కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

సుప్రసిద్ధ దర్శకుడు,  కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ ఇక లేరు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంగా ఉన్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.   శంకరాభరణం చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కే. విశ్వనాథ్ ఆ తరువాత సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం,  సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, శుభసంకల్పం వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలలో సంగీత, సాహిత్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. కే.విశ్వనాథ్ కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే, 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాలు లభించాయి.  
Publish Date: Feb 2, 2023 10:51PM

ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత పేర్లు

దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా అటు దేశ రాజధని ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లలో రాజకీయ  ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం  ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది. ఇప్పడు మరో సీరియస్ టర్న్ తీసుకుంది. ఇంతవరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లను చేర్చిన ఈడీ.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్‌షీట్‌లో నమోదు చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది.  కాగా డిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది.  ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌ గ్రూప్‌ లావాదేవీల్లో  శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు సమాచారం. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు మందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3 వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.
Publish Date: Feb 2, 2023 10:44PM

బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తమే చూపింది. బడ్జెట్ కు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర విత్తమంత్రి పట్టించుకోలేదు.   గతేడాది అప్పుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో అంచనాలు భారీగానే వేసుకున్నా మూడింట ఒక వంతు భాగానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో కోత పెట్టింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో గతేడాది తరహాలోనే రిజర్వు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఎఫ్ఆర్‌బీఎం గురించి స్పష్టత ఇవ్వడంతో ఈసారి కూడా రుణాల లభ్యత   కష్టంగానే ఉంటుందని స్పష్టమైపోయింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా దానిని విద్యుత్ సంస్కరణలకు ముడిపెట్టింది. అంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే   0.5% మేర అధిక రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే రాష్ట్రానికి రుణ లభ్యత 3.0% మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యుత్ సంస్కరణలను అమలు చేసే ప్రసక్తే లేదని క్లారిటీతోనే ఉంది. అందుకే రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు కాకుండా, 3.0% రుణానికే అవకాశం ఉంటుంది. అంటే  దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మేర రుణానికి కోత తప్పదు.  మరో వైపు కేంద్రం  నుంచి గ్రాంట్ల రూపంలో ఆశించిన స్థాయిలో రాకపోవచ్చనే అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.  ప్రీ-బడ్జెట్ సమావేశంలో హరీశ్‌రావు లిఖితపూర్వకంగా చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా కేంద్ర బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్ బిజినెస్, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టిందని, పని దినాల పెంపును కనీసం ప్రస్తావించలేదని అంటున్నారు.   మూలధన వ్యయం కేటాయింపులు పెంచడం లాంటివి కనిపించడం ఒక పాజిటివ్ సంకేతమైనా.. మెజారిటీ పేదల సంక్షేమం విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. చివరాఖరికి రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు కోసం విడుదలైన నిధులు పొరపాటున ఏపీ రాష్ట్ర ఖాతాలోకి వెళ్ళిపోయాయని, వాటిని సర్దుబాటు చేయాలన్న విజ్ఞప్తిని సైతం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.  
Publish Date: Feb 2, 2023 10:35PM

భారాసాకు కష్టమే.. తెలంగాణలో హంగే!

ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిందన్నది సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అలా తయారైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన తెరాస (ఇప్పుడు భారాస) తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజల దృష్టిని మరల్చి.. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు.. వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాలలో తెలంగాణ మోడల్ అంటూ తెరాసను భారాసగా మార్చి జాతీయ పార్టీని చేశారు. ఇతర రాష్ట్రాలలో భారాస విస్తరణ అంటూ వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేని నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని పార్టీ కండువా కప్పుతూ.. జాతీయ రాజకీయాలలో భారాసా ప్రభంజనం సృష్టిస్తుందంటూ తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ దిశగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన వ్యూహాలు ఫలించే అవకాశాలు లేవనీ తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన ఒక సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. అలాగే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ కూడా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని ఆ సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటుంటే.. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంతగా ప్రయత్నం చేసినా బీజేపీ ప్రభావం రాష్ట్రంలోని ఒక్క జిల్లాకే పరిమితమైందని సర్వే వెల్లడించింది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్ తప్పదన్న సంకేతాలు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా పరాజయాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్ కు చేరువయ్యే అవకాశాలున్నాయని కూడా ఆ సర్వే పేర్కొంది.  రాష్ట్రంలో  వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టబోయేది మేమే అని ధీమాగా చెబుతున్న బీజేపీ మూడో స్థానానికే పరిమితమౌతుందని సర్వే ఫలితం చెబుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనీ, ప్రజలలో కాంగ్రెస్ పట్ల సానుకూల వ్యక్తమౌతున్నదనీ సర్వే ఫలితం పేర్కొంది.     ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన ఈ  సర్వే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ గా కాంగ్రెస్ అవతరిస్తుందనీ,  అధికార భారాసా రెండవ స్థానానికే పరిమితమౌతుందనీ, ఇక బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసిందేననీ ఆ సర్వే పేర్కొంది.  ఉమ్మడి జిల్లాల వారిగా సర్వే వెల్లడించిన దానిని బట్టి ఆరు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఇక మూడు జిల్లాలో బారసా కు కొద్ది పాటి మొగ్గు కనిపించగా, కేవలం హైదరాబాద్ జిల్లాలో మాత్రమేబీజేపీ కి కొంత సానుకూలత కనిపించింది.  హంగ్ అనివార్యమైన పరిస్థితులున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరువగా వస్తుందనీ, ఎన్నికల నాటికి ఇదే ట్రెండ్ కొనసాగితే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని సర్వే ఫలితం చెబుతోంది. 
Publish Date: Feb 2, 2023 10:14PM

ఢిల్లీ లిక్కర్ స్కాం.. చార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం పేరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ  చార్జీషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ పేరు చేర్చింది. అలాగే రెండో చార్జిషీట్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌తో పాటు మరో 17 మందిపై కూడా ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ పేరు చేర్చటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  మొదటి నుంచీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగానే ఉంది.  
Publish Date: Feb 2, 2023 3:44PM

నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉందంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రవేశ పెట్టిన 2023-2024 వార్షిక బడ్జెట్ ఎలా వుంది? ఎప్పటిలానే, అధికార పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా వుంది. ప్రతిపక్షాలకు అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుంది. నిజానికి, అక్షరం పొల్లు పోకుండా ఇదే బడ్జెట్’ను చిదంబరం (కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రవేశ పెట్టి వుంటే,  బడ్జెట్ ఇదే అయినా కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా, బీజేపీకి అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుండి వుండేది. అలాగే ఇతర పార్టీల ప్రతిస్పందనలు. ఇప్పుడు బాగుందన్న నోళ్ళే అప్పుడు ఛీ’ అనేవి.. అలాగే, ఇప్పుడు ఛీ అన్న నోళ్ళు అప్పుడు ఆహో. ఓహో అనేవి.  సో ... బడ్జెట్ పై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి, రాజకీయ పార్టీలే కాదు, మీడియా, మేథావులు సైతం రాజకీయ రంగులకు అనుగుణంగానే విశ్లేషణలు చేస్తున్నారు.  సరే అదలా ఉంటే ఇది ఎన్నికల సంవత్సరం కూడా కావడం, మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్  కావడంతో, బీజేపీ బడ్జెట్ లోని సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, బడ్జెట్‌లో ప్రకటించిన ప్రజానుకూల  చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 12 రోజుల దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజునుంచే మొదలైన, ప్రచారానికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ సారధ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.  ఫిబ్రవరి 1 నుంచి 12న వరకు సాగే ఈ ప్రచారంలో దేశంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చలు, విలేకరుల సమావేశాలు,  సెమినార్‌లు నిర్వహించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్,  రైతు, యువజన విభాగాల అధినేతలతో సహా తొమ్మిది మంది సభ్యులతో కూడిన టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ యూనిట్ల అధినేతలు, అసెంబ్లీలోని విపక్ష నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రజలకు అవగాహనా కల్పించేందుకు బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందీ అంటే అందుకు ప్రత్యేక కారణం ఎన్నికలు. అవును ఈ సంవత్సరం ఏకంగా తొమ్మిది రాష్త్రాలలో  శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈ కేంద్ర బడ్జెట్ మోడీ ప్రస్తుత  ప్రభుత్వం ప్రవేశ పెట్టీ చిట్ట  చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. అందుకే, కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు  ఓక పథకం ప్రకారం బడ్జెట్ అనుకూల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఈ  ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి,  గతంలోనూ  బీజేపీ కేంద్ర బడ్జెట్‌లలో ప్రకటించిన సంస్కరణలు, కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలను నిర్వహించింది. ఇప్పుడ మళ్ళీ అదే పంథాలో ముందుకు సాగుతోంది. అయితే, కేవలం ప్రచారంతోనే రాజకీయ ప్రయోజనం చేకురుతుందా, అంటే అనుమానమే అంటున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు లక్ష్యంగా, ఎలాంటి ఆకర్షణలు లేకుండా నిర్మలమ్మ వండి వడ్డించిన  బడ్జెట్  ప్రజలకు ఎంత వరకు రుచిస్తుందనేది అనుమానమే అంటున్నారు.   అంతేకాదు, కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మల సీతారామన్  వరసగా ఐదవసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్, గత బడ్జెట్లకు భిన్నంగాలేదు. నిజానికి పేరుకే ఎన్నికల బడ్జెట్ కానీ, ఎన్నికల వాసనలు అసలే లేవు.  మధ్య తరగతికి పన్ను పోటు నుంచి కాసింత వెసులుబాటు కల్పించే చర్యలు మినహా, పెద్దగా ఓటు బ్యాంక్ తాయిలాలు ఏవీ కనిపించలేదు. అలాగని అందరినీ నిరాశ పరిచిందా అంటే అదీ లేదు. ఒక విధంగా మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనుసరిస్తున్న... సుస్థిర అభివృద్ధి లక్ష్యంగానే ఈ వార్షిక బడ్జెట్ కూడా వుంది. ఇక ప్రజలు ఎలా రిసీవ్  చేసుకుంటారో చూడవలసి వుంది.
Publish Date: Feb 2, 2023 2:48PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. చిక్కుల్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ నిఘా దళపతి పీఎస్సార్‌ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందా? నెల్లూరు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధించిన ఆధారాలను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్  పీఎస్సార్ ఆంజనేయులే తనకు అందించారంటూ మీడియా ఎదుట చెప్పంతో ఆయన చిక్కుల్లోపడేసిందనే పరిశీలకుల చెబుతున్నారు.  కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. తన ఫోట్ ట్యాప్ అయ్యిందనీ, ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడతానన్న కోటం రెడ్డి అన్నంత పనీ చేశారు. మీడియా సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను వెల్లడించారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి అమర్నాథ్ కోటం రెడ్డి చూపిన ఆధారాలు ట్యాపింగ్ కాదని, రికార్డింగ్ అని వ్యాఖ్యానించారు. దీంతో కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వాస్తవమేనని మంత్రి అంగీకరించినట్లైంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలోఆందోళన పెరిగింది. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలలో తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కోటం రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పారు. తాను తన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆరోపణలు చేయగానే పలువురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తనకు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు స్వయంగా మంత్రి రికార్డింగ్ వ్యవహారంతో అధికార పార్టీ తన సొంత ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టిందన్న విషయం తేటతెల్లమైపోయింది. ఒక ఎమ్మెల్యేకు స్వయంగా నిఘా విభాగం అధిపతే ఆయన ఫోన్ కాల్ రికార్డు పంపించారంటే.. అధికార పార్టీలోని ఎమ్మెల్యేల ఫోన్లన్నీ నిఘా నీడలోనే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. అదంతా పక్కన పెడితే.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలంటూ బయటపెట్టిన వివరాలు ఏపీ ఇంటెలిజెన్స చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందన్నఅభిప్రాయం వ్యక్తమౌతోంది.    
Publish Date: Feb 2, 2023 2:30PM

అయోధ్యకు చేరిన పురాతన సాలగ్రామం.. ఎందుకంటే?

అయోధ్యలో రామజన్మ భూమిలో  నిర్మాణంలో ఉన్నరామమందిరంలో  శ్రీరాముడి ప్రధాన విగ్రహాన్ని మలిచేందుకు నేపాల్ నుంచి అత్యంత అరుదైన సాలగ్రామాన్ని తీసుకువచ్చారు.  ఈ భారీ సాలగ్రామంతోనే శ్రీరామచంద్రుని విగ్రహాన్ని తయారు చేసి, గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈమేరకు శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్టు రెండు అరుదైన సాలగ్రామాల వివరాలను వెల్లడించింది. ఇవి 60 మిలియన్ ఏళ్లకంటే పురాతనమైనవని, ఒక రాయి 26 టన్నులు, మరొకటి 14 టన్నుల బరువుందని ట్రస్టు వివరించింది.  వీటిని దేవ శిలలుగా పిలుస్తారు. ఈ శిలలనునేపాల్ లోని ముక్తినాథ్ సమీపంలోని  గండకి నది సేకరించారు. గండకి నదిలోనే అరుదైన సాలగ్రామాలు లభిస్తాయి. అయోధ్యలో ఉన్నది రామ్ లల్లా మందిరం. అంటే బాల రాముడు, రాముడు బాలుడి అవతారంలో ఉంటారు కనుక ఈ అరుదైన..అత్యంత పురాతన, భారీ సాలగ్రామంతోనే రామయ్య బాలుడి రూపాన్ని చెక్కి, ప్రతిష్ఠాస్తారు. వచ్చే ఏడాది  సంక్రాంతి నాటికల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి.
Publish Date: Feb 2, 2023 1:38PM

