భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఆరోగ్య రంగాల్లో ఆహార భద్రత,లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు ప్రధాని మోదీ, పుతిన్ సమక్షంలో నిర్వహించారు. వీటితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.శుక్రవారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పుతిన్, మోదీ భేటీ అయ్యారు.  రెండు రోజుల పర్యటన కోసం గురువారమే భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.  గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. 
Publish Date: Dec 5, 2025 2:29PM

దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న వైసీపీ గ్రాఫ్!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన విపక్షం వైసీపీయే. అందులో సందేహం లేదు. ఎందుకంటే కూటమి పార్టీలు కాకుండా అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీ వైసీపీయే. అటువంటి వైసీపీ పని తీరును కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?  ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 17 నెలలు గడిచింది. ఒకింత ఆలస్యమైనా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. తాము ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పట్ల వారి స్పందన ఎలా ఉంది అన్న అంశంపై అంతర్గతంగా ఒక సర్వే చేయించారు. ఐప్యాక్ పై నమ్మకం సడలిపోయిందో ఏమో కానీ, ఈ సారి విపక్షంగా తన పార్టీ తీరు ఎలా ఉంది అన్నఅంశంపై ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి పాలనపైనా, విపక్షంగా వైసీపీ తీరుపైనా సర్వే చేయించారు.  అయితే ఈ సర్వే ఫలితంతో  జగన్ కు షాక్ తగిలింది.   విపక్షంగా వైసీపీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నదే ఈ సర్వే పలితంగా తేలిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.  గత ఏడాది ఓటమి తరువాత కంటే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పతనమైందని ఆ సర్వేలో తేలిందంటున్నారు. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతయ్యేంత ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత.. రాయలసీమలో కూడా వైసీపీ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని ఆ సర్వే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత గూడుకట్టుకుంటోందని సర్వే తేల్చిం దంటున్నారు. పార్టీ ఓటమి తరువాత రాష్ట్ర వదిలి బెంగళూరులో ప్రవాసం ఉంటున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి గూడుకట్టుకుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.   చూడాలి మరి ఈ సర్వే ఫలితంతో నైనా జగన్ రెడ్డి తన తీరు మార్చుకుంటారా?
Publish Date: Dec 5, 2025 2:26PM

పుష్ప సినిమా తరహాలో భారీగా నగదు రవాణా

  సికింద్రాబాద్‌లో ఓ ముఠా సినిమా ‘పుష్ప’ స్టైల్లో పథకం రచించి హవాలా డబ్బు రవాణా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో షాక్ అయ్యారు. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా వెళ్లుతున్న కారును ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ వేగం పెంచి... కారుతో సహా ముందుకు దూసుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుమారు 15 కిలోమీటర్ల వరకు కారును చేజ్ చేసి.. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం పోలీసులు కారు మొత్తం తనిఖీలు చేశారు.  మొదట్లో పెద్దగా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి పూర్తిగా తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. కారు డిక్కీ, టైర్ల లోపల, బనెట్ కింద, సీట్లలో వేరువేరు రహస్య గుహలు ఏర్పాటు చేసి, అందులో భారీ మొత్తంలో డబ్బును దాచి పెట్టిన విధానాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.  అనంతరం పోలీసులు వాహనాన్ని పూర్తిగా ఓపెన్ చేయించి తనిఖీ చేయగా, వివిధ బండిల్స్‌గా దాచిన మొత్తం ₹4 కోట్ల హవాలా నగదు బయటపడింది. డబ్బు మూలం, గమ్యం, ముఠా నెట్‌వర్క్ వివరాల కోసం పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. సినిమా రీతిలో డబ్బు రవాణా – పోలీసుల పరుగుపరుగుల చేజ్ – చివరకు భారీ నగదు స్వాధీనం… సికింద్రాబాద్‌లో ఈ ఘటన పెద్ద కలకలం రేపుతోంది.  
Publish Date: Dec 5, 2025 1:58PM

