత్యక్షంగానూ సూక్ష్మంగానూ ఉన్నాడు. మనం అంతరంగంలో బాహ్యంలో చేసే పనులన్నిటికీ ఆయనే క్రియారహితుడైన ఆధారం. మన భారతదేశంలో అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సిద్ధులు నివసించే ప్రదేశాలున్నాయి. అవి మనకు కనిపిస్తున్నాయా? మనం వాటిని చూడలేము. చూడలేము కనుక అటువంటి ప్రదేశాలు లేవని అర్దంకాదు.
ఆ విధంగానే, ఒక గొప్ప దివ్యశక్తి మన అంతరంగంలో పనిచేస్తూ ప్రత్యక్షంగా విరాజమానమై ఉంది. అటువంటి శక్తి లేదని అనడం తెలివితక్కువే అవుతుంది. పరమాత్ముడు తన శక్తిద్వారా ఈ బాహ్యజగత్తులో దానికి తగినట్టుగాను అంతర్గ జగత్తులో దానికి తగినట్టుగాను వ్యాపించి ఈ ప్రపంచాన్ని నివాసయోగ్యం చేశాడు.
ఒకవేళ కొందరు అన్నట్టు భగవంతుడు లేడనే అనుకుందాం. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు జీవించగలరు? ప్రపంచాన్ని నిర్మలంగా ఉంచేదెవరు?
అందరూ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ ప్రపంచం నివాస యోగ్యంగాను సంతోషకరంగాను ఉండేట్లు చేస్తున్నది ఆయనే. భగవంతుడి మహిమ అనంతం..
అనంతుడైన ఆయన ఉనికి వల్లనే మనం, ఆనందస్వరూపుడైన ఆయన తత్వాన్ని ఆస్వాదించగలుగుతున్నాము. పరమానందమయుడైన పరమేశ్వరుడి యొక్క పరమానందం, ఈ ప్రపంచంలో ప్రతిబింబించడం వల్లనే సకల ప్రాపంచిక భోగభాగ్యాల ద్వారా సకల కార్యాల ద్వారా మనం కొంతైనా ఆనందాన్ని పొందగలుగుతున్నాము. అన్నం రుచిలో, నీటి తీయదనంలో, స్వర రాగాల ఆలాపనలో, వికసిస్తున్న పువ్వు యొక్క మధురమైన చిరునవ్వుల్లో, శిశువుల కేరింతల్లో ఇలా అన్నింటిలో ఉన్నవి ఆ భగవంతుడి ఆనందపు ఛాయలే. రంగు రంగుల పువ్వుల సౌందర్యంలో పరమేశ్వరుడి తేజస్సు లేకపోయినట్టయితే మనం పువ్వులపట్ల ఇంత ఆకర్షితులం కాగలమా? వాటి పట్ల మనకు ఇంత ప్రేమ ఉంటుందా?
మామిడి, అనాస, దానిమ్మ, జామ లాంటి ఫలాల్లో పరమాత్ముడి సౌందర్యం, మాధుర్యం, రుచి, లేకపోయినట్టయితే అవి ఇంత రుచికరంగా తియ్యగా ఉంటాయా? వాటి మాధుర్యానికి తియ్యదనానికి కారణం పరాత్పర తత్వమే. పరి శుభ్రమైన మామూలు నీటిలో ఎంత తియ్యదనం! రంగు రంగులతో మెరిసే సూర్యుని కిరణాలు మనకెంత ఇష్టం! కోమలమైన ఈ కిరణాల స్పర్శ చాలు, తామరలు విచ్చుకుంటాయి, చెట్లు సంతోషంతో తలలూపుతాయి. పక్షులు ఆనందం పట్టలేక గానం చేస్తాయి. నిదానంగా పరికించి చూసినట్టయితే తెలుస్తుంది. ఆ వనలతలు, సూర్యకిరణాలు పరస్పర ప్రేమతో, పరస్పరము అర్చిత భావంతో, యజ్ఞరూపమైన పూజతో, మౌనభాషతో, మాట్లాడుకుంటాయి. ఎంతటి మధురమైన సుఖమైన స్పర్శ. ఇదంతా ప్రత్యేకంగా ఈ ప్రపంచం మీద పరమేశ్వరుడి ప్రేమ ప్రవాహమే.
కాని, మానవుడికి పరమాత్మ పరిచయం లేక పోవడం వల్ల, అజ్ఞానం చేత, చైతన్యవంతమైన ఈ ప్రపంచంలో లోటుపాట్లే కనిపిస్తాయి. ఈ లోటు అనేది మనిషిని అసాంతం కమ్మేయడం వల్ల అసలు భగవంతుడు అనేవాడు లేనే లేడని అనుకుంటూ ఉంటాడు. దాంతో సరిపుచ్చుకోక అందరూ దాన్నే నమ్మాలని వాదిస్తాడు, అందుకే మనిషి ఎప్పుడూ భగవంతుడు అనే పదానికి వ్యతిరేకంగానే ఉంటున్నాడు ఈకాలంలో.
◆నిశ్శబ్ద.