ఇది ఆరంభం మాత్రమే... అసలు సినిమా ముందుంది!

నెల్లూరు వైసీపీలో ముసలం ప్రారంభమయింది. పది అసెంబ్లీ స్థానాలుంటే పదింటిలోనూ వైసీసీయే గెలిచిన నెల్లూరు జిల్లాలో  ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు ఆరంభమైంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా వార్ కు దిగారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నిరసన గళం వినిపించారు. జిల్లాకే చెందిన  మరో ఎమ్మెల్యేలో కూడా అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందనీ, ఏ క్షణమైనా బయటపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఆరంభమైన అసమ్మతి ముందుముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెలుగు చూసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కృష్ణా జిల్లా గన్నవరంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రారవు జగన్ సైకో.. సినిమాల్లో విలన్ లా ఉన్నారని వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. వారి వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియో పార్టీలో కలకలం సృష్టిస్తోంది.  దీంతో ఈ జిల్లా, ఆ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలలో జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గత మూడున్నరేళ్లకు పై బడి మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఇక ముందు ముందు తమ అసంతృప్తిని వెళ్ల గక్కేందుకు ఒక్కరొక్కరుగా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  సీఎం సొంత జిల్లా కడప లో కూడా అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యేలు బయటపడలేదు కానీ, రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి వంటి వారు తమ అసమ్మతి గళం విప్పారు.  ఇలా ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసమ్మతి గూడుకట్టుకుని ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా అవి బయటపడే అవకాశం  ఉందని అంటున్నారు.  
Publish Date: Feb 2, 2023 1:16PM

ఈటల ఓటమికి కేటీఆర్ వ్యూహం!?

తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన నియోజక వర్గం  హుజురాబాద్.  ఇంచుమించుగా ఏడాది కిందట జరిగిన  హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ప్రభావితం చ్జేసిందో, అందుకు కారణాలు ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.  తెరాస ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగులో అడుగేస్తూ వచ్చిన బీసీ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో మొదలై హుజురాబాద్  ఉపఎన్నిక వరకు కొనసాగిన పొలిటికల్ హైడ్రామా గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం చర్విత చరణమే అవుతుంది. ఆ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడినా  ఓడిపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్  బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు.  ఇక అక్కడ నుంచి బీజేపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదునుపెడుతూ వచ్చారు. ఈటల చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకనో ఏమో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను వెంటాడుతూనే ఉన్నారు. ఈటల ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరం అయినా ఇంతవరకు అసెంబ్లీలో ఆయనను కనీసం ఒక్క రోజైనా కూర్చోనీయలేదు. మాట్లాడనీయలేదు.   ఏదో ఒక సాకుతో ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అయినా ఈటలను  గౌరవ స్పీకర్  సభలో ఉండనిస్తారో లేదో చూడాలి.అదలా ఉంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేస్తున్న ఈటలను సొంత  నియోజక వర్గం హుజురాబాద్ లో ఓడించేందుకు,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్,  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్  అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆయనకు సూచించారు. గత ఉప ఎన్నికలలో బీసీ కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు, నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే  ఇప్పటికే  కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇటీవల గవర్నర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు సైతం తప్పు పట్టింది.  ఆ తప్పును ప్రభుత్వ తరపు న్యాయవాది అంగీకరించడంతో పాటుగా, మరో మారు అలాంటి పరిస్థితి రాదని కోర్టుకు తెలిపారు. అయితే   కౌశిక్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంచితే  ఏ విధంగా చూసినా   కౌశిక్ రెడ్డి ఈటలకు సామ ఉజ్జీ కాదని అంటున్నారు. అంరో వంక ఉప ఎన్నికల్లో పోటీచేసిన గెల్లు శ్రీనివాస్ వర్గం కౌశిక్ రెడ్డిని ఉద్యమ ద్రోహిగా పేర్కొంటూ  ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ని ఢీకొట్టడం   కౌశిక్ రెడ్డికి అయ్యే పనేనా?  అంటే, కాదనే అంటున్నారు.
Publish Date: Feb 2, 2023 11:56AM

కోటంరెడ్డి తిరుగుబాటు వైసీపీ స్క్రిప్టేనా?

