రావణుడి సారథి నిజాయితీ!
రావణుడి సారథి నిజాయితీ!
ఇంద్రుడు తన సారధి మాతలితో రథంతో పాటు రాముడి దగ్గరకు వెల్లమన్నాడు. మాతలి రాముడితో అన్నాడు "రామ! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి" అన్నాడు.
రాముడు ఆ రథానికి సమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జరిగినది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు "ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి" అన్నాడు.
అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్త్రాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడునుకున్నాడు ఈ రధం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు వివరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర శస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు.
అప్పుడు రావణుడు ఆ సారధితో "ఛి నీచుడ! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొని వచ్చి దాచావు. నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు?" అన్నాడు కోపంగా.
అప్పుడా సారధి "మీ దగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను. మీ మీద కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి. గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి. వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి. తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రధికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది. అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టబడిన సారధిని నేను" అన్నాడు.
◆నిశ్శబ్ద.