విమానాల రద్దు సమస్యకు చెక్.. ఆ నిబంధనను ఉపసంహరణ

ఇటీవలి కాలంలో  ఇండిగో విమానాలు వరుసగా రద్దు  కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ   పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మునుపటి మార్గదర్శకాల్లో పైలట్లకు తప్పనిసరిగా  వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయరాదు అన్న కండీషన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది.  అయితే ప్రస్తుతం కొనసాగుతున్న  ఆ నిబంధనను సమీక్షించి  ఉపసంహరించింది. ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు  క్యా న్సెల్ అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లాల్సిన మొత్తం 155 ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
Publish Date: Dec 5, 2025 1:53PM

విమానానికి బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్

శంషాబాద్ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు పెద్ద సంఖ్యలో ఇండిగో విమా నాలు రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతోనే విమానాశ్రయంలో నిన్న రాత్రి నుంచీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇకే 526 విమానానికి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోనే కాకుండా, టెర్మినల్ లో కూడా తనిఖీలు నిర్వహించారు.  విమానాల రద్దుతో తీవ్ర అసహనంతో ఉన్న ప్రయాణీకులు ఈ తనిఖీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఓ వైపు విమానాల రద్దుపై ప్రయాణీకులు నిరసనలు, నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగుతోంది. మరో వైపు  బోర్డింగ్ పాస్ గేట్ వద్ద బైఠాయించి పలువురు నిరసనకు దిగారు. మొత్తంగా విమానాశ్రయం అంతా కిటకిటలాడుతోంది. ప్రయాణీకులకు కూర్చునే స్థలలం కూడా లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఈ సమయంలో టెర్మినల్ అంతటా ప్రయాణికులు భారీగా కిటకిటలాడు తున్నారు. కుర్చీలు లేకపోవడంతో పలువురు నేలపై కూర్చొని ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భిగానే భద్రతా తనిఖీల వ్యవహారంలో  కొందరు ప్రయాణీకులు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  ఇలా ఉండగా ఈ రోజు ఇప్పటి వరకూ   హైదరాబాదు నుంచి బయలుదేరాల్సిన 71 విమానాలు, రావాల్సిన 61 విమానాలు రద్దయినట్లు సమాచారం. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వందలాది మంది ప్రయా ణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎమిరేట్స్ విమానంలో ఉన్న ప్రయా ణికులందరినీ భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రత్యేక ప్రాంతాలకు తరలించగా, విమానం మొత్తాన్ని బాంబ్ స్క్వాడ్ సూక్ష్మంగా పరిశీలించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  అదనపు సిబ్బందిని మోహరించారు. 
Publish Date: Dec 5, 2025 11:46AM