నెల్లూరు పెద్దారెడ్ల అసంతృప్తి ఒక వైపు వైసీపీలో కాక రేపుతుంటే.. మరో వైపు తెలుగుదేశంలో ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందా అన్న అనుమానాలు  తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కోటం రెడ్డి తీరు పట్ల తెలుగుదేశంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ట్వీట్ రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సరిగ్గా నెల రొజుల కిందటే.. కోటం రెడ్డి జగన్ పిలుపు మేరకు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ఆయనతో బేటీ అయిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కోటంరెడ్డి బహిరంగంగా తన ఫోన్  ట్యాప్ చేస్తున్నారంటూ మీడియా ముందు ప్రకటించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో తాను తెలుగుదేశం తరఫున పోటీ చేస్తానంటూ ప్రకటించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గత మూడున్నరేళ్లుగా  తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేతపైనా ఇష్టారీతిగా నోరు పారేసుకున్న కోటం రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి.. తన రాజకీయ భవిష్యత్ చంద్రబాబు చేతుల్లోనే అనడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు అనుమానిస్తున్నాయి.  2019లో ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంపై ఇష్టారీతిగా విమర్శలు చేశారు. చంద్రబాబుది భస్మాసుర హస్తం అంటూ విమర్శించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబను విఫల నాయకుడిగా విమర్శించారు. ఇప్పుడు అప్పట్లో కోటం రెడ్డి చేసిన విమర్శలన్నీ తెలుగుదేశం సర్కిల్స్ లో విపరీతంగా సర్క్యలేట్ అవుతున్నాయి. కోటంరెడ్డిని తెలుగుదేశం గూటికి చేరనివ్వవద్దంటూ అధినేతకు విజ్ణప్తులు  చేస్తున్నాయి.  అంతే కాకుండా.. రాష్ట్రంలో రోజు రోజుకూ జగన్ ప్రభ మసకబారుతుండటం, వైసీపీ పట్ల ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పక్కా వ్యూహంతోనే కోటం రెడ్డి సొంత పార్టీపైనా, జగన్ పైనా విమర్శలతో బయటకు వచ్చారన్న అనుమానాలు దేశం శ్రేణుల్లో వెల్లువెత్తుతున్నాయి. అలాగే వివేకా హత్య కేసులో తాడెపల్లి ప్యాలస్ డొంక కదులుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చే వ్యూహంతో కూడా వైసీపీ కోటం రెడ్డి చేత కావాలనే సొంత పార్టీపై ఆరోపణలు చేయిస్తోందన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్లను పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆ అంశం నుంచి దృష్టి మరల్చడానికే కోససీమలో చిచ్చు రేపారనీ, ఇందు కోసం వైసీపీ సొంత ఎమ్మెల్యే ఇంటిని దగ్ధం చేయించడానికి కూడా వెనుకాడలేదనీ గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోటం రెడ్డి విషయంలో, ఆయన ఆరోపణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్న అనుమానాలనే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ ద్వారా బయటకు వెల్లడించారని అంటున్నాయి.   గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ట్వీట్ లో..  వైసీపీ కోవర్ట్ డ్రామా ఆరంభమైంది.. రాబోయే వ్యూహం సినిమా స్క్రప్ట్ లా ఉంది.. తెలుగు తమ్ముళ్లూ జర జాగ్రత్త అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను టీడీపీలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Feb 2, 2023 11:32AM

కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి కారణమేంటి?

