TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

ఉత్తరాంధ్రలో బొత్స ప్రభ మసకబారిందా?

ఉత్తరాంధ్ర రాజకీయాలలో బొత్స కుటుంబ ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మజ్జి శ్రీనివాసరావు వైపీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం, పార్టీలో బొత్స ప్రాధాన్యతకు గండి కొడుతుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మజ్జి శ్రీనివాసరావు బొత్సకు కుడి భుజంగా వ్యవహరించేవారు. అటువంటి మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీ మారడం వెనుక బొత్స వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయంటున్నారు. అయితే బొత్స సత్యనారాయణతో చిన్న శ్రీను విభేదించడం ఇదే తొలిసారి కాదనీ, గతంలో అంటే 2024 ఎన్నికల సమయంలో కూడా చిన్న శ్రీను, బొత్స సత్యనారాయణ మధ్య విభేదాలు తలెత్తిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత బొత్సకు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలిలో ప్రతిపక్ష నేత బాధ్యతలను పార్టీ అధినేత జగన్ అప్పగించారు. బొత్సకు అంతటి ప్రాధాన్యత ఇచ్చిన జగన్.. అదే సమయంలో బొత్సతో విభేదిస్తున్న చిన్న శ్రీనును విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించడంతో పాటు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చచార్జ్ బాధ్యతలను కూడా అప్పగించారు. బొత్స అభీష్ఠానికి వ్యతిరేకంగా జగన్ చిన్న శ్రీనును ప్రోత్సహించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇటీవల కొంత కాలంగా బొత్స జనసేన గూటికి చేరనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. స్వయంగా ఆ ప్రచారాన్ని బొత్స ఖండించారనుకోండి. అది వేరే విషయం. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న శ్రీను వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంపై వైసీపీయులే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న శ్రీను నిష్క్రమణ బొత్స ఆశీస్సులతోనే జరిగిందా అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా చిన్న శ్రీను పార్టీని వీడటం విజయనగరం జిల్లాలో మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు పరిశీలకులు. ఇక వైసీపీలో బొత్స ప్రతిష్ఠ, పరపతికీ కూడా చిన్న శ్రీను తెలుగుదేశం గూటికి చేరడం దెబ్బేనని చెబుతున్నారు. [Botsas influence waned in North Andhra, Botsa Satyanarayana, Chinna Srinu, YSRCP, TDP, Vizianagaram Politics, Uttarandhra News]

Published on: Thu Sep 10, 2026 9:58AM

political-news-img

అప్పుడు షర్మిల.. ఇప్పుడు విజయసాయి?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన మద్దతుదారులందరినీ శత్రువులుగా మార్చుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆయన కోసం రోడ్డెక్కి పోరాడిన సొంత చెల్లి, తల్లితో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఆ కోవలోకే విజయసాయి రెడ్డి చేరారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు చేదోడువాదోడుగా నిలిచారు. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ పుంజుకుని.. 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారపగ్గాలు అందుకోవడంలో జగన్ అన్ని విధాలుగా అండదండగా నిలిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అటువంటి విజయసారిరెడ్డి జగన్ కు దూరం జరిగారు. పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాలోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ప్రకటించి.. ఏకంగా సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మీడిమా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. ఆ సందర్భంగా తనను రెచ్చగొడితే గుట్టుముట్లు బయటపెడతా తస్మాత్ జాగ్రత్త అంటూ పరోక్షంగా జగన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూస్తే.. జగన్ కు సొంత చెల్లి 2024 ఎన్నికల ముందు శత్రువుగా మారి, ఆ ఎన్నికలలో జగన్ ఒటమిలో తన వంతు పాత్రపోషించారు. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ పునాదులను షర్మిల కదిలించగలగారు. ఆ ఎన్నికలలో సునీత ప్రచారం ఫలితాలపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ 2019 ఎన్నికల ముందు కాలికి బలపం కట్టుకుని తిరిగి ఎలాగైతే ఆ ఎన్నికలలో జగన్ ఘన విజయం సాధించి సీఎం కావడానికి దోహదపడ్డారో.. అలాగే.. 2024 ఎన్నికలకు ముందు సొంత చెల్లినైన తనను జగన్ ఆస్తిపంపకాలలో ఎలా మోసం చేశారో, సొంత బాబాయ్ హంతకులకు జగన్ ఎలా సహకారం అందించారో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన పరాజయానికి కూడా దోహదపడ్డారు. ఇప్పుడు ఇక జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసే పని గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, మద్దతు దారుడూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కుడి భుజంగా వ్యవహరించిన విజయసాయి రంగంలోకి దిగారని చెప్పవచ్చు. 2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర ఇప్పుడు అంత కంటే బలంగా, ప్రభావమంతంగా విజయసాయి పోషించనున్నారన్న మాట. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై సాయిరెడ్డికి పూర్తి అవగాహన ఉంది. జగన్ ఆర్థిక వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఇప్పటికే ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ప్రతిష్టపై సాయిరెడ్డి వెల్లడించే ఏ చిన్న వివరమైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే 2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర, 2029 ఎన్నికలలో విజయసాయి పోషించనున్నారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. [Vijaya Sai Reddy Real Threat To Jagan, Y P internal crisis, AP politics, Sharmila, TeluguOne News]

