రాజస్థాన్ కు చెందిన ఈ రాణి గారి కోపం గురించి వెంటే షాకవుతారు..!

రాజస్థాన్.. చాలా ప్రత్యేకమైన రాష్ట్రం.  రాజస్థాన్  రాష్ట్రంలో కోటలు,  అందమైన రాజ భవనాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడి రాజులు, రాణుల చరిత్ర చాలా గొప్పది కూడా.  వీరిలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కో విధమైన విస్మయాన్ని కలిగిస్తుంది.  ముఖ్యంగా కొందరు రాజులు, రాణుల నిర్ణయాలు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో రాణి ఉమాదే భాటియా కూడా ఒకరు.  ఈమెను రాజస్థాన్ ప్రజలు రుతీ రాణి అని పిలుస్తారు.  ఈమెకు చాలా కోపమట. ఎంతగానంటే ఈమె జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈమె భర్త బ్రతికున్నంత వరకు అసలు అయన దగ్గరకు వెళ్ళనే వెళ్లలేదట.  ఇంతకీ ఈ రాణి గారి కోపం ఎందుకో.. ఈమె ఎందుకు అంత కఠినంగా మారిపోయారో తెలుసుకుంటే.. ఉమాదే భాటియాని రాజస్థాన్ కు చెందిన రాణి.  ఈమెను ఉమా దేవి భాటియాని అని కూడా పిలుస్తారు. ఉమాదే భాటియాని  జైసల్మేర్ కు చెందిన రాజా రావల్ లుంకరన్ కుమార్తె. ఈమె రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి.  ఈమె చాలా అందగత్తె ఈమె అందం గురించి సుదూర రాష్ట్రాలకు కూడా పాకింది.  1537లో జోధ్పూర్ కు చెందిన మాల్ఢియో రాథోడ్ తన రాజ్య విస్తీర్ణాన్ని పెంచుకునే చర్యలో భాగంగా  పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ జైసల్మేర్ ను ముట్టడించాడు. రావల్ లుంకరన్ తన కుమార్తె ఉమాదే భాటియాను మాల్డియో రాథోడ్ కు ఇచ్చి వివాహం చెయ్యడం ద్వారా తన రాజ్యాన్ని ఆక్రమణ నుండి కాపాడుకున్నాడు. మాల్డియో రాథోడ్ తో ఉమాదే భాటియాకు వివాహం జరిగిన తరువాత జైసల్మేర్ నుండి ఉమాదే భాటియాతో పాటు కొందరు మహిళా పరిచారకులను కూడా ఉమాదే భాటియాతో అత్తవారింటికి పంపారు. ఉమాదే భాటియా వద్ద ఉన్న పరిచారకులలో భర్మాలి అనే ఒక దాసి ఉండేది.  ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాల్డియో రాథోడ్ బాగా మద్యం సేవించి రాణి దగ్గరకు రాకుండా మద్యం సేవించే గదిలోనే ఉండిపోయాడు.  దీంతో ఉమాదే భాటియా తన పరిచారిక భర్మాలిని పిలిచి రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి పిలుచుకుని రావలసిందిగా చెబుతుంది.  రాణి చెప్పినట్టు భర్మాలి రాజు దగ్గరకు వెళుతుంది. కానీ రాజు భర్మాలి అందానికి ముగ్ధుడై ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాడు.   రాజును తీసుకుని రావడానికి వెళ్లిన దాసి ఎంతసేపటికి రాకపోవడంతో ఉమాదే భాటియా తనే స్వయంగా రాజు దగ్గరకు వెళుతుంది.  అక్కడ రాజు భర్మాలితో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంలోనే ఆమె జైసల్మేర్ కు తన పుట్టింటికి వెళ్లిపోయింది.   అలా ఆరోజు వెళ్లిన ఉమాదే భాటియా అసలు ఎప్పుడు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.  భర్త చేసిన పనికి అతడిని జీవితంలో క్షమించలేకపోయింది.  జీవితాంతం ఆమె భర్త మీద కోపంతో అలా ఉండిపోవడంతో ఆమెను కోపిష్టి రాణి అని పిలవడం అందరికీ అలవాటైంది.                                            *రూపశ్రీ.
Publish Date: Nov 21, 2024 10:30AM

ఈ తప్పులు చేస్తే ధనవంతుడు పేదవాడు అవుతాడు.!

మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Publish Date: Nov 20, 2024 10:30AM

బాధ్యతల బండిని నడిపే మగమహారాజులకు ఇంటర్నేషనల్ మెన్స్ డే శుభాకాంక్షలు..!

మగవాడు... ఈ పదం ఏమీ పెద్ద బిరుదు కాదు కానీ, పుట్టిన తర్వాత  బాధ్యతగా పెరిగి, తన కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఉన్నతమార్గంలో నడిపించటానికి పాటుపడుతున్న ప్రతివాడూ మగాడే.. మొనగాడే... అటువంటి వారిని గుర్తించి,  వాళ్ళని అలా మార్చే విషయాల గురించి, అలా మారకుండా చేసే విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మగాడు సరిగా లేకపోతే.. అంటే బాధ్యతగా లేకపోతే అతని కుటుంబం, కుటుంబ సభ్యులు మానసికంగానూ, ఆర్థికంగాను, సామాజికంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ప్రతీ సంవత్సరం నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ రోజు పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయపరంగా  వారు  చేస్తున్న సేవలను  జ్ఞాపకం చేసుకోవడమే లక్ష్యం.  పురుషులు సమాజంలో తీసుకొచ్చే మంచి మార్పులని గుర్తు చేసి, వారిని ఆదర్శంగా చూపించే వీలు కల్పించే రోజు ఇది.   పురుషుల భావోద్వేగ స్వేచ్ఛ, పెరుగుతున్న  పురుషుల ఆత్మహత్యలు  వంటి అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి వేదికగా నిలుస్తుంది.  పురుషులు కూడా ఇతరుల మాదిరిగా మామూలు మనుషులేనని, వారికీ బాధ, నిరాశ కలిగినప్పుడు భావోద్వేగ మద్దతు అవసరమే అని  సమాజం గుర్తించేలా ప్రేరేపిస్తుంది.  సమాజంలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన కొన్ని భావనలు, పురుషులు తమ  భావోద్వేగాలను స్వేచ్ఛగా బయటపెట్టనివ్వకుండా చేస్తున్నాయి.  ‘మగ పిల్లాడు ఏడవటం ఏంటిరా? చూస్తే నవ్వుతారు’ అంటారు చాలా మంది. దాంతో వాళ్ళు తమ బాధ బయటపెట్టరు.   ఇది వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకే మగాళ్ళు చాలా కరుకు స్వభావం కలిగి ఉంటారు అంటారు. ఈ సమస్యలను గుర్తించటం ద్వారా  ఇంటర్నేషనల్ మెన్స్ డే మగావారి జీవితంలో మార్పులు తీసుకువస్తుంది. కుటుంబంలో, వివిధ రంగాల్లో,   సమాజంలో పురుషులు అనేక పాత్రలను పోషిస్తారు. కంటికి రెప్పలా కాపాడే  తండ్రిలా, మద్దతు ఇచ్చే అన్నగా, నమ్మకమైన స్నేహితుడునిగా, ప్రేమించే భాగస్వామిగా, సమాజంపట్ల బాధ్యత ఉన్న మనిషిగా పురుషులు చుట్టూ ఉన్నవారి కోసమే జీవితాన్ని   వెచ్చిస్తారు. ఇంత చేసినా వారి కృషి, త్యాగానికి అంతగా   గుర్తించబడవు. మెన్స్ డే ఈ విషయాలను గుర్తించేలా చేస్తుంది. పురుష దినోత్సవం సందర్భంగా కొన్ని లక్ష్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని  ప్రధాన లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.. నైతిక విలువలు, బాధ్యతలు కలిగిన మగవారిని గుర్తించి, వారిని ఆదర్శంగా చూపించడం. ఇలా చేయడం వల్ల మగవారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సాధ్యం అవుతుంది.     స్త్రీ, పురుషుల మధ్య పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రోత్సహించటం. ఇలా చేస్తే ప్రతి మగవాడి నుండి స్త్రీ కి సంరక్షణ, సహాయ సహకారాలు అందుతాయి. పురుషులు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేయడం  ప్రధానం. కుటుంబ జీవితంలో, పనిచేసే చోట, బయట సమాజంలో   పురుషులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇతర అనేక సమస్యల గురించి అవగాహన కల్పించటం. ఇది మగవారిలో నిగూఢంగా దాగున్న శక్తిని, వారి మానసిక స్వభావాన్ని బయటపెడుతుంది. మన సమాజం పురుషాదిక్యంలా కనపడుతున్నప్పటికీ బాధపడుతున్న, అణచివేయబడుతున్న అమాయకపు పురుషులు కూడా ఉంటారు, చాలాసార్లు తప్పుడు ఆరోపణల వల్ల  వాళ్ల జీవితాలనే కోల్పోతుంటారు. అటువంటివారిని కాపాడేందుకు  న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. ఇంటర్నేషనల్ మెన్స్ డే ప్రధానంగా పురుషుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. గణాంకాల ప్రకారం, పురుషులు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు.  వైద్య సహాయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. అందుకే మెయిన్స్ డే రోజు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టటం వంటి విషయాలపై చర్చలను ప్రోత్సహిస్తుంది. ఇంటర్నేషనల్ మెన్స్ డే కేవలం పురుషులకే సంబంధించినది కాదు,  ఇది లింగ సమానత్వాన్ని మెరుగుపరచడం, మంచి సంబంధాలను నెలకొల్పడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.  అప్పుడే  పురుషులు, స్త్రీలు కలిసి శాంతి కోసం, ప్రగతి కోసం  పనిచేస్తారు. ప్రతిమగవాడు తనకు  ఒక కుటుంబం ఏర్పడ్డాక తన జీవితాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తాడు. కుటుంబ సంతోషమే తన సంతోషం అని అనుకుంటాడు. తల్లి పడే కష్టం పిల్లల కాళ్ళ ముందు కనబడితే తండ్రి కష్టం కనిపించదు. అలా మగవాడి కష్టం బయటకు కనిపించదు. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం నిస్వార్థంగా తనను తాను కోల్పోయే మగాళ్ళు ఎప్పుడూ గౌరవించబడాలి. అలాంటి మగ మహారాజులకు అందరికీ హ్యాపీ మెన్స్ డే..!                                 *రూపశ్రీ 
Publish Date: Nov 19, 2024 10:30AM

