కుంభకోణంలో మాఘపౌర్ణమి
కుంభకోణంలో మాఘపౌర్ణమి
గుడి దగ్గర కోనేరు ఉండటం సహజం. కానీ కోనేరే ఓ తీర్థ స్థలంగా ఉండటం ఆశ్చర్యం. తమిళనాడులోని కుంభకోణం నడిబొడ్డున అలాంటి ప్రశస్తమైన కోనేరు కనిపిస్తుంది.
అసలు కుంభకోణం అన్న పేరే చిత్రమైనది. ప్రళయం తరువాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని సాగించేందుకు అవసరమయ్యే జీవాన్నంతా ఒక కుంభం (కుండ)లో ఉంచి దివికి తీసుకువచ్చాడట. అలా తీసుకువచ్చిన చోటే తరువాత కాలంలో కుంభకోణంగా మారిపోయిందని చెబుతారు. ఆ ఘటనకు ప్రతీకగానే పూజలకు నోచుకోని బ్రహ్మదేవునికి సైతం కుంభకోణంలో ఓ ప్రాచీన ఆలయం కనిపిస్తుంది. కేవలం బ్రహ్మదేవునికే కాదు... శివుడు, విష్ణువులకు సంబంధించి కూడా ఎన్నో ప్రముఖ ఆలయాలు కుంభకోణంలో అడుగడుగునా కనిపిస్తాయి. అందుకే కాశీకి వెళ్తే ఎంత పుణ్యమో కుంభకోణాన్ని దర్శించినా కూడా అంతే పుణ్యమని చెబుతుంటారు పెద్దలు.
అలాంటి కుంభకోణంలో ఓ బ్రహ్మాండమైన కోనేరు ఉంది. మన దేశంలోనే అతి పెద్ద కోనేరులలో ఇది ఒకటి. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో, ఈ కోనేటిలోకి సకల తీర్థాలన్నీ వచ్చి చేరతాయని అంటారు. ఆ సమయంలో ఈ కోనేటి స్నానం చేసేందుకు భక్తులు అసంఖ్యాకంగా వస్తుంటారు. 12 ఏళ్లకి ఓసారి వచ్చే ఈ పర్వాన్ని మహామహం అని పిలుచుకుంటారు. అందుకే ఈ కోనేటికి మహామహం కోనేరు అన్న పేరు స్థిరపడిపోయింది. గత ఏడాది (2016)లో మహామహం జరిగింది కాబట్టి, మళ్లీ ఆ సంరంభాన్ని చూడాలంటే మరో పన్నెండేళ్లు ఆగాల్సిందే!
కేవలం మహామహం సమయంలోనే కాదు... మకర సంక్రాంతి, మాఘ పౌర్ణమి సమయాలలో కూడా ఈ కోనేటిలో స్నానాలు చేసేందుకు భక్తులు ఉత్సాహపడతారు. ఇలాంటి ముఖ్య పర్వాలలో కనుక అక్కడ స్నానం చేస్తే, సకల పాపాలూ నశించిపోతాయని నమ్ముతారు. ఇక ఫిబ్రవరి- మార్చి నెలల మధ్యలో వచ్చే తమిళుర ‘మాసి’ మాసంలో కూడా ఇక్కడి కోనేటిలో మునకలు వేసేందుకు భక్తులు కుంభకోణానికి చేరుకుంటారు. ఆ సమయంలో కేవలం ఈ కోనేటి చుట్టుపక్కల ఉన్న గుడులే కాదు, కుంభకోణంలో ఉన్న ప్రముఖ శైవ, వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ఆరు ఎకరాలకు పైగా విస్తరించిన మహామహం కోనేటి చుట్టూ 16 మండపాలు కనిపిస్తాయి. చిన్న చిన్న మండపాలే అయినా, వందల ఏళ్లనాటి శిల్ప కళా చాతుర్యంతో కళకళలాడుతూ ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్క మండపానికీ ఒకో ప్రాముఖ్యత. ఉదాహరణకు గంగాతీర్థ మండపంలో ఒకప్పుడ బంగారంలో తులాభారాన్ని నిర్వహించేవారట. ఇక కోనేటి గట్టున ఓ 21 బావులు కనిపిస్తాయి. వివిధ దిక్పాలకులు, నదుల పేర్ల మీదుగా ఈ తీర్థాలను నిర్మించారు.
మహామహం అవడానికి ప్రసిద్ధ శైవ క్షేత్రమే అయినా, ఈ కోనేటిలో స్నానం చేస్తే అటు శివేకేశవులిరువురూ ప్రీతి చెందుతారని పురాణాలలో ప్రస్తావించబడింది. అందుకే రాజుల దగ్గర నుంచీ యతుల వరకూ వందల ఏళ్లుగా ఈ కోనేటిని దర్శిస్తూనే వచ్చారు. తెలుగు వల్లభుడు కృష్ణదేవరాయలు సైతం ఈ కోనేటిని దర్శించినట్లు తెలుస్తోంది. మరి ఈసారి తమిళనాడు యాత్రకు బయల్దేరితే ఈ కోనేటిని కలిసి రావడం మర్చిపోవద్దు సుమా!
- నిర్జర.