Published on: Tue Sep 8, 2026 10:56AM

political-news-img

ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!

ఇండియా కూటమిలో ఐక్యత బలపడుతోంది. ఇంత వరకూ కూటమిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించే విషయంలో ఉన్న భిన్నాభిప్రాయం మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం దిశగా ఇండియా కూటమి పార్టీల అడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా పరిశీలకులు ఇటీవల హస్తిన వేదికగా జరిగిన జన్ జీ ఉద్యమం కారణమని అంటున్నారు. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలు, ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాయి. పార్లమెంట్ వేదికగా అధికార పార్టీ విధానాలను ఎండగట్టడంలో ఆయన చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్న తీరుతో ఇండియా కూటమి పార్టీలు ఆయన నాయకత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. అలాగే యువతను ఆకట్టుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇండియా కూటమి పార్టీలలో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ వైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే కూటమి ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే సహజంగానే రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని అన్నారు. ఇప్పటికే టీవీకే అధినేత టీవీకే విజయ్ తాను ప్రధాని రేసులో లేననీ, కూటమి భాగస్వామ్య పార్టీగా తన మద్దతు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వానికేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఐండియా కూటమి పార్టీల అడుగులు పడుతున్నాయి. ఐక్యంగా ఉంటేనే బలమైన ప్రత్యామ్నాయంగా జనం భావిస్తారనీ, గుర్తిస్తారనీ కూటమి పార్టీలు భావిస్తున్నాయి. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ప్రజల ముందు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఉంచాలని ప్రయత్నిస్తున్నాయి. అందెలొ భాగంగారు నే నాయకత్వ అంశంపై ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు. [INDIA Allience Unity, Rahul Gandhi PM Post, MA Baby CPIM, Opposition Alliance India, Lok Sabha Elections, Congress Party Leadership, Telugu One]

