లంకలో ప్రజలు ఏమి మాట్లాడుకున్నారు??
లంకలో ప్రజలు ఏమి మాట్లాడుకున్నారు??
లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరుఎంనో విషయాలు మాట్లాడుకుంటున్నారు. "ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది. కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మధుడితో సమానమైన రూపం కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగిన వాడిని, గొప్ప అందం కలిగిన వాడిని, చక్కటి నడువడి కలిగినవాడిని, అన్ని కాలాలలో ధర్మాన్ని పాటించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వ్యతిరేకతను ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతను అపహరించడానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు కోపం, కసి, రోషం తో నిండిపోయేలా ఎలా మాట్లడగలిగింది?
అయినా రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అడవిలో 14,000 మంది రాక్షసులని, ఖర దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు. పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము, కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని కిష్కింధ రాజ్యానికి రాజుగా చేసినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.
పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. రావణుడి తమ్ముడు విభీషణుడు ఎంత ధర్మబద్ధమైన మాట చెప్పాడు "అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచ్చెయ్యి" అని చెప్పాడు. ఆరోజు విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే ఎందుకు??
ఒకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి "అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది. సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు. అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి. మేము ఎలా జీవించాలి" అని అడిగారు.
అప్పుడు బ్రహ్మ "నేను ఇవ్వాల్టి నుండి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివలన మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది" అని అన్నారు.
దానివలన ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతల ప్రార్థనలకు తృప్తి పడి, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి "ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది" అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొని వచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చేయుటకు, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు" అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.
◆నిశ్శబ్ద.