TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా..విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత కొంతకాలంగా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయనకు అనుచరులు, అభిమానులు ఉండటంతో ఈ చేరిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధా.? వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడంతో విజయవాడ నగర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రానున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాధా చేరిక జనసేనకు ఎంతవరకు కలిసివస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుంచి జనసేన వరకు.. రాధా రాజకీయ ప్రస్థానం.! వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ కార్యకలాపాల్లో కొనసాగారు. ఇప్పుడు జనసేనలో చేరడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం మొదలైంది. విజయవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.? విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా వంగవీటి మోహనరంగా అభిమానులు, రాధాకృష్ణ అనుచరుల మద్దతు రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన అంశంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రాధా జనసేనలో చేరడం ద్వారా పార్టీకి విజయవాడలో మరింత బలం చేకూరుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రానున్న ఎన్నికల్లో రాధాకృష్ణకు జనసేన ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది? విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తుందా? కూటమిలో సీట్ల కేటాయింపులపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై జనసేన నాయకత్వం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. [ Vangaveeti Radhakrishna, Vangaveeti Radha Joins Janasena, Pawan Kalyan, Janasena Party, Andhra Pradesh Politics, Vijayawada Mayor Candidate, Mangalagiri Janasena Office, Vangaveeti Mohana Ranga, Vijayawada Politics, AP Local Body Elections ]

Published on: Wed Oct 14, 2026 6:58PM

political-news-img

చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.?

దక్షిణాది రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ఆ తరువాత విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు విజయ్. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరిగి వెళ్లారు. అయితే ఈ పర్యటన పైకి సాధారణ పర్యటనగానే కనిపించినా, తెరవెనుక కీలక రాజకీయ చర్చలు, వ్యూహాలకు వేదికగా మారిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఏపీ, తమిళనాడు మధ్య నీటి సమస్యలు నదుల అనుసంధానం, జాతీయ రాజకీయ సమీకరణాలపై విజయ్ చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా విజయవాడ ఉత్సవ్ లో చెప్పారు కూడా. చంద్రబాబుతో భేటీలో ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు తమిళనాడు మద్దతుపై చంద్రబాబు, విజయ్ మధ్య సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కృష్ణా డెల్టాను పరిరక్షించడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని అందించడానికి అలాగే కర్ణాటక తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జల వివాదాలను శాశ్వత పరిష్కారానికీ కూడా దోహదపడుతుందంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబుతో భేటీకి ముందు రోజు తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. తన డిమాండ్లను ఆయన ముందుంచారు. ఈ రెండు సంఘటనలనూ బేరీజు వేసుకుంటే.. పొలిటికల్ గా విజయ్ ఎన్డీయే కూటమికి చేరువ అవుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. పరిశీలకులు కూడా ఇదే అంటున్నారు. ఇటీవల తమిళనాడులో ద్రావిడ రాజకీయాల సంప్రదాయానికి భిన్నంగా తనకంటూ ప్రత్యేక ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్న విజయ్, జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారనడానికి కూడా దీనినే తార్కానంగా చూపుతున్నారు పరిశీలకులు. ఇక పోతే చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్ మీడియా ఎదుట చంద్రబాబు మాదిరిగా విక్టరీ సింబల్ గా రెండు వేళ్లూ చూపుతూ అభివాదం చేయడం ద్వారా తన పర్యటన సక్సెస్ అయ్యిందన్న సంకేతం ఇచ్చారు. విజయ్ బెజవాడ పర్యటన దక్షిణాదిన రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Tamilnadu CM Vijay Victory Symbol, Chandrababu Naidu Meeting, Godavari Cauvery Linking, Telugu Ganga Project, NDA Alliance Politics, South Political Equations, Telugu One]

