సీతమ్మను చంపవద్దని రావణుడికి చెప్పినవారు ఎవరు!

 

సీతమ్మను చంపవద్దని రావణుడికి చెప్పినవారు!

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన "నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను" అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు.

ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి " ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా రావణా?? నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు. అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం" అన్నాడు.

అప్పుడు రావణుడు "రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను" అని చెప్పి అంతఃపురానికి వచ్చేశాడు.

మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు.

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు. అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుండి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి. గుర్రాలు పాదములు తెగి పడిపోతున్నాయి. లక్షల రాక్షస సైన్యం పడిపోతోంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా (వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు. "తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు" అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టాడు.

రాముడు లక్ష్మునుడి వైపు చూస్తూ "నా చేతిలోనుండి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు" అని బాధపడ్డాడు.

అప్పుడు హనుమంతుడు "రామ! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు" అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేణుడు ఆ ఓవదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు. మళ్ళీ పైకి లేచాడు.

 "ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో" అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు "దుర్మార్గుడు. దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు" అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.

                                       ◆నిశ్శబ్ద.