పరకామణి దొంగను వెనకేసుకొస్తున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసు నిందితుడిని వెనకేసుకు వస్తున్నారు. పరకామణిలో జరిగిన చోరీ చాలా చాలా చిన్నదని అంటూ.. ఆ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరం, దొంగతనం చిన్నాదా పెద్దదా అన్నది పక్కన పెడితే.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. మన చట్టం అదే చెబుతోంది. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అదేమంత పెద్ద నేరం కాదని తీసి పడేస్తున్నారు. పరకామణి లో రవికుమార్ అనే వ్యక్తి  ఏదో చిన్న దొంగతనం చేశాడు.. కానీ అందుకు ప్రాయశ్చితంగా  టీటీడీకి 144 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడంటూ వెనకేసుకు వచ్చారు. అటు వంటి వ్యక్తి విషయంలో ఇంత యాగీ చేస్తారేంటంటూ ఆశ్చర్యపోయారు. పరకామణి చోరీ నిందితుడిని వెనకేసుకురావడమే కాదు.. అతడిని మహాదాతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు.  నిజమే జగన్ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆయన స్వయంగా ఆక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వ్యక్తికి పరకామణి చోరీ చిన్న విషయం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి విషయంలో జగన్ తీరును ఎవరూ సమర్ధించరు. సమర్ధించలేరు. ఎవరి తప్పులకు వారు శిక్ష అనుభవించి తీరాలి. అయినా జగన్ మోహన్ రెడ్డి పరకామణి  చోరీ నిందితుడు రవికుమార్ ను వెనకేసుకురావడం చూస్తుంటే..ఈ చోరీ కేసులోనూ ఆయన ప్రమేయం ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులోనూ తాను బుక్కయ్యే ప్రమాదం ఉందన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోం దంటున్నారు.   అందుకే పరకామణి చోరీ కేసును ఇప్పుడు తిరగతోడి విచారించడం సరికాదన్నట్లుగా మాట్లాడు తున్నారంటున్నారు.  ఇక్కడ జగన్ పరకామణిలో చోరీ జరగలేదని చెప్పడం లేదు.. కానీ చోరీ చేసిన సొత్తుకంటే ఎన్నో రెట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్న వ్యక్తిని ఎందుకు విచారణ పేరుతో విధిస్తారని ఆశ్చర్యపోతున్నారు జగన్. రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.144 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇవ్వడం వల్లనే తన హయాంలో ఆ కేసును రాజీ చేశారని చెబుతున్న జగన్ అసలు ఓ చిరుద్యోగికి అంత ఆస్తి ఎక్కడిదన్న విషయం మాత్రం చెప్పలేదు. వాస్తవానికి ప జగన్ హయాంలో తిరుమల పరకామణిలో అవకతవకలకు హద్దు లేకుండా పోయిందనీ, రవికుమార్ ఇటువంటి చోరీలతోనే కోట్ల రూపాయలు సంపాదించాడ, ఆ సంపాదన నుంచి వందల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు రాసిచ్చాడనీ పరిశీలకులు ఆరోపణలు చేస్తున్నారు.  ఏది ఏమైనా చిన్న చోరీ చేసి ప్రాయశ్నితంగా 144 కోట్లు టీటీడీకి రాసిచ్చేశానని రవికుమార్ చెప్తున్న మాటలు, ఆయనను సమర్ధించుకు వస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలూ ఇసుమంతైనా నమ్మశక్యంగా లేవు.   అయినా నేరం జరిగిందని నిందితుడే అంగీకరించాడు. ఇప్పుడు జగన్  కూడా ఔను రవికుమార్ చోరీ చేశాడని చెబుతున్నారు. అలాంటప్పుడు విచారణ జరపడంలో తప్పేముంది? అన్నిటికీ మించి పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీష్ హత్యకు గురి కావడంతో పరకామణి చోరీ వ్యవహారంలో రవికుమార్ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే.  అయినా ఇప్పుడు పరకామణి చోరుడు రవికుమార్ ను వెనకేసుకు వస్తూ జగన్ మాట్లాడిన మాటలు వింటుంటే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అన్న సామెత గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.  అదలా ఉంటే కోర్టు కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.   ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన  పిటిషన్ ను గురువారం (డిసెంబర్ 4) విచారించిన ధర్మాసనం  సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును   సమర్థించింది.   ఆలయాల ప్రయోజనాల పరిరక్షణలో  కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని  స్పష్టం చేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. తరువాత రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.
Publish Date: Dec 5, 2025 10:30AM

ముంబై విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. వివిధ విమానాల ద్వారా బ్యాంకాక్‌ నుండి  ముంబైకి చేరుకున్న స్మగ్లర్ల నుంచి   26 కోట్లు విలువ చేసే 26 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. వేరువేరు విమానాల ద్వారా బ్యాంకాక్ నుంచి ముంబై చేరుకున్న వీరు.. లగేజ్ బ్యాగులు, డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు, వ్యక్తిగత వస్తువులలో దాచి అక్రమంగా తీసుకువచ్చిన విదేశీ గంజాయి అధికారుల తనిఖీల్లో బయటపడింది.  దీంతో  ఈ 9 మందినీ అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి స్మగ్లింగ్ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు.  
Publish Date: Dec 5, 2025 9:43AM

