ఉత్తరాఖండ్ ను రక్షించే శక్తి స్వరూపం.. ధారి దేవి ఆలయ రహస్యాలు తెలుసా!
ఉత్తరాఖండ్ ను రక్షించే శక్తి స్వరూపం.. ధారి దేవి ఆలయ రహస్యాలు తెలుసా!
భారతదేశంలో ఎన్నో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, శక్తి పీఠాలు, జ్యోతిర్లిగాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా విశిష్టమైనవి. కొన్ని దేవాలయాలలో ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. అలాంటి దేవాలయాలలో ధారి దేవి ఆలయం కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రక్షక దేవతగా ధారి దేవి నిలుస్తోందని చెబుతారు. ఈ అమ్మవారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కంచు కోట లాంటి రక్షణ ఇస్తోందట. ధారి దేవి ఆలయంలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
పవిత్రమైన అలకనంద నది ఒడ్డున ధారి దేవి ఆలయం ఉంది. ఈమెను ఉత్తరాఖండ్ రక్షక దేవతగా భావిస్తారు. చార్ ధామ్ ప్రాంతంతో పాటు హిమాలయ ప్రాంతాన్ని రక్షించే శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా నమ్ముతారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర రక్షక దేవత ధారి దేవి దైవిక, ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుందని చెబుతారు.
ధారి దేవి కాళీ దేవి శరీరం నుండి ఉద్బవించినదట. ఈ అమ్మవారు ఉగ్రమైన, కరుణామయమైన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుందట. చాలా దేవాలయాల మాదిరిగా కాకుండా, ఈ అమ్మవారి చిత్రం ఆరుబయట ఉంటుందట. ఇది దేవత అపారమైన శక్తిని, అమ్మవారు భూమిపై ఉన్నారని, ఆమె అన్నీ గమనిస్తూ ఉందని చెబుతుందని అంటారు. పురాణాల ప్రకారం దేవత రూపం రోజంతా కొద్దిగా మారుతుంది, ఉదయం యువతిగా, మధ్యాహ్నం స్త్రీగా, సాయంత్రం భయంకరమైన యోధురాలిగా కనిపిస్తుందట.
ధారి దేవిని ఉత్తరాఖండ్ రక్షకురాలిగా పిలుస్తారు. స్థానిక జానపద కథల ప్రకారం అమ్మవారిని ఎవరైనా అగౌరవ పరిచినా లేదా అవమాన పరిచినట్టు మాట్లాడినా ప్రకృతిలో అసమతుల్యతను సృష్టిస్తుందట. దీని ద్వారా తనను తాను సమతుల్యం చేసుకుంటుందట. చాలా మంది భక్తులు 2013 కేదార్‌నాథ్ వరదలకు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు సమయంలో విగ్రహాన్ని తాత్కాలికంగా మరొక ప్రదేశానికి తరలించడమే కారణమని చెబుతారు. అందుకే ధారి దేవిపై చాలా గట్టి నమ్మకం ఉంది అక్కడి ప్రాంతంలో.
ధారి దేవి ఆలయాన్ని ఆధ్యాత్మిక శక్తితో నిండిన ప్రదేశంగా అభివర్ణిస్తారు. కింద ప్రవహించే అలకనంద నది, పర్వత గాలులు, మంత్రాలు జపించే ప్రశాంతమైన వాతావరణం ధ్యానం, ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటాయి. భక్తులు ఆధ్యాత్మిక సాధన చేయడానికి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి, భయాలను అధిగమించడానికి ధారి దేవి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ భక్తి పూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తే ఆ అమ్మవారు తప్పక భక్తుల మొర ఆలకిస్తుందని చెబుతారు.
నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. వేలాది మంది భక్తులు ధారి దేవిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ పూజలో సాధారణ సమర్పణలు, ప్రార్థనలు ఉంటాయి. అయితే ఇవన్నీ చాలా విశ్వాసంతో చేయడం జరుగుతుందని,అందుకే అందరి సమస్యలు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తీరిపోతాయని అంటారు.
ధార్ దేవి ఆలయం కేవలం తీర్థయాత్ర స్థలం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మేల్కొలుపు కేంద్రం గా కూడా చెబుతారు. ఇక్కడి అమ్మవారిని, ఆమె శక్తిని, ప్రకృతితో మేళవించి ఉంటుందని నమ్ముతారు. భౌతిక జీవితానికి దూరమై, ఆధ్యాత్మిక సాధనలో పయనించాలని అనుకునేవారికి ధారి దేవి ఆలయం చాలా గొప్ప వేదిక అవుతుంది.
*రూపశ్రీ.