Published on: Mon Sep 7, 2026 2:17PM

political-news-img

జగన్ క్రెడిట్ చోరీకి ఉండవల్లి మాటసాయం.. ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ మరో సారి చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రగడ రేపుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్రెడిట్ వార్ కు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ క్రెడిట్‌ ను ఉండవల్లి తన వ్యాఖ్యల ద్వారా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రెడిట్ లో వేయడానికి ఉండవల్లి ప్రయత్నించారు. పోలవరం పేరు చెబితే ఎవరికైనా గుర్తుకు వచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఉండవల్లి అన్నారు. ఎవరెంత ప్రయత్నించినా, ఎంత తపస్సు చేసినా ఈ సత్యాన్ని మార్చలేరంటూ ఉండవల్లి పరోక్షంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి. ఇక ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం, నిర్దుష్ట కాల వ్యవధిలో పూర్తి కావడం తధ్యమన్న అంచనాల నేపథ్యంలో జగన్ కు మద్దతుగా ఉండవల్లి మీడియా ముందుకు వచ్చారు. పోలవరం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వచ్చిన ప్రజా సానుకూలతను తగ్గించేందుకు శతధా ప్రయత్నించారు. అంటే పోలవరం అంటే వైఎస్ మాత్రమే గుర్తుకు వస్తుంటారు అని వ్యాఖ్యానించడం ద్వారా వైసీపీకి పోలవరం పురోగతిని అనుకూలంగా మార్చేందుకు ఉండవల్లి ప్రయత్నించారన్న మాట. అయితే.. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను పడుకోపెట్టేసిన విషయాన్ని ఉండవల్లి ఇక్కడ కన్వీనియెంట్ గా మార్చిపోయారు. అంతేనా ఉండవల్లి జగన్ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఇసుమంతైనా కనిపించదు. ఉదాహరణకు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఉండవల్లి ఎన్నడూ మాట్లాడలేదు. జగన్ హయాంలో చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలు వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. కానీ అక్రమమద్యం కేసులోఅరెస్టైన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును తప్పుపట్టడమే కాకుండా, రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మరీ ఆయనను పరామర్శించి వచ్చారు. ఇక పోలవరం విషయానికి వస్తే.. జగన్ హయాంలో ఆయన సర్కార్ నిర్వాకం కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి.. ఖజానాపై 3 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించిన పాపాన పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలవరం పనులను పరుగులెత్తిస్తూ.. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంటే.. ఉండవల్లికి క్రెడిట్ వైఎస్ కు.. తద్వారా జగన్ వైసీపీకీ దక్కకుండా పోతోందన్న భయం, బెంగ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే హడావుడిగా పోలవరం అంటే వైఎస్ గుర్తుకు వస్తారనీ, వైఎస్ అంటే పోలవరం గుర్తుకు వస్తుందనీ చెబుతూ తగుదునమ్మా అంటూ జగన్ క్రెడిట్ వార్ కు మద్దతు పలుకుతున్నారు. ఈ వార్త కూడా చదవండి: https://teluguone.com/news/prevsingle/not-undavalli-he-is-chameleon--39-192665.html గతంలో ఇదే పోలవరం గ్యాప్ 2 ఆనకట్ట నిర్మాణంలో సాంకేతిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, డిజైన్ ఆమోదాలు లేకుండా పనులు ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో ముప్పు ఎదురౌతుందంటూ ఇదే ఉండవల్లి సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఇలా సాంకేతిక అంశాల ప్రస్తావిస్తూ ఒక వైపు పోలవరంపై విషం కక్కుతూనే.. మరో వైపు, ఇదే పోలవరం రాజకీయంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూరుస్తుందన్న దుగ్ధతో జగన్ క్రెడిట్ చోరీ యత్నాలకు మద్దతు పలుకుతూ ఉండవల్లి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంటున్నారు. [Undavalli Arun Kumar on Polavaram Project, Coalition Government, Chandrababu Naidu, YS Rajasekhara Reddy, AP Politics, Telugu One]

Published on: Sat Sep 5, 2026 12:10PM

political-news-img

కొండా సురేఖ శాఖలు రేవంత్ రెడ్డి చేతికి.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మాటేంటి?

కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన తరువాత రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్వహిస్తున్న శాఖల బాధ్యత స్వయంగా తానే చెప్పట్టారు. ఈ మేరకు బర్త్ రఫ్ ముందు వరకూ కొండా సురేఖ ఇంత వరకూ నిర్వహించిన శాఖలను సీఎం రేవంత్ నిర్వహిస్తారంటూ జీవో విడుదలైంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు దారి తీశాయి. ఇప్పుడిప్పుడే కేబినెట్ విస్తరణ ఉండదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నేడో రేపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని నిన్నమొన్నటి వరకూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. కొండా సురేఖ బర్త్ రఫ్ ను రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ముడి పెట్టి ఈ ప్రచారం జరిగింది. గత కొంత కాలంగా హైకమాండ్ ను కేబినెట్ విస్తరణ కోసం రేవంత్ కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ వివాదం నెలకొనడం, సీఎం ఢిల్లీ పర్యటన ఇవన్నీ కలిసి ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా జరిగింది. అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ.. రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కొండా సురేఖ శాఖలు సీఎం రేవంత్ రెడ్డి చేతికి వెళ్లడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లేనని అంటున్నారు. [Revanth Cabinet Reshuffle Postpone, Konda sureka Portpolios, CM Hands, Telangana politics, Telugu One]