సమస్యలొచ్చినప్పుడు మీరూ ఇలాగే చేస్తారా?

మనం ఎప్పుడూ సమస్యల నుండి పారిపోవాలని చూస్తాం. ఆ సమస్యల నుండి తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటాం. కొన్నిసార్లు కారణాలు సృష్టించుకుంటాం. ఇలా మన మనస్సు ఏర్పరచుకునే మరొక రక్షణ పద్ధతి అసలెటు వంటి సమస్యా మనకు లేదని అనుకోవడం! ఉదాహరణకు సమస్యతో సతమతమవుతున్న ఒక వ్యక్తిని చూడండి. అతడు చాలా అశాంతిగా, బాధతో ఉంటాడు. అతని కళ్ళల్లో అలజడి కనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా స్థిరంగా కూర్చోలేడు. చేతివేళ్ళను మాటిమాటికీ లాగుకుంటాడు. కాళ్ళను ఊపుతుంటాడు. అప్పుడప్పుడు నిట్టూర్పులు విడుస్తుంటాడు. ఇవన్నీ చేస్తున్నా బయటికి అందరితో తనకేమీ సమస్య లేదని అంటాడు. సమస్యను తిరస్కరించడమంటే ఇదే! తనను తానే మోసగించుకుంటున్నానన్న విషయం అతనికర్థం కాదు. అభద్రతా భావాలతోనూ, సందేహాలతోనూ కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇలాంటి పద్ధతి అవలంబిస్తాం. 'సమస్యలు లేవు' అని అనుకుంటే వాటిని ఎప్పుడూ  పరిష్కరించలేమన్న విషయం మరచిపోతాం. మొట్టమొదట సమస్య ఉన్నదన్న విషయాన్ని అంగీకరించాలి. మనం పిరికివాళ్ళం, బలహీనులం అయినందు వల్ల సమస్యలను తిరస్కరించడానికి 'వంద' మార్గాల్లో ప్రయత్నిస్తాం. లోలోపల అభద్రతాభావం ఉన్నా, పైకి అదేమీ లేనట్లుగా ఉంటాం. దాన్ని అంగీకరించం. దానికి బదులుగా అది లేదని బుకాయిస్తాం. అంతేకాదు, మనం చాలా శక్తిమంతులమైనట్లూ, పూర్తి భద్రతతో ఉన్నట్లు నటిస్తాం. సమస్య లేదని అనుకోవడం ఒక 'నిప్పుకోడి' ప్రవర్తించే విధంగా ఉంటుంది. తనను తినడానికి ఏదైనా జంతువు వస్తున్నదని చూడగానే, 'నిప్పుకోడి' తన తలను ఇసుకలో దూరుస్తుంది. అదేవిధంగా మనకు ఎవరిపైనైనా కోపం వస్తే, వారి నుంచి దూరంగా ఉందామని అనుకుంటాం. కానీ లోలోపల వారంటే అసలు ఇష్టమే ఉండదు. ఉడుక్కు పోతుంటాం. మనకు ఎవరిపై కోపం వచ్చిందో, ఆ వ్యక్తిని అసలు లెక్కచేయమని పైకి అన్నా, వ్యక్తపరచని కోపం మనల్ని నియంత్రిస్తుంది. లోపల మండిపోతూ, పైకి మాత్రం ప్రశాంతంగా, మంచివాడిగా ఉండడమన్నది కపటానికి గొప్ప నిదర్శనం. ఈ విధంగా హృదయంలో వంచన ప్రారంభమై, మన నైతిక జీవనాన్ని నాశనం చేస్తుంది. మానసిక తత్త్వశాస్త్రంలో దీనికొక ఉదాహరణ తరచూ చెబుతారు. ఒక త్రాగుబోతు వాని కొడుకు, తన తండ్రి త్రాగుబోతు అని అంగీకరించకపోవచ్చు. తండ్రి మద్యం త్రాగి క్రింద పడిపోతే, అనారోగ్యం వల్ల ఆయన ఆ విధంగా పడిపోయాడని ఇతరులు నమ్మాలని అతని కొడుకు అనుకుంటాడు. అంతే కాదు, తన తండ్రి అనారోగ్యానికి మందులు వేసుకున్నాడని కూడా అనవచ్చు. వాస్తవాన్ని అంగీకరించలేక దానిని పెడదోవ పట్టిస్తాడు. ఇదే విధంగా మన మనస్సు కూడా జీవిత సమస్యల నుండి తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులను, మార్గాలను అవలంబిస్తుంది. పైన చెప్పిన దానికి వ్యతిరేకమైనది నిష్కాపట్యం. మనస్సులో ఉన్నదే చెప్పగలగడం, చెప్పిందే చేయగలగడం మనస్సు యొక్క మంచి లక్షణం. దృఢమైన మనస్సే ఇలా చేయగలదు. ఆ విధంగా సమన్వయమైన మనస్సు ఎలాంటి సందిగ్ధాలకూ లోనుగాక ప్రశాంతంగా ఉంటుంది.  కాబట్టి మనిషి ఎప్పుడూ నిష్కపటంగా తన సమస్యలను అంగీకరిస్తూ వాటిని అధిగమించాలి. అంతేకానీ తనకు సమస్య లేదని బయటకు చెబుతూ సమస్య నుండి పారిపోకూడదు.                                     ◆నిశ్శబ్ద.
Publish Date: Nov 19, 2024 10:30AM

మీ ఆర్థిక సంవత్సరం ఎలా ఉంది??

