హయగ్రీవ మాధవ ఆలయం.. ఈ గుడి కోనేరులో తాబేలు వదిలితే కోరికలు తీరతాయట..!
హయగ్రీవ మాధవ ఆలయం.. ఈ గుడి కోనేరులో తాబేలు వదిలితే కోరికలు తీరతాయట..!
హిందువుల భక్తికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. దేవుళ్లు కూడా ఎందరో ఉన్నారు. ఒక్క నారాయణ స్వరూపంగానే ఎందరో దేవతలు ఉన్నారు. ఈ స్వరూపాలకు తగినట్టు ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో విశిష్టత ఉంటుంది, అక్కడ వింత సంప్రదాయాలు, పద్దతులు కూడా ఉంటాయి. అలాంటి దేవాలయాలలో హయగ్రీవ మాధవ ఆలయం కూడా ఒకటి. భారతదేశంలోని అస్సాం రాష్ట్రం, కామరూప్ జిల్లాలోని హజోలో ఉన్న ఈ ఆలయం గురించి వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే..
హయగ్రీవ మాధవ ఆలయం..
భారతదేశంలోని అస్సాంలోని కామరూప్ జిల్లాలోని హజోలో ఉన్న శ్రీ హయగ్రీవ మాధవ ఆలయం నిర్మాణ శైలికి మాత్రమే కాకుండా అక్కడి ప్రత్యేక సంప్రదాయాలకు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మణికూట పర్వతంపై నిర్మించబడిన ఈ ఆలయం శతాబ్దాలుగా అటు హిందువులకు, ఇటు బౌద్ధులకు కూడా ఆరాధనా స్థలంగా మారింది. ఈ ఆలయంలోని అత్యంత ముఖ్యమైన సంప్రదాయం.. విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి తాబేళ్లను సమర్పిస్తారు.
పౌరాణిక ప్రాముఖ్యత..
హయగ్రీవ మాధవ ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. విష్ణువు "హయగ్రీవ" అవతారం ఇక్కడ పూజలు అందుకుంటుంది. విష్ణువు మధు, కైటభులు అనే ఇద్దరు రాక్షసులను ఈ ప్రదేశంలోనే సంహరించాడని చెబుతారు.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత ఆలయాన్ని 1583లో కోచ్ రాజు రఘుదేవ్ నారాయణ్ నిర్మించాడు. అయితే కొందరు దీనిని 100 సంవత్సరాల క్రితం నాటి శిథిలమైన ఆలయ పునర్నిర్మాణం అని నమ్ముతారు. రాతితో చెక్కిన ఈ ఆలయ గోడలు ఏనుగులు, వివధ శిల్ప భంగిమలతో ఎంతో అందంగా, చూపరులను ఆకట్టుకుంటాయి.
తాబేళ్ల సమర్పణ..
హయగ్రీవ మాధవ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంప్రదాయం తాబేళ్ల సమర్పణ. ఆయలానికి అనుబంధంగా ఉన్న కోనేరును మాధవ పుఖురి అని అంటారు. ఇందులో వందలాది అరుదైన జాతుల తాబేళ్లు నివసిస్తాయి. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి లేదా దైవ అనుగ్రహం కోసం లేదా కోరికలు తీరిన తర్వాత ముక్కులు చెల్లించుకోవడానికి ఈ కోనేరులో తాబేళ్లను వదులుతారు. అలాగే కొందరు ఈ తాబేళ్లకు ఆహారం పెట్టడం చేస్తారు. ఈ తాబేళ్లను మహావిష్ణువు కూర్మావతారంగా భావిస్తారు. స్థానిక ప్రజలు ఈ తాబేళ్లను రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు, వాటికి ఎప్పుడూ హాని తలపెట్టరు.
బౌద్ధమతం..
హయగ్రీవ మాధవ ఆలయం మరొక ప్రత్యేకత ఏమిటంటే దీనిని హిందువులు మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో బౌద్ధులు కూడా సందర్శిస్తారు. టిబెటన్ బౌద్ధులు బుద్ధుడు మోక్షం పొందిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు. ఈ కారణంగా వారు ఈ ఆలయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు, దీనిని మహాముని ఆలయం అని పిలుస్తారు.
*రూపశ్రీ.