శంషాబాద్ విమానా శ్రయంలో అయ్యప్పల ఆందోళన

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన ఇండిగో విమానం 12 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.  గురువారం (డిసెంబర్ 4)  సాయంత్రం బయలు దేరాల్సిన ఈ విమానం శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విమానం జాప్యంపై ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో అయ్యప్ప స్వాములు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు.    ఈ క్రమంలోనే స్వాములు  బోర్డింగ్ గేటు ముందు  బైఠాయించి నిరసన తెలియజేశారు.  తమ ప్రయాణానికి వెంటనే ప్రత్యామ్నాయ   ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  గంటల తరబడి వేచిచూడాల్సి రావడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, అలాగే భోజనం–వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
Publish Date: Dec 5, 2025 9:33AM

కిడ్నీ రాకెట్ కేసు.. ఏ2 డాక్టర్ పార్థసారథి లొంగుబాటు

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో  కీలక పరిణామం చోటు  చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న డాక్టర్ పార్థసారథి రెడ్డి గురువారం మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తలిసిందే. కాగా లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి రెడ్డికి న్యామూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.    కిడ్నీ విక్రయం కోసం గత నెల 9న విశాఖకు చెందిన యమున  అనే యువతికి ఆపరేషన్ చేస్తుండగా ఆమె మరణించడంతో ఈ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది.    విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సూరిబాబు భార్య యమున   కిడ్నీని గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.  విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు రూ.8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ క్రమంలో యమునకు శస్త్రచికిత్స చేస్తుండగా ఆమె మరణించారు. వెంటనే ఆమె   మృతదేహాన్ని అంబులెన్స్‌లో రహస్య ప్రాంతానికి తరలించారు. యమున భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.   ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  A1 డాక్టర్ ఆంజనేయులు, మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  మదనపల్లె ఎస్బిఐ కాలనీ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో ఏ 2 నిందితుడు, బెంగుళూరు కి చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లైంది.  
Publish Date: Dec 5, 2025 9:24AM

అఖండ2 సినిమా టికెట్@ రూ.5లక్షలు.. కొన్నదెవరో తెలుసా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అఖండ-2 సినిమా మానియా జోరుగా ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా అఖండ తాండవం చూడటం కోసం అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. అయితే.. ఈ రోజు విడుదల కావలసిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది.  అది పక్కన పెడితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా టికెట్ ఐదు లక్షల రూపాయలకు ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.  అలా కొనుగోలు చేసింది మరెవరో  కాదు..  ఎమ్మెల్యే జగన్ మోహన్.  ఈ సందర్భంగా ఆయన ఓ అభిమానిగా ఈ సినిమా  విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిత్తూరుఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.   బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నగరంలో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  
Publish Date: Dec 5, 2025 9:06AM