Published on: Fri Sep 4, 2026 11:55AM

political-news-img

కొండా సురేఖ.. కాంగ్రెస్ తో బంధం తెంపుకున్నట్లే.!

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో తెలంగాణలో సరికొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి. కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత పార్టీలో ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది. కేబినెట్ నుంచి బర్త్ రఫ్ తో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిల కథ కాంగ్రెస్ లో ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. కొండా సురేఖ.. తన వైఖరితో కాంగ్రెస్ తో బంధాన్ని తెగే వరకూ లాగారన్న మాట రాజకీయవర్గాలలో బలంగా వినిపిస్తోంది. తన వైఖరి కారణంగానే కొండా సురేఖకు హైకమాండ్ వద్ద వాదన వినిపించే చాన్స్ కూడా లేకుండా పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలను ఖండించకుండా సురేఖ మొండిగా వ్యవహరించారనీ, దీంతో ఆ క్రమశిక్షణ ఉల్లంఘనను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందనీ అంటున్నారు. ఆ కారణంగానే హస్తిన వెళ్లిన కొండా సురేఖకు పార్టీ పెద్దల అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదని చెబుతున్నారు. సంక్షోభం తలెత్తిన ప్రారంభ దశలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ స్వయంగా రాఖీ కట్టారు. దీంతో వివాదానికి తెరదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని అంతి భావించారు. కానీ.. రక్షాబంధన్ రోజున కొండా సురేఖ రేవంత్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం కేవలం మొక్కుబడి తంతేనన్నట్లుగా ఆ తరువాత ఆమె వైఖరి ఉంది. ఏ దశలోనూ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కొండా సురేఖ ప్రయత్నించలేదు. తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధపడినట్లుగా ఆమె ఘర్షణాత్మక వైఖరిని అవలంబించారు. దీంతో చివరకు ఆవమానకరంగా కేబినెట్ నుంచి బర్త్ రఫ్ అయ్యే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. అసలు కొండా దంపతుల వైఖరిలో ఎక్కడా రాజీపడే తీరు కనిపించదని వారి గతాన్ని పరిశీలిస్తే అవగతమౌతుంది. గతంలో వైసీపీలోనూ, ఆ తర్వాత బీఆర్ఎస్‌లోనూ కొండా దంపతులు విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు తాగాగా కాంగ్రెస్‌ నుంచి కూడా అదే విధంగా బయటకు వచ్చే పరిస్థితిని తమంత తాముగా కొని తెచ్చుకున్నారు. ఇక వరంగల్ జిల్లాలో కొండా దంపతుల పట్టు కోల్పోయేలా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే పావులు కదపడం మొదలు పెట్టారని పరిశీలకులు ఉదాహరణలతో విశ్లేషిస్తున్నారు. ఆలా కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాల్సిందిగా గవర్నర్ కు సిఫారసు పంపిన రేవంత్ రెడ్డి అలా వరంగల్ జిల్లాలో కొండాకు ప్రత్యామ్నాయంగా గుండు సుధారాణి వంటి బీసీనేతలను తెరమీదకు తీసుకువచ్చారు. అంటే విస్పష్టంగా కాంగ్రెస్ లో వారికి ఇక స్థానం లేదని చెప్పకనే చెప్పారు. [Konda surekha chapter closed in Congress, Cabinet Removed, Konda Surekha, Revanth Reddy, Congress Party, Telangana Cabinet, Konda couple]

Published on: Thu Sep 3, 2026 3:45PM

political-news-img

1995 సెప్టెంబర్ 1 నుంచి చంద్రబాబు ప్రస్థానం... నిజంగా ఒక అద్భుతం.!