కేసీఆర్ రాష్ట్రం గురించి పట్టించుకోవడం మానేశారా? గవర్నర్ తో విభేదాల విషయంలో తగిలిన ఎదురు దెబ్బ కారణంగా ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బీజేపీపై విమర్శలు చేయవద్దని నిర్ణయించుకున్నారా? లేక కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కాపాడుకోవడం కోసం కేంద్రంపై, ప్రధానిపై విమర్శల వాడి వేడి తగ్గించేశారా? కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బుధవారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు దాదాపు శూన్యం. ఏదో ఒకటీ అరా కేటాయించినా.. అవన్నీ కేంద్ర సంస్థలకు సంబంధించి మాత్రమే. గత ఏడాది నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ ను చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఎలుగెత్తారు. అప్పుడు ఆయన ప్రసంగం అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. కేంద్రంపై పోరులో కేసీఆర్ చాంపియన్ అన్న భావన కలిగించింది. ఏడాది గిర్రున తిరిగింది. మళ్లీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ సారీ తెలంగాణకు రిక్తహస్తమే. అయినా కేసీఆర్ పన్నెత్తి మాట్లాడలేదు. కనీసం తెలంగాణకు కేంద్రం మళ్లీ అన్యాయం చేసింది అన్న మాటైనా ఆయన నోటి వెంట రాలేదు. జాతీయ పార్టీ అధినేత అయినా, తెలంగాణకు ముఖ్యమంత్రే కదా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేటాయింపులు దక్కకపోవడంపై నోరెత్తకపోవడమేమిటని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి పలు  రకాల భాష్యాలు చెబుతున్నారు. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభం అవుతున్నాయి. ఆ రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. మొదట గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని భావించిన కేసీఆర్.. ఆ తరువాతి పరిణామాలతో వెనక్కు తగ్గారు. అంతే కాదు.. గవర్నర్ కు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా గవర్నర్ ప్రసంగ ప్రతులలో ఆమె చెప్పిన మార్పులకు కూడా ఓకే చేసేశారు. అంటే ప్రభుత్వం ఆమోదంతో రూపొందిన గవర్నర్ ప్రసంగంలో కూడా ఆమె చెప్పిన మార్పులు చేయడానికి కిమ్మనకుండా అంగీకరించేశారు. తమిళనాడు గవర్నర్ చేసిన విధంగా తమిళిసై కూడా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా అన్న భయం ఆయనలో కనిపిస్తోంది. ఒక వైపు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తనతో జట్టుకట్టే పార్టీల గురించి అన్వేషణ సాగిస్తూనే.. మరో వైపు ఏ విధంగానైనా కేంద్రం మెప్పు పొందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే గవర్నర్ ఎపిసోడ్ తరువాత కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కేంద్రంపై విమర్శల దూకుడు కనిపించడం లేదు. మరో వైపు గవర్నర్ ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి పసన్న కుమార్ రెడ్డిని షటిల్ సర్వీసులా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య తిప్పుతున్నారు.   మొత్తానికి కేంద్రం విషయంలో కేసీఆర్ తీరు మారిందనడానికి బడ్జెట్ పై ఆయన నోరెత్తకపోవడాన్నే తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు. 
Publish Date: Feb 2, 2023 10:52AM

రాహుల్ జోడో యాత్ర ముగిసింది.. కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంది?

