భగవంతుని మీద భక్తి లేకుండా చేసే కర్మ ఎలాంటిదంటే..!

 

భగవంతుని మీద భక్తి లేకుండా చేసే కర్మ  ఎలాంటిదంటే..!


భగవద్భక్తిరహితమైన కర్మ నిలువదు. భగవద్భక్తి లేకుండా చేసే కర్మ ఇసుక మీద భవనాన్ని నిర్మించడం లాంటిది. అందువల్ల మొదట భక్తిని అలవరచుకోవాలి. ఆ తరువాత నీ కిష్టమైతే ఇతరమైనవన్నీ - అంటే పాఠశాలలు, ఆనుపత్రులు మొదలైనవన్నీ నువ్వు ప్రారంభించవచ్చు. మొదట భక్తి, తరువాత కర్మ. భగవద్భక్తి లేని కర్మ పునాది లేని గోడ లాంటిది. అది నిలబడదు.


కొత్తగా నగరానికి వచ్చే వ్యక్తి రాత్రి శయనించడానికి తగిన గదిని ఏర్పరచుకొని, అక్కడ తన సరంజామా పెట్టుకోవాలి. తరువాత స్వేచ్ఛగా నగర విచిత్రాలను చూడడానికి పోవచ్చు. అలా చేయనిపక్షంలో రాత్రి చీకటిలో బస లేక చాలా బాధపడాల్సి వస్తుంది. అలాగే నిత్యశాంతి నిలయమైన భగవంతుడి ప్రాపు ముందుగా సంపాదించగలిగితే, ఈ లోకంలోకి వచ్చిన కొత్త వ్యక్తి తన నిత్యకృత్యాలను చక్కబరచుకొంటూ సంసారంలో నిర్భయంగా ఉండగలుగుతాడు.


ఆవేశపూరితులైన కొందరు సంఘ సంస్కర్తలతో రామకృష్ణ గురుదేవులు ఒకసారి  ఇలా అన్నారు..


 "లోకోపకారం, లోకోపకారమని మీరేదో ఘోషిస్తూ ఉంటారే, మీరు ఉపకారం చెయ్యబోయే ప్రపంచం అంత క్షుద్రమైనదా? అయ్యా! అదీగాక లోకోపకారం చేయడానికి మీరెవరు? మొదట భక్తిసాధనలు చేసి భగవంతుణ్ణి దర్శించండి. అప్పుడు మీకు భగవదాదేశం కలుగుతుంది. లోక హితం ఒనర్చడానికి శక్తిసామర్థ్యాలు లభిస్తాయి. లోకోపకారాన్ని గురించి మీరప్పుడు మాట్లాడవచ్చు. అంతేగానీ అంత కన్నా ముందు కాదు".


దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే.. ఆ భగవంతుడి మీద భక్తి లేకుండా చేసే ఏ కర్మ కూడా నిలవదు. మొదట భక్తి అలవడితే అప్పుడు చేసే కర్మకు ఒక సార్థకత ఉంటుంది. 


                                          *నిశ్శబ్ధ.