కుంభకోణం యాత్ర – 25
కుంభకోణం యాత్ర – 25
తిరుభువనం
మనం ఇప్పుడు తిరు భువనం అనే ఊరు వెళ్తున్నాము. ఆ ఊరు పట్టు చీరెలకి ప్రసిధ్ధిట. అక్కడ పట్టు చీరెలు నేసేవారు వున్నారుట. పర్సులు చూసుకోకండి. ఇప్పుడు మనకి వాటిని చూసే సమయం లేదు. అప్పుడే చీకటి పడింది. తొందరగా వెళ్తే ఆలయం చూడగలుగుతాం. లేకపోతే లేదు. బస్ లో వెళ్దాంలెండి ఆగండి. ఆటో బేరం కుదిరి, వచ్చేసరికి బస్ వచ్చేస్తుంది. ఇక్కడ బస్సులు తొందరగానే దొరుకుతాయి. అదిగో .. మాటల్లోనే వచ్చింది. ఎక్కండి.
తిరు భువనం, అందరికీ తేలిగ్గా తెలియాలంటే శరభేశ్వర్ బస్ స్టాప్ ఇదే. దిగండి. ఆలయానికి అటు వెళ్ళాలి. కొంచెం తొందరగా నడవండి. ఆలయం మూసే సమయం అయినట్లుంది. జనాలెవరూ కనబడటం లేదు. ఇదే రాజ గోపురం. ఇంత హడావిడిలోకూడా ఉమ వెళ్ళి దేవుడికోసం పూలు తీసుకురావటం మాత్రం మరచిపోలేదు. పదండి లోపలికి. ఎదురుగా శివాలయం. ఈ పక్కది శరభేశ్వరాలయం. శరభేశ్వర ఆలయంలో పూజారిగారున్నారు. మనల్ని చూశారు కనుక ఐదు నిముషాలు ఆగుతారు. శివుడి గుళ్ళో ఎవరూ కనబడటం లేదు. మూసేస్తారేమో. ముందటెళ్దాం పదండి.
ఈ శివుడి పేరు కంపహరేశ్వరుడు. ఇందాక తిరువిడైమరుదూరు గురించి చెప్పేటప్పుడు పాండ్యరాజు వరగుణ పాండ్యన్ పొరపాటున ఒక బ్రాహ్మణుడిని చంపటంవల్ల బ్రహ్మ హత్యా దోషం పట్టుకుందని, ఆ రాజు మహాలింగేశ్వరుణ్ణి దర్శించిన సమయంలో బ్రహ్మ హత్యా దోషం ఆలయంలోకి ప్రవేశించలేక తూర్పు వాకిలి బయటే వుండి పోయిందని చెప్పాను కదా. వర గుణ పాండ్యన్ వేరే దోవనుంచి బయటకి వచ్చినా ఆ దోషం తనని ఎక్కడ తిరిగి పట్టుకుంటుందోనని భయంతో వణుకుతూనే వున్నాడు. ఆయన ఈ స్వామిని సేవించినప్పుడు రాజు భయాన్ని, వణుకుని ఈ స్వామి పోగొట్టాడుట. అందుకనే ఈయనని కంపహరేశ్వరుడు అంటారు. శివుడు స్వయంభువుడు. ఉపాలయాలలో భిక్షాటనమూర్తి, లింగోధ్భవ మూర్తి, దక్షిణా మూర్తి, బ్రహ్మ, దుర్గ వగైరా దేవతలు దర్శనమిస్తారు. ఈ శివుణ్ణి ప్రార్ధిస్తే నరాల బాధలన్నీ తగ్గుతాయి. ఒణుకు, అర్ధంలేని భయాలు, మెదడు సరిగ్గా ఎదగకపోవటం వగైరా అనేక బాధలనుంచి ముక్తిని ప్రసాదిస్తాడు.
ఆలయ నిర్మాణం
ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో జరిగింది. ఇక్కడ ఆలయ విమానం ఎత్తు రాజ గోపురానికన్నా ఎక్కువగా వుంటుంది. సాధారణంగా ద్రావిడ శైలి నిర్మాణం ఇలా వుండదు. ఈ ఆలయ నిర్మాణం తంజావూరు బృహదీశ్వరాలయం, దారాసురం ఐరావతేశ్వరాలయం, గంగైకొండ చోళ పురంలోని ఆలయాలను పోలి వుంటుంది. వీటన్నించిలోనూ రాజగోపురంకన్నా ఆలయ విమానం ఎత్తుగా వుంటుంది. ఆలయంలో వున్న శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని కులోత్తుంగ చోళుడు-3 కట్టేంచాడు. ఆలయంలో రామాయణ, మహా భారత గాధలని తెలిపే చిత్రాలు, శిల్పాలు వున్నాయి.
అమ్మవారు
అమ్మ ధర్మ సంవర్ధినికి ప్రత్యేక ఆలయం వున్నది. అదిగో, అదే, పదండి. అంటే ఈ ప్రాకారంలోనే మూడు ఆలయాలున్నాయన్నమాట. అమ్మవారు నుంచుని వుంటారు. 7 అడుగుల ఎత్తు. ఒక చేతిలో అభయాన్నిస్తూ రెండవ చేతిలో కమలం, అక్షమాల ధరించి వుంటారు. అమ్మవారు భార్యా భర్తల మధ్య అన్యోన్యత, పిల్లలు, వగైరా సమస్యలనుంచి భక్తులను రక్షిస్తూ వుంటారు.