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ భారత దేశానికి కూడా సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే సరిగ్గా 31 ఏళ్ల కిందట.. ఇదే రోజు ఒక దార్శనికుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన పాలన, పాలనలో తీసుకువచ్చిన దార్శనికత, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన సాగించిన ప్రయాణం ఒక చరిత్ర. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా మారిన హిస్టరీ. ఆయన నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు నాలుగుదశాబ్దాల రాజకీయ ప్రస్థానంలొ.. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట తొలి సారిగా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నంచి ఆయన ప్రతి అడుగూ చరిత్రే. జయాపజయాలతో సంబంధం లేకుండా, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన వేసిన ప్రతి అడుగూ చరిత్రే. తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 30 ఏళ్ల కిందట 1995, సెప్టెబంర్ 1 న తొలి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రెండు సార్లు విభజిత ఏపీ సీఎంగా. వాస్తవానికి ఆయన రాజకీయ ప్రవేశం నుంచీ ఆయన ప్రస్తానంలో ప్రతి మలుపూ ఒక సంచలనంగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏడుపదుల వయస్సు పైబడినా ఆయనలో ఎక్కడా వార్ధక్య ఛాయలే కనిపించవు. చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో అంతా ఉత్సాహమే. 1995 సెప్టెంబర్‌ 1న తొలి సారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తన దార్శనికతతో, విధానాలతో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డు ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో మార్పులు తెచ్చారు. దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలను రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు. ఇక యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు నిరహారదీక్ష చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు. చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదిం చుకున్నారు. ఇప్పడు నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారు. [CBN !st Time CM, 1995September, Developement, Welfare, Vision, History]

Published on: Wed Sep 2, 2026 11:00AM

political-news-img

జగన్ ‘చేయి’ అందుకోనున్నారా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ చేయి’ అందుకోనున్నారా? గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా? జగన్ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నారా? తాను విభేదించి బయటకు వచ్చిన కాంగ్రెస్ తో చెలిమికి తహతహలాడుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. దశాబ్దకాలంగా బీజేపీతో ఏకపక్షంగా స్నేహం చేసిన జగన్ ఇప్పుడు తన దృష్టిని కాంగ్రెస్ వైపు మళ్లించారంటున్నారు. ఇందుకు వారు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో జగన్ రహస్య భేటీని ఉదహరిస్తున్నారు. జగన్ ఇటీవల బెంగళూరులో కేసీ వేణుగోపాల్ తో రహస్యంగా భేటీ అయ్యారన్నప్రచారాన్నిపూర్తిగా కొట్టి పారేయలేమని పరిశీలకులు అంటున్నారు. హస్తిన ఢిల్లీ పీఠంపై మారిన సమీకరణాలు, ఏపీలో 2024 ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ రహస్య భేటీలోనే వైసీపీ జాతీయ స్థాయిలో ఎలాంటి పాత్ర పోషించాలి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించేందుకు ఉన్న అవకాశాలు? తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. రాష్ట్రం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాతవైసీపీ సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికార కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉండటంతో జగన్ కు గతంలోలా ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి అండ, ఆసరా కరవైంది. కేంద్రంలో, బీజేపీ అగ్రనేతలలో చంద్రబాబు మాటకే చెల్లుబాటు అధికంగా ఉంటోంది. అలాగే.. జగన్‌పై గతంలో అక్రమాస్తుల కేసు సహా పలు కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. వాటి దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలునమోదైన పాత కేసులు మళ్లీ తెరపైకి రావడం, దర్యాప్తు సంస్థల విచారణల వేగం పుంజుకోవడం ఆయనలో ఆందోళనను పెంచాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక కమలనాధులను ప్రాధేయపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదన్న భావనకు వచ్చిన ఆయన.. రాజకీయంగా రాష్ట్రంలో తాను, తన పార్టీ బలోపేతం కావాలంటే.. ‘హస్తం’ చేయి అందుకోవడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బెంగళూరు వేదికగా కేసీ వేణుగోపాల్ తో జరిగినట్లు చెబుతున్న రహస్య భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్కర కాలంగా కేంద్రంలో అధాకారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించిన జగన్ ఇప్పుడు తాను కమలం పార్టీకి కటీఫ్ చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు.. సమయంలో జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రతిష్ట పెరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. [YS Jagan Mohan Reddy secreat Meeting With KCVenugopal, BJPTies Severed, Congress Party, INDIA Alliance, Bengaluru]

