పినాకం నుండి గాండీవం వరకు.. అణుబాంబు కంటే శక్తివంతమైన ఆయుధాల గురించి తెలుసా!

 

పినాకం నుండి గాండీవం వరకు.. అణుబాంబు కంటే శక్తివంతమైన  ఆయుధాల గురించి తెలుసా!

పురాణాల గురించి ప్రస్తావన వస్తే దేవతలు, యోధులు,  వీరుల గురించి చెప్పాల్సి వస్తుంది.  వీరితో పాటు వీరు ఉపయోగించిన ఆయుధాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అణుబాంబు గురించి ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాయి. అయితే.. పురాణాలలోనే అణుబాంబు కంటే శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి.  వీటిని ఒక్కసారి ఉపయోగిస్తే.. ఒక్క దెబ్బకు ఒక్కో దేశం నామరూపాల్లేకుండా పోతుంది. ఈ విషయాన్ని కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.  మహాభారతం , ఇతర పురాణాల ప్రకారం  నాటికాలంలో ఒక్క క్షణంలో సమస్త విశ్వాన్ని నాశనం చేయగల శక్తిని కలిగిన అనేక అద్భుతమైన ధనుస్సులు ఉండేవి. దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ సాక్షాత్తు వీటిని సృష్టించాడట. అత్యంత శక్తివంతమైన, వినాశకరమైన ఈ ఐదు ధనుస్సుల గురించి తెలుసుకుంటే..

పినాకం..

పినాకం శివుడి ధనస్సు పేరు.  ఈ  ధనుస్సు గురించి వాల్మీకి రామాయణంలోని బాలకాండలో చాలా వివరంగా వర్ణించబడింది. ఈ ధనుస్సుతోనే శివుడు ఒక్క బాణంతో భయంకరమైన రాక్షసుడైన త్రిపురాసురుని మూడు నగరాలను సంహరించాడట. పినాక ధనస్సు ఎంత బరువైనదంటే, ఎంత శక్తివంతమైనదంటే, దాన్ని కదపడం అటుంచితే, కనీసం ఎత్తడం కూడా ఏ సాధారణ మానవుడి శక్తికీ అందనిది. త్రేతా యుగంలో సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు ఆ  ధనుస్సుకు నారి బిగిస్తుండగా దాన్ని సగానికి విరిచాడు.

కోదండం..

 అత్యంత శక్తివంతమైన రెండవ ధనుస్సు కోదండం.  ఇది సాక్షాత్తు శ్రీరాముని సొంత ధనుస్సు. రామాయణం ప్రకారం, ఈ ధనుస్సు  ఎక్కుపెట్టినప్పుడు వచ్చే శబ్దం  ఎంత భయంకరంగా ఉండేదంటే, దానిని వినగానే రాక్షసులకు యుద్దం చేయాలనే ఉత్సాహం పోయేదట. . కోదండ అంటే వెదురుతో చేసిన ధనుస్సు లేదా బాగా వంగిన ధనుస్సు అని అర్థం.

 లంకా యుద్ధంలో రావణుడిని, అతని మహా రాక్షస సైన్యాన్ని సంహరించడానికి శ్రీరాముడు ఈ ధనుస్సును ఉపయోగించాడు. ఈ ధనుస్సు నుండి సంధించిన బాణాలు ఎన్నడూ గురి తప్పేవి కావు. అందుకే రామ బాణం గురి తప్పదు అని కూడా చెబుతారు.

శారంగ..

విష్ణుమూర్తి  ధనుస్సు పేరు శారంగ. దీని ప్రస్తావన మహాభారతం , విష్ణు పురాణంలో ప్రముఖంగా ఉంది. విశ్వకర్మ  శారంగ ధనుస్సును సృష్టించాడు, అది అత్యంత బరువైనది , అద్భుతమైనది. ద్వాపర యుగంలో, విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, ఆయన ఈ ధనుస్సును ఉపయోగించాడని చెబుతారు.  ఈ ధనుస్సుకు అన్ని రకాల రాక్షస శక్తులను క్షణంలో నాశనం చేసే శక్తి ఉంది.

గాంఢీవం..

మహాభారతంలోని గొప్ప యోధుడైన అర్జునుడి ప్రధాన ఆయుధం గాండీవం. మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం, ఈ ధనుస్సు మొదట వరుణ దేవుడికి చెందినది. అగ్నిదేవుని అభ్యర్థన మేరకు ఆయన దానిని అర్జునుడికి బహుమతిగా ఇచ్చాడు. గాండీవం ఒక దివ్యమైన, అతీంద్రియ శక్తులున్న ధనుస్సు; దాని నారి శబ్దం వినగానే భూమి కంపించేదట. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఈ ధనుస్సుతోనే విశాలమైన కౌరవ సైన్యాన్ని ఓడించాడు.

విజయ..

 సూర్య పుత్రుడిగా భావించే  కర్ణుడి ధనస్సు పేరు విజయ. మహాభారతం ప్రకారం, ఈ ధనుస్సు మొదట దేవతల రాజు అయిన ఇంద్రునికి చెందినది, తరువాత అతని ప్రియ శిష్యుడైన పరశురాముడు దీనిని కర్ణునికి ఇచ్చాడట. ఈ ధనుస్సుకున్న అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, అది కర్ణుని చేతిలో ఉన్నంత వరకు, ప్రపంచంలోని ఏ యోధుడు గానీ, ఆయుధం గానీ అతన్ని ఓడించలేవు.

                          *రూపశ్రీ.