శరభేశ్వరాలయం
ఇంక మిగిలింది శరభేశ్వరస్వామి ఆలయం. మనవైపు ఈ ఆలయాలు కనబడవు. వీరి నమ్మకం ప్రకారం శరభేశ్వరుడు శివ రూపమే. మనం ప్రత్యంగళాదేవి గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాంకదా, ఆ దేవి శరభేశ్వరస్వామితోనే ఉద్భవించిందని, ఆ శరభేశ్వరుడే ఈయన.ఈ రూపం గురించి తమిళనాడులో ఒక కధ వున్నది. హిరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహావిష్ణువు నరసింహావతారం ఎత్తాడుకదా. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కధల ప్రకారం నరసింహుడి ఉగ్ర రూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. (శ్రీ నరసింహ క్షేత్రాలు రాసేటప్పుడు నేనీ విషయం రాస్తే తమిళనాడునుంచి ఒకరు ఇది సరికాదని సూచన చేశారు. అప్పుడే తెలిసింది నాకు వారి కధనం వేరని.) వారి కధ ప్రకారం...
హిరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి శరీరంమీద, లోపల వుండి (గోళ్ళతో చంపుతాడుకదా) ఆయనని చాలా రౌద్రంగా చేసిందిట. ఆయనని చల్లబరచటానికి దేవతలు శివుణ్ణి ప్రార్ధించారుట. హిరణ్యకశిపుడి రక్తం నేల మీద పడితే అనేక మంది హిరణ్యకశిపులు జన్మిస్తారుట. దానితో వాళ్ళు భయపడ్డారు. విష్ణుమూర్తి అమృతం తాగినవాడు. ఆయన శరీరంమీదనుంచి హిరణ్య కశిపుడి రక్తం కింద పడితే అమృతం ప్రభావంవల్ల ఆ రక్తానికి కూడా అమృత తత్వం వచ్చి వుంటుంది కనుక ఆ రక్తంనుంచి అనేకమంది హిరణ్య కశిపులు జన్మిస్తున్నారు. దానిని ఆపటానికి శివుడు వింత రూపాన్ని ధరించాడు. యాలి ముఖం, మానవ శరీరం, పక్షి రెక్కలు, 8 కాళ్ళు, 4 చేతులతో ఆయన రూపం ప్రత్యక్షమయింది. ఆయన రెండు రెక్కలలో ఒక రెక్క ప్రత్యంగరాదేవి, రెండవది శూలిని దుర్గ అవతరించారు. ఆయన నరసింహుణ్ణి ఆకాశంలో భూమ్యాకర్షణ శక్తి పని చేయనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశంలో శరభేశ్వరుడు నరసింహుడి శరీరాన్ని నొక్కి చెడ్డ రక్తమంతా బయటకి పోయేటట్లు చేశాడు. భూమ్యాకర్షణ శక్తి లేక పోవటంతో ఆ రక్తం కింద పడలేదు. శరీరంలోంచి చెడు రక్తం పోగానే నరసింహుడు శాంతించి శివుణ్ణి పూజించాడుట.
శరభేశ్వురుణ్ణి పూజిస్తే నలుగురు దేవతలని పూజించినట్లే. శరభేశ్వరుని ఆకారంలో నలుగురు దేవతా మూర్తులు, శివుడు, కాళి, దుర్గ, విష్ణు వున్నారు. శరభేశ్వరస్వామిని పూజించటంవల్ల ఆరోగ్యం, దిగుళ్ళు, కోర్టు విషయాలలో చికాకులు, చేతబడి, తెలియని శత్రువులనుంచి వచ్చే ముప్పు, గ్రహ పరిస్ధితులు సరిలేకపోవటంవల్ల వచ్చే సమస్యలు తొలగి పోతాయి. తమ బాధలు తొలగటంకోసం భక్తులు శరభేశ్వరస్వామికి చందనాభిషేకం, సహస్రనామ పూజ, 11 దీపాలు వెలిగించటం, 11 ప్రదక్షిణలు చెయ్యటం, 11 వారాల పాటు శరభేశ్వరునికి యజ్ఞం వగైరాలు చేస్తారు.
అమ్మయ్య. ఇవాళ్టికి అనుకున్నట్లు ఈ ఆలయ దర్శనం కూడా అయిపోయింది. రేపు పొద్దున్న స్వామి మలై వెళ్దాము. రేపటితో మన టూర్ కూడా ఆఖరుకదా. ఇప్పుడింక ఏ షాపులూ తెరిచి వుండవు. చీరెలదేముందర్రా, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ ఇలాంటి ఆలయాలను మాత్రం ఇక్కడే చూడగలం. పదండి. మళ్ళీ బస్ దొరికి రూమ్ కి వెళ్ళాలికదా.
దర్శన సమయాలు
ఉదయం 6 గం. ల నుంచి 11 గం. ల దాకా తిరిగి సాయంత్రం 5 గం.ల నుంచి 8 గం. ల దాకా.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)