Published on: Mon Aug 31, 2026 4:07PM

political-news-img

సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి నెక్స్ట్ టార్గెట్ జగనేనా?

విజయసాయి రెడ్డి ఒకప్పుడు జగన్‌కు కుడిచేయిలా ఉండేవారు. అంతే కాదు వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.అంతేనా ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. వ్యవసాయమే వ్యాపకమన్నారు. అయితే ఆ మాటకు కట్టుబడి ఉండలేదు. తాజాగా సొంత పార్టీ ప్రకటించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానన్నారు. ఈ లోగానే వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత కోటరీపైనా సంచలన విమర్శలతో ఓ బహిరంగ లేఖ రాశారు. జగన్ అనుచర వర్గాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని సాయి రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన లేఖలో విజయసాయి.. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పనిలో పనిగా జగన్ పట్టించుకోలేదంటూ నిష్టూరమాడాడు. గతంలో కూడా పలు సందర్భాలలో వైసీపీలో జగన్ కోటరీపై విమర్శల దాడులు చేసిన విజయసాయి రెడ్డి తన తాజా బహిరంగ లేఖలో మాత్రం సజ్జల టార్గెట్ గా నేరుగానే విమర్శల దాడి చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఇంత జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండడాన్ని నిలదీశారు. అలాగే జగన్ పట్ల తాను ఎంత లాయల్ గా ఉన్నానో చెప్పుకొచ్చారు. తానెన్నడూ జగన్ కు ద్రోహం చేయలేదన్న విజయసాయి.. జగన్ కోసం తాను ఎంతో చేశానని చెప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే తాను ఏ2 అని గుర్తు చేశారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, కాకినాడ పోర్ట్ కేసుల్లో కూడా తన పేరు ఉందనీ, వీటి వేటిలోనూ సజ్జల పేరు ఎందుకు లేదని ప్రశ్నలు గుప్పించారు. అక్కిడితో ఆగకుండా.. సజ్జలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో, తెలుగుదేశంతో కు రహస్య అవగాహన ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడు అంటూ పేరు చెప్పకుండా ఆరోపణలు, విమర్శలూ గుప్పించారు. ఆ నాయకుడే జగన్ మనసులో తనకు వ్యతిరేకంగా విషం నింపారనీ, ఇప్పుడా నాయకుడు నాయకుడు తెలుగుదేశం గూటికి చేరేందుకు రెడీ అయ్యారన్నారు. వైసీపీని వీడిన తరువాత నుంచీ సాయిరెడ్డి.వరుసగా ప్రణాళికా బద్ధంగా ఆ పార్టీపై విమర్శలు ఆరోపణలూ చేస్తున్న క్రమం గమనిస్తే.. ఆయన నెమ్మది నెమ్మదిగా జగన్ ను టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తన ఆరోపణలన్నీ ఒకే సారి గుప్పించలేదు. తొలుత జగన్ కోటరీ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా సాఫ్ట్ గా విమర్శించారు. ఆ తరువాత జగన్ కోటరీ ఆయనను తప్పుదోవపట్టిస్తోందనీ, జగన్ గమనించాలనీ సూచించారు. ఆ తరువాత కొందరి పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలూ, విమర్శలూ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కర్త, కర్మ, క్రియా అన్నీ రాజ్ కేసిరెడ్డే అని తొలుత చెప్పినది విజయసాయిరెడ్డే అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇటీవల జగన్ హయాంలోనే రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు భారీగా జరిగాయని బాంబు పేల్చారు. ఇప్పుడు తాజాగా నేరుగా సజ్జలపై విమర్శలూ, ఆరోపణలూ గుప్పించారు. 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో సజ్జల తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్న విజయసాయి, అప్పుడు జగన్ ప్రేక్షక పాత్ర వహించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. ఇప్పటి దాకా జగన్ ను నేరుగా విమర్శించలేదు. తాజా బహిరంగ లేఖలో మాత్రం జగన్ మౌనాన్ని నిలదీశారు. ప్రశ్నించారు. తద్వారా తన ఆరోపణలపై జగన్ స్పందించాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకు వచ్చారు. దీనిని బట్టి చూస్తుంటే.. తన కొత్త పార్టీ ప్రారంభించిన తరువాత ఇక ఆయన నేరుగా జగన్ నే టార్గెట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక . స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి. {Vijayasai Reddy Next Target Jagan,Vijaya Sai Open Letter, Sajjala, Attack Ycp Internal Crisis, AP Politics, Telugu One}

