కుంభకోణం యాత్ర – 31

 

 

 

కుంభకోణం యాత్ర – 31

ముగింపు

 

                                                                                           
ఇప్పుడు మనం దశావతార్ ఆలయానికి వెళ్తున్నాము.  ఈ ఆలయాన్ని నేనూ ఇంతకు ముందు చూడలేదు.  ఇందాకే నెట్ లో చూశాను.  ఆలయం వివరాలేమీ లేవుగానీ, ఈ ప్రాంతంలోనే వుండాలి.  ఆటో అతనికి చెబుదాం, కొంచెం ఎవరినైనా అడిగి, తీసుకు వెళ్ళమని.  బాగా చీకటి వడింది.  ఎలాగైనా ఆ ఆలయం కూడా చూస్తే మనకున్న సమయంలో, నేను వేసిన ప్రణాళిక  ప్రకారం మీకు అన్ని ఆలయాలూ చూపించినట్లే.

 

 

ఆటో ఆపాడేమిటి?  అదిగో!  ఆ ఎదురుగా కనబడేదే ధశావతార ఆలయంట.  ఆటో అక్కడిదాకా వెళ్ళదట.  ఈ ఆలయం మైన్ రోడ్ లో వున్నట్లున్నది.  ట్రాఫిక్ సమస్య ఎక్కడైనా తప్పదుకదా.  కొంచెం దూరమేకదా.  నడుద్దాం పదండి.గుళ్ళోంచి శ్రావ్యమైన సంగీతం వినబడుతోంది.  ఎవరో పాడుతున్నట్లున్నారు.  లోపలకెళ్దాం.  దాదాపు పదిమంది మహిళలు కలసి బృందంగా చక్కగా శాస్త్రీయ సంగీతం పాడుతున్నారు.  ప్రశాంత ఆలయ వాతావరణంలో, శ్రావ్యమైన సంగీతం, ఎంత బాగున్నదో!  సీనియర్ సిటిజన్స్ కి ఇలాంటి సాంగత్యం చాలా ప్రశాంతంగా వుంటుంది కదూ.  పాడక్కరలేదు.  విన్నా చాలు.   మనల్ని చూడగానే అందరి ముఖాలలో ప్రశ్నార్ధకం.  కొత్తవాళ్ళంకదా.  

 

 

తమిళనాడులోని ఆలయాలలో చాలా చోట్ల చూశాను.  సంగీతం వచ్చినవారు దేవుని ఎదురుగా నిలచి గొంతెత్తి హాయిగా పాడతారు.  అది చూసినప్పుడల్లా నాకు సంగీతం రాదని చాలా బాధ కలుగుతుంది.  అందుకే నాతో వచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తా.  పాటలు వచ్చినవాళ్ళు ఆలయంలో హాయిగా గొంతెత్తి పాడండి అని.  రోజూ నిర్ణీత సమయాల్లో ఇలా బృంద గానాలు కూడా చేస్తే ఆ నిండుదనమే వేరుకదా.

 

సరే.  దేవుణ్ణి చూద్దాము.  దశావతారాల ఆలయమన్నారుకదా.  మరి ఇక్కడ ఏమిటి ఒక విగ్రహమే కనబడుతోంది.  అదీ రామానుజుచార్యుల విగ్రహంలా వున్నది.  అవును ఆయనే.  అంటే ఇది దశావతారాల ఆలయం కాదన్నమాట.  రామానుజాచార్యులవారి ఆలయం.  పూజారిగారినడిగితే ఆయన తమిళంలో చాలా పెద్ద కధ చెబుతున్నారు, మనకి అర్ధం కావటంలేదు.  పైగా సమయాభావం ఒకటి.   నెమ్మదిగా అర్ధంకావటంలేదని చెప్పి బయల్దేరుదాము.