కోహ్లీ మానియాతో ఊగిపోతున్న విశాఖ

విశాఖపట్నం మొత్తం కోహ్లీ మానియాతో ఊగిపోతున్నది. విశాఖ వేదికగా  దక్షిణాఫ్రికాతో శనివారం (డిసెంబర్ 6) జరగనున్న మూడో వన్డే సందర్భంగా ఈ పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ విశాఖ వాసులు ఈ వన్డేపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే కోహ్లీ రాంచీ, రాయ్ పూర్ లలో జరిగిన తొలి వన్డేలలోనూ శతకాలు బాది.. తాను మళ్లీ పూర్వపు కోహ్లీ మాదిరిగా పరుగుల వేట ఆరంభించానని చాటోడో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.   విశాఖ వన్డే మ్యాచ్ వీక్షించాలన్న ఆసక్తి ఒక్క విశాఖ వాసుల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా వివరీతంగా పెరిగిపోయింది. ఇటువంటి స్పందన నభూతో అని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం  తొలి దశ టికెట్ల అమ్మకాలు గత నెల 28న  ప్రారంభమయ్యాయి. అయితే అప్పుడు టికెట్ల కోసం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆఫ్ లైన్ లో కౌంటర్లు ఏర్పాటు చేయక తప్పదేమోనని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ భావించింది. అయితే ఎప్పుడైతే రాంచీ, రాయ్ పూర్ లలో కోహ్లీ సెంచరీ చేశాడో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. కోహ్లీ ఫామ్ లో ఉండటం, విశాఖ మైదానంలో కోహ్లీకి అద్భుత ట్రాక్ రికార్డు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. విశాఖలో కోహ్లీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్ లలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు ఎక్కువ అని ఆలోచించకుండా అభిమానులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొనేశారు. అంతేనా గురువారం భారత జట్టు విశాఖ చేరుకుంది. ఈ జట్టు రాకకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని గంటల తరబడి వేచి చూశారు.   
Publish Date: Dec 5, 2025 8:51AM

శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

  తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.  ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,  టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి,  జానకి దేవి,  భాను ప్రకాష్ రెడ్డి,  నరేష్, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ  లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.  
Publish Date: Dec 4, 2025 8:50PM

భారత్‌కు చేరుకున్న పుతిన్...అపూర్వ స్వాగతం పలికిన మోదీ

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీ చేరుకున్నారు. పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు ప్రధాని మోదీ  సాదరంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధాని ప్రోటోకాల్‌ను ప్రక్కకు పెట్టి పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.  ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్‌ గౌరవార్థం రాత్రి ప్రధాని ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. మొత్తం 8 మంది మంత్రుల బృందంతో పుతిన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ట్వీట్ చేసింది. అత్యంత పటిష్ఠ భద్రత మధ్య పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది.
Publish Date: Dec 4, 2025 8:37PM

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం : డిప్యూటీ సీఎం పవన్

  “వర్షించని మేఘం... శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు.  ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే... ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించామన్నారు. గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది.   • మన ఐక్యతే రాష్ట్రానికి బలం   కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా... మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు " అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయి. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారింది. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది.    •   కష్టపడితేనే... ప్రతిఫలం   నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదు. సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణం. నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయి. అంతే తప్ప పదవే పరామావధిగా భావించి పని చేస్తే అందలం ఎక్కడం కష్టం. ఏ వ్యక్తికి అయినా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదు.  మన జిల్లాకే తలమానికం అయిన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటి వరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమే... దొరికిన పది శాతం విలువే వేలకోట్లలో ఉంటే... ఇప్పటి వరకు దొరకని సంపద విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో  మనం అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలి. అవినీతిని అరికట్టి బలహీనుల  గొంతుగా మారాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన  చంద్రబాబునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం అని గత పాలకులు మాట్లాడారు.  గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టాలని చూడటం మనం చూశాం. అయినా జనసేన ఎక్కడా తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం  సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడం. ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని మరి గుర్తింపు ఇస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజక వర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం” అన్నారు.  స్వచ్ఛరథాలు పరిశీలన  స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల దగ్గరకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొస్తే ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు.  ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గురజాల జగన్మోహన్,  అరణి శ్రీనివాసులు,  కె. మురళీమోహన్,  అరవ శ్రీధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్,  శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
Publish Date: Dec 4, 2025 7:15PM

