Read more!

కుంభకోణం యాత్ర – 30

 

 

 

కుంభకోణం యాత్ర – 30

మహా కాళి ఆలయం,  సెట్టి మండప
                                                                     

                           

ఈ ఆలయం ముందునుంచి చాలాసార్లు బస్ లో తిరిగాం.  ఈ ఆలయాన్ని చూసినప్పుడల్లా చిన్న ఆలయమే అయినా చాలా బాగుంది తప్పక చూద్దాం అనుకున్నాము కదా.  పదండి మరి.

 

 

ఇది నూతన ఆలయంలా వున్నది.  మిగతా వాటంత పాతది కాదు.  ఇక్కడ ముఖ్య దేవత మహాకాళి.  వెనుక వున్న విగ్రహాలు పవన కాళి, పెట్టికాళి, నటన కాళిట.  బహుశా ఇది గ్రామ దేవతల ఆలయం కావచ్చు.  చక్కగా వున్నది.  నిర్వహణ బాగున్నది.  నాలుగు రోజులనుంచీ అనుకుంటుంటే ఇవాళ్టికి చూశాం ఈ ఆలయాన్ని. తర్వాత మనం బాణా పురేశ్వరాలయానికి వెళ్తున్నాము.

 

 

బాణాపురేశ్వరాలయం, బాణాదురై

ప్రళయకాలంలో అమృత భాండం ఈ ప్రాంతానికి వచ్చి ఆగిందని, శివుడు కిరాత వేషంలో వచ్చి తన బాణంతో ఆ భాండాన్ని పగలగొట్టాడని చెప్పాను కదా మొదట్లో.  శివుడు బాణం వేసింది ఇక్కడినుంచే.  శివుడు నుంచుని బాణం వేసిన చోట శివలింగం ఆవిర్భవించింది.  ఆయన అక్కడనుంచి బాణం వేశాడుగనుక ఆయన బాణాపురీశ్వరుడయ్యాడు.  ఈ స్ధలాన్ని బాణాదురై అన్నారు.   ఈ వృత్తాంతానికి సంబంధించిన చిత్రపటాలు గుడి ముందు మండపంలో వున్నాయి.  అమ్మవారు సోమకళాంబిక. 

 

 

ఈ ఆలయం మిగతా ఆలయాలకన్నా చిన్నదే.  ఆలయ రోజ గోపురం మూడు అంతస్తులుగా వుటుంది.  గోపురం మీద కన్పించే శిల్పాలలో వ్యాసుడు శివుణ్ణి పూజిస్తున్నట్లు, పక్కనే వినాయకుడి విగ్రహాలు వుంటాయి.  ఒకసారి వ్యాసుడు తాను చేసిన శివాపరాధం పోగొట్టుకోవటానికి, వినాయకుడి సలహా మీద ఇక్కడికివచ్చి శివుణ్ణి ప్రార్ధించి ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడుట.  ఆ కధకి గుర్తుగా ఆ శిల్పాలు అంటారు.  అలాగే శివుడు కిరాతుడి రూపంలో బాణం వేస్తున్నట్లు ఒక శిల్పం.  ఈ ఆలయం కధ అదే కదా.

 

 

ఇక్కడ ఆలయం ముందు మండపంలో వున్న చిత్ర పటాలలో ఒక ఋషి పులి కాళ్ళతో వున్న ఒక చిత్రం కూడా వున్నది.  ఆయన పేరు పులికాల్ మునివర్ ట.  ఆయన గొప్ప శివ భక్తుడు.  రోజూ సమీపంలోని అడవిలోని పూలు, బిల్వ పత్రాలు తెచ్చి శివుణ్ణి పూజిస్తూ వుండేవాడు.  ఆయన  పూలు, పత్రి కోసం అడవిలో తిరిగేటప్పుడు ఆయనకి అడవి జంతువుల భయం వుండేది.  వాటిబారి పడకుండా ఆయన తన కాళ్ళు పులి కాళ్ళులా వుండేలా చెయ్యమని, అలా అయితే చెట్ల చాటునుంచి తనని చూసే క్రూర జంతువులు తనని పులి అని తలచి తన జోలికి రావని స్వామిని వరం కోరాడు.  స్వామి కరుణించాడు.  ( ఆ చిత్రం చూడగానే ముందు మేము ఆయన ఏదైనా శాపానికి గురైనాడేమో, ఇక్కడకొచ్చి ఆ శాప నివృత్తి పొందాడేమో అనుకున్నాము.  అసలు కధ ఇది.).

 

 

వంగ దేశం రాజు శూరసేనుడు.  ఆయన భార్యకి తీవ్రమైన కుష్టు వ్యాధి వచ్చి, ఎన్ని ఔషధాలు సేవించినా ప్రయోజనం లేక పోయింది.  వారి పురోహితుడి సలహా మీద, శూరసేన మహారాజు తన భార్యతో ఈ ఆలయానికి వచ్చి, కొంతకాలం ఇక్కడ వుండి స్వామిని సేవించి, ఆ వ్యాధినుంచి పూర్తిగా ఉపశమనం పొందటమే కాదు, వంశోధ్ధారకుడు కూడా కలిగి, సంతోషంతో తిరిగి వెళ్ళారుట.

 

 

ఈ స్వామి చాలా మహత్యం కలవాడని, భక్తులు అత్యంత శ్రధ్ధా భక్తులతో కొలుస్తారు.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)