Published on: Wed Oct 14, 2026 4:18PM

political-news-img

జగన్ కు షాక్: అక్రమాస్తుల కేసులో రోజు వారీ విచారణ, వ్యక్తిగత హాజరు: సీబీఐ కోర్టు నిర్ణయం.!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. ఈ విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే దిశగా నాంపల్లి సీబీఐ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు జగన్ తో పాటు మిగిలిన నిందితులందరినీ కూడా స్వయంగా కోర్టు ముందుకు తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది. జగన్ సహా మొత్తం 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేలా ఈ ప్రక్రియ సాగుతుందని విస్పష్టంగా పేర్కొంది. గతంలో ఈ కేసుల విచారణ నెమ్మదిగా సాగుతోందన్న కోణంలో విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల విచారణ త్వరగా ముగించి స్పష్టత తీసుకురావాలని ఈడీ ఆ పిటిషన్‌లో కోరింది. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, రోజువారీ విచారణను పట్టాలెక్కించింది. ఈ కేసుల్లో ఉన్న నిందితుల సంఖ్య పెద్దది కావడం, అలాగే దాఖలైన చార్జ్‌షీట్లు, పత్రాల పరిమాణం విస్తృతంగా ఉండటంతో న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు వాయిదాలు, మినహాయింపులతో కాలయాపన జరుగుతోందన్న అభిప్రాయాలకు చెక్ పెడుతూ, ధర్మాసనం స్వయంగా అందరినీ ప్రత్యక్షంగా విచారించేందుకు సిద్ధమైంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన పలు చార్జ్‌షీట్లపై విచారణ కొనసాగుతోంది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రాజకీయ నాయకులు స్వయంగా రోజు వారీ విచారణకు కోర్టుకు హాజరు కాకతప్పని అనివార్యత ఏర్పడింది. రోజువారీ విచారణతో ఇప్పటివరకు వాయిదాల మీదే నడుస్తున్న ఈ కేసుల పురోగతి వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోజువారీ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రతిరోజూ కోర్టు విచారణ సజావుగా సాగితే, ఈ కేసుల్లో తీర్పుల ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. [CBI Court Shok Jagan, YS Jagan Mohan Reddy, CBI Special Court Nampally, Disproportionate Assets Case, Enforcement Directorate, Telugu One]

Published on: Wed Oct 14, 2026 1:19PM

political-news-img

వివేకా హత్య కేసు: ఈడీ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా హత్య కేసులో మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు ముందు, తర్వాత పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు జరిగాయన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. వివేకా హత్య కోసం 40 కోట్ల రూపాయల డీల్ కుదిరిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం.. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆర్థిక మూలాలను గుర్తించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాఖలు చేసిన చార్జిషీట్లలోని కీలక అంశాల ఆధారంగా ఈడీ ముందుకు సాగుతున్నది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను, సాక్ష్యులు, అప్రూవర్ లను ఈడీ విచారించింది. గత కొన్నేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్‌లపై ఫోకస్ పెట్టింది. గతంలో ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌, కడప తదితర ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఆ తనిఖీల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, లెక్కల్లో చూపని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచి విచారించడం సంచలనం సృష్టిస్తున్నది. అవినాశ్ రెడ్డి విచారణ ద్వారా సేకరించిన సమాచారాన్ని గతంలో సేకరించిన ఆధారాలతో సరిపోల్చి చూసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరి కొందరు ప్రముఖులను కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం. [ED Interrogate YS Avinash Reddy, ED Investigation, YS Vivekananda Reddy Murder Case, Money Laundering Probe, YCP MP Avinash Reddy, ED Interrogation Viveka Case, Telugu One]

Published on: Wed Oct 14, 2026 11:40AM

political-news-img

జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ: విజయవాడ మేయర్ పీఠంపై కన్ను.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామానికి విజయవాడ వేదిక కానుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన బుధవారం (అక్టోబర్ 14) జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల వంగవీటి రాధా.. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల తర్వాత ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వంగవీటి రాధా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, విజయవాడ మేయర్ పీఠం అన్‌రిజర్వ్డ్ జనరల్‌గా కేటాయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంటోందని అంటున్నారు. తెలుగుదేశంకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఆ పార్టీ తరఫున వంగవీటి రాధా లేదా ఆయన భార్య పుష్పవల్లిని బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి కుటుంబానికి విజయవాడలో ఉన్న బలమైన అనుచరగణం, చారిత్రక నేపథ్యం ఈ నిర్ణయానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదే సీటుపై టీడీపీ నుంచి కూడా బోండా ఉమా కుమారుడు రవితేజ, మరి కొందరు కూడా ఆసక్తికనబరుస్తుండటంతో వంగవీటి రాధ జనసేన చేరిక ఉత్కంఠ రేపుతోంది. రాజకీయంగా ఈ పరిణామంతో సమీకరణాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది. అదలా ఉంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. [Vangaveeti Radha Joining Janasena, Vangaveeti Radhakrishna, Pawan Kalyan, Vijayawada Mayor Elections, TDP Janasena Alliance, Andhra Pradesh Politics, Telugu One]

Published on: Wed Oct 14, 2026 9:03AM

political-news-img

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట: తదుపరి విచారణపై స్టే విధించిన సుప్రీం కోర్టు.!

భారతీయ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ పరిణామం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గతంలో చేసిన చోర్‌ కీ సర్దార్‌ వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే.. తనపై నమోదైన పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌ను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, దీనిపై విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరువునష్టం కేసుకు సంబంధించి దిగువ కోర్టులో జరుగుతున్న తదుపరి విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు రాహుల్‌ గాంధీకి ఊరటనిచ్చాయి. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ అంశాలు, న్యాయపోరాటాలతో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీకి ఈ పరిణామం పెద్ద ఉపశమనం కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. [Big Relief Rahul Gandhi, Supreme Court, Defamation Case, Bombay High Court, Narendra Modi, Congress Party, Telugu One]

Published on: Tue Oct 13, 2026 7:29PM