సంధ్య థియేటర్ శ్రీ తేజ ఘటనపై దిల్ రాజు స్పందన

  ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా చూడడానికి చూడడానికి వచ్చిన ఓ కుటుంబ సభ్యుల్లో శ్రీ తేజ తల్లి  మరణించగా... శ్రీ తేజ తీవ్రస్థాయిలో గాయపడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ఈ ఘటనపై దిల్ రాజ్ స్పందిస్తూ శ్రీ తేజ తండ్రిని కలిసి మాట్లాడారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, నిర్మాత దిల్ రాజు ఆయన కుటుంబానికి అందిస్తున్న సహాయంపై వివరాలు వెల్లడించారు. శ్రీ తేజ భవిష్యత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఆయన మీడియాతో పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ మరియు అరవింద్ ఇద్దరు స్పందించడమే కాకుండా శ్రీ తేజ పేరుతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించానని చెప్పారు.  అయితే ఆ రెండు కోట్ల రూపాయలతో వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీ తేజ తండ్రికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఘటన అనంతరం ఆస్పత్రిలో జరిగిన చికిత్స కోసం అల్లు అర్జున్ మరియు అతని తండ్రి అరవింద్ దాదాపు రూ. 70 లక్షల వరకు చెల్లించినట్లు కూడా ఆయన వెల్లడించారు. అదే సమయంలో, శ్రీ తేజ పునరావాసానికి అవసరమైన రిహాబిలిటేషన్ ఖర్చులను పూర్తిగా అల్లు అర్జున్ భరిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. అల్లు అర్జున్ టీం ఘటన జరిగిన మొదటి రోజు నుంచే సమగ్రంగా స్పందించారని, అవసరమైన అన్ని సహాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం శ్రీ తేజ తండ్రి మాట్లాడుతూప్రమాదం జరిగిన తర్వాత నుంచి చిత్రపరిశ్రమ అనేక విధాలుగా తమకు అండగా నిలుస్తోందని,అల్లు అర్జున్ టీం నుంచి వచ్చిన సహాయం ముఖ్య భరోసాగా మారిందని తెలిపారు.ఇంకా కొంత ఆర్థిక సహాయం అవసరమున్న నేపథ్యంలో దిల్ రాజుతో మాట్లాడగా, ఆయన అన్ని విధాల సహాయానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.శ్రీ తేజ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో, కుటుంబ సభ్యులు, పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Publish Date: Dec 4, 2025 6:01PM

తెలుగు వన్‌కు 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లు...ఘనంగా సంబరాలు

  తెలుగు డిజిటల్‌ ప్రపంచంలో మరో గర్వకారణమైన మైలురాయిని తెలుగు వన్ ఛానల్ అందుకుంది. 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లను చేరుకోవడంతో, హైదారాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఛానల్ ఎండీ రవిశంకర్ కంఠమనేని ప్రత్యేకంగా హాజరై సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రవిశంకర్ కేక్ కట్ చేసి అందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి టీమ్ మొత్తం పెట్టిన కృషి, నిబద్ధత కారణమని పేర్కొన్నారు. “ఈ రోజు మనం జరుపుకుంటున్నది కేవలం ఒక మైలురాయి కాదు… మనపై ప్రేక్షకులు ఉంచిన విశ్వాసానికి ప్రతీక” అని చెప్పారు. ఇటీవలి సిల్వర్ జూబ్లీ వేడుకలతో తెలుగు వన్ తాను సాగించిన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా గుర్తుచేసుకున్నామని, ఇప్పుడు ఈ కొత్త విజయంతో మరొక మెట్టు ఎక్కినట్టేనని అన్నారు. సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడే కంటెంట్ అందించడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “మన తదుపరి లక్ష్యం 20 మిలియన్లు కాదు… నేరుగా 34 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు. తెలుగు వన్‌కి దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నాం” అని రవిశంకర్ అన్నారు.సంస్థలో కష్టపడి పనిచేస్తే ఉద్యోగులకు మరింత మంచి భవిష్యత్తు సిద్ధంగా ఉంటుందని సిబ్బందిని ఉత్సాహపరిచారు. “25 ఏళ్ల క్రితం తెలుగు వన్‌కు వేసిన ఫౌండేషన్‌… ఇప్పుడు కోట్లాది మంది ప్రేమతో మహా వృక్షంగా మారింది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం” అని ఎండీ రవిశంకర్ తెలిపారు
Publish Date: Dec 4, 2025 5:42PM