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఆయన విజయవంతంగా తన గమ్యం చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు.  అయిదు నెలల కాలంలో 14 రాష్ట్రాలలో కాలి పాదయాత్ర సాగించిన  రాహుల్‌ గాంధీ, ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంత మేరకు రాజకీయ లబ్ధి చేకూరిందన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం రావడం లేదు. రాహుల్ తన పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎర్రటి ఎండలో, వణికించే చలిలో కూడా ఎక్కడా ఆగకుండా ఆయన పాదయాత్ర నిర్ధిష్ట షెడ్యూల్ ప్రకారం సాగింది. ఆయనలోని పట్టుదలను, ఓర్పు, సహనాన్ని ప్రజల కళ్లకు కట్టింది. రాహుల్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. రాజీవ్ గాంధీ తనయుడిగా, తల్లి సోనియా చాటు బిడ్డగానే కాకుండా ప్రజా జీవితంలో యాక్టివ్ గా ఉండే నేతగా, ప్రజల కష్టాలకు, సమస్యలకు స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక అలుపూ, సొలుపు అన్నది లేకుండా రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తూ, అదీ ఉత్సాహంగా, ప్రజలతో మమేకమౌతూ ఆయన సాగించిన నడక అందరి దృష్టినీ ఆకర్షించిందనడంలో సందేహం లేదు. స్థిత ప్రజ్ణత సాధించిన నేతగా, పరిణతి చేందిన వ్యక్తిగా, రాజకీయ వేత్తగా ఆయనకు దేశ వ్యాప్త గుర్తింపు తీసుకు వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే ఈ గుర్తింపు  కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనకరం, ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందా? అధికారాన్ని హస్తగతం చేస్తుందా? అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే రాజకీయ వర్గాల నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తోంది. ఆయన పాదయాత్ర సాగుతున్న సమయంలోనే తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైంది. హిమాచల్ లో విజయం సాధించినప్పటికీ.. ఆ విజయాన్ని రాహుల్ పాదయాత్ర క్రెడిట్ లో వేయడానికి వీల్లేదు. ఆ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒక సారి అధికారం మారడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.   ఏతావాతా.. రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలలో ఆదరణ ఉందనీ, ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నీరుగారలేదనీ, అయితే ఆ ప్రజాదరణనూ, క్యాడర్ ఉత్సాహాన్నీ ఎన్నికలలో విజయంగా మరల్చుకుందుకు అవసరమైన వ్యూహాలు కరవయ్యాయనీ తేలింది.  ఇక మళ్లీ రాహుల్ వద్దకు వస్తే.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల, ప్రజలకు చేరువ కావడం వల్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న అవగాహన నిస్సందేహంగా మరింత పెరిగింది.  అలాగే ప్రజలకు కూడా రాహుల్ పట్ల ఇప్పటి వరకూ ఉన్న దృక్ఫథం కూడా మారి ఉంటుంది. నాన్ సీరియస్ రాజకీయ వేత్త కాదనీ, విపక్షాలు ఇంత కాలం విమర్శిస్తున్న విధంగా ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ కాదనీ కూడా అర్ధమైంది. ఆయనలో పరిణితి చెందిన నేతను ఈ యాత్ర  ప్రజలకు పరిచయం చేసింది.   ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికీ, పార్టీకి అవసరమైన జవసత్వాలు నింపడానికి చేకగలిగిందంతా చేశారు. ఇక మిగిలినది పార్టీ చేయాలి. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా వ్యక్తమౌతున్న సానుకూలతను వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలదో చూడాలి. పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ ఉన్నా,  రాష్ట్రాలలో పార్టీ నేతల మధ్య తగాదాలు, విభేదలూ గెలుపునకు అవరోధాలుగా మారుస్తున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ ఎన్నికల ఓటములకు అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు.. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో విజయంపై పార్టీ దృష్టి సారించాల్సి ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దానిని కాపాడుకోవడం.. విపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ ముందున్న సవాళ్లు.  మరీ ముఖ్యంగా  కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో  ఏకకాలంలో బీజేపీ, అధికార బీఆర్ఎస్ లను ఎదుర్కొని విజేతగా నిలవాల్సిన అవసరం ఉంది.   
Publish Date: Feb 2, 2023 10:05AM

బాలకృష్ణ గ్రేట్.. విజయసాయి రెడ్డి

తెలుగుదేశం అధినేత   నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణపై  ఎవరైనా సోషల్ మీడియా వేదికగా  విమర్శలు గుప్పిస్తున్నారంటే.. అది వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి రోజు.. వీరిపై  ట్విట్టర్ వేదికగా ఏదో ఒక విమర్శ చేస్తేనే కానీ  విజయసాయిరెడ్డికి  పూట గడవదన్న టాక్   సోషల్ మీడియాలో ఉంది.  అయితే తాజాగా టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్జతలు తెలపడం సంచలనంగా మారింది.  జనవరి 27న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.  ఆ  సందర్భంగా  ఆయన బంధువు, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై.. కుప్పకూలిపోయారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి..  చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  నందమూరి తారకరత్న.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అది ఎలాగంటే... విజయసాయిరెడ్డి భార్య సునంద.. చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డి.  ఆ అలేఖ్యా రెడ్డి.. తారకరత్న భార్య. అంటే.. విజయసాయిరెడ్డికి.. తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు.  దీంతో విజయసాయిరెడ్డి.. బుధవారం(ఫిబ్రవరి 1) బెంగళూరులోని నారాయణ హృదయాలకు వెళ్లి.. మరదలి అల్లుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన పూర్తిగా సేఫ్ అని చెప్పారు. అయితే  తారకరత్న అస్వస్థతకు గురైన రోజు దాదాపు  45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ   నిలిచిపోవడంతో  మెదడు పైభాగం దెబ్బతిందని.. ఈ నేపథ్యంలో.. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌‌ కారణంగా.. లివర్ కానీ.. కొన్ని ఆర్గాన్స్‌కి కానీ.. రక్త ప్రసరణ తగ్గిందని.. దీంతో కొంత యాక్టివిటీ తగ్గిందని అన్నారు.   అయితే ఈ రోజు హార్ట్ ఫంక్షనింగ్ పర్ ఫెక్ట్ గా ఉందనీ,  మెదడులో ఎడిమా  అంటే వాపు  ఉందని.. ఇది మూడు నాలుగు రోజులు ఉంటుందని..  ఆ తర్వాత స్టెబిలైజ్ అయి.. వాపు తగ్గడం ప్రారంభమవుతుందని... వైద్యులు చెప్పారని విజయసాయి వివరించారు.  వైద్యులు  అద్బుతంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనీ. మంచి ట్రీట్‌మెంట్ కనిపిస్తోందని విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. తారకరత్న ఆరోగ్యం విషయంలో బాలకృష్ణ  ఎంతో కష్టపడ్డారనీ, అన్ని విషయాలూ ఆయన   స్వయంగా చూసుకొంటురన్న విజయ సాయి ఆయనకు కృతజ్జతలు తెలియజేసుకొంటున్నానన్నారు.        తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి ఫ్యామిలీతోపాటు నారా ఫ్యామిలీలో ఎంత ఆందోళన వ్యక్తమవుతుందో.. విజయసాయిరెడ్డి ఫ్యామిలీలో కూడా అంతే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సైతం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలోనే ఆసుపత్రలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించి... అతడికి అందిస్తున్న వైద్యాన్ని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Publish Date: Feb 2, 2023 9:22AM