ఏముంది  జీవితంలో నెలనెలా సంపాదన, ఖర్చులు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అంటూ మార్చ్ ఫాస్ట్ కొడుతూ ఉంటాయి. ఇది ప్రతి నెలా ఉండేదే అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అని అనిపించవచ్చు. అయితే  ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సంవత్సర ముగింపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉంటుంది. ఈ మార్చ్ నెలలోనే బడ్జెట్ లు నిర్ణయించబడతాయి.  పన్నులు, ఖర్చులు, మిగులు, ఆదాయం, నిధుల కేటాయింపు ఇలా అన్నిటికీ ఈ మార్చ్ నెల మూల కేంద్రకంలా ఉంటుంది.   ప్రభుత్వాలు ఆర్థికపరంగా సాగడానికి ఈ ప్రణాళికలు ఎంత మేలు చేస్తాయో దీని వల్ల అర్థమవుతూనే ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఇలాంటి ఆర్థిక ప్రణాళిక ఒకటి ఎందుకు ఏర్పాటు చేశాకోకూడదు అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది?? కుటుంబానికో అర్గిక ప్రణాళిక!! ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం చాలా వరకు అందరి విషయంలో జరుగుతూ ఉండేవి అయినా అవన్నీ అనుకోవడంతోనే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నోటి లెక్కల్లో ఆర్థిక సంస్కరణలు లాగే కుటుంబాలే బోలెడు. అలాంటి కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఒక స్లోగన్ పట్టుకోవాలి, ఆ స్లోగన్ ప్రకారం దారి మార్చుకోవాలి.  కొత్తకొత్తగా ఉన్నదీ!!  నిజంగానే కొత్తగా ఉండాలి, అప్పుడు అలాగే పాడుకోవచ్చు, ఆర్థిక ఖంగారులు లేకుండా ఆస్ట్రేలియాలో గంతులేసే కంగారుల్లా ఉల్లాసంగా ఉండచ్చు.  ప్రతి ఒంట్లో సంవత్సరం వారీ పెద్ద పెద్ద ఖర్చుల సందర్భాలు మామూలుగానే వస్తుంటాయి. వాటిలో మొదటి ప్రాధాన్యత పిల్లల చదువు"కొనడానికి" అదే అదే చదువు కోసం పెట్టె ఖర్చు అన్నమాట. ఏడాదికో మారు పిల్లల ఫీజు, పుస్తకాల ఖర్చు మొదలైనది. ఆ తరువాత ఇన్సూరెన్స్ ల కహానీ. ఏడాదికోసారి ఇంట్లో ఇన్సూరెన్స్ కట్టే సమవమ్ వచ్చినప్పుడు మధ్యతరగతి జీవులు పడే తంటాలు అంతా ఇంతా కావు. ఈ ఇన్సూరెన్స్  ల కోసం నెలవారీ సంపాదనలో కొద్దిగా ముందుజాగ్రత్తగా తీసిపెడుతుంటే సంవత్సరానికోసారికి పడే టెన్షన్ హుష్ కాకి. పండుగలు, పుట్టినరోజులు అన్ని ఇళ్లలో తీసుకొచ్చే సందడి ఎంతో గొప్పది. అయితే చాలామంది అలాంటి సందడిని కాస్త అసంతృప్తితోనే గడిపేస్తూ ఉంటారనేది నిజం. బాగా డబ్బున్న వాళ్లే ఇలాంటి సంతోషాల్ని ఆర్థికంగా కూడా ఆస్వాదించగలుగుతారు. ఒకప్పుడు ఉన్నదాంతో తృప్తిపడటమనే మాటను పెద్దలు చెప్పి, పాటించేవాళ్ళు, అదే వాళ్ళ పిల్లలకి వచ్చింది. కానీ ఇప్పట్లో ఉన్నదాంట్లో తృతీ పడాలి అనే మాట వింటే కాంప్రమైజ్ అవుతున్నట్టు, తమని తాము మోసం చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు కాబట్టి ఇప్పట్లో తృప్తి లభించాలి అంటే ఆర్థిక స్థాయిలు ఎక్కువగానే ఉండాలి. పొరపాట్లు తలపోట్లు!! చాలామంది ఆర్థిక పరంగా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన ప్లానింగ్ లేకుండా చాలా ఖరీదైన వస్తువులు ఇన్స్టల్మెంట్ లలో  కొనడం, వడ్డీ శాతం గురించి సీరియస్ నెస్ లేకుండా బంగారు నగలు తాకట్టు పెట్టడం, కారణం లేకుండా షాపింగ్ చేయడం, సరదాకు, మోహమాటాలకు వేల రూపాయల ఖర్చులు చేసేయ్యడం. సాధ్యాసాద్యల ఆలోచన లేకుండా అప్పులు చేయడం. ఇలాంటి వాటి వల్ల ఉన్న కాసింతలో సర్దుకుపోవడం అనే తృప్తి కూడా ఉండకుండా దూరమైపోతుంది. అలాంటి ఇబ్బందుల అసంతృప్తులు ఇంట్లో ఒకరిమీద మరొకరు చూపించుకుంటూ తలపోటు తెచ్చుకుంటారు. ఆర్యోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాని అందరూ దాన్ని కొంటున్నారు. రెండింటికి తేడా ఏంటి అంటే?? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, శారీరక వ్యాయాయం ఉంటే ఆరోగ్యమదే మెరుగుపడుతుంది. కానీ అవేమీ లేకుండా లైఫ్ స్టైల్ ను మార్చుకోకుండా కృత్రిమ మందులు వాడితే ఆరోగ్యం బాగైపోతుందని ప్రోయిన్లు, వితమిన్లతో సహా అన్నిటినీ టాబ్లెట్స్ రూపంలో కొని వాడితే ఆయుష్షు తగ్గుతుంది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ లలో ఒకో శాఖకు ఇంత అని నిధులు కేటాయించినట్టు. మనము కూడా మన సంపాదనను అనుసరించి విద్య, ఆరోగ్యం, వైద్యం, సంతోషాలు, ప్రత్యేకతలు వంటి వాటికి ప్రధాన్యతలు ఇచ్చుకుంటూ ఉంటే మన సంవత్సరం కూడా ఆర్థిక భరోసాతో నడిచేస్తుంది.  ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తమ సంపాదనతో తృప్తి పడేవాళ్ళు అన్నిటినీ హ్యాండిల్ చేసుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.  
Publish Date: Nov 18, 2024 10:30AM

హనీమూన్ వెళ్తే ఈ 5 తప్పులు చేయకండి.. మీ లైఫ్ ఖతం..!

పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు  అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం,  బంధువులకు దూరంగా.. కొత్త జంట  ఒకరినొకరు తెలుసుకోవటానికి,  అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన  సమయం పొందుతారు. అది ప్రేమ వివాహమైతే  వేరే విషయం. కానీ పెద్దలు  కుదిర్చిన వివాహమైతే భార్యాభర్తలు కలిసి గడిపేందుకు, వారు ఒకరినొకరు తెలుసుకునేందుకు  ఇదే తొలి అవకాశం అవుతుంది. సాధారణంగా హనీమూన్ అనేది శారీరక సంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అయితే మొదటి సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంట మధ్య చాలా  లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగితే వారి వైవాహిక జీవితం  సంతోషంగా ఉండటానికి బదులు, కొత్త జీవితం కాస్తా కలతలకు నిలయంగా మారుతుంది.  హనీమూన్ లో కొత్తజంట చేయకూడని 5 తప్పులేంటో తెలుసుకుంటే.. పెళ్లిలో జరిగిన తప్పులను ప్రస్తావించొద్దు.. పెళ్లి అన్నాక ఏవో ఒక చిన్న లోటు పాట్లు, తప్పులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.  రెండు వైపుల నుండి వాదనలు, అభిప్రాయ బేధాలు ఏర్పడి  ఉండవచ్చు. కానీ హనిమూన్ కు వెళ్లినప్పుడు ఈ విషయాలను కొత్త జంట చర్చిస్తూ కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏకాంతంగా గడిపి, గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాల్సిన సమయంలో జరిగిన గొడవల గురించి  అస్సలు మాట్లాడొద్దు. ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. హనిమూన్ అనగానే ముందుగానే అక్కడ అలా ఉండాలి, ఆ సమయం ఇలా గడవాలి వంటి విషయాలను ముందుగానే అంచనా వేసుకోకూడదు. కేవలం హనిమూన్ ప్లాన్ మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరి సహకారం మీద, అక్కడి వాతావరణం మీద మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందే ఏదేదో ఊహించుకుని ఆ తరువాత డిజప్పాయింట్ అవ్వకూడదు. గతాలు వద్దూ.. ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది తమ గతం గురించి చెబుతుంటారు. గతంలో ఎవరితోనైనా ప్రేమ, వారితో రిలేషన్షిప్, స్నేహం, వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఇలాంటివి ప్రస్తావించకూడదు.  ముందు ఏం జరిగిందో అనే విషయాలు మనసు నుండి తీసేయడం మంచిది. కొత్త భాగస్వామితో జీవితాన్ని కొత్తగా సంతోషంగా ప్రారంభించాలి. వాదన వద్దూ.. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరనే మాట ఎంత వాస్తవమో... ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు  ఒకేలా ఉంటాయనే మాట అంతే వాస్తవం.  హనీమూన్ లో ఇద్దరు వ్యక్తుుల విభిన్న ఆలోచనలు, ఇష్టాలు, నిర్ణయాలు గొడవలకు, వాదనలకు కారణం కాకూడదు. ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినా అది గొడవగా మారకముందే దాన్ని ఆపేసి కాసేపు మౌనంగా ఉండటం మంచిది. గదికే పరిమితం కావద్దు.. హనీమూన్ కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి వెళ్లి తీరా ఆక్కడికి వెళ్లాక అక్కడ కేవలం మీకు కేటాయించిన గదిలోనే ఉండిపోకూడదు.  అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను, వాతావరణాన్ని, సంస్కృతిని గమనించి, అర్థం చేసుకుని, జీవితానికి వాటిని అన్వయించుకుంటే మీ జీవితంలో హనీమూన్ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.                                           *నిశ్శబ్ద.
Publish Date: Nov 16, 2024 10:30AM

దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని అందించిన గురునానక్ జయంతి నేడు..!

  దారి తప్పినప్పుడల్లా మనల్ని సన్మార్గంలో నడిపించటానికి గురువు అవసరం. అలాంటి గొప్ప గురువులలో ఒకరైన గురునానక్ జయంతి నేడు. గురునానక్ జయంతి సిక్కులకి అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి.  సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతినీ  ఒక పండుగలా జరుపుకుంటారు.  సిక్కులకే కాకుండా గురునానక్ బోధనలు  ప్రజలందరికీ, మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విలువలు నేర్పిస్థాయి. ఈ రోజును గురు పురబ్, గురునానక్ ప్రకాశ్ ఉత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుగుతుంది. ఈ సంవత్సరం గురునానక్ 555వ జయంతి జరుపుకుంటున్నారు. గురునానక్ 1469 లో తల్వండిలో జన్మించి, చిన్న వయస్సులోనే  ఆధ్యాత్మికత పట్ల లోతైన ఆసక్తి కనబర్చారు. ఇతరులకి సాయం చేయాలనీ ఆయనకు ఎక్కువగా ఉండేది. భారతదేశంలో ఆధిపత్యం వహించిన కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతం ముందడుగు వేసింది. గురునానక్ స్థాపించిన సిక్కిజం, వినయాన్ని, సేవను, దేవుని పట్ల భక్తిని ప్రోత్సహించే దిశగా సాగింది.  గురునానక్ జయంతి ప్రాముఖ్యత .. గురునానక్ జయంతి అంటే కేవలం గురునానక్ కు నివాళి కాదు, అది ఆయన బోధనలకు ఇచ్చే గౌరవం. ఇది విశ్వ సోదరభావం, కరుణ,  సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. సిక్కులకు, గురునానక్ ప్రతిపాదించిన ఏకమతం, భక్తి సూత్రాలను గుర్తు చేస్తుంది. "ఇక్ ఓంకార్" అంటే ఒకే దేవుడు ఉన్నాడు అనేది ఆయన సందేశం.  సిక్కిజానికి ఈ సందేశం కేంద్ర బిందువుగా ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఏకదైవవాద దేవుని ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఆయన బోధనలు గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరిచారు.  గురునానక్ జయంతి ఎలా జరుపుకుంటారు? గురునానక్ జయంతిని భారతదేశంలోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  సిక్కు ప్రజలందరూ గొప్ప ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ‘అఖండ్ పాఠ్’, అంటే గురు గ్రంథ్ సాహిబ్  నిరంతర 48గంటల పఠనం గురుద్వారలో ప్రారంభమవుతుంది. భక్తులు తెల్లవారుజామున ప్రార్థనలు, ‘నగర కీర్తన’  అని పిలువబడే ఊరేగింపులో పాల్గొంటారు, ఇందులో గురుగ్రంథ్ సాహిబ్‌ని ఒక పల్లకిలో ఉంచి వీధుల్లో తీసుకువెళతారు. ఊరేగింపు సమయంలో కీర్తనలు, సిక్కు యోధులు నిర్వహించే ‘గత్కా’  అనే యోధకళా ప్రదర్శనలు ఉంటాయి. ‘లంగర్’, అంటే ఉచిత సామూహిక భోజనం.  ఈ వేడుకలో ఇదే ప్రధాన భాగం. మతం, కులం లేదా లింగం ఇలా ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే లంగర్, గురునానక్ విలువలైన  సమానత్వం, సేవా గుణాలను  ప్రతిబింబిస్తుంది.  గురు నానక్ బోధనలు.. గురునానక్ బోధనలు సులభంగ ఉంటూనే లోతైన అర్థం కలిసి ఉంటాయి.  అన్ని విశ్వాసాల ప్రజలకు సంబంధించినవి. ఆయన బోధనలలో ప్రధానంగా మూడు సూత్రాలు ఉన్నాయి:   దేవుని పేరును జపించడం  ‘నిజాయితీగా సంపాదించడం ఉన్నది ఇతరులకు కొంత పంచడం.  ఇలా..  వినయము, నిజాయితీ,  దయతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. ప్రజలంతా  దేవుని దృష్టిలో సమానమని, కులం వ్యవస్థ, లింగ వివక్ష వంటివాటిని తిరస్కరించారు.  గురునానక్ బోధనలు  ప్రుజలలో  దయ, సేవాభావం కలిగి ఉండాలని, దేవుని పట్ల భక్తితో జీవితం గడపాలని మార్గనిర్దేశం చేస్తాయి. గురునానక్ జయంతి మనకు సహనం, దానం, గౌరవించటం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని చెప్పకనే చెబుతుంది.                                      *రూపశ్రీ   
Publish Date: Nov 15, 2024 10:30AM

ఇతరుల సొమ్ముపై అత్యాశ పడితే ఏమౌతుందో తెలుసా?

