హనుమంతుడు వెళ్ళిపోయాక లంకలో జరిగిందేమిటి?
హనుమంతుడు వెళ్ళిపోయాక లంకలో జరిగిందేమిటి?
లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో "జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడో మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వలన రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి, ఎవరిమానన వారు తలోమాట చెబితే, అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి" అన్నాడు.
అప్పుడా మంత్రులన్నారు "ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లోనుండి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుండి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకములోకి వెళ్ళి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడినుండి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు. యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత' అన్నారు.
ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి రావణ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము" అన్నాడు. అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి "నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను" అన్నాడు.
అప్పుడు వజ్రదంష్ట్రుడు రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరికి పంపి 'అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు' అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది. అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము" అన్నాడు.
అప్పుడు నికుంభుడు( కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు "దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను" అన్నాడు. అప్పుడు విభీషణుడు "మూడు విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతిహలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము. కట్టిస్తాము అని ఎగురుతున్నారే. రాముడంటే అంత చేతకానివాడిలా కనపడుతున్నాడ. రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు. అప్రమత్తుడై ఉన్నాడు. దైవము ఆయన పట్ల అనుకూరించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకలేనంత మూర్ఖుడు కాదు. నదులకు (తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు (పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు?
ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టిస్తాను. నేను చంపేస్తాను. నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటే వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటే, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశారా?? అని అడిగాడు.
◆ వెంకటేష్ పువ్వాడ.