కుంభకోణం యాత్ర 27
కుంభకోణం యాత్ర – 27
సూర్యనాధార్ ఆలయం
స్వామిమలై చూసేశాంగా. ఇప్పుడు ఇంకా కొంత సమయం వుంది. వుండండి. ఇక్కడకి దగ్గరలో ఏదైనా ఆలయం వుందేమో కనుక్కుని వస్తాను. ఆ బస్ సూర్యనాధార్ కోవెలకి వెళ్తుందిట. అంటే సూర్యనారాయణ దేవాలయం. ఇవాళ ఆదివారం కదా. ఆలయం కొంచెం ఎక్కువసేపు తెరచి వుంచవచ్చు. ఆ బస్ ఎక్కుదాం పదండి. అరే. హడావిడిలో బస్ నెంబరు చూడలేదు. సరేలెండి. సూర్యాలయానికి వెళ్తుందన్నారుకదా. కూర్చుందాం.
ఇక్కడ దిగమంటున్నారు. దిగండి. ఇదేమిటి? సాధారణంగా మనం బస్ దిగంగానే ఆలయం కనబడుతుందికదా. ఈ చుట్టుపక్కల ఆలయమేమీ కనబడటం లేదు. అడుగుదాం. అదిగో ఆ దోవలో వెళ్ళాలిట. ఒక కిలో మీటరు పైనే వుంటుందిట. ఈ ఎండలో మనం అంత దూరం నడిచేసరికి గుడి మూసేస్తే ఉసూరుమంటాము. ఆటోలో వెళ్దాము పదండి. ఆటో 40 రూ. లు అంటున్నాడా? సరే పదండి. ఇప్పుడు మనకి సమయం ముఖ్యం. గుడి మూసేలోపల చేరుకోవాలి. ఏమిటి గుడి ఇంకా రాలేదు. చాలా దూరం వెళ్తున్నట్లున్నాము. ఇవాళ మనకి చెన్నై తిరుగు ప్రయాణం లేదుగనుక ఏ హడావిడీ లేదు. అదిగో..ఆలయం వచ్చేసినట్లుంది. ఇక్కడనుంచి ఆటోలు ముందుకు వెళ్ళవట. వచ్చాంగానీ, తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటోలు దొరకకపోతే ఎలా? ఈ ఆటోనే ఆగమని చెబుదాము. అతను వుండడట. మళ్ళీ ఫోన్ చేస్తే వస్తాను అంటున్నాడు. ఆ షాపు ఆవిడకి ఫోన్ నెంబరు తెలుసుట. ఆవిడకూడా తను ఫోన్ చేస్తానని చెబుతోంది.
పూలు వగైరా ఆవిడ దగ్గరే తీసుకుందాము. ఆలయం తీసే వుందిట. మన అదృష్టం బాగుంది. ధైర్యం చేసి ఇంత దూరం వచ్చినందుకు దర్శనమవుతుంది. ఇవాళ ఆదివారంకాదా. జనం బాగానే వున్నారుట. ఈ ఊరి పేరు కూడా సూర్యనార్ కోవిల్ అనే అంటారుట. మన దేశంలో సూర్య దేవాలయాలు చాలా తక్కువగా వున్నాయి. తమిళనాడులో చుట్టూ మిగతా గ్రహాలతో కొలువు తీరిన సూర్య ఆలయం ఇది ఒక్కటేట.
ఆలయం చూశారా చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతమున్న ఈ రాతి కట్టడం కుళోత్తుంగ చోళుడి సమయంలో కట్టారు. తర్వాత విజయనగర రాజుల కాలంలో ఇంకొన్ని నిర్మాణాలు జరిగాయి. ఐదు అంతస్తుల రాజ గోపురం, చుట్టూ గ్రనైట్ రాతి ప్రహరీ గోడ. మధ్యలో ఎత్తయిన ప్రదేశంలో ఉషా, ఛాయా సమేత సూర్యనారాయణ మూర్తి, చుట్టూ, గురు తప్పితే మిగతా గ్రహాలన్నింటికీ ప్రత్యేక ఆలయాలు. ఈ గ్రహాలన్నీ సూర్యుడికి అభిముఖంగా వుంటాయి. గర్భాలయానికి వెళ్ళే దోవలో వున్న హాలులో విశ్వనాధుడు, విశాలాక్షి, నటరాజు, శివకామి, వినాయకుడు, షణ్ముఖుడి మూర్తులున్నాయి.
సూర్యునికెదురుగా ఆలయంలోనే ముందు నవగ్రహాలలో ఒకరైన గురువుంటాడు. సూర్యుడు అంటేనే వేడికి చిహ్నంకదా. ఆయన వున్న ప్రాంతంమంతా చాలా వేడిగా వుంటుంది. ఆ వేడి వాతావరణాన్ని కొంత చల్లబరచటానికి సూర్యునికి అభిముఖంగా (ఆలయంలోనే) గురువుని ప్రతిష్టించారు. దీనితో సూర్యుని వేడి కొంత చల్లబడి భక్తులు సేవించుకోవటానికి వీలుగా వుంటుందని. సూర్యుడి రధాన్ని లాగేది గుఱ్ఱాలు కదా. శివుని ఎదురుగా నంది వున్నట్లు, సూర్యుని ఎదురుగా ఆయన వాహనం గుఱ్ఱం వున్నది.
