సేవకుల గురించి రాముడి వివరణ!
సేవకుల గురించి రాముడి వివరణ!
లంక నుండి వచ్చిన హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించాడు. "హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాతడమే గొప్ప పని అయితే నువ్వు సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.
సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్థత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు, తనకి చెయ్యగలిగే సమర్థత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖన్ని పొందేటట్టుగా ప్రవర్తించావు, సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దగ్గర ఉన్నది ఈ దేహమే. అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను" అని, హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.
తరువాత రాముడన్నాడు "అంతా బాగానే ఉంది కాని, ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు. మనకున్న ఈ వానర సముహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము. అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా" అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అన్నాడు.
"రామ! నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు నీముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు. నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే, రావణుడు నిహతుడయ్యిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి" అన్నాడు.
సుగ్రీవుడి మాటలకి ఉత్సాహం పొందిన రాముడు "నిజమే, నేను తలుచుకుంటే నా తపఃశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలుచుకుంటే నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను" అని చెప్పి, హనుమ వంక తిరిగి "హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది. ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి" అని అడిగాడు.
◆ వెంకటేష్ పువ్వాడ.