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో పురోగతి కోసం అనేక ఆలోచనలను అందించాడు. వాటిలో ఒకటి మరొకరి సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో ఉండకూడదు. ఒక వ్యక్తి దురాశతో ఇతరుల డబ్బుపై చెడు కన్ను వేయకూడదు. అది ఇతరుల సంపదపైనా లేదా డబ్బుపైనా, మనం దానిపై చెడు దృష్టి పెడతాము. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇతరుల సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాము...? ఇప్పుడు తెలుసుకుందాం. ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది: చాణక్యుడు ప్రకారం, మితిమీరిన అత్యాశతో ఉన్న వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను లేదా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. జీవితంలో చాలా నష్టాలను భరించవలసి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇతరుల సంపదపై: ఆచార్య చాణక్య మనం ఎప్పుడూ ఇతరుల సంపదపై అత్యాశకు గురికాకూడదు. దేవుడు మనకు ఇచ్చిన దానితో మనం సంతృప్తి చెందాలి. మరి వారిలాగా ప్రగతి సాధించేందుకు కృషి చేయాలి. ప్రాణాపాయం: ఇతరుల సంపదపై అత్యాశతో ఉండటం ప్రమాదానికి దారి తీస్తుంది. మితిమీరిన కోరికతో ఇతరుల సంపదను అపహరించడానికి చెడు మార్గాలను ఆశ్రయించవలసి ఉంటుంది. దీని వల్ల మీరు మీ జీవితాన్ని కోల్పోవచ్చు. మనిషి జీవితంలో ఏది లభించినా దానితో సంతృప్తి చెందాలని చాణక్యుడు చెప్పాడు. మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే మనం సంతృప్తి చెందగలం, ఇతరుల డబ్బును దోచుకోవడం లేదా వారి డబ్బు కోసం అత్యాశతో కాదు.                                                 
Publish Date: Nov 15, 2024 10:30AM

బాలల వికాసమే మంచి సమాజ నిర్మాణానికి మూలం..!   

  సమాజమైనా, దేశమైనా, ప్రపంచమైనా అభివృద్ధి చెందాలంటే  పూలమొక్కల్లాంటి పిల్లల్ని మనం చక్కగా కాపాడుతూ, వారిని విలువలవైపు నడిపిస్తూ, వారిలో అవకాశాలన్నీ అందిపుచ్చుకునే సామర్ధ్యం పెంచాలి. అప్పుడే ఈ లోకం అందమైన పూలతోటలా విస్తరిస్తుంది.  ఇదే నిజాన్ని పండిట్ జవహార్లాల్ నెహ్రూ నమ్మి, వారిని దేశ భవిష్యత్తుగా భావించి, వారి వికాసం కోసం కృషి చేశారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్14 తేదీన, సమాజానికి బాలల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వారి మౌలిక హక్కుల రక్షణకు ప్రతిజ్ఞ చేస్తూ జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము.  ఈ రోజు పిల్లల అభిరుచులు, అభివృద్ధి, వారి హక్కులు, అవసరాలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో పిల్లలు దేశ భవిష్యత్తు. అందుకే వారి విద్య, సురక్ష, ఆనందంపై మనం కృషి చేయాలి. ప్రతి చిన్నారి భయపడి కాకుండా తన కలల్ని నిజం చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని ఆయన ఆశించారు. చిన్నారుల జీవితాలు ఆనందమయం కావడం మనందరి బాధ్యత. ఈ రోజు మన చిన్నారులకు ప్రేమ, అవగాహన, స్నేహం చూపించి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలి. అలాగే సమాజంలో పిల్లలు ఎదుర్కునే సమస్యల గురించి కూడా అర్థం చేసుకోవాలి.  చిన్నారులు ఎదుర్కొనే సవాళ్ళు.. బాలల దినోత్సవం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనే సవాళ్లను కూడా ముందుకు తీసుకువస్తుంది, వీటిలో పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ కొరత, శిశు కార్మికత్వం వంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా  తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలు, పాఠశాలకు వెళ్లాల్సింది పోయి చిన్న వయసులోనే పని చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాలల దినోత్సవం  ఈ సవాళ్లను పరిష్కరించేందుకు అవగాహన పెంపొందించడమే కాకుండా, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడం కోసం అందరూ కలసి చేపట్టవలసిన చర్యలను ప్రోత్సహిస్తాయి. బాలల ప్రాథమిక హక్కులు.. బాలల  దినోత్సవంలో  ప్రధానంగా  ఉన్నది  విద్యకున్న  ప్రాముఖ్యత  తెలియచేయటం.  పేదరికం  నుంచి బయటపడేందుకు, పిల్లలకు మంచి విద్య అందించడమే కీలకమైన మార్గం. పిల్లల నేపథ్యమేదైనా సరే, వారికి విద్య అనేది మౌలిక హక్కుగా పరిగణించబడుతోంది. పాఠశాలలు, చాలా సంస్థలు విద్యను సరదాగా నేర్చుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తాయి. విద్యతో పాటు, ఆట కూడా పిల్లల అభివృద్ధిలో విలువైన పాత్ర పోషిస్తుంది. వినోదాత్మక కార్యక్రమాలు, ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు పిల్లల సృజనాత్మకతను, సామాజిక నైపుణ్యాలను వెలుగులోకి తెస్తాయి. ఈ సంఘటనలు పిల్లలకు  అభివృద్ధి అనుభవాన్ని కలిగిస్తాయి. పిల్లల ప్రతిభ.. బాలల   దినోత్సవం   పిల్లల  ప్రతిభను గుర్తించి  ప్రశంసించే గొప్ప అవకాశం. పాఠశాలలు, వివిధ సంస్థలు తరచుగా టాలెంట్ షో,  కళా ప్రదర్శనలు  వంటి   కార్యక్రమాలను   నిర్వహిస్తాయి. ఈ   గుర్తింపు   పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి, తమ అభిరుచులు, ఆసక్తులను  అనుసరించేలా  ప్రోత్సహిస్తుంది. డిజిటల్ భూతంతోజాగ్రత్త.. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు ఆన్‌లైన్ భద్రత కలిగి ఉండాలని నేటి బాలల దినోత్సవం నొక్కి వక్కాణిస్తోంది.  పిల్లలు ఎక్కువగా డిజిటల్  ప్లాట్‌ఫారమ్‌లతో  గడుపుతున్నారు.  స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, సిస్టమ్ వంటివి పిల్లలకు ఆటవస్తువులు అయిపోయాయి. అయితే వీటి వల్ల  కలిగే ప్రమాదాలు, ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం.  చివరిగా పెద్దలుగా మనం చేయాల్సిన పనేంటంటే, పిల్లల అభిరుచులు, ఆసక్తులు,  వారి భవిష్యత్తు నిర్మాణం మన కర్తవ్యంగా భావించి, ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడే దేశం ప్రగతిపథంవైపు వెళ్తుంది.                              *రూపశ్రీ   
Publish Date: Nov 14, 2024 10:30AM

మన కష్టమే పిల్లలకు ఆదర్శం!

  పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి! ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు. ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు. ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. - నిర్జర.
Publish Date: Nov 14, 2024 10:30AM

భవిష్యత్తును శాసించే బాలలు...

