రాముడి ప్రణాళికతో సముద్రతీరానికి చేరిన వానరసైన్యం!
రాముడి ప్రణాళికతో సముద్రతీరానికి చేరిన వానరసైన్యం!
హనుమంతుడు చెప్పిన మాటలకు రాముడు విజయమనే ముహూర్తం కాబట్టి మనం బయలుదేరదాము అన్నాడు. సుగ్రీవుడు వారధి కడితే సముద్రం దాటవచ్చని చెప్పాడు. రాముడు సరేనని చెప్పడంతో వానరసైన్యం "శ్రీరాముడి జై" అంటూ ముందుకు కదిలింది.
రాముడు అందరినీ ఒకచోట సమావేశపరిచి సుగ్రీవుడితో "వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి. తాగడానికి మంచి నీరు దొరకాలి, వళ్ళు, తేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి.
ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి. వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి" అని చెప్పాడు.
అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. వానర సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు "ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో" అని ఒకడు, "నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి చూడరా నా కండ" అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవారు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది.
అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ అలసిపోయినట్టు అయిపోయారు.
రాముడు వాళ్ళు అలసిపోవడం గమనించి "మీరందరూ బాగా అలసిపోయినట్టు ఉన్నారు. ఈ సహ్యాద్రి పర్వతం మీద పండ్ల చెట్లు పుష్కలంగా ఉన్నాయి, నీరు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మీరు కడుపునిండుగా పండ్లు తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి" అని చెప్పాడు.
అప్పుడు వారు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడినుండి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వారు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది. ఆ విధంగా రాముడి మార్గనిర్దేశకత్వంలో వానరసైన్యం దక్షిణ దిక్కులో ఉన్న సముద్రతీరానికి చేరింది.
◆వెంకటేష్ పువ్వాడ.