Published on: Sun Aug 30, 2026 8:55AM

political-news-img

‘స్థానిక ఎన్నికలు..వైసీపీ ద్వంద్వ వైఖరి.!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైపీపీ ద్వంద్వ వైఖరీ, డోలాయమానం, అదే సమయంలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఓ వైపు స్థానిక పోరులో గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ శ్రేణులు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. పనిలో పనిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల ఆశావహులకు హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే.. సదరు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనని హెచ్చరించాడు. అదే సమయంలో ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకపక్క గెలుపే లక్ష్యంగా నిలవాలంటూ అధినేత పార్టీ శ్రేణులలో జోష్ నింపడానికి ప్రయత్నిస్తుంటే.. మరోపక్క పార్టీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరినీ, ఎన్నికల విషయంలో ద్వేదీ భావాన్నీ, అదే సమయంలో ఓటమి భయాన్నీ సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద స్థానిక ఎన్నికలను వీలైనంత వరకు వాయిదా వేయించేందుకే సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తూ కోర్టును ఆశ్రయించడం ఆ పార్టీలో స్థానిక పోరు విషయంలో ఎంత గందరగోళం నెలకొని ఉందో అర్ధమౌతున్నదంటున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ఆ పిటిషన్‌లో కోరారు. పాత ఓటర్ల జాబితా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడం సరికాదని, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వాదనపై న్యాయ, ఎన్నికల విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్నంత మాత్రాన ఎన్నికలను నిలిపివేయాలనే నిబంధన ఎక్కడా లేదని, గతంలో నిర్ణయించిన అర్హత తేదీల ప్రకారం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ నాయకులతో జరిపిన సమీక్ష సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం ఇస్తే సహించేది లేదని, ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాకుండా, స్థానిక పోరులో నిర్లక్ష్యం వహిస్తే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఓటమి భయంతోనే న్యాయపోరాటాల పేరుతో కాలయాపన చేయాలని చూస్తున్నారనే చర్చ మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే ఆశించిన ఫలితాలు రావేమోనన్న ఆందోళన వైసీపీలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్న వైకాపా, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలు గెలుచుకోలేకపోతే ఆ ప్రచారం తప్పని రుజువై ఉన్న కాస్తపరువూమంటగలుస్తుందన్న భయంలో ఉంది. అందుకే వీలైనంత కాలం ఎన్నికల వాయిదా దిశగా వ్యూహాలు పన్నుతోందనీ, అందులో భాగంగానే ఎన్నికల నిలుపుదల కోరుతూ కోర్టును ఆశ్రయించిందని చెగుతున్నారు. {AP Local Body Elections, YSRCP High Court Petition, YS Jagan Mohan Reddy, Lella Appi Reddy, Voter List Special Intensive Revision, AP Politics News, Local Bodies Grant}

Published on: Sat Aug 29, 2026 2:39PM