భూత దయ శ్రుతి మించితే ఇంత పర్యవసానాలు ఉంటాయని తెలుసా!

 

భూత దయ శ్రుతి మించితే ఇంత పర్యవసానాలు ఉంటాయని తెలుసా!

మనిషికి ఉండాల్సిన గుణాలలో భూత దయ కూడా ఒకటి.  భూత దయ అనేది ఆ భగవంతుడిని మెప్పించే మార్గాలలో ఒకటి. భూత దయ కలిగిన వ్యక్తికి ముక్తి కూడా తొందరగానే లభిస్తుందని అంటారు. అయితే ప్రతి దానికి హద్దులు ఉన్నట్టే భూత దయకు కూడా హద్దులు ఉన్నాయి. నేటి కాలంలో చాలామంది పెంపుడు జంతువులను  పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటి పట్ల ప్రేమ శృతి మించుతూ ఉంటుంది.  చాలామంది భూత దయ కాస్తా హద్దు మీరుతూ ఉంటుంది. పెంపుడు జంతువుల పట్ల అమితమైన ప్రేమ పెంచుకోవడం, కనీసం మనుషుల పట్ల లేదా ఇతర జంతువుల పట్ల నిర్లక్ష్యం వహించడం చూస్తుంటాం.  అయితే ఈ పెంపుడు జంతువుల పట్ల కలిగే భూత దయ ఎంతటి పర్వవసానాలక దారి తీస్తుందో  ఒక కథ వివరిస్తుంది. అదేంటో తెలుసుకుంటే..

పూర్వం  భరతుడు అనే రాజు ఉండేవాడు. ఆయన తన రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించాడు. ఆ తరువాత ఆయనకు వైరాగ్యం వచ్చింది. మోక్షం పొందాలని సంకల్పించాడు. అలా అనుకోగానే రాజ్యాన్ని పిల్లల చేతుల్లో పెట్టి తపస్సు కోసం వెళ్లిపోయాడు.  అడవిలో ఎంతో కఠినంగా తపస్సు చేయసాగాడు.  జుట్టంతా జడలు కట్టింది.  మనిషి పూర్తీగా తపస్సులో మునిగిపోయాడు. దీంతో ఆయన మనసు చాలా ప్రశాంతతలోకి వెళ్లిపోయింది. ఇక ఆయనకు మోక్షం సిద్దిస్తుంది అనగా జరిగింది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన.

ఆయన మోక్షానికి చేరువ అవుతాడనగా ఒక రోజు ఆయన స్నానం చేయడానికి నదికి వెళ్లాడు. అక్కడ ఆయన స్నానం చేస్తుండగా అక్కడికి ఒక లేడి వచ్చింది.  అది గర్భిణి. పాపం అది నీళ్లు తాగుతూ ఉంటే ఉన్నట్టుండి అడవిలో సింహ గర్ఝన వినిపించింది. ఆ లేడి భయపడి ప్రాణ భయంతో  చెంగున ఎగిరింది. అది అలా ఎగరినప్పుడే పాపం ప్రసవించింది.  ప్రసవించగా చిన్న లేడి పిల్ల నీటిలో పడిపోయింది. మరొకవైపు ఆ తల్లి లేడి చనిపోయింది.  నదిలోనే స్నానం చేస్తున్న భరతుడు ఈ సంఘటన చూశాడు. పాపం ఆ లేడి పిల్ల తల్లి కూడా చనిపోయి, నీటిలో కొట్టుకుని పోతుంటే భరతుడు ఆ లేడి పిల్లను పట్టుకున్నాడు.  దాన్ని చూసి ఆయనకు జాలి వేసింది.  దాంతో లేడి పిల్లను తీసుకుని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ దానికి ఆహారం పెట్టడం, స్నానం చేయించడం వంటివి చేసేవాడు.  దాని ఆలనా పాలనా కూడా చూసుకునేవాడు.  పూర్తీగా ఆయన లోకం అంతా లేడి పిల్ల నిండిపోయింది.  తపస్సు అటకెక్కింది.

లేడి పిల్లను ఏదైనా క్రూర జంతువు చంపేస్తుందేమో అని భయపడేవాడు.  అలా ఆయన ద్యాస అంతా లేడిపిల్ల ఉండిపోయింది. రాత్రి పడుకొనేటప్పుడు కూడా ఆయన దాన్ని పక్కన పెట్టుకుని పడుకునేవాడు. ఆఖరికి ఆయనకు బెంగ పట్టుకుంది.  నా తర్వాత దీన్ని ఎవరు చూసుకుంటారు అని బెంగ పెట్టుకున్నాడు. చివరికి ఆయన చనిపోయే ముందు దాన్నే చూస్తూ దాన్ని ఎవరు చూసుకుంటారో అని బాధపడుతూ అలాగే మరణించాడు. తరువాత జన్మలో జింకలా పుట్టాడు. కానీ ఆయన చేసిన తపస్సు ఫలితంగా ఆయనకు ముందు జన్మ గురించి గుర్తు వచ్చింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను.. మోక్షానికి చేరువ అయ్యి చివరిలో ఇలా భూత దయ శృతి మించడం వల్ల మోక్షాన్ని సాధించలేకపోయాను అనుకున్నాడు. పులస్త్య మహర్షి దగ్గరకు వెళ్లాడు. మృత్యువు ఎప్పుడు వస్తుంది,  తిరిగి మానవ జన్మ ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూడసాగాడు.

మోక్షాన్ని చేరుకోవడానికి మానవ జన్మ మాత్రమే తేలికైన మార్గం. చివరికి ఎదురుచూస్తూనే చనిపోయాడు.  మళ్లీ ఇంకొక జన్మ ఎత్తాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుండి తీవ్రమైన వైరాగ్యంతో మోక్షం కోసం ఆరాటపడ్డాడు. అడవిలో కూర్చుని ధ్యానం చేసేవాడు.  ఒక దొంగల నాయకుడి కంట పడ్డాడు. అతను చాలా క్రూరుడు.  ఆ కుర్రాడిని కాళికాదేవికి బలి ఇద్దామని తీసుకెళ్లాడు.  దొంగల నాయకుడు కత్తి ఎత్తగానే కాళికాదేవి కన్నులు తెరిచింది. విగ్రహంలో నుంచి ఆ అమ్మ బయటకు వచ్చి దొంగల నాయకుడిని మాత్రమే కాకుండా అందరినీ సంహరించింది. అప్పుడు ఆయన మోక్షాన్ని పొందాడు.

ఎన్నో ఏళ్లు తపస్సు చేసిన గొప్ప వ్యక్తి భరతుడు. అలాంటి వ్యక్తి కేవలం ఒక జంతువు మీద ఉన్న ఉన్న భూత దయ కాస్తా శృతి మించడంతో మోక్షాన్ని తృటిలో కోల్పోయి,  తిరిగి మోక్షం పొందడానికి మూడు జన్మలు ఎత్తాడు. అలాంటిది సాధారణ మానవులు ఎన్నెన్నో వ్యామోహాలలో చిక్కుకుంటుంటారు. దేని పట్ల అయినా ప్రేమ, దయ , కరుణ ఉండటం మంచిదే.. కానీ అది హద్దు మీరకూడదని ఈ కథ తెలియజేస్తుంది.

                                  *రూపశ్రీ.