మనిషి భోగాల విషయంలో ఎలా ఉండాలో చెప్పిన రామకృష్ణులు!
మనిషి భోగాల విషయంలో ఎలా ఉండాలో చెప్పిన రామకృష్ణులు!
ఒకసారి దక్షిణేశ్వరాలయ మందిరంలో 'విద్యాసుందర్' అనే నాటకం వేశారు. శ్రీరామకృష్ణులు దాన్ని చూశారు. మరుసటిరోజు ఆ నాటకంలో వేషం వేసిన వ్యక్తి ఒకడు శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చాడు. ఇంకా చిన్న వయసు గల ఆ యువకుడు నాటకంలో 'విద్య' అనే వేషము వేశాడు. గురుదేవులు అతడి నటనను చాలా మెచ్చుకున్నారు. ఆ వయసుకే ఆ అబ్బాయికి పెళ్ళి అవడమే కాక ఒక బిడ్డ పుట్టి చనిపోయింది. ఆ తరువాత మళ్ళీ ఇంకొక బిడ్డ పుట్టింది.
ఈ విషయం మొత్తం తెలిసిన తరువాత రామకృష్ణ గురుదేవులు సంతోషాలు, బాధలు శాశ్వతంగా ఉండవని వివరిస్తూ అతడితో చాలాసేపు మాట్లాడారు.
"భోగం ఉన్నంతవరకు యోగం ఉండదు. డబ్బు అనేది అన్నదమ్ములలో కూడా పోట్లాటలకు దారి తీస్తుంది. అప్పటివరకు ఎంతో ప్రేమతో మెలగుతున్న కుక్కలు చూడు! ఒక ఎంగిలి విస్తరి పడగానే కాట్లాడుకుంటాయి. ఎప్పుడైతే భోగం వదలిపోతుందో అప్పుడే శాంతి వస్తుంది. ఒక కథ చెపుతా విను!" అంటూ అతడికి ఈ క్రింది కథను చెప్పారు.
"ఒక బాటసారి ఎండలో నడచిపోతున్నాడు. ఎంతో దూరం నడిచాడు. కాని చేరవలసిన ఊరు ఇంకా రాలేదు. ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది. ఆ బాటసారి అక్కడికి పరుగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు. అప్పటికే బాగా అలసి ఉండటం వల్ల, ఎండవల్ల అతడికి దాహం వేసింది. "నీళ్ళు ఎక్కడైనా దొరికితే బాగుండునే!" అనే ఆలోచన కలిగింది. అలా అనుకున్నాడో లేదో, తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ళపాత్ర ఒకటి ప్రత్యక్షమైంది. ఆ నీళ్ళు త్రాగగానే వాడికి ఆకలి వేసింది. అన్నం తినాలనే కోర్కె మనస్సులో కలిగింది. తలచిందే తడవుగా రకరకాల పిండివంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనపడింది. కడుపు నిండా తినేసరికి, భుక్తాయాసం కలిగి పడుకుందామనుకున్నాడు. వెంటనే మెత్తని, చక్కని పాన్పు కళ్ళ ఎదుట తారసిల్లింది. వాడు దాని మీద అటుయిటు దొర్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైన సంగతుల్ని నెమరువేస్తున్నాడు.
'నేను ఏది కోరుకుంటే అది కళ్ళముందు ప్రత్యక్షమవుతున్నదే! చూస్తే ఇదేదో వింతగా ఉంది. ఇలాగే ఏదైనా పులి వచ్చి నన్ను మ్రింగదు గదా!' అనుకున్నాడు. ఇంకేముంది! గాండ్రు మంటూ ఒక పెద్దపులి వచ్చి అతడి గొంతు కొరికి చంపేసింది. "చూసావా! ఆ చెట్టు మరేమిటో కాదు. అదే కల్పవృక్షము! కల్పవృక్షం ఏది కోరితే దాన్ని ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షంవంటి వాడు. కల్పవృక్షం నీడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది.”
ఈ కథ వింటున్న ఆ నటుడు, "మహాప్రభూ! భోగాన్ని గురించి మీరు చెప్పిందంతా పరమసత్యం, భగవంతుణ్ణి భోగాలు కావాలని ప్రార్ధిస్తే చివరకు మిగిలేది అనర్ధమే. మనస్సులోకి అనేక ఆలోచనలు, కోరికలు వస్తుంటాయి. అవన్నీ మంచివి కావు గదా! భగవంతుడు కల్పవృక్షం వంటివాడు! మీరు చెప్పిన కథలోలాగా, 'పెద్దపులి వస్తుందేమో' అనుకుంటే నిజంగానే పులి వచ్చి అతణ్ణి మ్రింగివేసింది” అన్నాడు.
వెంటనే గురుదేవులు, "నిజమే! భోగభాగ్యాలు కావాలని కోరితే వాటి వెనుకనే పెద్దపులి కూడా వస్తుందన్న విషయము ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో! నేను నీకు అంతకంటే ఏమి చెప్పేది? భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీకు సాక్షాత్కరిస్తాడు" అని బోధించారు. ప్రతి వ్యక్తీ గుర్తుపెట్టుకోవలసిన విషయమిది.
◆నిశ్శబ్ద.