పూరీ జగన్నాథ ఆలయంలో 22 మెట్ల రహస్యం!
పూరీ జగన్నాథ ఆలయంలో 22 మెట్ల రహస్యం!
ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం చాలా ప్రఖ్యాతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది విష్ణుమూర్తి యొక్క నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటి , ఆాలయం అద్బుతమైన వాస్తుశిల్పం ఒక ఎత్తైతే.. ఇక్కడ జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఇక ఆలయ ప్రధాన ద్వారం వరకు 22 మెట్లు ఉన్నాయి. వీటిని స్థానికంగా "బైసీ పహాచా" అని పిలుస్తారు. ఇవి సాధారణ మెట్లు కాదు... వీటి గురించి పూర్తీ వివరంగా తెలుసుకుంటే..
బైసీ పహదా ప్రాముఖ్యత..
భక్తులు ఆలయ గర్భగుడి చేరుకోవడానికి ముందు ఈ 22 మెట్లను ఎక్కాలి. హిందూ నమ్మకాల ప్రకారంఈ మెట్లను ఎక్కడం లౌకిక జీవితం నుండి ఆధ్యాత్మిక చైతన్యానికి మారడాన్ని సూచిస్తుందట. భక్తితో ఈ మెట్లను ఎక్కే భక్తులు జగన్నాథ దర్శనం వల్ల కలిగే పూర్తీ ఫలితాన్ని పొందుతారని చెబుతారు.
22 మెట్ల రహస్యం..
ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారం, ఈ 22 మెట్లు మానవులలో ఉండే 22 రకాల దుర్గుణాలు, బలహీనతలు , ప్రాపంచిక బంధాలకు ప్రతీకగా నిలుస్తాయని చెబుతారు. భక్తుడు ఈ మెట్ల మీదుగా నడిచి వెళ్లినప్పుడు తనలోని అహం, కోపం, దురాశ, బంధాల పట్ల వ్యామోహం వంటి, ఇతర దుర్గుణాలను విడిచిపెట్టి భగవంతుడిని పూర్తీగా శరణాగతి పొందిన వాడు అవుతాడట.
ఆధ్యాత్మిక పురోగతి..
కొంతమంది పండితులు ఈ 22 మెట్లు ఆత్మ ప్రగతిలోని 22 దశలను సూచిస్తాయని నమ్ముతారు. పండితుల ప్రకారం, భగవంతుని మార్గం కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు, అది మనస్సు, బుద్ధి , ఆత్మ లను శుద్ది చేసే మార్గం. అందుకే దేవాలయంలోకి ప్రవేశించే ముందు ఈ మెట్లు చాలా ముఖ్యమైనవి.
చాలా మంది ఈ 22 మెట్లను వేద సూత్రాలు , ఆధ్యాత్మిక సూత్రాలకు సంబంధించినవి కావచ్చని కూడా చెబుతుంటారు. కొందరు వీటిని మానవ ఇంద్రియాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి , ఆత్మకు ప్రతీకలుగా భావిస్తారు. అయితే విభిన్న సంప్రదాయాలు విభిన్న వ్యాఖ్యానాలను అందిస్తాయి, ఇదే ఖచ్చితం అని ఎవరూ చెప్పడం లేదు.
22 మెట్లు చెప్పే విషయం..
జగన్నాథ ఆలయపు ఈ 22 మెట్లు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదు, భగవంతుని చేరుకోవడానికి బాహ్య ప్రయాణంతో పాటు అంతర్గత ప్రయాణం కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ఇవి ఇస్తాయి. ఈ కారణంగానే శతాబ్దాలుగా లక్షలాది భక్తులు భక్తితో ఈ మెట్లను దాటి, జగన్నాథుని దర్శించుకుని ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారు.
*రూపశ్రీ.