నెల్లూరు పెద్దారెడ్ల ప్రతిఘటన

కాలం కలిసి వస్తుంటే.. అన్ని ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి.. అదే కాలం కలిసి రాకుంటే.. ఒకదాని వెనుక ఒకటి పోతునే ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా  చోటు చేసుకొంటున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీకి కాలం కలిసి రావడం లేదని అనిపించక మానదు.  మొన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి.. నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నేడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి..  రేపు ఎవరు అనే  చర్చ జోరుగా సాగుతోంది. వీరందరూ ఒకరి వెంట ఒకరు వైసీపీపైనా, సీఎం జగన్ పైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్‌నారాయణరెడ్డి గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతలను నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం.  మరి కొద్ది రోజుల్లో ఆయన  తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమనీ, నేడో రేపో ముహూర్తం ఖరారు చేసుకుంటారని నెల్లూరులో విస్తృతంగా ప్రచారంలో ఉంది.   అలాగే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..   జగన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో..   తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అధికారులపై చూపిస్తుండడంతో.. ఈ ఏడాది జనవరిలో సీఎం  జగన్ ఆయనను తన క్యాంప్ కార్యాలయానికి స్వయంగా  పిలిపించుకొని మరీ మాట్లాడి పంపించారు. అయితే గత కొద్ది రోజులుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. సొంత పార్టీపై కోటంరెడ్డి నిప్పులు చెరగడమే కాదు..  అన్నా.. జగనన్న మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే... అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి,  జగన్‌కే సూటిగా ప్రశ్నలు సంధించారు. నమ్మకం లేని చోటు నేను  ఉండను గాక ఉండనంటూనే.. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. ఆ విషయం ఆ పార్టీ వారికే చెప్పానని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తాన్నారు. దీంతో కోటంరెడ్డి పార్టీ మార్పు పక్కా అని అందరికీ అర్థమైపోయింది.     ఇక... ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం.. తన నియోజకవర్గంలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలపై.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గమైన ఉదయగిరిలో పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి.. చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఆతడి వల్ల మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలకుడు ధనుంజయరెడ్డి నిర్ణయాల వల్ల .. పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధనుంజయ్ రెడ్డి ససతం ఉదయగిరి ఎమ్మెల్యేపై తనదైన శైలిలో పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌కు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాదు తన మీద పెత్తనం చేయడం కదరని పని అని.. ఈ విషయం సీఎం జగన్, జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడానికే కాదు.... దేనికైనా సిద్ధమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  స్పష్టం చేశారు.  ఇలాంటి వరుస పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని మరో ఎమ్మెల్యే.. అంటే మరో పెద్దారెడ్డి.. తన గొంతు సవరించుకొని.. అధికార పార్టీపై అసమ్మతి గళం విప్పి ఎదురు తిరిగేవారు ఎవరా? అని తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు సైతం టెన్షన్ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో   ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అలాంటి జిల్లాలో ఇలా   ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తడం విప్పుతూ పోతే.. ఇక మిగిలేది ఎవరిని.. అధికార పార్టీ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు. 
Publish Date: Feb 2, 2023 9:03AM