 

 

ఆఖరి ప్రయత్నంగా ఆ వచ్చే అమ్మాయిని అడుగుదాము.  అమ్మయ్య.   ఈ అమ్మాయికి తెలుసు.  4, 5 షాపులకవతల వున్నదిట దశావతారాల ఆలయం.  రెండు పూల షాపుల మధ్యలో వుంటుంది.  ఎక్కువ దూరం వెళ్ళకుండా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళమని చెప్పింది.  చాలా ధాంక్సమ్మా. ఆ అమ్మాయి గుర్తులు బాగానే చెప్పింది.  రెండు పూల షాపుల మధ్య ..  ఇదిగో ఆలయ గోపురం.  వేరే దానిలోకెళ్ళకుండా, మళ్ళీ ఒకసారి అడుగుదాం.  అవును .. ఇదేట.  అమ్మయ్య .. ప్రయాణంలో ఆఖరి మజిలీ కూడా చేరాము.  

 

 

ఇదీ చిన్న ఆలయమే.  గర్భగుడిలో ఒక పీఠం పై దశావతారాల విగ్రహాలు వున్నాయి.  ఈ ఆలయం  కూడా చాలా పురాతనమైనదే.  ఒక పక్క ఆళ్వారుల విగ్రహాలు.  అందులో రామానుజాచార్యులది ప్రముఖంగా.  ధ్యాన ముద్రలో వున్న ఆంజనేయస్వామి.  పూజారిగారు వివరంగా అన్నీ చెప్పారు కానీ ఒక్క ముక్క అర్ధం కాలేదు.  ఆలయ చరిత్ర అంటూ ఒక జెరాక్సు పేపరు ఇచ్చారు.  అంతా తమిళంలో వున్నది.  ఏమి సేతురా అని మనలో మనమే పాడుకోవటం తప్పితే ఇంకేం చెయ్యలేము ప్రస్తుతానికి.

 

తమిళ రాష్ట్రం వారికి భాషాభిమానం మరీ ఇంత తీవ్రంగా వుండటంవల్ల మనలాంటి పొరుగు రాష్ట్రాలవారు బాధ పడతారనే ఆలోచన వుననట్లు లేదు.  అయినా ఇంత దూరం నుంచి మనమా ఆలయాలకి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకేమీ ఫరక్ పడదనుకుంటాను.  ఎందుకంటే అక్కడివారే చక్కగా చాలామంది ప్రతి రోజూ ఆలయానికి వెళ్తారు.  ఎంత చిన్న ఆలయమైనా, ఎంత మారుమూల వున్నా పూజలు సక్రమంగా జరుగుతాయి.  భక్తులు వస్తూనే వుంటారు.  ఈ అలవాటు మనవారికెప్పుడవుతుందో!??

 

ఆ పురాతన ఆలయాలలోకి వెళ్ళగానే అక్కడి వాతావరణానికి మనస్సంతా ప్రశాంతంగా అయి, తృప్తితో నిండిపోతుంది.  చికాకులన్నీ మాయమయి సంతోషంతో నిండిపోతుంది.  అది చాలదూ దేవుడున్నాడని చెప్పటానికి.  ఆయన నాలుగు చేతులతో ప్రత్యక్షమవటానికి మనమేమన్నా ప్రహ్లాదుడంతటి గొప్ప భక్తులమా?  అన్నీ మంచి పనులే చేస్తున్నామా??అమ్మల్లారా, అయ్యల్లారా, ఈ విధంగా మన కుంభకోణం యాత్ర పరిసమాప్తమయింది.  మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు వేరే విషయాలు చెప్పుకుందాము.  ఇప్పటిదాకా మాతో తిరిగి, నేను చెప్పే కధలన్నీ విన్నందుకు చాలా సంతోషం.

 

 

29-8-2016న ఉదయం 7 గం.లకల్లా ఉమ, నేను హోటల్ ఖాళీ చేసి సామానుతో సహా కిందకి దిగాము.  హోటల్ వాళ్ళు అప్పటికే బ్రేక్ ఫాస్ట్ కొన్ని ఐటమ్స్ రెడీగా పెట్టారు.  తిని, మంచి కాఫీతాగి, వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఆటోలో (లగేజ్ వుందికదా) పాత బస్ స్టాండి కి వచ్చాము.  ఇది కొత్త బస్ స్టాండ్ ఎదురుగానే.  దీనికీ నడకయినా ఐదు నిముషాలే.  చెన్నైకి బస్ రెడీగా వున్నది.  ఎక్కి కూర్చున్నాము.  మరి కుంభకోణంనుంచి చెన్నైకి 7 గంటల ప్రయాణం.  చెన్నైనుంచి మా హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6 గం.లకి బయల్దేరుతుంది.  సిటీ అంటే ట్రాఫిక్ మయం కదా.  కొంచెం ముందుండటమే నయం.