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన పుట్టిన రోజును బాలల దినోత్సవం పేరిట జరుపుకుంటారు. నిజానికి ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. కానీ భారతీయులు మాత్రం నవంబర్ 14న జవహార్ లాల్ నెహ్రూ జయంతి రోజునే జరుపుకుంటున్నాం. దీనికి కారణం జవహార్ లాల్ నెహ్రూ బాలబాలికల విద్యను ఎంతగానో ప్రోత్సహించారు.  తమ విద్యకు ఆయన అందించిన ప్రోత్సాహానికి పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకుని తమ ప్రేమను చాటుకున్నారు.  నవంబర్ 14వ తేదీనే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పిల్లలకూ కొన్ని హక్కులున్నాయని, ఆ హక్కులకు అనుగుణంగా  వారు జీవించాలని బాలల దినోత్సవం నొక్కి చెబుతుంది. అంతే కాదు.. సమాజంలో పిల్లలకు విద్య అందడం నుండి వారి సంక్షేమం వరకు చాలా విషయాల గురించి ప్రభుత్వాలు చర్చిస్తాయి. పసిడి నవ్వుల చాచాజీ.. పుట్టినరోజు ఈ రోజు పిల్లల పండుగ ఈ నాడు ఈ గేయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. జవహార్ లాల్ నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచాజీ అని పిలుస్తారు. దీనివెనుక కారణం.. భారత్  బ్రిటీషర్ల చేతుల్లో నలిగి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ దేశాన్ని సరైన మా్ర్గంలో నడిపించే ఉద్దేశ్యంతో నెహ్రూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాల అనుగుణంగా ఆయన నిరంతరం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి వచ్చేది. ఆయనకు స్వతహాగా పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎనలేని మక్కువ. ఈ కారణంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవాడు, వారిని దగ్గరకు తీసుకునేవాడు. దీంతో పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూకు గులాబీలంటే మక్కువ అని తెలిసి గులాబీ పువ్వులతో ఆయన్ను చుట్టుముట్టేవారు. అలా పిల్లలకు ఆయన పట్ల ప్రేమాభిమానాలకు గుర్తుగానూ, పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానూ ఆయన జయంతిని  బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈరోజున ఏం చెయ్యచ్చు.. పిల్లలకు కూడా రాజ్యంగంలో కొన్ని హక్కులున్నాయని చదువుకుంటూనే ఉన్నాం. కానీ నిజానికి పిల్లలకున్న హక్కుల గురించి  తెలిసిన వారు చాలా తక్కువ.  బాలల దినోత్సవం రోజున ఈ హక్కుల గురించి చర్చించి పిల్లలు వాటిని ఉపయోగించుకునేలా చేయాలి. చాలామంది పిల్లలకు విద్య, ఆహారం, స్వేచ్చ లభించడం లేదు. ఇటువంటి పిల్లలను గుర్తించి వారిని వారికి న్యాయం జరిగేలా చేయాలి. పిల్లలలో లింగ సమానత్వం పాటించాలి. మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అనే చాదస్తపు ఆలోచనలు వదిలి పిల్లలను సమానంగా పెంచాలి. ఉరుకులు పరుగుల ఉద్యోగాల కాలంలో పిల్లలను పట్టించుకోవడం గురించి ఆలోచించాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడాలి, ఆలోచనలు పంచుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో స్నేహితుల మాదిరిగా ఉండాలి. అలా ఉంటే పిల్లలు ఉత్తమ పౌరులుగా అభివృద్ది పెంచుతారు. తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారు. బడి వయసు పిల్లలను బడికి వెళ్లేలా చేయడం, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట గుర్తుంచుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల విషయంలో బాధ్యతగా ఉండాలి.                                                     *నిశ్శబ్ద.
Publish Date: Nov 14, 2024 10:30AM

జీవితం బాగుండాలంటే..  ఈ 8 రకాల వ్యక్తులను అస్సలు నమ్మకండి.. !

  “నమ్మకం”  మూడక్షరాల ఈ మాట మన జీవితంలో చాలా విలువైనది. మన జీవితంలో ఏ బంధమైనా నిలబడాలంటే దానికి పునాది నమ్మకమే. మన ఇంట్లోవారయినా, స్నేహితులైనా, బంధువులైనా ఎవరితోనయినా మన ప్రయాణం సాఫీగా సాగాలంటే వారికీ, మనకీ మధ్య నమ్మకమనే గట్టి దారం కలపబడి ఉండాలి.  నమ్మకమనేది  సంపాదించుకోవాలి తప్ప బలవంతం మీద పొందలేము.  మనం జీవితంలో  ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలిసుండటం చాలా ముఖ్యం. అలా సైకాలజీ ప్రకారం మనం నమ్మకూడని 8 రకాల వ్యక్తులున్నారట.  వీరిని అసలు నమ్మకూడదని మానసిక విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ వీళ్ళేవరంటే.. స్వార్థపరులు: ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ‘నేను, నేను మాత్రమే’ అనే మనస్తత్వం  కలిగి ఉంటారు. వీళ్ళను నార్సిస్టులు అని అంటారు.  ఇతరుల భావాలు, అవసరాలు గురించి వీళ్లకు పట్టదు. వాళ్ళ అహాన్ని సంతృప్తిపరుచుకోవటం కోసం అవతలి వాళ్ళ మీద నింద వేయటానికి కూడా వెనుకాడరు.   అబద్ధాలు చెప్పేవారు: అబద్ధాలు చెప్పడం  కొందరికి అలవాటుగా ఉంటుంది. ప్రతివిషయనికి అబద్దం చెప్పి సింపుల్ గా విషయాన్ని దాటవేయడం, తప్పించుకోవడం చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు  బంధానికి అవసరమైన నిజాయితీ, సమగ్రతలు ఉండవు.  తమ వ్యక్తిగత లాభాల కోసం ఇతరులని తరచూ తప్పుదోవ పట్టించటానికి అబద్ధాలు చెప్తుంటారు.  వీళ్లకు దూరం ఉంటే మేలు..   అధికార ధోరణి: తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులు చేసే పనులని, నిర్ణయాలని నియంత్రించి వారికి అనుకూలంగా మార్చుకునే  నైపుణ్యం కలిగి ఉంటారు. వీరిని మానిప్యులేటర్లు అని చెప్పవచ్చు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులని ఎలాగైనా తప్పించుకోవాలి. బాధితుల్లా ప్రవర్తించేవారు: ఎల్లప్పుడూ తమని తాము బాధితులుగా చూపించుకోవాలనుకునే వ్యక్తులు వారివల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా  వారు చేసిన పనులకి, వారన్న మాటలకి జవాబుదారీతనం తీసుకోరు. ఎప్పుడు సింపతీ పొందడానికి కథలు అల్లేస్తారు..  వీరి స్వార్ధం వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు. అసూయపడేవారు: ప్రతిదానికీ ఇతరుల్ని చూసి అసూయపడే వ్యక్తులు నమ్మదగినవారు కాదు. వారు ఇతరుల విజయాలకి,  సంతోషానికి మనస్ఫూర్తిగా మద్ధతునివ్వరు, అభినందనలు చెప్పరు. వారిలో ఉన్న అసూయ వల్ల ఇతరులకి హాని కలిగించవచ్చు. నిబద్ధత లేని వ్యక్తులు: జీవితంలో ఎలాంటి కట్టుబాట్లు, పద్ధతులు లేకుండా ఉండే వ్యక్తులకి   బంధాల పరంగానైనా, పని విషయంలోనైనా  నిబద్ధత ఉండదు. వీరికి స్థిరత్వం, జవాబుదారీతనం ఉండదు. ఇలాంటి వాళ్ళను నమ్మితే నట్టేట మునిగినట్టే.. సానుభూతి లేని వ్యక్తులు: సానుభూతి చూపించడం  ఇతరుల కష్టాన్ని, బాధను తగ్గించడంలో సహాయపడుతుంది.  మనం మనుషులమనే సమైక్య భావాన్ని కలిగిస్తుంది. కష్టాలను, బాధలను, ఇబ్బందికర పరిస్థితులలో ఉన్న మనుషులను చూసి కూడా సానుభూతి  చూపలేని వ్యక్తులు చాలా స్వార్ధపరులని అర్థం.  వీరు తమ,పర భేధాలు చూపిస్తారు. ఆకర్షణ చూపించే వ్యక్తులు: అధికంగా ఆకర్షించాలని ప్రయత్నించే వ్యక్తులు తరచూ వాస్తవం బయటపడకుండా,  అసలు ఉద్దేశాన్ని లోపల కప్పి ఉంచుతారు. అలాంటి వ్యక్తులు తాము  కోరుకున్నది అవ్వటం కోసం ఇతరులతో మృదువుగా మాట్లాడటం, వారిని మెప్పించే పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కూడా నమ్మకూడదు.                          *రూపశ్రీ.
Publish Date: Nov 13, 2024 10:52AM

మానవత్వం నిలబడాలంటే.. దయ చూపించడానికి మించిన గొప్ప మార్గం ఉందా?