ఆలయంలో సూర్యుడు పడమట ముఖంగా వుంటాడు. రెండు చేతులలో కలువలతో ప్రసన్న వదనంతో, ఉషాదేవి, ఛాయాదేవి, ఇద్దరు దేవేరులతో కొలువుతీరి వున్నాడు. ఏలినాటి శని వున్నవారు 12 ఆదివారాలు ఆలయంలో వుండి (ఆదివారాలు మాత్రమే కాదు .. మొదటి ఆదివారంనుంచీ 12 ఆదివారాలు పూర్తి అయ్యేదాకా) ఇక్కడే వుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనినే స్ధలవాసం అంటారు.
ఈ ఆలయం ఇక్కడ ఏర్పడటానికి ఒక కధ వున్నది. పూర్వం కలవ మహర్షి కుష్టు రోగంతా చాలా బాధపడ్డాడు. ఆయన నవగ్రహాలని ప్రార్ధించగా, ఆయన భక్తికి సంతసించిన నవగ్రహాలు అతని బాధని నివారించారు. దానితో బ్రహ్మకి కోపం వచ్చింది. శివుని ఆదేశం ప్రకారం నవగ్రహాలు మానవులకి మంచి చెడ్డలు మాత్రమే ఇవ్వాలని, వారికి వరాలిచ్చే శక్తులు నవగ్రహాలకు లేవని, ఆయన నవ గ్రహాలని భూమిమీద వెల్లురుక్కవనం (తెల్లని అడవి పూల అరణ్యంలో) కుష్టు రోగంతో బాధ పడుతూ నివసించమని శపించాడు. ఆ శాప కారణం చేత నవగ్రహాలు ఇక్కడ ఒక్కచోట వున్నాయి. నవగ్రహాలు తమని ఆ శాపంనుంచి రక్షించమని శివుణ్ణి కోరారు. శివుడు ప్రత్యక్షమై ఆ ప్రదేశం వారిదేనని, అక్కడ వారు, వారిని సేవించిన భక్తుల కోరికలు తీర్చవచ్చనీ చెప్పాడు.
తమిళనాడులో నవగ్రహ ఆలయాలు ప్రసిధ్ధి చెందాయి. ఇక్కడ నవగ్రహాలకు వేరు వేరు ఊళ్ళల్లో ప్రత్యేక ఆలయాలున్నాయి. అయితే ఈ ఆలయాలన్నింటిలోనూ ప్రధాన దేవత శివుడు. కానీ సూర్యనారాయణ దేవాలయంలో ప్రధాన దైవం సూర్యుడే.
తమిళనాడులో నవగ్రహ యాత్ర చాలా ప్రసిధ్ధి చెందింది. తమిళనాడు దర్శించినవారు ఈ నవగ్రహ ఆలయాలన్నింటినీ దర్శించాలనుకుంటారు. దానికి రెండు రోజులు సమయం పడుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు ప్రీతికరమైనది. భక్తులు సాధారణంగా గ్రహశాంతికి ఆ గ్రహానికి ప్రీతికరమైన రోజులలో పూజలు జరిపిస్తారు. ఆ రోజులలో ఈ ఆలయాలలో జన సందోహం చాలా ఎక్కువగా వుంటుంది.
ఉత్సవాలు
రధసప్తమి సమయంలో పది రోజులపాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. తమిళ నెలల్లో మొదటి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. దీనినే మహా అభిషేకం అంటారు. అలాగే శని, గురువారాల్లో, గ్రహాలు ఒక నక్షత్రంనుంచి ఇంకొక నక్షత్రంలోకి మారేటప్పుడు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనమయింది. ఒంటిగంట దాటింది. గుడికి ఆలస్యంగా రావటం కూడా ఒక విధంగా మంచిదయింది. ఎక్కువ క్యూలో నుంచోనక్కరలేకుండా దర్శనం తొందరగా అయింది. ప్రసాదమేమైనా తీసుకుని తిందాము. హోటల్ కి వెళ్ళేదాకా ఆగాలికదా. ఇక్కడ సూర్యనారాయణునికి చక్కెర పొంగలి నైవేద్యం పెడతారు. అది తీసుకుందాం.
ఆత్మారాముడు కొంత శాంతించాడు. ఇంక ఇప్పుడు హోటల్ కి చేరాలి. కుంభకోణం వెళ్ళాలి అంటే అడయూర్ దగ్గరనుంచీ చాలా బస్ లు వుంటాయిట. అక్కడదాకా ఆటో రూ. 80 అంటున్నాడు. వెళ్దాము. చాలా దూరమే వున్నది. హైదరాబాద్ తో పోల్చుకుంటే ఇక్కడ ఆటోలు కూడా చౌకే. కుంభకోణం బస్ రెడీగా వున్నది. పదండి. బస్ ఛార్జీ చూశారా? 7 రూపాయలే. భోజనం చేసి కొంచెం సేపు రెస్టు తీసుకున్న తర్వాత సాయంకాలం మనమే ఆలయాలు చూడగలమో చూద్దాము. ఏమిటో ఇన్నాళ్ళూ హాయిగా తిరుగుతుంటే చాలా బాగుందికదా. అన్ని విషయాలూ మర్చిపోయి హాయిగా గడిపాము. ఇక్కడ హోటలూ, బస్సులూ, గుళ్ళూ అన్నీ బాగున్నాయికనక ఎక్కడా ఇబ్బంది పడలేదు.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)