మా ఉమకి చెన్నైతో కొంత పరిచయం వున్నది.  వాళ్ళు కొన్నాళ్ళ అక్కడ వుండటంతో.  తాంబరంలో దిగుదాం.  అక్కడనుంచీ స్టేషన్ కి డైరెక్టు బస్ లో వెళ్ళచ్చు.  సమయం ఆదా అవుతుంది.  కోయంబేడు బస్ స్టాండు దాకా వెళ్ళి, అక్కడనుంచి సెంట్రల్ కి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది, అంతా ట్రాఫిక్ అన్నది.  బుధ్ధిగా ఇద్దరం తాంబరంలో దిగాం.

ఇంక చూసుకోండి మా పాట్లు.  అక్కడా బస్ స్టాండ్లు అన్నీ మారాయి.  మేము దిగిన చోటనుంచి ఏ సిటీ బస్ వెళ్ళదు.  ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి.  ఏం చెయ్యాలో పాలు పోలేదు.  సెంట్రల్ కి ఆటో అడిగితే రూ. 800 అడిగాడు.  మా అదృష్టం.  ఇంకా టైము చాలా వున్నది.  ఇంత దూరం వచ్చి ఈ ఆటో అతనికి రూ. 800 ఇవ్వాలా అనే ఉక్రోషం.  ఇంతలో ఒక షేర్డ్ ఆటో దాదాపు ఫుల్ గా వున్నది వచ్చి ఆగింది.  పక్కనెవరో సలహా ఇచ్చారు.  అదెక్కి ఇంకా ముందుకెళ్ళి తాంబరం సిటీ బస్ లు ఆగే చోట దిగి అక్కడనుండి బస్ లో వెళ్ళమని.  గబగబా ఎక్కేశాము.  అతను బస్ స్టాండ్ కి కొంచెం దూరంలో ఆపాడు.

బస్ స్టాండుదాకా సూట్ కేసులు ఈడ్చుకుంటూ వెళ్తే బస్ వెంటనే వచ్చింది.  మేమెక్కినప్పుడు ఖాళీగానే వున్నది.  ఎక్కి కూర్చుని అమ్మయ్య అనుకున్నాము.  మొత్తానికి సాయంత్రం 4 గం. ల లోపే సెంట్రల్ స్టేషన్ చేరుకున్నాము.

ముందు స్టేషన్ లోని రత్న కేఫ్ లో కాఫీ తాగి వెళ్ళి కొంచెం సేపు రెస్టు తీసుకున్నాము.  5 గం. లు దాటిన తర్వాత వచ్చి రాత్రికి సాంబారు సాదం తీసుకున్నాము.  ఇక్కడ ఇవి రెండూ చాలా బాగుంటాయి.  నెమ్మదిగా రైలు ఎక్కామండీ.  అలవాటు ప్రకారం మా ఇద్దరికీ అప్పర్ బెర్తులే వచ్చాయి.  ఇద్దరం 60 ఏళ్ళు దాటిన వాళ్ళమే.  అమ్మా, బాబూ అంటే విని సహాయం చేసేవాళ్ళు ఇప్పటికీ వున్నారండీ.  ఇద్దరం కంపార్టుమెంట్ లో చెరో చివరా సైడ్ లోయర్ బెర్తుల్లో విశ్రమించి సికిందరాబాదు చేరుకుని, అక్కడనుండీ ఎవరిళ్ళకు వారు చేరుకున్నవారలమైనాము.

 ఈ ప్రకారంగా కుంభకోణం యాత్ర సఫలం అయినట్లే.  మరి 4 రోజులలో 32 ప్రఖ్యాతి చెందిన, అతి పురాతన, అతి పెద్ద ఆలయాలు దర్శించామంటే మన పూర్వ జన్మ పుణ్య ఫలమే.  అందరికీ దక్కని అవకాశం మనకి దక్కింది.  దానిని సద్వినియోగం చేసుకున్నాము.  సంతోషం.    

                                   

 

 

 

 

 

    .. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)