   ఈ సమాజం ప్రశాతంగా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని గుణాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో ప్రేమ, క్షమ, దయ, జాలి అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కలిగి ఉన్నవారినే మానవత్వం కలిగిన మనుషులు అని కూడా అంటారు.  సమాజంలోని ప్రతి వ్యక్తిలో  దయ, మంచితనాన్ని ప్రోత్సహించడానికి, ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించడానికి, తద్వారా సమాజంలో మంచి  మార్పును తీసుకురావటానికి ఒక ప్రత్యేక రోజును కేటాయించారు.  నవంబర్ 13వ తేదీన వరల్డ్ కైండ్నెస్ డే గా జరుపుకుంటారు. దయ అనే గుణం ప్రతి మనిషిలో ఉన్న ప్రత్యేకమైన  లక్షణం. ఈ గుణం మనలో అభివృద్ధి చెందినంతగా  ఏ జీవిలోనూ వృద్ధి చెందకపోవచ్చు.  అందుకే ఇది మనల్ని  భూమి మీద ఉన్న ఇతర జీవులలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆ సమాజంలో అనుకరణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  పిల్లలు తల్లిదండ్రులను చూసి కొన్ని ఎలాగైతే అనుకరిస్తారో.. సమాజంలో కొందరి ప్రవర్తన చూసి మరికొందరు కూడా అనుకరిస్తారు.  ఈ విధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే గుణాలలో దయ గుణం కూడా ఉండాలన్నది వరల్ట్ కైండ్నెస్ డే ముఖ్య ఉద్దేశం.   దీని ఫలితంగా ప్రజల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి.  ఇతరుల పట్ల దయతో ఉండమని పిల్లలకి చిన్నప్పటినుంచే చెప్తూ ఉంటే, వారిలో ఇది బలంగా మారి మంచి సమాజ నిర్మాణానికి పునాది అవుతుంది. ఒక వైద్యుడు తన రోగుల పట్ల, ఒక అధికారి తన సిబ్బంది పట్ల, ఒక కుటుంబ పెద్ద తనపై ఆధారపడి ఉన్నవారి పట్ల  దయ చూపకపోతే పరిస్థితులు ఎలా  ఉంటాయో ఒక సారి ఊహిస్తే జీవితంలో ఇలాంటి పరిస్థితులు వద్దే వద్దు అనే భావన కలుగుతుంది. మనిషికి మరొక మనిషి మీద ఈ జీవకోటి మీద  దయ లేకపోవడం వల్ల కుటుంబం, వ్యవస్థ, సమాజం మీద చాలా చెడు ప్రభావం పడుతుంది. అదే మన చుట్టూ ఉన్నవారిపై దయతో ఉండటం, ఇతరుల పట్ల నిస్వార్థంగా దయను చూపించడం వల్ల సమాజంలో సామరస్యం పెరుగుతుంది. చిన్న సాయం కూడా ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక చిన్న  చిరునవ్వు కూడా ఎదుటి  వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి కాస్త ధైర్యం పోగవుతుంది.  ఒకరు సహాయం చేసినప్పుడు, ఇతరులు సైతం దానిని ప్రేరణగా తీసుకుని మరిన్ని మంచిపనులు చేయాలని కోరుకుంటారు. ఈ దయాగుణం పెరగటం వల్ల మనుషులు కుల, మత, ప్రాంత, లింగ భేధాలతో ఒకరికొకరు వేరుపడకుండా..   వారిలో ‘నేను’, ‘మేము’ అనే భావాలు తొలగి, ‘మనం’ అనే విశాల భావం కలుగుతుంది. అప్పుడు ఈ  సమాజంలో అందరూ ఒకరికొకరు సాయంగా ఉంటూ  కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఈ భూమి మీద మనకెంత హక్కు ఉందో, మిగతా ప్రాణులకీ అంతే ఉందని గుర్తించి గౌరవిస్తారు. దాంతో  ఈ    ప్రపంచం మరింత అందంగా మారుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా దయ చూపించడానికి మించిన  గొప్ప మార్గం మరొకటి లేదని మర్చిపోకూడదు. చేసే సాయం  చిన్నదైనా , పెద్దదైనా దాని ప్రభావం కచ్చితంగా సమాజం మీద పడుతుంది. ప్రేమ, సహనం, సోదరభావం, పరస్పర గౌరవం, సహకారంతో కూడిన సౌమ్య వాతావరణాన్ని కల్పించడానికి మన రోజువారీ జీవితంలో ఇతరుల పట్ల, ఇబ్బందులలో ఉన్నవారి పట్ల,  జీవకోటి పట్ల దయ చూపించడాన్ని భాగం చేసుకోవాలి.  ఈ ప్రపంచంలో కూడా  బ్రతకడానికి పోరాటం చేస్తూ సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారు కోట్లాది మంది ఉన్నారు.  ఇలాంటి వారికి ఎల్లప్పుడూ ఓ అపన్న హస్తం కావాలి.  కేవలం దయా గుణం ఉన్నప్పుడే అపన్న హస్తం అందివ్వడం సాధ్యం అవుతుంది.  అందుకే  తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు,  ఇరుగు పొరుగు,   ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తాము దయా గుణాన్ని పలు సందర్భాలలో వ్యక్తం చేస్తూ పిల్లలకు కూడా దీన్ని అలవాటు చెయ్యాలి. అప్పుడే ఈ ప్రపంచం మానవత్వం కలిగిన మనుషులతో బలపడుతుంది.                            *రూపశ్రీ.
Publish Date: Nov 13, 2024 10:30AM

జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే జీవితం నాశనమే..!

  మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తుల్లో  సాధారణంగా  తల్లిదండ్రులు ఉంటారు.  తర్వాత జీవిత భాగస్వామి కూడా అంతే ప్రభావం చూపిస్తారు., వాస్తవానికి ఇంకా ఎక్కువనే చెప్పాలి. మూడొంతుల మీ జీవితం ఎలా ఉండబోతుందనేది   జీవిత భాగస్వామి మీదనే ఆధారపడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం మీకుండదు,  కానీ మీ జీవిత భాగస్వామి ఎవరనే  నిర్ణయం తీసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది.  ఈ నిర్ణయం జీవితంలో ఎవరికయినా  చాలా ముఖ్యమైనదే అవుతుంది. అందులో ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించి మరీ    జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  కొంతమంది తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి, తర్వాత  జీవితాంతం బాధపడుతుంటారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో పొరపాటున కూడా  చేయకూడని కొన్ని తప్పులేంటంటే కుటుంబ సభ్యుల ఒత్తిడి.. సాధారణంగా  పెద్దవాళ్ళు జీవితాంతం తోడుండే మన భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో సహాయపడతారు. కానీ ఒక్కోసారి ఆ పెద్దవాళ్ళ ఒత్తిడివలనే ఒక అమ్మాయైనా లేక అబ్బాయైనా తమకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తర్వాత జీవితాంతం ఇబ్బందిపడుతూ ఉంటారు. తొందరపడి నిర్ణయం తీసుకోవటం.. ఏ మనిషి గురించైనా అర్ధం కావాలంటే  సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కలిసి మాట్లాడినంత మాత్రాన ఎవరి గురించి ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. కాబట్టి సమయం తీసుకుని ఆ వ్యక్తి మనకి సరిపోతారా? లేదా? అని నిర్ణయించుకోవాలి తప్ప తొందరపడకూడదు. వేర్వేరు సంస్కృతులు కావటం.. వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయిల సంస్కృతుల మధ్య పూర్తి బేధం ఉంటే, వారి వివాహం అయ్యాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంస్కృతి కేవలం వ్యక్తులతో కాకుండా  సమాజంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమాజంవలనే  ఇరువురూ కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని ప్రభావం వివాహ బంధం మీద కూడా పడుతుంది.  ముఖ్యంగా ప్రేమ వివాహాలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక ఆకర్షణ లేకపోవటం.. ఈ సృష్టి గమనానికి ఆడ, మగ మధ్య ఆకర్షణ ఎంత ముఖ్యమో, వివాహ బంధం మరింత బలపడి ముందుకి వెళ్ళటానికి కూడా  భౌతిక ఆకర్షణ ఉండటం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి భౌతిక ఆకర్షణ లేకపోతే ఆ ఆకర్షణ వేరేవైపుకి మళ్లి, జీవితాలు నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఆర్థిక అవసరాల కోసం, పనులు చేసిపెట్టే మనిషి కావాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకునే వారి జీవితంలో ఇలాంటివి కనిపిస్తాయి. నమ్మకం లేకపోవటం.. సమాజంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం నిలబడాలన్నా నమ్మకం ఉండాలి. అదే భార్యాభర్తల మధ్యైతే  ఈ నమ్మకం ఇంకాస్త ఎక్కువే ఉండాలి. జీవిత భాగస్వామి మీద  నమ్మకం లేకపోతే ఆ వివాహబంధంలో ఎవరూ,  ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.   ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండకపోతే ఆ వివాహ  బంధం ఎక్కువ కాలం నిలబడదు.                                            *రూపశ్రీ 
Publish Date: Nov 12, 2024 10:30AM

పోలికల వల్ల కలిగే నష్టం ఏమిటి?

మనల్ని ఇంకొక మనిషి నుండి వేరు చేసేవి, ప్రత్యేకంగా ఉంచేవి  ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలకు తగినట్టే వారు పనులు చేస్తారు,దానికి తగ్గట్టుగా జీవిస్తారు. కానీ ఎప్పుడూ మనం ఉన్న స్థితినీ ఉండవలసిన స్థితినీ పోల్చి చూసుకుంటున్నాం. ఉండవలసిన స్థితి అనేది మన మనసు రూప కల్పన చేసినదే. సరిపోల్చి చూసుకోవడం అనేది ఎదురైనప్పుడు వైరుధ్యం వస్తుంది. ఏదో పరాయివస్తువుతో కాదు, నిన్నటి మనతో ఉన్నది, ఈరోజు మనతో ఉన్నదీ రెండింటినీ తరచి చూసుకున్నా అవి మనిషిలో ఎప్పుడూ సంఘర్షణను వెంటబెట్టుకొస్తాయి. పోల్చి చూచుకోవడం అనేది లేనప్పుడు ఉన్నది ఒక్కటే వుంటుంది. అది మనలో మనమే అయినా లేక ఇతరులతో అయినా పోలిక అనేది లేనప్పుడు మనలో ఉన్నది ఒక్కటే మనతో ఉంటుంది.  ఉన్నదానితో జీవించడమే ప్రశాంతంగా వుండడం, అప్పుడు మీరు మీ అంతరంగ స్థితికి మరే పరధ్యాసా లేకుండా పరిపూర్ణ సావధానత యివ్వగలరు. అది నిరాశ అయినా, వికారమయినా, క్రౌర్యం అయినా, భయం అయినా, ఆదుర్దా అయినా, ఒంటరితనం అయినా… ఇట్లా ఏదైనా సరే... దానితోనే పూర్తిగా సహజీవనం చేస్తారు. అప్పుడు వైరుధ్యం లేదు. కనుక సంఘర్షణ కూడా లేదు. కాని, ఎంతసేపు మనం ఇతరులతో మనను పోల్చి చూసుకుంటున్నాం. మనకంటే శ్రీమంతులు, మేధావంతులు, మరింత అనురాగపరులు, ప్రసిద్దులు, ఇలా ఎన్నో రకాలుగా మిన్న అయిన వారితో, 'మిన్న' అవడం మనల్ని నడుపుతుంది. మన జీవితాలలో అది గొప్ప ప్రాధాన్యం అయిపోతుంది. ఏదో ఒకదానితోనో, మనష్యులతోనూ పోల్చి చూసుకోవడం అనేది మనకు సంఘర్షణను తెచ్చి పెడుతున్న  ప్రథమ కారణం. అసలు పోల్చి చూసుకోవడం అనేది ఎందుకు జరుగుతోంది? మరొకళ్ళతో మిమ్మల్ని ఎందుకు పోల్చుకుంటారు? ఈ పని చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నారు కదా... ప్రతి పాఠశాలలోను యిద్దరు పిల్లలకు పోలిక. రెండో వానిలాగ వుండటానికి మొదటివాడు తనను తాను నాశనం చేసుకుంటాడు. అసలు సరిపోల్చి చూసుకోవడం అనేది లేనప్పుడు, ఆదర్శం అంటూ లేనప్పుడు, అవతలి పక్షం అనేది లేనప్పుడు, ద్వంద్వప్రవృత్తి లేనప్పుడు, మీకంటే విభిన్నమయిన వారుగా మీరు కనిపించాలని ప్రయత్నం చేయనప్పుడు మీ మనసు ఏమవుతుంది? మీ మనసు వ్యతిరేకమైన దానిని నిర్మించడం, ఎదురుగా పెట్టడం మానివేస్తుంది. అప్పుడది చాల తెలివిగా, పదునుగా, లలితంగా, అమిత శక్తివంతగా తయారవుతుంది.  ఎందుకంటే ప్రయత్న ప్రయాసల వలన మన గాఢాసక్తి చెదరిపోయి పలచబడుతుంది. జీవసత్త్వమే శక్తివంతమైన లక్షణం. ఈ సత్యం లేకుండా ఏ పని చేయలేరు.  ఇతరులతో పోల్చి చూసుకోవడం అన్నపని లేనప్పుడు, మీరు మీరుగా వుండిపోతారు. పోలిక వల్ల, మీరు పరిణమించాలనుకుంటున్నారు. ఎదగాలనుకుంటున్నారు. మరింత తెలివి కలవారు, సుందరులు అవాలనుకుంటున్నారు. కాని నిజంగా అలా కాగలరా? వాస్తవం ఏమిటంటే  మీరు ఉన్న స్థితి పోల్చి చూచుకోవడం వల్ల మీరు వాస్తవాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు. అది శక్తిని దుర్వినియోగం చేసుకోవడం.  ఎటువంటి పోలికలు లేకుండా, మీ నిజస్థితిని మీరు చూచుకున్నందువల్ల మీకు ఎంతో శక్తి సంపద ఒనగూరుతుంది. పోలికలు లేకుండా మీవంక మీరు చూసుకున్నప్పుడు మనసు తృప్తితో స్తబ్ధమయిపోయిందని కాదు అర్ధం మీరు పోలికలకు అతీతులు అయిపోతారు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవసరమయిన శక్తి,  జీవసత్త్వం ఎలా వృధా అయిపోతుందో మనకు తెలిసివస్తుంది. పోలికలు పెట్టుకోవడం జీవితంలో ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని కుచించుకునేలా చేయడమే అవుతుంది. అందుకే పోలిక మంచిది కానే కాదు.                                       ◆నిశ్శబ్ద.
Publish Date: Nov 11, 2024 10:30AM