కుంభకోణం యాత్ర – 26
కుంభకోణం యాత్ర – 26
స్వామి మలై
సుప్రభాతం. ఇవాళ తారీకు 28-8-16 ఆదివారం. ఏమిటి పంచాంగం చెబుతున్నాననుకుంటున్నారా. ఇవాళతో మన కుంభకోణం యాత్ర పూర్తవుతుంది. ఇప్పటికే మనం ముఖ్య ఆలయాలు చాలా చూశాము. ఇంకా చూడవలసినవి చాలా వున్నాయి. కానీ మనకున్న సమయం సరిపోదు. ఇవాళకూడా మనం చాలా బిజీ. ఎందుకంటే రేపు పొద్దున్నే చెన్నైకి బయల్దేరితేనే రైలు సమయానికి సెంట్రల్ స్టేషన్ చేరుకోగలం. మనకిక్కడినుంచి చెన్నై చేరుకోవటానికి పగలు అనుకూలంగా రైళ్ళు లేవు. బస్ ప్రయాణం సమయం 7 గంటలు పడుతుందిట.
సరే. ముందు ఇవాళ్టి సంగతి చూద్దాము. ఇవాళ మనం ముందు స్వామిమలై వెళ్తున్నాము. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి ఇష్టమైన ప్రదేశాలు ఆరు వున్నాయిట. వీటినే ఆరుపడై వీడు అంటారు. అవి తిరుత్తణి, స్వామిమలై, పళని, పఝముడిదిర్ చోలై, తిరుపురకుండ్రం, తిరుచెందూరు. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు అభివృధ్ధిలోకి వచ్చి మంచి పేరు సంపాదిస్తే సంతోషంకదా. దేవుళ్ళుకూడా ఈ మమతలకి అతీతులుకాదేమో ఎందుకంటే పరమ శివుడు పుత్రోత్సాహాన్ని పొందిన ప్రదేశం ఇది. మరి ఆ కధ చెప్పాలికదా.
శివుడికి అంత సంతోషం ఎందుకు కలిగిందంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్ధంచెప్పాడు. అందుకు. ఏమిటి టిఫెన్ తినటం మానేసి మరీ చూస్తున్నారా నేను చెప్పేదానికోసం. తినండి .. తినండి. మళ్ళీ మనకి సమయం సరిపోదు. చిన్న పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కధలు చెబుతాం కదా. అలా మీరు బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటే ఈ ఆలయ గురించి చెబుతాను. మనకి సమయం ముఖ్యం కదా.
ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి బయలుదేరారు. ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు. కనబడ్డవాడు వూరుకున్నాడా. ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం చెప్పమని బ్రహ్మగారిని అడిగాడు కుమారస్వామి. పాపం దేవతలకి కూడా ఎవరి డిపార్టుమెంటు వారిదేనేమో బ్రహ్మగారు చెప్పలేకపోయారు. ఇంకేముంది కుమారస్వామి ఆయనని బందీ చేశాడు. సృష్టికర్త బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది. దేవతలందరూ శివుని దగ్గరకెళ్ళి పరిస్ధితి వివరించారు.
అందరూ కలసి కుమారస్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మ దేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఆయన ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం అడిగితే చెప్పలేదు. అందుకే బందీ చేశాను అన్నాడు .. తన తప్పేమి లేదన్నట్లు. అప్పుడు శివుడు కుమారస్వామిని అడిగాడు..సరే ఆయనకి తెలియదని బందీని చేశావు. మరి నీకు తెలుసా దానర్ధం..అయితే చెప్పు అన్నాడు. కుమారస్వామి ఘటికుడు. అంత తేలిగ్గా చెప్తాడా. నాకు తెలుసు. నేను చెప్తాను. అయితే నేను ప్రణవ మంత్రార్ధాన్ని బోధిస్తున్నాను గనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రధ్ధలు గల శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు. ఇంకేముంది. కుమారుడు గురువైనాడు. తండ్రి అత్యంత భక్తి శ్రధ్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్ధాన్ని విని పులకరించిపోయాడు.
పరమ శివుడు జగత్తుకే స్వామి. ఆ స్వామికే గురువై, నాధుడై ఉపదేశించాడు గనుక ఇక్కడ కుమారస్వామికి స్వామి నాధుడనే పేరు వచ్చింది. ఈ స్ధలానికి స్వామి మలై అనే పేరు.కధ విన్నారు కదా. ఈ ఆలయం చాలా పురాతనమైనదని ఈ పాటికే మీరు గ్రహించి వుంటారు. ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భ గుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.
అక్కడ చిన్ని కొండ పైన ఆలయం వుంటుంది. పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లూ అరవై తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూడండి. కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. నేలనుంచి షుమారు 60 అడుగుల ఎత్తున వున్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.
గుడి క్రింది భాగంలో శివుడు పార్వతుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు (ఈయన గురించి మనం తిరువిడైమరుదూర్, తిరు భువనం రెండు ఆలయాలకి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాముకదా) ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిడైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.
ధ్వజ స్ధంబం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొంగు ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.
పురాణాల కధనం ప్రకారం ఈ దేవుని సన్నిధానానికి వచ్చి నిశ్చల భక్తితో ఈ స్వామిని కొలిచే వారు చేసిన పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగి పోతాయంటారు. ఈ దేవాలయంలో వివాహం చేసుకున్నవారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు.
రోజూ అసంఖ్యాక భక్తులు ఈ స్వామి దర్శనార్ధం వస్తూంటారు. ఈస్వామి భక్తులు భారత దేశంలోనే కాక అనేక ఇతర దేశాలలో కూడా వున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత స్వామికి అనేక ముడుపులు పాల కావడి, పూల కావడి వగైరాలు సమర్పిస్తారు.
సాయం సమయంలో కనుక వెళ్ళిసట్లయితే 5-45 ప్రాంతంలో స్వామికి అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు. అప్పుడు స్వామి సౌందర్యం వర్ణించటానికి మాటలు చాలవు. ఇదివరకు వెళ్ళనప్పుడు మేము చూశాము. ఈ సమయంలో మరి ఆ దర్శనం లభిస్తుందో లేదో తెలియదు. ఇక్కడనుంచి బస్సులు చాలా వున్నాయి. మనం బస్సులోనే వెళ్దాము. 30—40 ని. ల్లో వెళ్ళిపోవచ్చు. పదండి మరి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)